ఈ వారం కథ

సాహసం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్లెదురుగా నీళ్లు.. ఆ నీటిపై తేలే అందమైన నగరం.. నా కళ్ల వెనుక మాత్రం కల్లోల సముద్రం.. మనసును మండిస్తున్న బడబానలం.. వారం రోజుల ఇటలీ ప్రయాణంలో భాగంగా ఇవాళ వెనిస్‌లో ఉన్నాం. నిన్నా, మొన్నా ఫ్లోరెన్స్.. అంతకన్నా ముందు రోమ్.. ఆ రోజు రోమ్‌లో నేను చిక్కుకున్న పరిస్థితిని తలచుకుంటేనే కాళ్లలోనుంచి వణుకు రావలసిన విషయమది! చేతిలో డబ్బూ దస్కం ఏమీ లేకుండా రెండేళ్ళ పిల్లతో అనామకంగా రోమ్ నగర వీధులలో నిలబడవలసి రావడం.. దేవుడి దయ ఉండబట్టి ఏ ప్రమాదం జరగకుండా తప్పించుకున్నా.. కానీ, మనసుకు తగిలిన దెబ్బ.. ఎలా మానుతుంది?
మూడు రోజులుగా ఆలోచనలతో తల పగిలిపోతోంది. ఆ రోజు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాక శరత్ మొహం చూడాలంటేనే దుస్సహంగా ఉంది. ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడే ఇలాగే నిలుచున్న పళంగా మాయమైపోవాలనిపిస్తోంది.
***
ఉదయం పది గంటల సమయం.. వెనిస్‌లోని సెయింట్ మార్క్స్ స్క్వేర్ పరిసరాలు.. ఎటు చూసినా జనంతో సందడిగా వుంది. శరత్ కోసం చూడగా పదడుగుల దూరంలో కనిపించాడు. ధాత్రిని ఎత్తుకుని మెల్లగా నడిచి వస్తున్నాడు. అది ఆనందంగా చాక్లెట్ తింటోంది. వాళ్ళ నాన్నని కూడా రుచి చూడమని నోటికి అందిస్తోది. నేను అక్కడి నుంచి పక్కకి తప్పుకుని కొంచెం వెనక్కి నడిచాను. శరత్ కనిపించడం లేదిపుడు. అక్కడ దుకాణాల అద్దాల్లోనుంచి కనిపిస్తున్న గాజు బొమ్మల అందాన్ని పరికిస్తూ ఇంకాస్త వెనక్కి వచ్చేశాను.
శరత్ కళ్ళబడాలనిపించడం లేదు.. తప్పుకుని తిరిగాలనిపిస్తోంది. గుండెల్లోని దుఃఖాన్నీ, మంటనీ అదిమిపెట్టడం నాకు కష్టంగా ఉంది. ఎవరినైనా దగ్గరి వాళ్ళని కావలించుకుని అంతా చెప్పుకుని మనసులోని భారం దించుకోవాలని వుంది. అయినా, ఎవరున్నారిక్కడ? ఈ పరాయి దేశంలో.. మాతృభూమికి ఇన్ని వేల మైళ్ళ దూరంలో..
‘సౌమ్యా.. నువ్వేనా..? ఇక్కడున్నావేమిటి?’ ఉద్వేగంగా వినిపించిన స్వరమూ.. దానితోపాటు నన్ను ఆప్యాయంగా చుట్టేసిన కరమూ...
తిరిగి చూస్తే- పద్మావతిగారు..! అమ్మకి ఆమె స్నేహితురాలు. నాకు పెద్దగా సాన్నిహిత్యం లేకపోయినా అమ్మకి ఆవిడ ఎంతో ఆప్తురాలో తెలుసు కనుక ఆవిడని చూడగానే అమ్మని చూసినట్లే అనిపించి మనసు వణికింది.
‘మేమిప్పుడు జర్మనీలో ఉంటున్నాం ఆంటీ. ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. ఒక పాప మాకు’ నా వివరాలు చెప్పాను.
‘మా అమ్మాయి స్విట్జర్లాండులో ఉంటోంది. అక్కడినుంచి వచ్చాం. ఇవాళ వెనిస్ చూసి రేపురోమ్ వెళ్తాం’ అన్నారావిడ. పక్కనున్న షాపులో ఏదో కొంటున్న తన కుటుంబాన్ని చూపించారు. ఇంతలో శరత్ కూడా రావడంతో ఆమెకి పరిచయం చేశాను. ఒక్క క్షణం ముగ్గురం వౌనంగా నిలబడ్డాం. నాకు ఆవిడని వదిలి ఇవతలికి రావాలని లేదని శరత్‌కి అర్థమయిందేమో- ‘ఇపుడే వస్తా..’ అంటూ మళ్లీ ధాత్రిని తీసుకుని వెళ్లిపోయాడు.
ఆవిడ నా చేయి పట్టుకుని ‘ఇలా కూర్చుందాం రా..’ అంటూ కూర్చోపెట్టారు. ఆ వెంటనే నావైపే చూస్తూ ‘ఏదో బాధ కనిపిస్తోంది నీ మొహంలో..’ అన్నారు.
ఆవిడ మాటలకి విస్తుపోయా. ఎలా కనిపెట్టేశారు..? ఆమె వయసో.. అనుభవమో.. నామీద వున్న అభిమానమో.. కారణమేదైతేనేం.. నేను చెప్పకుండానే నా బాధని కనిపెట్టేశారు.
చిన్నగా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టా. మూడు రోజుల క్రితం రోమ్‌లో దిగాం. గత నెలలో మాకు తెలిసిన భార్యాభర్తలు రోమ్ వెళ్లి వచ్చారు. వాళ్ళు వుండి వచ్చిన రిసార్ట్ చాలా బావుందని విని మాకోసం కూడా అదే తీసుకున్నారు శరత్. రోమ్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న రైల్వేస్టేషన్‌కి చేరి రిసార్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే పావుగంట తర్వాత వాళ్ళ వ్యాన్ వచ్చింది. అందులో ఎక్కి కూర్చుంటే నిర్మానుష్యమైన దారుల వెంబడి ప్రయాణం మొదలయింది. నాకు కొంచెం ఆదుర్దాగా అనిపించింది. వ్యాన్‌లో వచ్చిన వాళ్ళు ఇద్దరు దృఢకాయులైన మగవాళ్ళు. బాగా తెలిసినవాళ్ళు చెప్పిన రిసార్ట్ కదా అన్నది ఒక ధైర్యం. అయితే, వాళ్ళు చెప్పారని బుక్ చేసేశాడే కానీ శరత్ వాళ్ళని పూర్తి వివరాలేమీ కనుక్కోలేదు. వాళ్ళు రిసార్ట్‌కి ఎలా వెళ్ళారు? ఇలాగే వ్యాన్‌లో వెళ్ళారా? లేక వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళారా? ఇలాంటివన్నీ ఏమీ అడగలేదు. ‘అవన్నీ అడుగుతామా?’ అని విసుక్కున్నాడు నేను ఆ ప్రశ్న వేస్తే.
దాదాపు ఇరవై నిమిషాల ప్రయాణం చేశాక ఆ ప్రదేశం వచ్చింది. అసలే అలసిపోయి వుంటే రిసెప్షన్‌లో వున్న ఆవిడ ఇంటర్నెట్‌లో బుక్ చేసినపుడు శరత్ మా వివరాలేవో సరిగా రాయలేదని పేచీ పెట్టింది. కాస్త వాదన జరిగాక అప్పుడు పాస్‌పోర్టులు తీసుకుని కాటేజీ తాళం చెవులు ఇచ్చింది. కాటేజీ బాగానే వుంది. కానీ, అది మూడు రోజుల్లో రోమ్ చూసి వెళ్దామనుకునే వాళ్లకి అనువైన ప్రదేశం కాదని మా ఇద్దరికీ అర్థమైంది. అక్కడి నుంచి బయటికి రావాలంటేనే చాలా సమయమూ, డబ్బూ ఖర్చవుతాయి.
‘మనం ఊరంతా తిరుగుదామని వచ్చాం కానీ, తీరిగ్గా కాటేజీలో విశ్రాంతి తీసుకోవడానికి కాదు కదా!’ అన్నా.
‘అయితే ఏం చేద్దామంటావిపుడు?’ శరత్ విసుక్కున్నాడు.
‘ఖాళీ చేసేసి స్టేషన్ దగ్గరలో ఏదన్నా హోటల్ చూసుకుందాం’
‘ఇప్పటికిప్పుడు దొరకద్దూ..’
‘ప్రయత్నిద్దాం’ అంటూ నేను టూరిస్టు గైడ్ తీసి నెంబర్లు వెతికి పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్లు చేశాను. రోమ్ స్టేషన్ దగ్గరే గది దొరికింది.
‘కానీ, ఆవిడ ఒప్పుకోదు. పేచీకోరు మనిషిలా వుంది’ అన్నాడు శరత్
‘మాట్లాడి వస్తా..’ అని రిసెప్షన్ దగ్గరికి వెళ్తే అంతకుముందున్న ఆవిడ లేదు. మరొక అమ్మాయి వుంది. ఆ అమ్మాయితో మాట్లాడి పాస్‌పోర్టులు తీసుకుని వచ్చాను. వెనక్కి వచ్చి గది తీసుకునేసరికి ముప్పావు రోజు పూర్తయిపోయింది. ఆ రోజుకి ట్రెవీ ఫౌంటెన్ లాంటి రెండు, మూడు ప్రదేశాలు చూశామంతే.
రెండవ రోజన్నా కొంచెం వేగంగా అన్నీ చూడాలన్న ఉత్సాహంతో త్వరగా తయారయ్యాను నేను. శరత్ మాత్రం ఆ రోజు అంత హుషారుగా లేడు. మెట్రో టిక్కెట్ కొనుక్కున్నాం. ఆ జనాన్ని చూస్తే కళ్ళు తిరిగిపోయాయి. వాళ్ళందరితోపాటూ తోసుకుంటూ అసలు ట్రైన్‌లో ఎక్కగలమా? అనిపించింది నాకు. అంత విపరీతంగా వున్నారు. వాటికన్ సిటీకి వెళ్లాం. టిక్కెట్ కొనుక్కుని మ్యూజియంలో ప్రవేశించాం. చాలా పెయింటింగ్స్ వున్నాయి. చూస్తూ నడుస్తున్నాం. పది నిమిషాల తర్వాత చూస్తే శరత్ కనిపించలేదు. ముందుకు వెళ్ళిపోయాడో, వెనుక వుండిపోయాడో అర్థం కాలేదు. కాసేపు ఆగాను. తను నా అంత ఆసక్తిగా మ్యూజియం చూడడు కదా.. ముందుకే వెళ్లిపోయి ఉంటాడనుకుని మళ్లీ నడవడం మొదలుపెట్టాను. సిస్టైన్ చాపెల్ నిజంగా చాలా స్థిమితంగా చూడవలసిన అద్భుతం.
ఒక పక్క ధాత్రిని ఎత్తుకుని నడవడం.. మరొకప్రక్కన శరత్ ఎక్కడా కనబడడం లేదన్న కంగారు. ఎలా చూశానో, ఎలా నడిచానో నాకే తెలీదు. బయటికి వచ్చేసరికి దాదాపుగా పనె్నండయింది. మ్యూజియం నుంచి బయటికి వెళ్ళే మెట్లు ఒక గదిలోకి దారితీస్తాయి. అదొక్కటే బయటికి వెళ్ళే మార్గం. కాబట్టి శరత్ నాకన్నా ముందే వచ్చివుంటే ఆ గదిలో వుండి వుండాలి. కానీ, అక్కడ లేడు. ‘ఇంకా రాలేదన్నమాట. లోపలే ఉన్నాడన్నమాట’ అనుకుని అక్కడ వున్న కుర్చీలో కూలబడ్డాను.
ధాత్రి ఆకలని సతాయించడం మొదలుపెట్టింది. అపుడు గుర్తొచ్చింది- నేనసలు చేతిలో పైసా కూడా పెట్టుకోలేదని. పాస్‌పోర్టులు, డబ్బు శరత్ దగ్గర వున్న పర్స్‌లోనే వున్నాయి. నాలో కంగారు ఎక్కువైంది. ఏమిటి చేయడమిప్పుడు? శరత్ కనబడకపోతే హోటల్‌కి తిరిగి వెళ్ళడం ఎలా?
గంట గడిచింది. రెండు గంటలు గడిచాయి. ధాత్రి కాసేపు సతాయించి నిద్రపోయింది.
‘ఏమైపోయాడు శరత్? లోపల ఇంతసేపు ఉండటానికి అవకాశం లేదు. బయటికి వస్తే ఇక్కడ ఆగాలి కదా! ఒకవేళ ఏ కారణంతోనైనా బయటికి వెళ్లినా మళ్లీ నా కోసం వెనక్కి వచ్చి వుండాలి కదా! ఒకవేళ వెళ్లినా మళ్లీ రావాలి. నేనిక్కడే వుంటానని తెలుసు కదా! వస్తాడు’ అనుకుని అలాగే కూర్చున్నాను. మరో గంట గడిచింది. మూడు గంటలపాటు అక్కడే కూర్చున్న నన్ను మ్యూజియం ఉద్యోగులు వింతగా చూడటం మొదలుపెట్టారు.
వాళ్లకు మెల్లగా విషయం చెప్పాను. డబ్బుల్లేవని ముందే చెప్పలేదు- లోకువ అయిపోతానేమోనని, డబ్బు కోసం నాటకాలాడుతున్నాననుకుని అసలు నా మాటే వినిపించుకోరేమోనని. మనిషి కనబడడం లేదని మాత్రం చెప్పాను. ఉన్నదానికంటే కాస్త ఎక్కువ కంగారు నటించాను. ఒక ఆఫ్రికా అబ్బాయి నా మాటలు చాలా సానుభూతిగా విని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. అతనితో ఏం మాట్లాడితే ఏం గొడవో తెలియదు. నేను చెప్పదలచుకున్నవి చెప్పడానికీ, చెప్పద్దనుకున్నవి చెప్పకుండా వుండడానికీ కూడా కంగారునీ, భయానే్న ఆసరాగా తీసుకోదల్చుకున్నాను. సహాయం అడగాలన్నా మొహంలో భయానే్న చూపించాలి. వాళ్ళకి అన్ని వివరాలూ చెప్పకుండా తప్పించుకోవడానికీ నోట మాట రానితనానే్న అభినయించాలి. అదీ పైకి నేను అమలుపరచిన ప్రణాళిక. మరోవైపు మనసులో నిజంగానే బోలెడంత కంగారు.
మేం ఏ హోటల్లో దిగామో అడిగి అక్కడికి ఫోన్ చేశారు ఆ మ్యూజియం వాళ్ళు. శరత్ అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. మరేమయ్యాడు? చూస్తుండగానే నాలుగయింది. మ్యూజియం మూసేసే సమయం. ఇంక అక్కడినుంచి కదలాలి నేను. కదిలి ఏం చేయాలి? ఆ ఆఫ్రికా అతను నా దగ్గరికి వచ్చి నిల్చుని ‘ఏం చేయబోతున్నార’ని అడిగాడు.
అపుడు బయట పెట్టాను నా దగ్గర డబ్బులు లేవన్న విషయం. ఆ మాట చెప్తూ వుండగా గుర్తొచ్చింది పొద్దున కొన్న మెట్రో టిక్కెట్ నా జేబులో వుందని.
పొద్దున్న రైలు ఎక్కేటపుడు నా టిక్కెట్ నాకు ఇచ్చేశాడు శరత్. ఇపుడు ఒక్కదాన్నీ మెట్రో స్టేషన్ దాకా ధాత్రిని ఎత్తుకొని నడిచి ఆ జనంలో రైలు ఎక్కి వెళ్ళగలనా? నా భయమేమిటో చెప్పగానే అతను ‘ఆ టిక్కెట్ రైలుకీ, బస్సుకీ పనికొస్తుంది. బస్సులో వెళ్లండి’ అని సలహా చెప్పాడు.
‘బస్టాప్ ఎంత దూరం?’ అని నేను అడిగేలోపే ‘నేను చూపిస్తాను రండి’ అని దారితీశాడు. దారి పొడుగునా మాట్లాడుతూనే ఉన్నాడు. అతను స్టూడెంట్ అట. మ్యూజియంలో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడట. ఏదో చెప్తున్నాడు.. కానీ- అతని చరిత్ర ఏమిటో మనకేం తెలుసు? రోమ్‌లో జరిగే నేరాల గురించి మేమందరం బాగానే విని వున్నాం. రోమ్ వెళ్లి బంగారమూ, డబ్బులూ పోగొట్టుకుని వచ్చిన వాళ్ళు మా ఆఫీసులోనే ఇద్దరు ముగ్గురు వున్నారు.
రోడ్డుమీద నడుస్తున్నంతసేపూ ఒకటే సందేహాలు. అతనితో పరిచయం వున్నట్లుగా ఎవరికైనా కనిపిస్తే ఏం ప్రమాదమో? అతనెవరో నాకు తెలియనట్లూ.. నేను ఒంటరిదాన్నన్నట్లూ నడిస్తే ఏం ప్రమాదమో? మరోవైపు- ఎవరన్నా వచ్చి ప్రశ్నలు వేస్తే పాస్‌పోర్టు కూడా దగ్గర లేదన్న భయం. అంతకన్నా ముఖ్యంగా అసలు శరత్ ఏమయ్యాడో? ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడో? అన్న ఆలోచనతో గుండెల్లో దడ.
నేను నడవలేకపోతున్నానని గ్రహించి ధాత్రిని ఎత్తుకుంటానన్నాడు ఆ అబ్బాయి. కానీ నేను ఇవ్వలేదు. బస్ ఎక్కి స్టేషన్‌లో దిగాను. అక్కడినుంచి మెల్లగా నడుచుకుంటూ హోటల్ చేరితే అక్కడ బయటే నిలబడి వున్నాడు శరత్!
‘ఏమైంది?’ అని అడిగితే ఏమీ కాలేదట. తను మ్యూజియం చూసి బయటికి వచ్చి నేను వెళ్ళిపోయి ఉంటాననుకుని తను వచ్చేశాడట.
‘నేను వెళ్లిపోయి వుంటానని ఎలా అనుకున్నావు?’ అని ప్రశ్నిస్తే- ‘అనుకున్నాను’ అన్నది ఒక్కటే జవాబు. ఎన్నిసార్లడిగినా అదే జవాబు.
‘నా దగ్గర డబ్బులు కూడా లేవు కదా.. ఎలా వస్తాననుకున్నావు?’ అంటే- ‘వచ్చావుకదా!’ అన్నాడు.
... ఇలా జరిగిందంతా నేను చెబుతూంటే నా గొంతులోకి దుఃఖం వచ్చేసింది. పద్మావతిగారు ఓదార్పుగా నా చేతి మీద చేయివేశారు. ‘ఎందుకు వచ్చేశాడో చెప్పలేదన్నమాట’ అన్నారు.
‘చెప్పలేదు.. కానీ- అర్థమైంది..’ అన్నాను.
‘నీకేం భయం? నిన్ను ఎక్కడ వదిలేసినా వచ్చేయగలవు. నిన్న ఎలా క్షణాల మీద హటల్ మార్చావో చూశాను కదా!’ అని ఆమె అన్నపుడు అర్థమైంది.
‘అప్పటి నుంచి నాకు శరత్‌ని చూస్తేనే అసహనంగా వుంది ఆంటీ’ అన్నాను జీరబోయిన గొంతుతో
కొన్ని క్షణాలు వౌనంగా ఉండిపోయిన తర్వాత- ‘ముప్ఫై ఏళ్ళనాటి సంఘటన ఒకటి గుర్తొస్తోంది నాకు’ అన్నారావిడ.
‘ఏమిటది..?’ అని నేను అడగబోయేలోపే చెప్పడం మొదలుపెట్టారు.
***
ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలపుడు మేం కార్లో ఇంటికి వెళ్తున్నాం. నిర్మానుష్యంగా, చీకటిగా వున్న రోడ్డులో నా స్నేహితురాలు నడిచి వెళ్తూ కనిపించింది. మేం కారు ఆపబోతూ వుండగా.. ఎవరో ఇద్దరు ఆకతాయిలు స్కూటర్‌మీద వేగంగా ఆమెకి దగ్గరగా వచ్చారు. ఏం అల్లరి పని చేద్దామనుకున్నారో కానీ- ఆఖరి నిమిషంలో ఆమె గర్భవతి అని గ్రహించినట్లున్నారు. తప్పుకుని వెళ్లిపోయారు. ఆమె కంగారుగా పక్కకి జరగబోయి కొంచెం తూలి మళ్లీ నిలదొక్కుంది. నేను కారు దిగి ఆమెని పొదివి పట్టుకున్నాను. కార్లో కూర్చుని కాస్త స్థిమితపడి మంచినీళ్ళు తాగాక- ‘ఎందుకిలా ఒంటరిగా వస్తున్నావు.. ఏమైంది?’ అని అడిగాను.
భర్తా తనూ ఎక్కడి నుంచో స్కూటర్‌మీద ఇంటికి వస్తున్నారట. ‘ఈ పూట అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్దామా?’ అని దారిలో రెండు, మూడుసార్లు అడిగిందట ఆమె. వాళ్ళ అమ్మా వాళ్ళ ఇల్లు అక్కడికి అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉందని అతను వద్దన్నాడు. ఆ రోడ్డు దగ్గరికి రాగానే ఇంటివైపు మలుపుతిప్పేస్తుంటే ఆశ చావక మళ్లీ అడిగింది.
స్కూటర్ ఆపి- ‘దిగు’ అన్నాడు. ఎందుకో అనుకుని ఆమె కిందకు దిగింది. అంతే.. అతను వెళ్లిపోయాడు. కిలోమీటరు పొడవున్న ఆ రోడ్డుమీద ఆమె మెల్లగా నడుచుకుంటూ వస్తోంది. నేను నివ్వెరపోతూ ‘ఆటో ఎక్కకపోయావా?’ అన్నా.
‘చేతిలో డబ్బుల్లేవు. ఆటోలు కూడా కనబడలేదు’ ఆమె పేలవంగా నవ్వింది.
నేను పర్సులోనుంచి డబ్బులు తీస్తూ ‘పద ఆటో ఎక్కిస్తాను. అమ్మ దగ్గరికి వెళ్లిపో’ అన్నాను.
‘కాదులే పద్మా.. ఇంటి దాకా వచ్చేశానుగా, ఇంటికే వెళ్తా’ అంది.
ఎంత చెప్పినా వినకుండా ఇంటికే వెళ్లింది. నాకు కొంచెం చిరాకనిపించింది. తర్వాత ఆమె కనబడినపుడు విసుక్కున్నాను.
‘మరీ అంత కసాయితనమా? ఎందుకు భరిస్తావు? నీకేం తక్కువ? మీ అమ్మ దగ్గరికి వెళ్లిపో. చదువుకున్నందుకు కొంచెమైనా సాహసం వుండాలి’ అన్నాను.
ఆమె చిన్నగా నవ్వి- ‘చేయగలిగిన పని చేయడం సాహసమా? లేక ‘చేయగలనా?’ అని సందేహం ఉన్న పని చేయడం సాహసమా?’ అంది.
‘అంటే..’ అన్నాను నేను అర్థం కాక.
‘మా అమ్మ దగ్గరికి వెళ్లిపోయి నా బతుకు నేను బతకగలగడం నేను కచ్చితంగా చేయగల పని. ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకుని సున్నితత్వాన్ని నేర్పగలగడం.. అది నేను చేయగలనా? అన్నది సందేహం కలిగించే పని. రెండోది సాహసం అనుకుంటున్నాను నేను’ నవ్వుతూ చెప్పింది.
ఆ సమాధానానికి నాకు బుర్ర తిరిగింది. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే ‘గుడ్డెద్దు చేలో పడ్డట్లు పోవడం సాహసం కాదు పద్మా.. ముందు, వెనుకలు చూసుకుని చేసేదే సాహహం’ అంది.
‘అంటే..?’ అని మళ్లీ ప్రశ్నించా.
‘ముందు అంటే ప్రయోజనం, వెనక అంటే ప్రమాణం’ అని సూక్తిలా చెప్పింది.
‘నా బిడ్డకి నాతో సమానంగా ప్రేమించే మనిషిని దూరం చేయకపోవడం ‘ప్రయోజనం’. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులలో నిలబడి నెగ్గినవారూ, వారు చెప్పిన మాటలూ ‘ప్రమాణం’ అంటూ ఆ సూక్తిని వివరించింది.
***
చెప్పడం పూర్తిచేసి పద్మావతిగారు నా మొహంలోకి చూడగానే ‘ఎవరావిడ? ’ అన్నాను అప్రయత్నంగా.
‘మీ అమ్మ..’
అయిదు నిమిషాలు వౌనంగా కూర్చుండిపోయాం ఇద్దరమూ. శరత్ వచ్చాడు. ‘గండోలాలో తిరిగేందుకు టిక్కెట్ తీసుకుంటున్నాను’ అన్నాడు. అతన్ని చూస్తే అసహనంగా అనిపించలేదు నాకీసారి. ఆసక్తిగా అనిపించింది. పద్మావతిగారి దగ్గర సెలవు తీసుకుని వచ్చేస్తూ వుంటే- ‘ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఆత్మన్యూనతతో బాధపడేవారితో సాహచర్యం అడుగడుగునా సాహసమే. అప్రమత్తంగా ఉండవలసిన వ్యవహారమే’ హెచ్చరికగా అన్నారావిడ. చిరునవ్వుతో తలవూపాను. నాకన్నా రెండడుగులు ముందు నడుస్తూ వెళ్లిన శరత్ ధాత్రితోపాటు పడవలోకి ఎక్కి నాకు చేయి అందించాడు. జీవితకాలపు సాహసయాత్రకు సిద్ధమవుతూ నేను ఆ చేయిని అందుకున్నాను. *

-టి.శ్రీవల్లీ రాధిక