కళాంజలి

అభ్యాసంతో కళల వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ కొట్టే వేంకటాచార్యులు ప్రసిద్ధ రంగస్థల నటుడు, రచయిత, పరిశోధకుడు, దర్శకుడు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎంతో సాధించినా నిండుకుండ, బంగారుకొండ. ఎన్నో బిరుదులు, సన్మానాలు పొందినా వీరి మాట సున్నితం. మనస్సు నవనీతం. వందల ప్రదర్శనలు వీరు పౌరాణిక నాటకాలలో చేశారు. కొన్ని దశాబ్దాలుగా నాటక రంగానికి అంకితమైన వీరు హైదరాబాద్ శ్రీరామభద్ర జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి 2009లో రిటైరయ్యారు. వీరితో ముఖాముఖి...
ప్ర: మీ బాల్యం గురించి చెప్పండి...
జ: నేను తే.1.3.1951న కొట్టే వేంగళమ్మ, శేషయ్యగార్లకు జన్మించాను. నా జన్మస్థలం జంగంరెడ్డి పాళెం గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా. నేను 14 ఏళ్ల వయసులో పల్లెపడుచు సాంఘిక నాటకంలో ‘గోపీ’ పాత్ర వేశాను. అప్పటి నుంచి నాటక రంగంతో విడదీయరాని బంధం, ప్రేమ.
ప్ర: మీ గురువులు ఎవరు?
జ: నాటకరంగంలో కొట్టే ఓబుళయ్య, వేమూరి సీతారామశాస్ర్తీ, అయ్యదేవర పురుషోత్తమరావు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తీగార్లు నాకు గురువులు.
ప్ర: మీ నాటకానుభవం గురించి..
జ: 14 ఏళ్ల వయసులో రంగస్థల ప్రవేశం జరిగింది. 1978 దాకా మా గ్రామంలో దాదాపు 30 నాటకాల్లో ప్రముఖ పాత్రలు ధరించాను. తరువాత 1982 నుండి సిఎస్‌ఆర్ కళామందిరం, హైదరాబాద్ నాటక సంస్థ సహకారంలో కొన్ని వందలసార్లు నాటకాలు ప్రదర్శించాను. వివిధ నాటకాలు, వివిధ భూమికలు. ఆకాశవాణి, దూరదర్శన్ మాధ్యమాల ద్వారా కూడా నేను ప్రదర్శించిన నాటకాలు ప్రసారం చేయబడ్డాయి. ఈ కళ ఒక తపస్సు! కళలకే అంకితమై పోయాను.
ప్ర: మీరు పొందిన గౌరవాలు?
జ: నాకు ‘నాట్య కళాప్రవీణ’ అనే బిరుదు శ్రీ సాయి కళానికేతన్, విశాఖపట్నం వారు ఇచ్చారు. అలాగే ‘నాట్య కళారత్న’ శ్రీ నూనె వేంకటరత్నం స్మారక కళా పురస్కారం, కొన్ని వందల సన్మానాలు జరిగాయి. ఎక్కడ ప్రదర్శించినా ‘వన్స్‌మోర్’ అంటూ చప్పట్లే. ప్రేక్షకుల ఆదరణే నాకు నిజమైన ప్రశంస. శ్రీ వేంకటేశ్వర నాట్యకళాపరిషత్, తిరుపతి వారి పద్య నాటకాల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం ఒక మధుర స్మృతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించే ‘నంది నాటకాల’ పోటీలకు న్యాయనిర్ణేతగా ఎన్నోసార్లు ఉన్నాను. చాలా నాటక సంస్థలకు న్యాయనిర్ణేతగా బాధ్యత వహించాను. పౌరాణిక పద్య నాటకాల మీద విస్తృత ఉపన్యాసాలు ఇచ్చాను. తెలుగు విశ్వవిద్యాలయం పద్యనాటక విభాగంలో 2009-11, డిప్లొమా ఇన్ పద్య నాటకం విద్యార్థులకు శిక్షకునిగా పనిచేసి పద్యనాటకాలు ప్రదర్శించాం. ఇవన్నీ గౌరవాలే.. అన్నీ మధుర స్మృతులే!
ప్ర: మీరు రాసిన గ్రంథాలు?
జ: పిహెచ్.డి కోసం ‘శ్రీ కాళ్లకూరి నారాయణరావు రచనలు’ అనే అంశం మీద పరిశోధన చేశాను. నా సిద్ధాంత వ్యాసం ప్రచురించాను కూడా. * సంప్రదాయ నాటక సౌరభాలు * పద్యనాటక ప్రబోధిని * పద్య నాటక పారిజాతం (ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడెమీ ప్రచురణ) * గయోపాఖ్యానము - చిలకమర్తి కవితా వైభవం (విశ్వసాహితీ సంస్థ హైదరాబాద్ వారిచే ఉత్తమ గ్రంథ పురస్కారం) * గుణనిధి - నాటకం (2015లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ గ్రంథ పురస్కారం) * పద్యనాటక మంజరి (2014 ఆంధ్రప్రదేశ్ నంది నాటక పురస్కారాలలో ఉత్తమ నాటక సాహిత్య గ్రంథంగా బహుమతి పొందింది) * పద్య నాటకం - రచనా శిల్పం * పద్యనాటక పరిమళాలు.
ప్ర: మీరు ఇప్పటివరకూ ఎన్ని పాత్రలు పోషించారు?
జ: భక్తతుకారాంలో - శంభాజీ, శ్రీరామ పాదుకా పట్ట్భాషేకంలో లక్ష్మణుడు, వీరాభిమన్యులో దుర్యోధనుడు, చింతామణిలో భవానీ శంకరుడు, బిల్వమంగళుడు, కర్ణలో దుర్యోధనుడు, పాండవోద్యోగంలో కర్ణుడు, దుర్యోధనుడు, భువన విజయములో అల్లసాని పెద్దన, గయోపాఖ్యానములో అర్జునుడు, గయుడు, శ్రీరామాంజనేయ యుద్ధంలో లక్ష్మణుడు, గుణనిధిలో యజ్ఞదత్తుడు, నర్తనశాలలో భీముడు, ద్రౌపదీ వస్త్రాపహరణంలో శిశుపాలుడు, పాండవ విజయంలో కర్ణుడు, సత్యహరిశ్చంద్రీయములో విశ్వామిత్రుడు, నక్షత్రకుడు, ధర్మవిజయములో దుర్యోధనుడు, ధర్మవ్యాధుడులో ధర్మవ్యాధుడు, ప్రసన్న యాదవములో నరకాసురుడు, తులసీ జలంధరలో జలంధరుడు, భాగ్యనగరంలో రుద్రకవి, బీబీనాంచారిలో శంకరశాస్ర్తీ.
ప్ర: మీరు బాగా గుర్తు పెట్టుకొన్న ప్రదర్శనలు?
జ: దాదాపు 5 సంవత్సరాల క్రితం అంటే 2012-13 ప్రాంతంలో అనకాపల్లిలో చింతామణి వేశాము. మేం సోబర్‌గా, వల్గారిటీ లేకుండా చక్కగా వేస్తాము ఆ నాటకాన్ని. ఆ ప్రదర్శన దాడి వీరభద్రరావుగారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన రాజకీయ నాయకుడే కాదు మంచి సాహితీవేత్త. మా ప్రదర్శనను చూసి ఘన సత్కారం చేశారు. ఇవ్వాల్సిన పారితోషికంకన్నా రెండింతలు ఇచ్చారు ఆ వేళ.
ప్ర: మీకు కళలలో ఎవరు సహాయం చేశారు?
జ: అయ్యదేవర పురుషోత్తమరావుగారు మా పక్కింట్లో ఉండేవారు - జామై ఉస్మానియాలో. ప్రస్తుతం నాగోలులో ఉంటున్నా. ఆ రోజుల్లో వారి అబ్బాయి రామభద్ర కాలేజీలో నా విద్యార్థి. అలా పరిచయం పెరిగింది. పాదుకా పట్ట్భాషేకం నాటకం వేస్తూ వారు నన్ను లక్ష్మణుడిగా వేయమన్నారు. అది మొదలు, కొన్ని వందలసార్లు కలిసి ప్రదర్శనలు ఇచ్చాం.
ప్ర: మీరు అభ్యాసం ఎలా చేసేవారు?
జ: చిన్నప్పుడు ‘గోపీ’ పాత్రలో రంగస్థలంతో నా జీవితం ముడిపడింది. ఆ రోజుల్లోనే పద్యపఠనం నేర్చుకున్నాను. దేవరకొండ పాండురంగారావు గారు మంచి సంగీతకారుడు, హార్మోనియం కళాకారుడు. వారు నాకు కర్ణుడి పాత్ర పద్యాలు 1982లో నేర్పించారు. నాకు కర్ణుడి పాత్ర ఎంతో పేరు తెచ్చింది.
ప్ర: కళాకారులకు మీరు ఇచ్చే సందేశం?
జ: పాత్రను అర్థం చేసుకోవాలి. అధ్యయనం చేయాలి. కష్టపడి నేర్చుకోవాలి. విద్య నేర్చుకోవాలి. అభ్యాసం చేయాలి. దీనికి షార్ట్‌కట్స్ లేవు. కష్టపడితేనే పాత్రకి న్యాయం చేయగలం. అప్పుడే చేసేవారికి, చూసేవారికి సంతోషం కలుగుతుంది.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి