గుంటూరు

కదంతొక్కిన జూట్‌మిల్లు కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 4: భజరంగ్ జూట్‌మిల్లు కార్మికులు లాకౌట్‌కు వ్యతిరేకంగా కదంతొక్కారు. సోమవారం జూట్‌మిల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి మిల్లు యాజమాన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు కదిలేది లేదని భీష్మించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, కెఎస్ లక్ష్మణరావు, జంగాల అజయ్‌కుమార్, పాశం రామారావు, మాల్యాద్రి, భావన్నారాయణ, వైకె తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని అరెస్ట్‌చేసి నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల కడుపు కొట్టే విధానాలను మానుకోవాలన్నారు. మిల్లునైనా తెరవండి, జైలులోనైనా పెట్టండని డిమాండ్ చేశారు. గతేడాది కాలంగా మిల్లు యాజమాన్యం మెడలు వంచి కార్మికులకు పనికల్పిస్తారని నిరీక్షించి కార్మికుల కుటుంబాల నీరసించాయన్నారు. అర్ధాకలితో కుటుంబ పోషణ భారమై పిల్లల చదువులు మాన్పించి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, జైలులో నైనా పట్టెడన్నం దొరుకుతుందేమోనని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కార్మికులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, ఫలితంగా వందలాది మంది కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. నామమాత్రపు సమీక్షలు, సమావేశాలతో కాలయాపన చేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్మిక ఉద్యమాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జూట్‌మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. అలాంటి హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలోనే ఉద్యమాల బాట పడుతున్నారని స్పష్టంచేశారు. ఏడాదికాలంగా జూట్‌మిల్లు అక్రమ లాకౌట్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మిల్లు తెరిచే వరకు న్యాయ పోరాటం చేస్తామని న్యాయవాది వైకె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.