గుంటూరు

జిల్లాలో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట/ సత్తెనపల్లి/ మాచవరం/ నకరికల్లు, ఆగస్టు 30: గత నాలుగురోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని గ్రామాలు ఏకంగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయ. సత్తెనపల్లిలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఆయా మండలాల్లో దాదాపు వెయ్యమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇలావుండగా మంగళవారం తెల్లవారు ఝాము నుంచి కురిసిన భారీ వర్షంతో మండల కేంద్రమైన అచ్చంపేటకు చుట్టుపక్కల ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. చప్టాల పైకి భారీగా వర్షపునీరు ప్రవహిస్తోంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో స్తంభించింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పత్తి, మిర్చి పంట పొలాల్లో భారీగా నీరు చేరడంతో మొక్కలు పూర్తిగా నీట నానుతున్నాయి. భారీ వర్షాల ధాటికి వృక్షాలు ఎక్కడికక్కడ నేలమట్టమయ్యాయి. అచ్చంపేట ముందు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో సత్తెనపల్లి నుంచి అచ్చంపేట వైపువస్తున్న ఆర్టీసి బస్సు నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయే స్థితిలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, పంచాయతీ సిబ్బంది మోకులు, జెసిబి, ట్రాక్టర్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. దీంతో పెద్దఎత్తున ప్రాణనష్టం తప్పింది. ఎన్‌ఎస్‌పి కెనాల్ కార్యాలయం, విద్యుత్, ఎమ్మార్వో కార్యాలయాల వద్ద భారీగా వర్షపునీరు చేరింది. విద్యుత్, ఇతర సమాచార వ్యవస్థలు స్తంభించాయి. పొందూరు గ్రామంలో చెరువు తెగిపోవడంతో గ్రామంలోకి నీరు చేరుకుంది. మంగళవారం మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెవెన్యూ, పోలీసు అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.
* పొంగి పోర్లుతున్న బసవమ్మవాగు
భారీ వర్షాలకు మంగళవారం సత్తెనపల్లి పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనితో నాగన్నకుంట ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ఇళ్లలోకి నీరుచేరి కొన్ని వస్తువులు నీటమునగగా మరికొన్ని నీటిపై తేలుతున్నాయి. దీనితో దిక్కుతోచన స్థితిలో నాగన్నకుంట ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎలుకలు, పాములు, కాళ్లజెర్రులు గట్లపైకి వచ్చి చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నీటిమునిగిన ఇళ్ళు ఖాళీచేసి సమీపంలోని డాబాలపైకి ప్రజలు చేరుకుంటున్నారు. ఇదిలావుండగా మాచర్ల-గుంటూరు రహదారిలోవున్న బసవమ్మవాగు పొంగి పొర్లుతుండడంతో అటుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నరసరావుపేట రోడ్డులోని బట్టీల సమీపంలోని సప్టావద్ద వర్షపునీరు వరదలై పారుతుండడంతో నరసరావుపేటకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనితో ఆలస్యంగా స్పందించిన మున్సిపల్ అధికారులు జెసిబి సహాయంతో కల్వర్టుకు అడ్డుపడ్డ వ్యర్థాలను తొలగించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. తహశీల్దార్ కార్యాలయంలోకి నీరుచేరడంతో ఉద్యోగుల విధుల నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పొంగి పొర్లుతున్న వాగుల కారణంగా పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2వ వార్డులోని మాష్టిన్‌పేటలో వర్షకారణంగా ఇళ్ళలోకి మోకాలిలోతువరకు నీరువచ్చి చేరడంతో ఇంళ్ళలోని సామాన్లు, ఫర్నీచర్, బట్టలు పాడైపోయి ఆస్తినష్టం సంభవించింది. సమీపంలోని పెద్దడ్రైనేజి నుండి లోతట్టు ప్రాంతంలోకి చేరడంతో ఆప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎస్టీ కాలనీలోని కొన్ని పూరిళ్ళు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తంగా పట్టణంలోనే గాక నియోజకవర్గంలోని పలు లోతట్టు గ్రామాల రహదారులు నీటమునిగాయి దీనితో ఆయా ప్రాంతాల ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
పెద్ద సంఖ్యలో నీట మునిగిన ఎరువుల బస్తాలు
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాచవరం మండలంలోని పలు గ్రామాల్లోని వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. వేమవరం వద్ద గల రాళ్లబండి వాగు, పినె్నల్లి వద్దగల కొట్టెళ్ల వాగు పిల్లుట్ల సమీపంలోగల పిల్లెరు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాచవరం గ్రోమోర్ గోడౌన్‌లో సుమారు రూ. 4 లక్షల విలువగల ఎరువుల బస్తాలు పూర్తిగా నీట మునిగాయి. వర్షాల రాకతో చెరువులు, బావులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండిపోయి జలకళ సంతరించుకున్నాయి. వర్షంతో రైతులకు ఆనందంతో పాటు పంటలకు పుష్కలంగా నీరు అందాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా వాగుల వద్ద ప్రయాణికులు తిరగకుండా పోలీసు పికేటింగ్ నిర్వహించారు. అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షం రైతుకు అనందం ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ ఎడతెలిపి లేకుండా కురుస్తోంది.
నీటిలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
నాలుగు రోజులుగా కురుస్తున వర్షం మంగళవారం కూడా నకరికల్లును ముంచెత్తింది. వివిధ ప్రాంతాలు పూర్తిగా జలమయమై రోడ్లపై నీరు ఎరులై ప్రవహించింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షంపు నీరు ప్రవహించేందుకు సరైన డ్రైన్ మార్గం లేకపోవటంతో నీరు రోడ్డుపై నిలిచి పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి చేరాయి. పలు ప్రాంతాల్లో గోడలునాని కూలే పరిస్థితి చేరుకున్నాయి. గంగమ్మగుడి పరిసర ప్రాంతంలో అత్యధికంగా నీరు చేరటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఆర్టీసీ బస్సు నీటిలో ఇరుక్కుపోగా పొక్లెయిన్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. నకరికల్లు పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి చిన్న వాహనాలు దారి మళ్లించటంతో కొన్ని ప్రమాదాలు తప్పాయి. రాష్ట్ర రహదారి విస్తరణ సమయంలో గ్రామంలో నిర్మించిన వంతెన అస్యవస్తంగా నిర్మించిన రోడ్లు అసంపూర్తిగా నిర్మించిన డ్రైన్‌ల కారణంగానే నీటి ప్రవాహానికి అవకాశం లేక పలు సమస్యలు ఎదురౌతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి ఈ సమస్య పునరావృతం కాకుండా అవసరమైన జలమార్గాలను ఏర్పాటు చేయావలసిందిగా కోరుతున్నారు.