గుంటూరు

బాబు అవినీతి, అన్యాయాలను ప్రతిఘటిస్తా:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జనవరి 19: రాష్ట్రంలోను, రాజధాని ప్రాంతంలోను ప్రజలకు, రైతులకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను, అవినీతిని ప్రతిఘటిస్తామని, అన్నదాతలకు వైఎస్‌ఆర్‌సీపీ అన్ని రకాలుగా, తోడుగా అండగా ఉంటుందని , రైతులకు అన్యాయం జరగనివ్వబోమని వైఎస్‌ఆర్ సీపీ అధినేత , ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు, రైతుకూలీలతో సుమారు గంటపాటు ముఖాముఖి నిర్వహించి వారెదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలుసుకుని ప్రసంగించారు. రాజధాని ప్రాంత రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని, మరో రెండేళ్లు భూములు కాపాడుకుంటే ఆ తరువాత మన ప్రభుత్వమే వస్తుందని, మీ భూములను ఎవరూ తీసుకోలేరని, భయపడుతూ ఎవరూ బతకనవసరం లేదని వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో భూ సేకరణ నోటీసులు ఇచ్చిన నవులూరు, ఎర్రబాలెం, ఉండవల్లి , పెనుమాక గ్రామాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా తాను పర్యటించకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే హత్య చేసే విధంగా ఉన్న ఈ చర్యలను ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు పాలన మూడేళ్లైనా రాజధాని ప్రాంతంలో టెంపరరీ మినహా ఒక్క ఇటుకా కన్పించడం లేదని, రాజధాని నిర్మిస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో లేదని, రాజధాని కట్టాలన్నా, ప్రజలకు మంచి చేయాలన్నా వైఎస్‌ఆర్ సీపీకే సాధ్యమన్నారు. భూములు బలవంతంగా లాక్కోకుండా రైతులకు నష్టం కలగని రీతిలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తామని జగన్ అన్నారు. కమిషన్ల కోసం, నచ్చిన వారికి భూములు కట్టబెట్టేందుకు చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ఐదో నెంబర్ జాతీయ రహదారిలో కాజనుంచి సూరాయపాలెం వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిని కలిపే రోడ్డు నిర్మాణానికి భూసేకరణ జరిపినా ఆ రోడ్డు నిర్మించలేని పరిస్థితిలో మూడేళ్ల చంద్రబాబు పాలన సాగుతోందని, మళ్లీ కొత్తగా సీడ్ యాక్సెస్‌రోడ్డు పేరిట పేదల కడుపులు కొట్టేందుకు పూనుకున్నాడని జగన్ ధ్వజమెత్తారు. మూడు పంటలు పండే పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో జరీబు భూమిని డ్రాఫ్ట్ రిపోర్టులో జరీబుగాను, ఫైనల్ రిపోర్టులో మెట్టగాను చూపారని బాలాజీ అనే ఉండవల్లి రైతు జగన్ దృష్టికి తీసుకు రాగా చంద్రబాబు సింగపూర్ వెళ్ళకముందు జరీబుగా ఉందని, వెళ్లొచ్చాక మెట్ట్భూమిగా మారిందని జగన్ హేళన చేశారు. పేదలు, ఎస్సీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉండగా అడంగుల్లో పేరుమార్చి ప్రభుత్వ భూమిగా చూపి ఆ భూముల్ని దుర్భుద్ధితో లాక్కున్నారని, మరోవైపు చంద్రబాబు తన బినామీలతో ఆ భూముల్ని ఎకరా 12 నుంచి 20 లక్షలకు కొనిపించి ప్లాట్లు ఇచ్చే దౌర్భాగ్య స్థితికి దిగజారానని జగన్ అన్నారు. రాజధాని మొదట్నుంచి ఒక స్కాంకింద నడుస్తోందని, పలానా చోట రాజధాని కడతామని చెబితే రైతులు సంతోషపడతారని, చంద్రబాబుకు రాజధాని ఈ ప్రాంతంలోనే పెట్టాలనే ఆలోచన ఉన్నప్పటికీ నూజివీడులో రాజధాని అంటూ లీకులు ఇచ్చి తన బినామీల చేత తక్కువ ధరకు ఈ ప్రాంత భూములు కొనుగోలు చేసి ఆ తరువాత ఇక్కడ రాజధానిని ప్రకటించారని జగన్ అన్నారు. బినామీలతో కొనుగోలు చేసిన భూములు సమీకరణ పరిధిలోకి రాకుండా బినామీలకు లబ్ది చేకూర్చేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోనింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా ప్రోత్సహించాడని, నిజమైన రైతులు అధిక ధరలకు భూములు అమ్ముకోకుండా వారి భూమిని వ్యవసాయ జోన్‌గా ప్రకటించారని జగన్ ధ్వజమెత్తారు. సమీకరణలో తీసుకున్న భూములు కూడా నచ్చిన వారికి నచ్చిన ధరకు ఇస్తున్నాడని, చంద్రబాబు అన్యాయాలను, అవినీతిని ప్రశ్నిస్తే చంద్రబాబు ఆయన మంత్రులు పేపర్లు, టీవీల దగ్గర చేరి జగన్‌కు రాజధాని ఇక్కడ రావడం ఇష్టం లేదని తనపై బండలు వేస్తారని జగన్ అన్నారు. మూడేళ్లైనా చంద్రబాబు బాడుగ (అద్దె) ఇంట్లోనే ఉంటున్నాడని, రాబోయే రోజుల్లో ఇల్లు కొనుక్కుని తాను ఇక్కడే ఉంటానని జగన్ అన్నారు. చూస్తూ చూస్తూనే మూడేళ్లు గడిచాయని, దేవుడి దయదలిస్తే ఏడాదికే ఎన్నికలు వస్తాయని, లేకున్నా రెండేళ్లకు కచ్చితంగా వస్తాయని, అప్పుడు మన ప్రభుత్వమే వస్తుందని, రైతులే వ్యాపారం చేసుకునే విధంగా బ్రహ్మాండమైన రాజధాని కడతామని జగన్ అన్నారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు తిరిగి ఇచ్చే కమర్షియల్ ప్లాట్లలో రైతులు షాపింగ్ మాల్స్ కట్టకూడదని, మంగలి షాపులు, కూరగాయల షాపులు, ఎటిఎంలు మాత్రమే పెట్టుకోవాలని ప్రభుత్వం చెబుతోందని, చంద్రబాబుకు నచ్చిన వారికి ఇచ్చిన ప్లాట్లలో మాత్రం జి ప్లస్ 22 ఫోర్లు కట్టుకోవచ్చనే నిబంధన విధించారని, రైతులు బాగుపడకూడదని చంద్రబాబు చేస్తున్న దౌర్భాగ్యపు పని ఇదని జగన్ అన్నారు. సమీకరణకు తీసుకున్న పొల్లాల్లో ప్లాట్లు వేయకుండా చెత్త కాగితం మీద ప్లాట్లు నెంబర్లు ఇస్తున్నారని, వాటికి ఏం చట్టబద్ధత ఉంటుందని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కమిషన్ల కోసం ఎవరినీ వదలరని, మద్యం, ఇసుక, బొగ్గు, కాంట్రాక్టర్లను, చివరికి దేవుడి భూములను వదల్లేదని జగన్ ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు రాజధానికి మాస్టర్ ప్లానే లేదని, ఏ దేశం వెళితే ఆ దేశం వారితో మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తానంటూ చెబుతాడని, మరోవైపు బాహుబలి సినిమా డైరెక్టర్ రాజవౌళి చేత మాస్టర్ ప్లాన్ చేయిస్తానని చెబుతాడని జగన్ ఎద్దేవా చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంచి రాజధాని పరిధిలో మాత్రం పెంచలేదని జగన్ విమర్శించారు. సమీకరణకు భూములు తీసుకునేప్పుడు ఏ ఊరి వారికి ఆ ఊరిలోనే ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసగించిందన్నారు. 6లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి 650 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు చూపారని, అంటే అడుగు 10 వేల రూపాయలు పడిందని విమర్శించారు. రాజధానిలో రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన రుణమాఫీ ఉచిత విద్య, పెన్షన్లు, నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుంటే రెండు వేల రూపాయలు భృతి ఇస్తానని చెప్పిన హామీలేవీ అమలు కావడం లేదని జగన్ అన్నారు. బాబొస్తే జాబొస్తదని అన్నారని నిడమర్రుకు చెందిన నాగమణి అనే మహిళ పేర్కొనగా జాబు రావాలంటే ఇప్పుడు బాబు పోవాలమ్మా అని జగన్ అన్నారు. మూడేళ్లుగా గ్రామకంఠాల సమస్య తేల్చలేక పోయారని జగన్ ధ్వజమెత్తారు. కోటిరెడ్డి (పెనుమాక), సురేష్ (ఉద్దండిరాయునిపాలెం), నాగరత్నం (నిడమర్రు), బాలాజీ (ఉండవల్లి) తదితర రైతులు, కూలీలు తమ సమస్యలను జగన్ ఎదుట ఏకరువు ఎట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), బాపట్ల, తిరువూరు , నరసరావుపేట ఎమ్మెల్యేలు కోన రఘుపతి, రక్షణనిధి, జి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ నేతలు అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ, నాగిరెడ్డి, బి బ్రహ్మనాయుడు, ఎల్ అప్పిరెడ్డి, ఎం నాగార్జున, కె మనోహర్‌నాయుడు, జంగా నాగిరెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రసంగించారు.