ఈ వారం కథ

స్వచ్ఛమైన నవ్వు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఉత్తేజ్ సర్, మీరు కొంచెం ఫాస్ట్‌గా ఉండాలి సర్!’’ అంటూ ఉంటాడు నా కొలీగ్ ఆకాశ్.
ఆకాశ్‌కీ నాకూ అయిదేళ్ళే తేడా అయినా నేను వెనుకబడి ఉన్నాననిపిస్తుంది. గత మూడేళ్ళుగా నా దగ్గరే జూనియర్‌గా పని నేర్చుకుంటున్నాడు కాబట్టి అతని విమర్శ నా పని విషయంలో కాదు. కానీ నాకిలానే ఉండాలనిపిస్తుంది. తనకేమో అలానే ఉండటం తప్పనిసరి అనిపిస్తుంది.
‘‘మీకంటే ఒక్క సంవత్సరమే జూనియర్ కదా ఆ శ్రీకాంత్. అయినా చూడండి, ప్రమోషన్ ఎలా కొట్టేసారో!’’ అకస్మాత్తుగా ఓ రోజు ఆకాశ్ తన సందేహాన్ని అలా నా ముందుంచాడు.
‘‘శ్రీకాంత్ పీజీ చేశాడు ఆకాశ్. తనకి నాకంటే అయిదు మార్కులు ఎక్కువున్నాయి. ప్రమోషన్ టెస్టులో అయిదు మార్కులు చాలా పనిచేసిపెడతాయి’’. నవ్వుతూ అతని మాటలను తేలిగ్గా తీసిపారేశాను.
‘‘అలా అనకండి గురూజీ! అందుకే మీకు ట్రెండ్ ఫాలో అవ్వమని చెబుతాను. మనం చుట్టూ సర్కిలొకటి గీసుకుని దాంట్లోనే ఉండిపోతానంటే కుదరదు. దాన్నుండి బైటకు రావాలి. అప్పుడే చుట్టూ వున్న ప్రపంచం తెలుస్తుంది. మీకంటే జూనియర్ మిమ్మల్ని దాటి వెళ్లిపోయినా మీరు మాత్రం అలా ఉండిపోతాననుకుంటే ఎలా? హెడ్డ్ఫాసు వాళ్ళని ‘కొంచెం’ చూసుకుని ఉంటే మీ పని తేలికైపోయేది కదా ఉత్తేజ్ సర్?’’ హితబోధ చేశాడు ఆకాశ్.
‘‘అలా తెచ్చుకునే ప్రమోషన్లో ఆనందం ఎలా వుంటుంది ఆకాశ్?’’ సూటిగా ప్రశ్నించాను.
నా ప్రశ్నకు ఆకాశ్ ఏమీ తొణకలేదు. ‘‘అయ్యో అలా అంటారేంటి ఉత్తేజ్ సర్. ఆనందమంటే ఏంటి చెప్పండి? మీ కుటుంబానికి మీ ఆదాయం ద్వారా కావలసినవి కొనివ్వడం లేదా మీరు ఇంటికి సంబంధించి ప్లాన్ చేసుకున్న పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తిచెయ్యడం. అంతేనా?!’’
ఆకాశ్ చెప్పినదానికి అటూ ఇటూ కాకుండా తలూపాను.
‘‘మరి అలాంటి ఆనందం మీరెంత త్వరగా దక్కించుకుంటే అంత సంతృప్తి కదా ఉత్తేజ్ సర్! ఓ పదివేలు మీవి కావనుకుంటే చాలు, మన హెడ్డ్ఫాసులో పనైపోతోంది! అలా చెయ్యడం తప్పు అని మీరు ఊరుకుండిపోయినా వేరేవాళ్ళు అలానే ఉండిపోరు. ఖర్చుపెట్టి ప్రమోషన్స్ తీసుకుంటూనే ఉన్నారు. నా మటుకు నాకూ అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ ముక్కుసూటితనంవల్ల ‘మంచివారి’గా పేరైతే వస్తుంది కానీ కెరీర్‌లో మాత్రం డెవలప్‌మెంట్ ఉండదు ఉత్తేజ్‌సర్!’’ ఉద్వేగంతో చెప్పాడు ఆకాశ్.
‘‘నిజమే ఆకాశ్. అందరికీ అది బాగానే వుంటుందేమో కానీ నాకలా చెయ్యడానికి మనస్కరించదు. నన్నొదిలేద్దూ!’’ నెమ్మదిగా చెప్పాను.
‘‘అయ్యో అన్నిట్లోనూ మీరిలానే వుండిపోతున్నారు గురూజీ! పనిలో మీ అంత స్పీడు ఎవరూ ఉండరు. కానీ లోకం పోకడలోనే మీరిలా ఉండిపోవడం నాకేదోలా ఉంటుంది. కొంచెం దూకుడు కూడా ఉండాలి సర్’’ కొంచెం బాధగా చెప్పాడు ఆకాశ్.
‘‘్ఫర్వాలేదు ఆకాశ్. ఏ విషయంలో అయినా మన మనసుకు నచ్చినట్టు చేసే స్వేచ్ఛ మనకు ఉంటుంది. నీ విషయంలో నేనేమీ అడ్డుచెప్పను. భవిష్యత్తులో నీకెలా బావుంటే అది చేద్దువుగానిలే!’’ అతనికి సర్ది చెప్పాను.
‘‘ఏంటో సర్ మీరు’’ అని చెప్పి తన పనిలో మునిగిపోయాడు ఆకాశ్.
మరో రోజు ఉదయానే్న ఆఫీసుకుగా నీరసంగా వచ్చాడు ఆకాశ్. అతని ముఖం చూస్తూనే ప్రశ్నించాను, ‘‘ఏమైంది ఆకాశ్?’’
‘‘నా పర్స్ పోయింది సర్! అందులో రెండువేల రూపాయల డబ్బు, క్రెడిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆఫీస్ ఐడీ కార్డ్ ఉన్నాయి’’.
‘‘అయ్యో! మిగతావి ఫర్వాలేదు కానీ ఆఫీస్ ఐడీ కార్డ్ లేకుండా పనేమీ కాదు కదా? నీ సిస్టం ఆపరేట్ చేయాలన్నా, అటెండెన్స్ వెయ్యాలన్నా దానితోనే కదా పని? అసలు అది లేకుండా లోపలికెలా రాగలిగావ్?!’’ ఆదుర్దాగా ప్రశ్నించాను.
‘‘అదే కదా సర్ నా బాధ? నేనొచ్చే టైముకే మన అటెండర్ కూడా వస్తుంటే అతనితోపాటే లోపలికి వచ్చేసాను. హెడ్డ్ఫాసుకి రిపోర్టు చెయ్యండి ఉత్తేజ్ సర్’’ ఆకాశ్ బాధగా చెప్పాడు.
‘‘కూల్ ఆకాశ్. ఐడీ కార్డ్ పోవడమంటే మన పైవాళ్ళ దృష్టిలో కాస్త పెద్ద నేరమే. ముందు పోలీస్ రిపోర్ట్ ఇద్దాం’’ అనునయిస్తూ చెప్పాను.
‘‘కానీ ఈలోగా ఆఫీసు వాళ్ళు నేను సిస్టంలో లాగిన్ కాలేదని లైన్లోకి వచ్చేస్తారేమో సర్’’.
‘‘ఆ సంగతి నేను బాస్‌కి చెప్పి మేనేజ్ చేస్తాలే. కంగారు పడకు’’ అభయమిచ్చాను.
‘‘్థంక్యూ సోమచ్ ఉత్తేజ్ సర్..’’ ఆకాశ్ ఇంకేదో చెప్పబోతూండగా అతని ఫోన్ మ్రోగింది.
‘‘అవునండీ నేను ఆకాశ్‌ని మాట్లాడుతున్నా.. ఓహో అలాగా.. థాంక్యూ సర్.. సో కైండ్ ఆఫ్ యూ.. వస్తున్నా.. మరో పది నిమిషాల్లో అక్కడుంటాను’’ కాల్ ముగించి నావైపు తిరిగి చెప్పాడు ఆకాశ్. ‘‘సర్, పర్స్ దొరికిందట. ఫోర్ టవున్ పోలీస్ స్టేషన్నుండి ఫోన్!’’ అతని గొంతులో పట్టరాని సంతోషం పలుకుతోంది.
‘‘వెరీ గుడ్.. త్వరగా వెళ్లిరా’’ నేనూ నవ్వుతూ చెప్పాను.
సుమారుగా మరో అరగంట తర్వాత తిరిగివచ్చాడు ఆకాశ్.
‘‘అన్నీ ఉన్నాయా? సరిగ్గా చూసుకున్నావా ఆకాశ్?’ అడిగాను.
జేబులోంచి పర్స్ బైటకు తీసి పర్స్ తెరిచి చూసుకుంటూ చెప్పాడు ఆకాశ్. ‘‘అన్నీ ఉన్నాయి సర్. అయినా మళ్లీ చూస్తున్నా’’ అని పర్సంతా వెతికాడు.
అందులోంచి ఓ కార్డేదో తీసాడు. ‘‘సర్, ఎవరిదో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఇందులో’’.
‘‘అయ్యో ఎవరిదో పాపం. నీ పర్సులోకెలా వచ్చిందో?’’
‘‘ఎవరిదో వాళ్ళకు దొరికితే నా కార్డులతోపాటు కలిపి పర్సులో ఉంచేసారేమో పోలీస్ వాళ్ళు. ఎవరో జోసెఫ్ అట ఉత్తేజ్ సర్. పర్వాలేదులెండి.. ఇది డూప్లికేట్ తయారుచేసి దానికి లేమినేషన్ చేయించిన కార్డే’’ తేలిగ్గా అన్నాడు ఆకాశ్.
‘‘కానీ అతని దగ్గర ఒరిజినల్ ఉందో లేదో మనకు తెలీదు కదా ఆకాశ్. ఈలోపుగా అతన్ని ఆపి పోలీసులు చెక్ చేస్తే అన్యాయంగా దొరికిపోతాడు కదా?!’’
‘‘అంత సీనుండదులెండి సర్’’ అతని గొంతులో అదే తేలిక భావం ధ్వనించింది.
‘‘ఇదేవిధంగా ఓ గంట క్రితం నీ పర్సును పోలీసులకు అప్పజెప్పినవాళ్ళు ఆలోచించి ఉంటే నీ పరిస్థితెలా వుండేదో ఆలోచించు ఆకాశ్!’’ నా గొంతులో కరకుదనం నాకే కొత్తగా వినిపించింది.
‘‘అదేంటి సర్, అలా అంటారు. మన ఐడీ కార్డెంత ముఖ్యమో మీకు తెలుసు కదా. దానికీ ఈ డ్రైవింగ్ లైసెన్సుకీ పోలికా?’’
‘‘నీకు నీ ఐడీ కార్డెంత ముఖ్యమో అతనికి తన డ్రైవింగ్ లైసెన్సు కూడా అంతే ముఖ్యం కావచ్చు కదా ఆకాశ్. అతనికెంత టెన్షన్‌గా వుంటుందో ఊహించు!’’
‘‘మీరు మరీ ఏవేవో ఆలోచిస్తారు ఉత్తేజ్ సర్. ఐతే దీన్ని రిటర్న్ చేద్దామంటారా?’’ నా వాదన అతని ధోరణిని కాస్త మెతకబరిచినట్టు అనిపించింది.
‘‘రిటర్న్ చెయ్యడమే కరెక్ట్. చూడు లైసెన్సులో కాంటాక్ట్ నెంబర్ ఉందేమో’’. కేవలం ఓ గంటలోనే మారిపోయిన ఆకాశ్ మనస్తత్వానికి విస్తుబోయిన నేను ఇంకా తేరుకోలేకపోతు
న్నాను.
నా మాటల ప్రభావం అతనిమీద ఎంతవరకు పనిచేసిందో కానీ ఫోన్ తీసుకుని లైసెన్సు మీద ఉన్న ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేశాడు ఆకాశ్. ఫోన్లో అతని మాటల ప్రకారం ఆకాశ్ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఆ జోసెఫ్‌కి లైసెన్సును అందిస్తాడని అర్థమయి తేలికగా నిట్టూర్చాను.
కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు ఆఫీసుకి బయలుదేరబోతూంటే నా ఫోన్ మ్రోగింది. ఈ సమయంలో ఎవరా అనుకుంటూ చూస్తే ‘ఆకాశ్’ పేరు కనిపించింది. ఫోన్ ఎత్తి ‘చెప్పు ఆకాశ్!’’ అన్నాను.
నన్ను ఆశ్చర్యపరుస్తూ ‘‘ఆకాశ్ మీకు బంధువా?’’ అని ఓ కొత్త గొంతు అడిగింది.
‘‘లేదండీ.. నా కొలీగ్. అతనెక్కడున్నాడు?’’ అనుమానంగా ప్రశ్నించాను.
‘‘ఎక్కువసార్లు మీ పేరు కనిపిస్తే మీకు చేసాను. ఇతనికి గాంధీ సెంటర్లో పెద్ద ఏక్సిడెంటయింది. ప్రస్తుతం వివేకానంద రోడ్లోని ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు. మీరు వెంటనే రాగలరా?’’
‘‘వస్తున్నా’’ అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి కారు తీశాను. ఆఫీసులో నాకు అసిస్టెంట్‌గా వుండడంవల్ల ఫోన్ కాల్ రికార్డ్స్‌లో మా నంబర్లే ఎక్కువగా వుంటాయి. దారంతా ఆకాశ్ రూపమే మనసులో మెదిలింది. ఆ వెంటనే ఈమధ్యనే కొత్తగా కాపురానికొచ్చిన అతని భార్య కూడా! హాస్పిటల్‌కి వెళ్ళాక అక్కడి పరిస్థితిని బట్టి ఆమెకు ఫోన్ చెయ్యొచ్చు అనుకున్నాడు మనసులో.
ఎంత వేగంగా వెళ్ళినా పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌ను ఛేదించుకుంటూ ఆరోగ్య హాస్పిటల్‌కి చేరుకోవడానిక నాకు పావుగంట పైనే పట్టింది. కారు పార్క్ చేసి గబగబా రిసెప్షన్ వైపు పరుగుపెట్టాను. తలమీద గట్టిగా దెబ్బ తగలడంతో ఆకాశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరో రోజు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని, అత్యవసర చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చు గురించి రిసెప్షన్ దగ్గరే వాళ్ళు నన్ను నిలబెట్టేశారు. మా ఆఫీసునుండి ఆకాశ్ చికత్సకయ్యే మొత్తం గురించి మాట్లాడారు. అప్పటికప్పుడు కావలసిన మొత్తం లక్షన్నర!
నేను మా బాస్‌కి ఫోన్ చేసి హెడ్డ్ఫాసునుండి వెంటేనే అతని చికిత్స కోసం సాంక్షన్ చెయ్యవలసిన మొత్తం గురించి మాట్లాడాను. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాక అదృష్టం కొద్దీ ఆ పనులు చకచకా అయిపోయాయి.
కాస్త ఊపిరి పీల్చుకుని ఆకాశ్ తప్పకుండా కోలుకోవాలని మనసులో దేవుడిని వేడుకుంటూ అతని భార్యకు ఫోన్‌చేశాను. మా ఇంటికి కూడా ఫోన్ చేసి విషయం చెప్పాను. మరో అరగంటకు ఏడ్చుకుంటూ ఆమె హాస్పిట్లోకి అడుగుపెట్టింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ముందు ఇద్దరం ఆ రాత్రిని భారంగా గడిపాము. తర్వాతి రోజు ఉదయం పదిన్నర గంటలకు డాక్టర్లు బైటకు వచ్చి మరి కాసేపట్లో అతనికి స్పృహ వస్తుందని, ప్రాణగండం తప్పిందని చెప్పాక కానీ నా అలజడి తీరలేదు. నాకే అలా ఉందంటే ఆకాశ్ భార్యకు ఇంకెంత భయంగా ఉండి ఉంటుందో.
నర్స్ వచ్చి డాక్టర్ పిలుస్తున్నట్టు చెప్పడంతో నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఏక్సిడెంట్ గురించి పది నిమిషాలపాటు వివరంగా మాట్లాడాడాయన. తీవ్రమైన గాయం తగిలినా సకాలంలో హాస్పిటల్‌కి రాగలగడంవల్లనే ఆకాశ్ ప్రాణాపాయంనుండి బైటపడ్డాడని, మరో రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్‌చేస్తామని చెప్పాడు డాక్టర్.
అక్కడనుండి కిందకు వెళ్లి అంబులెన్స్ స్ట్ఫా గురించి వాకబు చేసి తిరిగి పైకొచ్చి ఐసీయూ వైపు నడిచాను. ఆకాశ్‌కి స్పృహ వచ్చినట్టుంది. బైట అతని భార్య లేదు. నర్సుని అడిగి నేనూ లోపలికి అడుగుపెట్టాను. తలనిండా కట్టుతో చాలా నీరసంగా కనిపించాడు ఆకాశ్. అతని పక్కనే కళ్ళొత్తుకుంటూ నిలబడింది ఆకాశ్ భార్య.
‘‘ఇక భయం లేదు ఆకాశ్.. డోంట్ వర్రీ’’ నవ్వుతూ ఆకాశ్‌ని పలకరించాను.
‘‘్థంక్యూ ఉత్తేజ్ సర్. చాలా హెల్ప్ చేశారు’’ కృతజ్ఞతగా చూస్తూ చెప్పాడు ఆకాశ్.
‘‘ఇట్సోకే. రేపు నాకైనా ఇలాంటి పరిస్థితి రావొచ్చు, నువ్వు చెయ్యవా ఏంటి? నువ్ చెప్పే దూకుడు అన్నిట్లోనూ ఉండాలి ఆకాశ్’’ నవ్వాను.
నా మాటలకు కొంచెం నొచ్చుకున్నట్లుగా కనిపించాడు ఆకాశ్.
‘‘అన్నట్టు ఆకాశ్, నీకు ఏక్సిడెంట్ అయిందని ఎవరో అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. అది వెంటనే రావడం మన అదృష్టం’’ ఆకాశ్‌వైపు చూస్తూ చెప్పాను.
అవునన్నట్టుగా తల ఊపాడు.
‘‘ఆ అంబులెన్స్ డ్రైవర్ ఎవరో కనుక్కున్నాను. అతను జోసెఫ్’’ నెమ్మదిగా విషయాన్ని చెప్పాను.
ఆశ్చర్యానందాలతో ఆకాశ్ కళ్ళు మెరిసాయి. అతని ముఖంలో ప్రతిఫలిస్తున్న భావాలు నాకు అర్థమయినట్టుగా తల ఊపుతూ, ‘‘అవును. ఆ డ్రైవింగ్ లైసెన్సు పోగొట్టుకుని తిరిగి నీ దగ్గర తీసుకున్న అతనే ఈ జోసెఫ్’’ నవ్వుతూ చెప్పాను.
‘‘నా పాలిట దేవుడు సర్ అతను’’ నవ్వుతూ చెప్పాడు ఆకాశ్.
ఆ నవ్వెంతో స్వచ్ఛంగా వుంది. *

-రాజేష్ యాళ్ళ రచయిత సెల్ నెం:9700467675