గుంటూరు

స్థానిక సంస్థల బలోపేతానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు సిటీ, సెప్టెంబర్ 20: స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటుచేసిందని, 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని 4వ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ జి నాంచారయ్య పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్‌లు, చైర్‌పర్సన్లతో నిధుల కేటాయింపుపై సలహాలు, సూచనలను నాంచారయ్య బృందం సేకరించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ నాంచారయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ల కిందకు వస్తాయన్నారు. ఆయా స్థానిక సంస్థల్లో నిధుల వినియోగం, ఆదాయ వనరుల వివరాలు, ఆడిట్ తదితర అంశాలను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. కమిషనర్‌లు, ప్రజాప్రతినిధుల నుండి ఆయా స్థానిక సంస్థల అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని, వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. కేంద్రప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘానికి కూడా ఈ నివేదికలు పంపుతామని, నివేదికల ఆధారంగా కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధుల కేటాయింపులో జనాభా ప్రాతిపదికతో పాటు నగర విస్తీర్ణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు నగరానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని విలీన గ్రామాల్లో డ్రైన్లు, రోడ్లు, మంచినీటి పైపులైన్లు, విద్యుత్ సరఫరా తదితర వౌలిక సదుపాయాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిన అవసరముందని సూచించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు బి నాగరాజు, టి భాస్కరరావు, వి జయసింహులు నాయుడు, ఐ సత్యనారాయణ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

అమరేశ్వరుని సేవలో శ్రీశైలం ఎమ్మెల్యే
అమరావతి, సెప్టెంబర్ 20: కర్నూలు జిల్లా శ్రీశైలం శాసనసభ్యుడు రాజశేఖరరెడ్డి దంపతులు గురువారం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిని సందర్శించారు. అమరేశ్వరాలయానికి విచ్చేసిన రాజశేఖరరెడ్డి దంపతులకు ఆలయ అధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాలు, జ్ఞాపికను ఆలయ పాలకమండలి సభ్యులు పీసపాటి నాగేశ్వరశర్మ, నాగార్జున బహూకరించారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి
కాకుమాను, సెప్టెంబర్ 20: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా అధికారులు పనిచేయాలని మండల ప్రత్యేక అధికారిణి కె పద్మాదేవి అన్నారు. గ్రామదర్శినిలో భాగంగా మండల పరిధిలోని పెద్దివారిపాలెం గ్రామంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మండల శాఖల అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి గ్రామ పారిశుద్ధ్యంపై జాగ్రత్త చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. తహశీల్దార్ కె సాయిప్రసాద్, హౌసింగ్ ఎఇ అజేయుడు, ఎంఇఒ కెఎఫ్ కెనడి పలువురు అధికారులు పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి
పెదనందిపాడు, సెప్టెంబర్ 20: ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అన్నారు. సుదీర్ఘ చరిత్రకల్గిన పెదనందిపాడుకు భూగర్భ డ్రైనేజీ పథకం మంజూరు చేయడం ఈ ప్రాంత అదృష్టమన్నారు. పెదనందిపాడులోని పురాణ కాలక్షేప మండపంలో గురువారం భూగర్భ డ్రైనేజీ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమష్టి కృషి ఐక్యతపైనే అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో పంతాలు, పట్టింపులతో అభివృద్ధి పనులకు తీవ్ర విఘాతం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. నూటికి నూరుశాతం గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన ఘనత రాష్ట్ర చరిత్రలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి దక్కిందన్నారు. భూగర్భ పైపులైను వేసిన ఆరు నెలలకు గానీ దానిపై రోడ్లు వేయడం వీలుపడదన్నారు. అప్పుడే మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మండల ఉపాధ్యక్షుడు ఎన్ బాలకృష్ణ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ పథకం మంజూరు కావడానికి కారకులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కిషోర్‌బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ వెంకటేశ్వరరావు, డిఇ రమేష్, ఎంపీడీవో ఖాజాబీ, పంచాయతీ కార్యదర్శి నాగయ్య, మాజీ సర్పంచ్ కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా భూగర్భ డ్రైనేజీ పథకంతో పాటే 40 ఏళ్ల క్రితం వేసిన మంచినీటి పైపులైనును కూడా ఆధునికీకరించాలని మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ధూళిపాళ్ల మోహనరావు సూచించారు.