గుంటూరు

పల్నాడు ప్రాంతాన్ని దత్తత తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, డిసెంబర్ 11: జిల్లాలో అత్యంత వెనుకబడిన పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వినుకొండ ప్రాంతాలను దత్తత తీసుకుని అభివృద్ధికి చేయూతనివ్వాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తిని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు కోరారు. ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న అనుపు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆదివారం సాయంత్రం ఎంపీ రాయపాటి హాజరై ప్రసంగించారు. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తమ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రపంచ పర్యాటక కేంద్రమైన అనుపులో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతం చారిత్రక, బౌద్ధప్రాశస్త్యం వైభవాన్ని మరోమారు ప్రపంచానికి చాటే విధంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నానని, ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని, దీని ద్వారా మాచర్ల మండలంలో పదివేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుందన్నారు. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో మంచినీటి సమస్య తీర్చడానికి వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రపంచ బ్యాంక్ ద్వారా 640కోట్లు మంజూరు చేసిందన్నారు. కారంపూడి, దుర్గి ప్రాంతాల్లో గెయిన్ ఇండియా వారు నిధులు మంజూరు చేసి, అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ఇన్ఫోసిస్ పౌండేషన్ ద్వారా వెనుక బడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ పౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి, మాచర్ల దేశం పార్టీ ఇన్‌చార్జి చలమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పినె్నల్లి లక్ష్మారెడ్డి, దేశం పార్టీ నేతలు నిమ్మగడ్డ శ్రీనివాస్, చిరుమామిళ్ళ కృష్ణయ్య, యాగంటి మల్లిఖార్జునరావు, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

తుపానుపై అంతా అప్రమత్తం
నిజాంపట్నం, డిసెంబర్ 11: వార్ధా తుపానును ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆర్డీఓ నరసింహులు తెలిపారు. ఆదివారం ఆయన నిజాంపట్నం సందర్శించి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావం వల్ల గంటలకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేట నిలుపు చేయాలన్నారు. ఇప్పటికే వేటకు వెళ్ళిన బోట్లు ఒడ్డుకు చేరారని అధికారుల ద్వారా సమాచారం అందిందన్నారు. వాయుగుండం తీరాన్ని తాకే సమయంలో ఈదురు గాలులు వీస్తాయని, దీని ప్రభావంతో విద్యుత్ అంతరాయం కలుగకుండా జనరేటర్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు కురిస్తే తాగునీరు సమస్యలు తలెత్తకుంటా నీటిని సిద్దం చేశామన్నారు. రోడ్లు పాడైపోవటంతో మరమ్మత్తులకు ఆర్‌అండ్‌బి డిఇకి ఆదేశాలిచ్చామన్నారు. తుఫాను ప్రభావం గుంటూరు జిల్లాలకు నష్టం వాటిల్లుతోందని వాతావరణ శాఖ ప్రకటించిందన్నారు. నగరం, రేపల్లె, బాపట్ల, భట్టిప్రోలు, కర్లపాలెం, కొల్లూరు మండలాల రైతులు పంటలను జాగ్రత్తలు చేసుకోవాలన్నారు. అనంతరం హార్బర్‌ను సందర్శించిన ఆయన నివాసులను తీరప్రాంతాలకు చేర్చే విధంగా అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ వెంట తహశీల్దార్ మోహనకృష్ణ, అన్ని శాఖల అధికారులు ఉన్నారు.

గీతాజయంతి వేడుకల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక చైతన్యం
* ఉత్సాహంగా పాల్గొన్న పాఠశాలల విద్యార్థులు
గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 11: గీతనే గ్రంథరాజాన్ని, మహాజ్ఞాన గంగను లోకానికి వరంలాగా ప్రసాదించిన గీతాచార్యుడ్ని స్మరించుకుంటూ ఆదివారం నగరంలోని పలు సంస్థల ఆధ్వర్యంలో గీతాజయంతి మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. ప్రముఖంగా నగరంలోని విష్ణుమందిరాలు, కృష్ణ్భగవానుడు కొలువైయున్న ఇస్కాన్, గౌడీయమఠం, స్తంభాలగరువులోని కృష్ణచైతన్యథామం, పాత గుంటూరులోని వేణుగోపాలస్వామి దేవాలయం, ఎన్జీవో కాలనీలోని వేణుగోపాలసన్నిధి, ఆర్ అగ్రహారం గీతా మందిరంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ఆర్ అగ్రహారం సంపత్‌నగర్ శ్రీ రామనామక్షేత్రంలో గీతాజయంతి ఉత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. నగరంలోని అన్ని విద్యాసంస్థల నుండి 800 మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా క్షేత్రానికి తరలివచ్చి గీతాకంఠస్త పోటీలు, వ్యాసరచన పోటీల్లో పాల్గొని తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. భగవద్గీత, కృష్ణశతకాలలో కంఠపాట పోటీ పరీక్షలను నిర్వహించారు. వివేకానంద స్వామి, చిత్రలేఖన పోటీలను కూడా జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వ్యాపారవేత్త అరుణాచల మాణిక్యవేల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించి గీతాగ్రంథాన్ని అధ్యయనం చేయడం అందరికీ సర్వ శుభకరమన్నారు. కృష్ణ్భగవానుడు అర్జనుడ్ని ఉద్దేశించి మాత్రమే గీతను ప్రబోధించలేదని, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించుకోవాలో గీతద్వారా మానవాళికి స్వామి అందించారన్నారు. పాల్గొన్న విద్యార్థులందరికీ కృష్ణయ్యకు నివేదించిన పండ్లు, ప్రసాదాలను అందజేశారు. రామనామక్షేత్రం కార్యదర్శి రాగం రామపిచ్చయ్య, ఆర్‌వి లీలాసుందరి, పాతూరి శ్రీ్ధర్, బండి రామకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు గీతాపఠనం ఆవశ్యకతను తెలియజేశారు.
హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో...
గీతాజయంతి మహోత్సవాలను మూడు రోజులుగా నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యాన ఆదివారం ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం రాజాగారితోటలోని టిటిడి కళ్యాణ మండపంలో గీతశ్లోక కంఠస్త పోటీలను పాఠశాల విద్యార్థులకు నిర్వహించారు. ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జయంతి ఉత్సవాల్లో పలువురు పండితులు పాల్గొని గీతాగ్రంథంలోని సంపూర్ణమైన జ్ఞాన విషయాలను తెలియజేశారు.

ముడుపులు తీసుకునే పదవులు ఇస్తున్నారు..
* అంబటి రాంబాబు

గుంటూరు, డిసెంబర్ 11: ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పదవులను ముడుపులు తీసుకుని ఇస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన శేఖర్‌రెడ్డికి ఏ అర్హత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా నియమించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్‌కు శేఖర్‌రెడ్డి కోట్ల రూపాయలు ముడుపులు సమకూర్చినందునే పాలకమండలిలో స్థానం లభించిందని ఆరోపించారు. శశికళ, లోకేష్‌బాబుల బినామీ శేఖర్‌రెడ్డి అని అందుకే పదవిని కట్టబెట్టారన్నారు. చిన్న కాంట్రాక్టర్‌గా ఉన్న శేఖర్‌రెడ్డి నేడు కోట్లాది రూపాయల సంపాదన వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. హెరిటేజ్ కంపెనీని ఫ్యూచర్ గ్రూపుకు అమ్మేందుకే ఇటీవల చంద్రబాబు దుబాయ్ వెళ్లారని ఆరోపించారు. హెరిటేజ్ కంపెనీ లావాదేవీలను చక్కదిద్దుకునేందుకు మరోసారి విదేశీ పర్యటనకు బయల్దేరిన బాబు ఇంతలో శేఖర్‌రెడ్డిని ఐటి అధికారులకు పట్టుబడటంతో అతన్ని తప్పించే ప్రయత్నంలో భాగంగా విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డబ్బున్న వారికే పదవులు వస్తాయని, ఇందుకు శేఖర్‌రెడ్డే నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు, వైసిపి సేవాదళ్ అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, నాయకులు మామిడి రాము, మర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంతోనే అందరికీ వైద్యం

గుంటూరు, డిసెంబర్ 11: ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే అందరికీ మెరుగైన వైద్యసేవలు అందించడం సాధ్యపడుతుందని, కార్పొరేట్ వైద్యం ప్రజలకు మేలు చేయదని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రంగారాయ మెడికల్ కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పుతుంబాక విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గడ్డిపాటి కళ్యాణ మండపంలో మెడికల్ అండ్ హెల్త్, ఇతర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాష్టస్థ్రాయి సదస్సులో విజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో పనిచేయడం లేదని, లాభార్జనే ధ్యేయంగా వైద్యాన్ని వ్యాపారంగా నిర్వహిస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్య, ఆరోగ్య రంగాలను ప్రభుత్వం తమ ఆధీనంలో ఉంచుకుని ప్రజలందరికీ ఆ సేవలందించాలని అమర్త్యసెన్ వంటి ఆర్థిక వేత్తలు సూచించినప్పటికీ అందుకు భిన్నంగా ఈ రంగాలపై ఆధిపత్యాన్ని ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిందని విమర్శించారు. ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కెవిఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్వీర్యం చేశాయన్నారు. ఓ వైపుప్రభుత్వ వైద్యకళాశాలల్లో సౌకర్యాలు సరిగా లేని కారణంగా మెడికల్ కౌన్సిల్ సీట్లను రద్దు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా అపోలో వంటి కార్పొరేట్ సంస్థలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు సమగ్ర ఆసుపత్రి వైద్యులు గొంది శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రాథమిక, ద్వితీయస్థాయి ఆసుపత్రులను బలోపేతం చేయాలని, వ్యాధి నివారణ కార్యక్రమాలను బలోపేతం చేయాలని సూచించారు. సదస్సులో వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ సురేష్, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, నాయకులు భానుమూర్తి, వై నేతాజీ, జె శ్యామ్, ఎం రాజేశ్వరరావు, డాక్టర్ టి సేవా కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం:కోడెల
సత్తెనపల్లి, డిసెంబర్ 11:సర్వేంద్రియాయాం నయనం ప్రధానం అన్న సత్యాన్ని గమనించి దీనికి మద్దతుగా కోడెల సత్యన్నారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అవయావలలోకెల్లా కళ్ళు ప్రధానమైనవని వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆదివారం స్థానిక డిఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో శంకరకంటి ఆసుపత్రి, పోలీసు శాఖ, డాక్టర్ కోడెల సత్యన్నారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిభిరాన్ని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో స్పీకర్ మాట్లాడారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలనుండి కంటి వైద్యం కోసం తండోపతండాలుగా వృద్ధులు తరలివచ్చారు. వారికి అన్ని సౌకర్యాలను డిఎస్పీ మధుసూదనరావు ఆధ్వర్యంలో పట్టణ పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిభిరంలో సుమారు 1600కు పైగా పరీక్షలను చేయించుకున్నారు. వీరిలో 700 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని తేల్చడం జరిగింది. వీరికి త్వరలో శంకర కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేస్తారు. డిఎస్పీ ఎం మధుసూదనరావు మాట్లాడుతూ జనవరిలో వృద్ధులకు మోకాళ్ల నొప్పులకు వైద్య శిభిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి నజీర్ ఉల్ ఎయిన్, నియోజకవర్గంలోని పోలీస్టేషన్ల ఎస్సైలు, పట్టణ సి ఐలు, పోలీసు సిబ్బంది కంటి పరీక్షలకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఉచిత మెగా కంటి వైద్యశిభిరం అనంతరం జరిగిన సభకు పట్టణ టిడిపి అధ్యక్షులు పెద్దింటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ యెల్తినేడి రామస్వామి, వార్డు కౌన్సిలర్లు తోట అంబికశంకర్, చౌటా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

16న జగన్ సమక్షంలో మహేష్‌రెడ్డి వైసిపిలో చేరిక
నరసరావుపేట, డిసెంబర్ 11: మాజీమంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మూహూర్తం ఖరారయింది. ఈ నెల 16వ తేదీన నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో మహేష్ తీర్థం పుచ్చుకోనున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతోపాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల నుండి కాసు అభిమానులు, నాయకులు బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇందులోభాగంగా కాసు తన వర్గానికి చెందిన వారిని కలిసి సభకు ఆహ్వానిస్తున్నారు. రోజుకో అసెంబ్లీ నియోజకవర్గంలో కాసు మహేష్‌రెడ్డి పర్యటిస్తూ తమ అభిమానులతో పాటు వైఎస్సార్‌సిపి కార్యకర్తలను కలిసి వారితో సంప్రదింపులు చేస్తున్నారు. ఈనెల 16వ తేదీన వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి నరసరావుపేటకు వస్తున్న సందర్భంగా ఈనెల 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక ప్రకాష్‌నగర్‌లోని శుభం కల్యాణమండపంలో నియోజకవర్గ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పట్టణ వైకాపా అధ్యక్షులు ఎస్‌ఎ అనీఫ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నయనానందకరంగా జానపద నృత్యాభినయం
గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 11: భరతమాత పూజా దినోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సంస్కారభారతి గుంటూరు శాఖ ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని బృందావన గార్డెన్స్ పద్మావతీ కళ్యాణ వేదికపై జానపద నృత్యాభినయ పోటీలను ఆసక్తికరంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన బాలబాలికలు, ఔత్సాహిక కళాకారులు తమ జానపద నృత్యాభినయాలతో చూపరులను అమితంగా ఆకట్టుకున్నారు. ఇదే వేదికపై 6వ తరగతి నుండి 10 తరగతి వరకు మేధాశక్తిని పెంపొందించేలా పోటీలు కూడా నిర్వహించారు. విద్యార్థులు ఆడిన కోలాటాలు, లయబద్ధమైన నృత్య విన్యాసాలు, జానపద నృత్యోత్సవాన్ని తలపించాయి. తొలుత భరతమాత చిత్రపటానికి సంస్కార భారతి అధ్యక్షుడు ఇండ్ల శ్రీ్ధర్‌బాబు, శ్రీనివాసరావు, వెంకన్న దేవాలయ పాలకవర్గ సభ్యులు పుష్పమాలలు అర్పించారు.
ఘనంగా ముగిసిన అనుపు ఉత్సవాలు
విజయపురిసౌత్, డిసెంబర్ 11: ప్రపంచ పర్యాటక కేంద్రం అనుపులో ఇన్ఫోసిస్ పౌండేషన్ ఆధ్వర్యంలో అనుపు ఉత్సవాలు ఆదివారం రాత్రిలో అత్యంత వైభవంగా ముగిశాయి. తెలంగాణా ప్రాంత నృత్య కళాకారులచే ఫోక్ డాన్స్ ఉత్సహంగా నిర్వహించారు. గ్రామీణ గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా డప్పులతో అనుపులోయ హోరెత్తేవిధంగా నృత్యాలు జరిపారు. వీటితోపాటు లంబాడీ యువతులు, సాంప్రదాయ దుస్తులతో నాట్యం ఆడిన తీరు ఎంతో ఆకట్టుకుంది. చివరిగా ఇన్ఫోసిస్ పౌండేషన్ టీం సభ్యులు ఫ్యాషన్ షో, నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు తిలకించారు.
పర్యాటకులతో సందడిగా మారిన ధ్యానబుద్ధ
అమరావతి, డిసెంబర్ 11: రాష్ట్రప్రభుత్వం విద్యార్థినీ, విద్యార్థులకు, విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంతో జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున అమరావతి తరలివచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు కూడా విచ్చేశారు. వీరితో పాటుగా పర్యాటకులు కూడా ఆదివారం అధిక సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. పర్యాటకులు రాజధాని అమరావతి, కొత్త సచివాలయం, ఉండవల్లి గుహలను కూడా సందర్శించి వచ్చినట్లు తెలిపారు.