గుంటూరు

సామాన్యుల నగదుకు భరోసా ఏదీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జనవరి 15: పెద్దనోట్ల రద్దు తరువాత దేశంలో సామాన్యుల నగదుకు భరోసా కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని ఉమ్మడిరాష్ట్ర మాజీ స్పీకర్, పిసిసి ఉపాధ్యక్షులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మారీసుపేటలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హడావుడిగా నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 50 రోజుల్లో సాధారణ పరిస్థితులు కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. నల్లధనం వెలికితీత, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకే పెద్దనోట్లు రద్దు చేశామని చెప్పుకొంటున్న ప్రభుత్వం ఆర్‌బిఐ అంచనాల ప్రకారం ఇప్పటికే 15 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుండి బ్యాంకులకు చేరాయన్నారు. అయితే నల్లధనం ఎక్కడ ఉందో వారేచెప్పాలన్నారు. అయినప్పటికీ ప్రజలకు అవసరమైన నగదును బ్యాంకుల నుండి తీసుకునేందుకు నిబంధనలు కొనసాగటం సామాన్యులను ఇబ్బందులకు గురిచేయటమే అన్నారు. నోట్ల రద్దు తాను చెబితేనే ప్రధాని రద్దు చేశారని చెప్పుకుంటున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్యుల నగదుకు భరోసా కల్పించలేక పోయిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని మనోహర్ ప్రశ్నించారు. ఆర్థిక నిపుణులు, మేథావులు చెబుతున్న విధంగా నడుచుకోకుండా పెద్దనోట్లు రద్దు చేసి సామాన్యులు, రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టిన కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే నోట్ల రద్దు కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా కేంద్రం ఆదుకోవాలని ఆయన డిమండ్ చేశారు. రైతులు పండించిన పంట దిగుబడులకు మద్దతు ధర 20 శాతంగా పెంచి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఎకరాకు 25 నుండి 35 వేల రూపాయల వరకు ఖర్చుపెట్టి పంటలు పండించిన రైతులకు నోట్ల కొరత కారణంగా మరో 20 శాతం ఆర్థికంగా నష్టం కలిగించిందన్నారు. ఆ లోటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పూడ్చాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కాలంలో క్రూడ్ ఆయిల్ ధరలు 142 డాలర్లు ఉన్నప్పటికీ పెట్రోలు, డీజిల్ లీటరు 55 నుండి 60 రూపాయలకే అందించారని, బిజెపి ప్రభుత్వం వచ్చేనాటికి బ్యారల్ ధర ఒకస్థాయిలో 38 డాలర్లకు పడిపోయిందని, దీని కారణంగా కేంద్ర ఖజానాకు 3లక్షల కోట్లు అదనపు ఆదాయం చేకూరిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజలు, రైతులు, ఇంధన వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని పెద్దనోట్ల కొరత, అధిక ఇంధన ధరలను అదుపులో ఉంచాలని ఆయన కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం దశరధరామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్యశశిధర్‌రావు, మండల అధ్యక్షులు కోపల్లె శ్రీనివాస్, యార్డు మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దివ్వెల మధుబాబు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు అడపా నారాయణరెడ్డి, షేక్ రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రవంక నదిలో పడి
ఇద్దరు చిన్నారుల మృతి
* ఆదర్శ గ్రామంలో విషాదం
* ఉసురుతీసిన అక్రమ మట్టి తవ్వకాలు
మాచర్ల, జనవరి 15: గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని ఆదర్శ గ్రామం లింగాపురంలో ఆదివారం ఇద్దరు చిన్నారుల మృతి తీవ్ర విషాదం నింపింది. గ్రామానికి చెందిన దొండా అంజయ్య - రమణ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. గ్రామస్తులు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న తరుణంలో గ్రామాన్ని ఆనుకొని వెళ్తున్న చంద్రవంక నది సమీపంలో అంజయ్య కుమారులు శివరామకృష్ణ(6), శ్రీసాయి(5) ఆటలు
ఆడుకుంటూ నదిలోకి దిగారు. ఇటీవల కొందరు చంద్రవంక నదిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరపటంతో గుంతలు లోతుగా ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో సాగర్ కుడికాలువ నుండి లీకై వచ్చిన నీరు చేరిపోయింది. చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడిపోవటంతో నీట మునిగి ఊపిరాడక మృతి చెందారు. అప్పటివరకు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారులు కనిపించకపోవటంతో పక్కనే ఉన్న చంద్రవంక నదిలో దిగి చూశారు. విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ రామాంజనేయులు, అర్బన్ సీఐ సత్యకైలాష్‌నాథ్ దుర్ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
* మృతదేహాలు గురజాల తరలింపు
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవటంతో చిన్నారుల మృతదేహాలను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఏరియా వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా కేసులను ‘రిఫర్ టు గుంటూరు’ అని చెప్పే వైద్యులు కనీసం పోస్టుమార్టం చేసేందుకైనా అందుబాటులో లేకపోవడం పట్ల అన్నివర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైభవంగా పార్వేట ఉత్సవం

మంగళగిరి, జనవరి 15: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో శనివారం గోదాదేవి కల్యాణం, ఆదివారం స్వామివారి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పండ్లు, పూలు, టెంకాయలు సమర్పించారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, కోసూరి శివనాగరాజు, వెనిగళ్ల ఉమాకాంతం, ఆలేటి నాగలక్ష్మి, ఏవి సాంబశివరావు, రావుల శ్రీనివాస్, మోరంపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్థానిక శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం కూడా వైభవంగా నిర్వహించారు.

ముగ్గురు యువకులు మృతి

అచ్చంపేట, జనవరి 15: నదిలో స్నానం చేయాలనే సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మండలంలోని కోనూరు గ్రామంలో జరిగిన సంక్రాంతి కనుమ రోజున చోటుచేసుకున్న విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మచ్చా కోటేశ్వరరావు కుమారుడు మానవేంద్రరాయ్ (15), మచ్చా శ్రీనివాసరావు కుమారుడు కౌటిల్య (13), కోటేశ్వరరావు మేనల్లుడు సత్తెనపల్లి మండలం దీపాలదినె్నపాలెం గ్రామానికి చెందిన కారుపల్లి అజయ్ (19) తమ బంధువులు, స్నేహితులతో కలసి స్నానాలు చేసేందుకు కృష్ణానదికి వెళ్లారు. అజయ్ కోనూరు గ్రామంలో ఉన్న మేనమామ ఇంటికి పండుగ సెలవులకు వచ్చాడు.నదిలో స్నానం చేయాలనే సరదా కలగడంతో అతనితో పాటు మనవేంద్రరాయ్, కౌటిల్యతో పాటు రూపాంజలి, నాని, రుద్రదేవ్, లక్ష్మీప్రావీణ్య తదితరులతో కలిసి సమీపంలో ఉన్న కృష్ణానదికి వెళ్లారు. తొలుత కౌటిల్య స్నానానికి నదిలో దిగి ఊబిలో చిక్కుకున్నాడు. ఇది గమనించిన అజయ్ అతనికి చేయి అందించే ప్రయత్నంలో నదిలోకి జారుకున్నాడు. ఒడ్డున ఉన్న మానవేంద్రరాయ్ వీరిని రక్షించే ప్రయత్నంచేసి కొట్టుకుపోయాడు. ఒకరిని రక్షించే ప్రయత్నంలో మరొకరు ఇలా ముగ్గురు గల్లంతయ్యారు. స్నేహితులు గ్రామానికి చేరుకుని బంధువులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు అంతా చేరుకుని గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటల అనంతరం మృతదేహాలను వెలికి తీశారు. అజయ్ గుంటూరులో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మానవేంద్రరాయ్ అచ్చంపేట బ్లూబెల్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మరో మృతుడు కౌటిల్య గ్రామంలోని పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సంఘటన స్థలాన్ని సిఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ నాగేశ్వరరావు సందర్శించి వివరాలు సేకరించారు. వీఆర్వో శవ పంచనామ అనంతరం మృతదేహాలను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పండుగ పూట ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ సెలవులను ఆనందంగా గడిపిన తమ పిల్లలు సాయంత్రానికి విగత జీవులుగా మారారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.
కారణజన్ముడు త్యాగరాజ స్వామి

గుంటూరు కల్చరల్, జనవరి 15: భగవంతుని సేవ ముందు లౌకికమైన సంపదలు, కోరికలు ఏ మాత్రం ముఖ్యం కావని, ఒక్క మాటలో చెప్పాలంటే ధనం కన్నా రాముని సన్నిధే మిన్న అని ఆచరించి చూపిన కారణ జన్ములు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి అని సంస్కృతి సంస్థ వ్యవస్థాపకుడు సర్రాజు బాలచందర్ శ్లాఘించారు. ఆదివారం నగరంలోని లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ స్వామివారి ఆడిటోరియంలో ఆరు రోజుల పాటు జరిగే నాదయోగి శ్రీ త్యాగయ్య 170వ ఆరాధన సంగీత మహోత్సవాలను ఆయన జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్షులు కేతరాజు నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథి బాలచందర్ మాట్లాడుతూ కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులలో అగ్రగణ్యుడై నాదోపాసన ద్వారా రామ సాక్షాత్కారాన్ని పొందిన రాగరాజు త్యాగయ్య సంగీత జగత్తుకే ఆదర్శప్రాయుడన్నారు. అధ్యక్షత వహించిన నరసింహారావు సంస్థ కార్యదర్శి నేతి విశే్వశ్వరరావు, వ్యవస్థాపకులు బుర్రా సీతారామశాస్ర్తీ, సంయుక్త కార్యదర్శి ఎస్ గిరిజా శంకర్ తదితరులు త్యాగరాజస్వామి వారి కీర్తనలన్నీ ఆణిముత్యాలని కొనియాడారు.
తొలుత మందిరంలో కొలువై ఉన్న సీతా రామచంద్రమూర్తి, లక్ష్మణ, ఆంజనేయ సమేత మూర్తులకు త్యాగయ్య చిత్రపటాలకు అతిధులు పుష్పార్చన చేశారు. ఈ సందర్భంగా ఆరాధనా సంగీత మహోత్సవాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. పలువురు యువ కళాకారులు త్యాగయ్య కృతులు ఆలపించారు. ప్రధానంగా అమెరికా నుంచి వచ్చిన అనన్య అశోక్ త్యాగయ్య కృతులలోని ఉత్తమ సాహిత్యాన్ని విలువలు కలిగిన కీర్తనలను ఎంచుకుని మధురంగా గానం చేశారు.

ప్రముఖులకు విశిష్ట పురస్కారాలు

మాచర్ల, జనవరి 15: పట్టణంలోని పలు రంగాల్లో విశిష్ఠ సేవలు అందిస్తున్న పలువురికి వియన్నార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. వియన్నార్ ఫౌండేషన్, మధర్‌థెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో సేవారంగం, విద్యా రంగం, ఉద్యోగ రంగం, సాహిత్య రంగం, సంగీత రంగం, నాట్య రంగం, నాటక రంగం, సాంస్కృతిక రంగం, సామాజిక రంగానికి చెందిన జక్కిరెడ్డి మర్రెడ్డి, గంగామోహన్, బెజ్జంకి జగన్నాధాచార్యులు, షేక్ చినలాలుసాహెబ్, తమ్మిశెట్టి సీతారాములు, ముళ్ళపూడి శివనాగేశ్వరరావు, ఉప్పు కృష్ణారావు, వూటుకూరి కాశీవిశ్వనాధం, షేక్ అన్వర్‌భాషాలను వియన్నార్ సంస్థ డైరెక్టర్ వేముల శ్రీనివాసరావు, న్యాయవాది కుర్రి సాయిమార్కొండారెడ్డి, గాదె కిరీటిరెడ్డిలు విశిష్ఠ పురస్కారాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, శ్రీనివాసరావు, పోకూరి చందులు పాల్గొన్నారు.

చెంచుకాలనీలో యువకుడి హత్య
విజయపురిసౌత్, జనవరి 15: సంక్రాంతి పండుగకు సరుకుల కోసం ఇంటి నుండి బయలుదేరి అనుపు వద్ద ఒక యువకుడు హత్యకు గురైన సంఘటన చెంచుకాలనీలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..వెల్దుర్తి మండలం జెండాపెంట గ్రామానికి చెందిన ఉడతల గురవయ్య (30) చాపల వేట నిమిత్తం అనుపు సమీపంలోని మేడిచర్ల తండాకు చేరుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం గురవయ్య భార్య లింగమ్మకు వంట సామాన్లు తెస్తానని చెప్పి, చెంచుకాలనీకి వచ్చాడు. సాయంత్రానికి గురవయ్య ఇంటికి రాకపోవడంతో భార్య లింగమ్మ చెంచుకాలనీకి వచ్చింది. చెంచుకాలనీ-అనుపు మార్గ మధ్యంలో గురవయ్య మృతదేహం కనిపించింది. గురవయ్య చేతిపై గొడ్డలితో నరకగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సంఘటనను తెలుసుకున్న మాచర్ల రూరల్ సిఐ శివశంకర్ విజయపురిసౌత్ ఇన్‌చార్జి ఎస్‌ఐ హరికృష్ణ మృతదేహం వద్దకు చేరుకుని, వివరాలను సేకరించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించింది. పోలీసుల జాగిలాలు చెంచుకాలనీలో ఒక ఇంటి వద్ద ఆగడంతో ఆ ఇంటిలో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురవయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు గురవయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శివశంకర్ తెలిపారు.
అగ్రక్షేత్రంగా అమరావతి

అమరావతి, జనవరి 15: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసి ఉన్న అమరేశ్వర స్వామి వారిని దేవదేవుడైన దేవేంద్రుడు ప్రతిష్ఠించిన మూలంగా పుణ్యక్షేత్రాల్లోకెల్లా అగ్రస్థానాన్ని అందుకుంటుందని నంద్యాలకు చెందిన యోగాచార్య అఖిల పరిపూర్ణ యోగానందాచార్యులు అన్నారు. శనివారం అమరావతిని సందర్శించిన అనంతరం ఆదివారం అమరావతి క్షేత్రాన్ని సందర్శించారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పురావస్తు ప్రదర్శన శాలలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా పరిపూర్ణ యోగానందాచార్యులు మాట్లాడుతూ 1975 నుండి ఇప్పటి వరకు 14వేల హోమాలు నిర్వహించామని, హరయోగ, రాజయోగంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇల్లు ఒక యోగా కేంద్రం కావాలని ఆయన ఆకాంక్షించారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు పరిపూర్ణ యోగనందా చార్యులను ఘనంగా సత్కరించారు. ఆయన వెంట కె.తరుణ్‌సాగర్, రామసుబ్బారెడ్డి, అశోక్, కెబి శ్రీధర్ తదితరులు ఉన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవటం అవశ్యం

మంగళగిరి, జనవరి 15: కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా పట్టణంలోని ఇందిరానగర్‌లో సిపిఐ ఆధ్వర్యాన శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సాయంత్రం బహుమతి ప్రదానోత్సవ సభలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉడతా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పూర్వం ఎంతో వైభవంగా జరిగేదని, నేడు ప్రజలు పండుగ జరుపుకునే తీరికలేని విధంగా గడపడం విచారకరమన్నారు. సంప్రదాయాలను మర్చిపోతున్నారని, వాటిని కాపాడి రేపటి తరానికి తెలియ జేయాలని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నియోజకవర్గ కార్యదర్శి రావుల శివారెడ్డి, పిల్లలమర్రి నాగేశ్వరరావు, కూరపాటి మురళీరాజు, చిన్ని తిరుపతయ్య, ఉయ్యాల సత్యనారాయణ, చిలకా బసవమ్మ, వీరాంజనేయులు పాల్గొన్నారు.