గుంటూరు

సిపిఐ సీనియర్ నేత జీవీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 1: సిపిఐ సీనియర్ నేత, గుంటూరు జిల్లా సిపిఐ మాజీ కార్యదర్శి జీవీ కృష్ణారావు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా ఆయన భౌతికకాయాన్ని సిపిఐ కార్యాలయానికి తరలించారు. ఆయన పార్ధివదేహాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు ఈడ్పుగంటి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మహ్మద్ ముస్త్ఫా, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, జంగాల అజయ్‌కుమార్‌తో పాటు కాంగ్రెస్, వైసిపి, టిడిపి, వామపక్ష పార్టీల నేతలు సందర్శించి నివాళులర్పించారు. జీవీ సతీమణి 13 సంవత్సరాల కిందట మరణించారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన కృష్ణారావు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషిచేశారు. జీవీ మృతికి సంతాపం వ్యక్తంచేస్తూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సందేశం పంపించారు. తనకు చిరకాల మిత్రుడైన జివి మృతిచెందడం వ్యక్తిగతంగా తనకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. కాగా జివి కృష్ణమూర్తి భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం 7 గంటలకు గుంటూరు సంగడిగుంటలోని ఆయన స్వగృహానికి తరలించి మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు, సిపిఐ శ్రేణులు తెలిపారు.
పింఛన్‌దారులకు బ్యాంకు అకౌంట్స్
గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 1: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేసిన కారణంగా నగరంలో సామాజిక పింఛన్ల పంపిణీలో సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు, సకాలంలో పింఛన్లు అందుకునేందుకు బ్యాంకు అకౌంట్లు లేని పింఛన్లదార్లకు నూతన అకౌంట్లను తెరిపించారు. ఐడిఎఫ్‌సి బ్యాంకు వారితో చర్చించి బ్యాంకు అకౌంట్లు లేని పింఛన్‌దారులకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరంలో అక్కడిక్కడే ఓపెన్ చేయించి, అన్‌లైన్ ద్వారా అకౌంట్లలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. బ్యాంకు అకౌంట్ల ఓపెనింగ్ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు కారణంగా సామాజిక పింఛన్ల పంపిణీలో సమస్యలు లేకుండా ఉండేందుకు లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్‌తోపాటు ఏటియం కార్డును కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ సింహాచలం, ఐడిఎఫ్‌సి బ్యాంకు ప్రతినిధులు, ఉపా సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులు ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి
కాకుమాను, డిసెంబర్ 1: చిన్నారుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల ఆరోగ్యక్లబ్ చైర్మన్ గేరా మోహనరావు అన్నారు. మండల పరిధిలోని కొమ్మూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం పాఠశాల ఆరోగ్యక్లబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గేరా మోహనరావు మాట్లాడుతూ చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యపై శ్రద్ధచూపగలరని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో క్లబ్ కమిటీ కన్వీనర్ కిషోర్‌బాబు, సభ్యులు శివపార్వతి, జ్యోతి, షర్మిల, అలీ, జమీర్‌బాషా చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం లేక అవస్థలు
* అప్పిరెడ్డి దృష్టికి తీసుకొచ్చిన నల్లచెరువు వాసులు
గుంటూరు, డిసెంబర్ 1: డ్రైనేజీలలో మురుగు పేరుకుపోయి పారిశుద్ధ్యం మెరుగుపడక నిత్యం దోమల బారినపడి రోగాల పాలవుతున్నామని నల్లచెరువు వాసులు వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దృష్టికి తెచ్చారు. గురువారం 18వ డివిజన్ పరిధిలోని నల్లచెరువులో డివిజన్ అధ్యక్షుడు షేక్ ఖాజామొహిద్దిన్ ఆధ్వర్యంలో గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని అప్పిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రచారానికే పరిమితం అవుతుందే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి దోమలపై దండయాత్ర పేరుతో చేపట్టిన కార్యక్రమాలు ఏమాత్రం ఫలితాలు ఇవ్వలేదన్నారు. కార్పొరేషన్ కార్యాలయానికి అతి సమీపంలోని నల్లచెరువులోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే శివారు కాలనీల్లో పరిస్థితేంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు, నాయకులు మార్కెట్‌బాబు, మాల్యాద్రి, జాన్సీ, తమ్మెట శ్రీను, శ్యామ్, సుల్తాన్ మొహిద్దిన్, సలీం, లతీఫ్, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

చౌకధరల దుకాణాలలో
నగదు రహిత లావాదేవీలు

గుంటూరు, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల ద్వారా జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని గుంటూరువారితోట నాలుగోలైన్‌లోని ఓ చౌకధరల దుకాణంలో ఆన్‌లైన్ వ్యవస్థను జెసి కృత్తికాశుక్లా గురువారం లాంఛనంగాప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మీడియాతో మాట్లాడుతూ తొలిసారిగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీనివల్ల నగదుతో నిమిత్తం లేకుండా బ్యాంకు కార్డు ద్వారా పేదలకు నిత్యావసరాలు అందే వీలు కలిగిందన్నారు. డీలర్లు లీడ్‌బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. వినియోగదారులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉందని వివరించారు. ఈ విధానం వల్ల అతి తక్కువ సమయంలో నిత్యావసరాలను పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చిట్టిబాబు, తహశీల్దార్లు ఫణికుమార్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కొనసాగుతున్న దాడులు
* గోడౌన్‌లో 2వేల కల్తీకారం బస్తాలు

గుంటూరు, డిసెంబర్ 1: కల్తీకారం నిల్వలపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గురువారం నిర్వహించిన దాడులలో నల్లపాడు గొర్లెమండి ప్రాంతంలో నరసరావుపేటకు చెందిన పినిశెట్టి నాగేశ్వరరావు గోడౌన్‌లో రెండువేల కల్తీకారం బస్తాల నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు సిఐ కె శ్రీనివాసరావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు కోల్డుస్టోరేజీలు, మిల్లులలో నిల్వవున్న కల్తీకారాన్ని జనావాసాల మధ్యన గోడౌన్లకు తరలిస్తున్నారని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మార్కెటింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులకు అందించాలని కోరారు.

పొగాకు బోర్డు ఇడిగా వెంకటేష్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 1: భారత పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి టి వెంకటేష్‌ను నియమిస్తూ కేంద్రప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన వెంకటేష్‌కు కేంద్రప్రభుత్వంలో కూడా వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

రౌడీషీటర్ దారుణ హత్య
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 1: నగర నడిబొడ్డున రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన నగరంలో సంచలనం కల్గించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... స్థానిక అభ్యుదయ నగర్‌కు చెందిన బొప్పన రవి (30) 2014లో కబేళా వద్ద జరిగిన ప్రసాద్ హత్య కేసులో నిందితుడు. ఈ కేసులోనే కాక పలు నేరాలతో రవికి సంబంధం ఉండటంతో అరండల్‌పేట పోలీసులు ఎ1 ప్లస్ రౌడీషీట్ నమోదు చేశారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అరండల్‌పేట 3వ లైనులో రవిని పథకం ప్రకారం ఆటోలో వచ్చిన ప్రత్యర్థులు కత్తులతో పొడిచి పరారయ్యారు. నెత్తురు మడుగులో రవి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. ఈ హత్యోదంతంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరండల్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎఎస్‌పి జె భాస్కరరావు, వెస్ట్ డిఎస్‌పి సరిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యం ఈ ప్రాంతం జనసమ్మర్ధంతో కిటకిటలాడుతుంటుంది. అన్ని కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని ఓ హోటల్‌కు అమర్చిన సిసి కెమెరా పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు జాగీలాలను రంగంలోకి దించారు. సంఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రల నమూనాలను సేకరించారు.
ఎయిడ్స్ రహిత సమాజానికి అందరూ కృషిచేయాలి
* మంత్రి రావెల కిషోర్‌బాబు

గుంటూరు, డిసెంబర్ 1: ఎయిడ్స్ రహిత సమాజానికి అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక నందివెలుగు రోడ్డులోని పాతగుంటూరు వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకుల కార్యాలయ ఆవరణలోని మహిళా శిక్షణా కేంద్రం నుండి నర్సింగ్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన మంత్రి రావెల మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు సామాజిక బాధ్యత గల సంస్థలు, వ్యక్తులు అందరూ కలిసి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అత్యధిక శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా వ్యాధి నివారణకు, వైద్యానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను రూపొంచిందన్నారు. ప్రజల్లో ఎయిడ్స్ పట్ల చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం శిక్షణా కేంద్రం ఆవరణలో జరిగిన సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొన్నారు. జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ కృషిచేయాలని ఆయన కోరారు. అక్షరాస్యత, విద్యావ్యాప్తి ద్వారా ఎయిడ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు అవకాశం ఉందన్నారు. ఎయిడ్స్ వ్యాధి గురించి జిల్లావ్యాప్తంగా ప్రజల్లో సమగ్ర అవగాహన కల్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1986లో ప్రప్రథమంగా భారతదేశంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్ వ్యాధి ప్రారంభమైందని, 1987 నుండి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారిచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ టి పద్మజారాణి, జిల్లా ఎయిడ్స్ నోడల్ అధికారి డాక్టర్ సరసిజాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుహాసిని, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్యామల, డిటిసిఒ డాక్టర్ కామేశ్వరప్రసాద్, అధికారులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సాధన చేస్తే విజయం తధ్యం
గుంటూరు (స్పోర్ట్స్), డిసెంబర్ 1: క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే విజయాలను సులభంగా అందుకోవచ్చని ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక బిఆర్ స్టేడియంలో ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడా కార్యక్రమం తొలిరోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిలోని క్రీడానైపుణ్యాన్ని పెంపొందించాలన్నారు. పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ధి జరగాలన్నారు. ప్రతిరోజూ శిక్షణలో పాల్గొనడం ద్వారా మంచి విజయాలు సాధించవచ్చన్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ పోటీల్లో రాణించి తద్వారా జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఖేలో ఇండియా క్రీడాకార్యక్రమాన్ని ఈ ఏడాది నుండి ప్రారంభించారన్నారు. అండర్-14, 17 బాలబాలికలు ఈ క్రీడా విధానం ద్వారా లబ్ధిపొందనున్నారన్నారు. ప్రతిజిల్లాకు ఒక స్పోర్ట్స్ స్కూలును ఏర్పాటుచేసే విధంగా కృషి జరుగుతుందన్నారు. ఖేలో ఇండియా క్రీడాపోటీల్లో రాష్ట్ర, జాతీయ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు గల పాఠశాలలకు ఉచితంగా క్రీడా పరికరాలను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్‌గేమ్స్ కార్యదర్శి జి గణేష్, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు కరిముల్లా చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథి విజేతలైన క్రీడాజట్లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.

వరికోతలు కోయాలా? వద్దా?
* సందిగ్ధంలో అన్నదాత
* పెద్దనోట్ల రద్దే కారణం
చేబ్రోలు, డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్నదాతను గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. వరికోతలు ముమ్మరంగా జరగాల్సిన ఈ రోజుల్లో పెద్దనోట్ల రద్దు వలన అదునుకు వచ్చిన వరిని కోయాలా, వద్ద అన్న సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా ధాన్యాగారంగా ప్రసిద్ధిగాంచిన చేబ్రోలు మండలంలో ఇప్పటికే 50 శాతం వరికోతలు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ మండలంలో ఇంతవరకు కనీసం 5 శాతం వరికోతలు కూడా జరగలేదు. పెద్దనోట్లు రద్దు కావడంతో తమకు పాత నోట్లు ఇస్తే మాత్రం పనులకు రామని వ్యవసాయ కూలీలు తేల్చిచెప్తున్నారు. దీంతో బ్యాంకులకు వెళితే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడం, బయట అప్పులు పుట్టక పోవడంతో వరికోతల గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ ఎవరినైనా అప్పు అడిగితే వారు కాదనడం లేదు కానీ, మీ ఖాతాలకు డబ్బులు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తాం, బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకోండని చెప్పినా, బ్యాంకులకు రైతులు వెళ్లి డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. బ్యాంకులకు వెళ్లి క్యూలైనులో నిలబడినా ఇచ్చేది రెండు, మూడు వేలే. ఈ డబ్బులు 5, 10 ఎకరాలు ఉన్న రైతుకు వ్యవసాయ ఖర్చులకు ఏమాత్రం సరిపోవు. వరికోతలు కోసే సమయంలోనే రెండవ పంటగా రైతులు మినుము చల్లుతారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే మినుము విత్తనాలను మండలంలో ఇంతవరకు పంపిణీ చేయక పోవడంతో రైతులు బయట షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేక, ఒకవేళ కొనుగోలు చేసినా వ్యాపారులు ఇచ్చిన విత్తనాలనే తీసుకోవాల్సి రావడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వరికోతలు, విత్తనాలను చల్లడానికి ఖర్చులకు డబ్బులు దొరకక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికితోడు వరికోతల సమయంలో పొలాల్లోని నీరు బయటకు వెళ్లగొట్టాల్సి ఉంది. అయితే సాగునీటి కాల్వల నీటిమట్టాన్ని తగ్గించక పోవడం వల్ల పొలాల్లోని నీరు బయటకు వెళ్లడం లేదని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులన్నీ ఒకేసారి ముంచుకు రావడంతో చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు డిసెంబర్ 1వ తేదీన బ్యాంకులను ఆశ్రయిస్తే 1వ తేదీన కేవలం పెన్షన్లను మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. వీటన్నింటికీ మించి గత రెండు రోజులుగా నాడా తుఫాన్ ప్రభావంతో ఆకాశంలో కారుమబ్బులు కమ్మడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.

కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవ్
* బ్యాంకుల వద్ద పోలీసులు జులుం ప్రదర్శిస్తే చర్యలు
* డిజిపి సాంబశివరావు

గుంటూరు, డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్దు కారణంగా ఉత్పన్నమైన సమస్యలు తాత్కాలికమేనని, మరి కొద్ది రోజులు సంయమనం పాటిస్తే శాశ్వత ప్రయోజనం ఉంటుందని డిజిపి నండూరి సాంబశివరావు ప్రజలకు నచ్చజెప్పారు. నగరంలో పాత గుంటూరు, నగరంపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ పోలీసుస్టేషన్ భవనాలను గురువారం డిజిపి సందర్శించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా 100 మోడల్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం నగరంపాలెం పోలీసుస్టేషన్ సమీపంలోని ఎస్‌బిఐ ప్రధానశాఖ కార్యాలయం ఏటిఎం వద్ద ఉన్న ఖాతాదారులను, నోట్ల ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు కూడా ఒక్కో సందర్భంలో దురుసుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఖాతాదారులు డిజిపి దృష్టికి తెచ్చారు. క్యూ లైన్‌లో ఉన్న ప్రజలపై దాడులు చేస్తే సహించేది లేదని పోలీసులను డిజిపి హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల తరఫున క్షమాపణ చెప్పారు. అనంతపురం జిల్లాలో అనుకోని సందర్భంలో అవాంఛనీయ సంఘటన జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుంటూరులో మహిళా పోలీసుస్టేషన్ డిఎస్‌పి కమలాకరరావుమీద వచ్చిన అవినీతి ఆరోపణలపై డిజిపి విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా అడిషనల్ ఎస్‌పి భాస్కరరావును నియమిస్తున్నట్లు తెలిపారు. నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గుంటూరు రేంజి ఐజి సంజయ్, ఐపిఎస్ అధికారులు రాజేంద్రనాధ్‌రెడ్డి, నరేష్‌కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.