గుంటూరు

చారిత్రక వైభవానికి ప్రతీక అనుపు ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, డిసెంబర్ 9: అలనాటి చారిత్రక వైభవాన్ని చాటే విధంగా ప్రపంచ పర్యాటక కేంద్రమైన అనుపులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం మాచర్ల మండలం అనుపులో ఇన్ఫోసిస్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు మంత్రులు పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తి, కలెక్టర్ కాంతీలాల్ దండే ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరికి ఇన్ఫోసిస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా బుద్ధుని విగ్రహం వద్ద మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు, కిషోర్‌బాబు మాట్లాడుతూ నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలో బుద్ధుని కాలం నాటి ఎన్నో అపురూప కట్టడాలు, శిల్పకళ బయటపడిందని, వీనిని పురావస్తుశాఖాధికారులు అనుపు వద్ద అదే ఇటుకలు, శిల్పాలతో నాగార్జున విశ్వవిద్యాలయం, యాంపీ స్టేడియం, చైతన్య స్తూపం, బౌద్ధ విహారాలను పునరుద్ధరించారని అన్నారు. 1600 సంవత్సరాల తర్వాత, తిరిగి అనుపులో ఉత్సవాలు ఇన్ఫోసిస్ పౌండేషన్ జరపడం హర్షణీయమన్నారు. ఈ ఉత్సవాలు ప్రపంచానికి అనుపు ప్రాముఖ్యత గురించి తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని అన్నారు. ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తి మాట్లాడుతూ బుద్ధుని బోధనలు భావి పౌరులకు మార్గదర్శకాలు కావాలని అన్నారు. ఇక్ష్వాకులు, శాతవాహనులు, పల్లవులు, విజయనగర రాజులు, రెడ్డిరాజులు, నిజాంరాజుల పాలనలో విజయపురి తన ప్రాశస్త్య వైభవాన్ని చాటుకుందన్నారు. ఏడాది క్రితం తాను అనుపునకు రావడం జరిగిందని, ఈ ప్రాంత అందాలు ప్రాముఖ్యత తనను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. అప్పటి నుండి అనుపులో ఉత్సవాలు నిర్వహించడానికి ప్రణాళికలు వేశామన్నారు. ఉత్సవాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతీయ విద్యాభవన్, ఇన్ఫోసిస్, పురావస్తుశాఖ ఎంతో సహాయ, సహకారాలను అందించాయన్నారు. జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే మాట్లాడుతూ ఇన్ఫోసిస్ అనుపు ఉత్సవాలు నిర్వహించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. నాగార్జున కొండ, అనుపు, అమరావతి, భట్టిప్రోలు ప్రాంతాలు భిక్షువులకు ఎంతో పవిత్రమైనవన్నారు. అనుపులో హారతి దేవాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం ఎంతో ప్రాముఖ్యమైనవన్నారు. ఇక్కడ ఉత్సవాలు జరగడం పట్ల సుధామూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ బౌద్ధులకు ఎంతో పవిత్రప్రాంతమైన అమరావతి పేరుతో నూతన రాష్ట్ర రాజధానిని సిఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణంలో ఇన్ఫోసిస్ భాగస్వామి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఇన్ఫోసిస్ డైరెక్టర్ మనీషా, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
* వైసిపి నేతల ధ్వజం

గుంటూరు, డిసెంబర్ 9: రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని వైసిపి నేతలు ధ్వజమెత్తారు. వైసిపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని ఎన్‌టిఆర్ వైద్యసేవగా మార్చిన ప్రభుత్వం నిధులు మాత్రం అరకొరగా విడుదల చేస్తుందన్నారు. 1100 కోట్లు అవసరం కాగా 568 కోట్లు మాత్రమే విడుదల చేశారని, ఇందులో 368 కోట్లు బకాయిలే ఉన్నాయన్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవా పథకం సక్రమంగా అమలవుతుందని చెబుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్ బహిరంగ చర్చకు ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి చిన్నారులు చనిపోవడం బాధాకరమని, ఇందుకు నైతిక బాధ్యత వహించాల్సిన ఆరోగ్యశాఖ మంత్రి ప్రతిపక్ష నేతపై అర్ధరహిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోనా రఘుపతి, మహ్మద్ ముస్త్ఫా, పినె్నల్లి రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే సదుద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించారన్నారు. ఈ పథకాన్ని మరింతగా పేదలకు చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ చంద్రబాబుకు కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే సుచరిత, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిలు మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేత సలహాలు ఇవ్వడం లేదంటూ అసత్యాప్రచారాలు చేస్తున్న మంత్రులు రాజధాని ఎక్కడ నిర్మించాలో అసెంబ్లీలో గానీ, బయట గానీ ప్రతిపక్షాలను సంప్రదించారా అని ప్రశ్నించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావి వెంకట రమణ, జంగా కృష్ణమూర్తి, వనమా బాలవజ్రబాబు, దేవళ్ల రేవతి, కావటి మనోహర్ నాయుడు, నసీర్ అహ్మద్, కొత్తా చిన్నపరెడ్డి, ఎం హనుమంతునాయక్ తదితరులు పాల్గొన్నారు.

నోట్లకోసం రోడ్డెక్కిన అన్నదాతలు
* ఆక్రోశంతో మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో
* బ్రాంచి మేనేజర్‌ను నిలువరించిన రైతులు
అచ్చంపేట, డిసెంబర్ 9: బ్యాంకుల్లో ఇస్తున్న రెండు వేల రూపాయలు కూలీలకు చెల్లింపులు జరిపేందుకు కూడా సరిపోవడం లేదని ఆవేదనతో మండల రైతులు శుక్రవారం రోడ్డెక్కి ప్రభుత్వం, బ్యాంకుల అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. మండల గ్రామాల నుంచి ఉదయమే డబ్బుల కోసం పెద్ద ఎత్తున పెన్షనర్లు, రైతులు, ఇతర ఖాతాదారులు ఎస్‌బిఐ వద్దకు చేరుకున్నారు. బ్యాంకు అధికారులు నగదు లేకపోవడంతో చెల్లింపులు నిలిపివేశామని అక్కడికి చేరుకున్న వారికి చెప్పేశారు. అప్పటికే డబ్బుల కోసం నాలుగైదు దఫాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వారికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో అక్కడున్న మహిళలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు, ఇతర ఖాతాదారులందరూ ఆవేశంతో ఆంజనేయస్వామి విగ్రహం సెంటర్‌లో నినాదాలు చేస్తూ రాస్తారోకో జరిపి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని బ్రాంచ్ మేనేజర్‌తో మాట్లాడదామని, ఖాతాదారులందరికీ ఎస్‌బిఐ వద్దకు తీసుకువచ్చారు. బ్యాంకు అధికారులు తాళాలు వేసుకుని బయటకు వచ్చి సమాధానం చెప్పకపోవడంతో బ్యాంకు వద్దే రైతులు నినాదాలు చేస్తూ బైఠాయించారు. బ్రాంచ్ మేనేజర్ శివప్రసాద్ ఖాతాదారుల వద్దకు వచ్చేసరికి వారంతా ఆవేశంతో ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. బిఎం స్పందిస్తూ వచ్చిన నగదునే అందరికీ సర్దుబాటు చేస్తున్నారని, రైతులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని, ఈ పరిస్థితులను పై అధికారులకు తెలియజేస్తున్నామన్నారు. నగదు సర్దుబాటుపై కొన్ని ప్రతిపాదనలను అక్కడికి చేరుకున్న వారు చేయడంతో ఆ ప్రతిపాదనలను బ్యాంకు మేనేజర్ పై అధికారులు తెలియజేసి పరిశీలిస్తామని చెప్పడంతో ఖాతాదారులు శాంతించారు. ఎఎస్‌ఐ మంత్రునాయక్, రైటర్ కిరణ్‌కుమార్, బ్యాంకు వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత:మంత్రి ప్రత్తిపాటి

తాడికొండ, డిసెంబర్ 9: ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాథాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని లాం వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్ లో సిఐఐ, ఎపిటెక్ సంయుక్తంగా వ్యవసాయ యాంత్రీకరణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ 2016-17 సంవత్సరంలో రైతులకు అవసరమైన వ్యవసాయ యాంత్రీకరణకు గాను 280 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. గత ఏడాది యాంత్రీకరణకు 160 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నేడు వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులలో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి రైతులను తీసుకువచ్చి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అధునాతన పనిముట్లు, యంత్రాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ రబీలో 27 లక్షల హెక్టార్ల పంట వేయడం జరిగిందని, సాగునీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ రబీ పంటకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రైతుల్లో యాంత్రీకరణపై అవగాహన కల్పించేందుకు సోనాలిక, బికెటి, బిఎస్‌టి, టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్, మహింద్రా ట్రాక్టర్స్, స్వరాజ్, నంది పైప్స్ వంటి పలు కంపెనీలు తయారు చేసిన వ్యవసాయ అధునాతన పనిముట్లు , యంత్రాలను, పలు కంపెనీలకు సంభందించిన పురుగు మందులు, ఎరువులను ఈప్రదర్శనలో ఉంచడం జరిగింది. తొలుత లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంత్రి పుల్లారావు ప్రారంభించారు. కార్యక్రమంలో లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధికారులు నారాయణ, వ్యవసాయ శాఖ జెడి కృపాదాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆటోభోల్తా.. ఏడుగురు అంగన్‌వాడీలకు గాయాలు

రేపల్లె, డిసెంబర్ 9: అధిక లోటుతో ప్యాసింజర్లను ఎక్కించుకొని రేపల్లే పట్టణానికి వస్తున్న ఆటో ప్రమాదవశాత్తూ బోల్తాపడిన సంఘటనలో ఏడుగురు అంగన్‌వాడీలకు తీవ్ర గాయాలుకాగా వారిలో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉందని రేపల్లె ప్రభుత్వ వైద్యశాల అధికారి డాక్టర్ కె జనార్ధన్ తెలిపారు. పోలీసుల కధనం ప్రకారం శుక్రవారం రేపల్లె మండలం పిరాట్‌లంక, బొబ్బర్లలంక, మోర్‌తోట తదితర ప్రాంతాల నుండి అంగన్‌వాడీ కార్యకర్తలు , టీచర్లు ఆటోలో ప్రయాణిస్తుండగా రేపల్లె- పెనుమూడి రహదారిపై ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన ఆటోడ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో వేగాన్ని అదుపు చేయకపోవటంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈసంఘటనలో ఏడుగురు అంగన్‌వాడీ కార్యకర్తలు తలలుపగిలి తీవ్ర రక్తస్రావంతో కేకలువేయటంతో సమీప ప్రజలు క్షతగాత్రులను రేపల్లె వైద్యశాలకు తరలించారు. వారికి ప్రథమ చికిత్సచేసిన అనంతరం తీవ్రంగా గాయపడిన కె ఝాన్సీరాణి (పిరాట్‌లంక), ఎస్ అనిక(బొబ్బర్లంక), కె వెంకటరమణ (మోర్‌తోట), ఎస్ వరలక్ష్మి (రాజులచెరువు)లను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించినట్లు డాక్టర్ జనార్ధన్ తెలిపారు. వీరంతా ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద అంగన్‌వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. రేపల్లెలోని ఐసిడిఎస్ కార్యాలయంలో ప్రతినెలా జరిగే సమావేశానికి హాజరైయ్యేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైనట్లు ప్రాజెక్టు అధికారి రాథాకృష్ణ తెలిపారు. సమాచారం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ వైద్యశాలకు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. అంగన్‌వాడీలకు ఎన్‌టిఆర్ వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. అలాగే వైసిపి పట్టణ కన్వీనర్ గడ్డం రాథాకృష్ణమూర్తి, సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్, సిపిఐ క్షతగాత్రులను పరామర్శించారు.

మహేష్‌రెడ్డి అనుచరుల అత్యుత్సాహం

నరసరావుపేట, డిసెంబర్ 8: కాసు మహేష్‌రెడ్డి హైదరాబాద్ నుండి నరసరావుపేటకు వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న వైయస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉదయం పది గంటలకు పట్టణంలో ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణం నుండి నకరికల్లు అడ్డురోడ్డుకు కాసు మహేష్‌రెడ్డి స్వాగతం పలికేందుకు ద్విచక్రవాహనాలతో యువత భారీ ప్రదర్శనగా బయలుదేరారు. పట్టణం సమీపంలోని రావిపాడు వద్ద ద్విచక్రవాహనాల ర్యాలీ నిలిపి యువత కేరింతలు కొట్టాడం ప్రారంభించారు. అదే సమయంలో ట్రాఫిక్‌కు కొంత అంతరాయం కలగడంతో అప్పుడే రావిపాడు నుండి వస్తున్న కారులోని వ్యక్తి పెద్దగా హారన్ మోగించారు. ద్విచక్రవాహనాలపై ఉన్న కార్యకర్తలు ఆవేశంగా వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పూదోట జోజి, పూదోట చిన్నయ్యకు గాయాలయ్యాయి. వీరు నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్‌సీపీలోకి వచ్చిన మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో నరసరావుపేటకు చేరుకుని పేటలో ర్యాలీ నిర్వహిస్తుండగా పలుచోట్ల మహేష్‌రెడ్డి ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగింది. నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ మీదుగా మల్లమ్మ సెంటర్, ఓవర్‌బ్రిడ్జి మీదుగా ద్విచక్ర వాహనాలు, కార్లు, అభిమానుల ర్యాలీతో ఆయన గృహానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఉద్వాసన పలికి వైయస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్ నుండి తొలిసారిగా నరసరావుపేటకు చేరుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. యువకులు ర్యాలీగా తనను కలిసేందుకు వస్తూ మార్గమధ్యంలో రావిపాడు గ్రామం వద్ద జరిగిన సంఘటనలో ఇరువురుకి గాయాలైన సంఘటన తెలిసి, మనస్థాపానికి గురయ్యాడు.తనకు దాడి జరిగిన కారణాలు తెలియవన్నారు. గాయపడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు తాను క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 16న నరసరావుపేట పట్టణంలో పల్నాటి ప్రజల సమక్షంలో పార్టీలోకి చేరుతున్నానని పేర్కొన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

‘ఉగ్రవాదంపై రాజ్యం వైఖరి నాడు-నేడు’పై
రేపు ఆంధ్రభూమి సంపాదకుల ప్రసంగం
బాపట్ల, డిసెంబర్ 9: ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులుగా సుదీర్ఘకాలంగా కొనసాగుతూ, ఏది చరిత్ర?, ఇదీ చరిత్ర వంటి వివిధ సంచలనాత్మక చారిత్రక గ్రంథాలు రచించిన ఎంవిఆర్ శాస్ర్తీ ఈనెల 11న బాపట్లలో చారిత్రక ప్రసంగం చేయనున్నారని రసరంజని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల సంగమేశ్వరశాస్ర్తీ తెలిపారు. శుక్రవారం బాపట్లలోని సాధన హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రసరంజని వ్యవస్థాపక కార్యదర్శి బూర్గుల సంగమేశ్వరశాస్ర్తీ మాట్లాడుతూ తమ సంస్థ గత 20 సంవత్సరాలుగా అనేక సామాజిక, సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ రచించిన పలు గ్రంథాలను ఎంతో ఆసక్తితో చదివామని, ఉన్నమాట, వీక్‌పాయింట్ వంటి శీర్షికలతో ఆయన రచించిన పలు వ్యాసాలు తమను ఎంతో ప్రభావితం చేశాయన్నారు. ఈ క్రమంలో వర్తమాన సమస్య ఉగ్రవాదం తీవ్రత గురించి ‘ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరి నాడు-నేడు’ అనే అంశంతో సామాన్యులకు అర్థమయ్యేరీతిలో ఎంవిఆర్ శాస్ర్తీ బాపట్లలో ప్రసంగించనున్నారని వివరించారు. సాహితీవేత్తలు, అధ్యయనశీలురు, ఔత్సాహికులంతా సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైలుపేటలోని పాత విజయదుర్గా థియేటర్ ఆవరణలో నిర్మించిన రాధశ్రీరాములమ్మవారి ఎంఎస్‌ఆర్ కళ్యాణమండపంలో ఆదివారం సాయంత్రం 6.30 గం.లకు ప్రసంగం ప్రారంభమవుతుందని నిర్వాహకులు వివరించారు. రసరంజని గౌరవ సలహాదారులు అంబటి మురళీకృష్ణ, నందిరాజు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో భవానీమాతల
కలశ జ్యోతుల ఊరేగింపు
అమరావతి, డిసెంబర్ 9: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ రుక్మిణీసమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం భవానీమాతలు సామూహిక కుంకుమపూజలు నిర్వహించారు. సాయంత్రం సుమారు 200 మంది మహిళలు, భవానీలు, అయ్యప్పలు, కలశ జ్యోతులతో అమరావతి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భవానీలు ప్రదర్శించిన డప్పులు, వాయిద్యాలు, భక్తిరస సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు విశేషంగా ఆకర్షించాయి. పెద్దింటి కోటేశ్వరరావు గురు భవానీ పర్యవేక్షణలో భవానీలు, అయ్యప్పలు, ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.