కళాంజలి

సరస మధురకవి సారంగపాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం లలితకళలకు పుట్టిల్లు. సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం అనే అయిదు కళలను లలిత కళలు అంటారు. నాట్యం సమాహార కళ. కేవలం నాట్యంలో సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం ఇమిడి ఉన్నాయి. దక్షిణ భారతంలో కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహినీ అట్టం సంప్రదాయ శాస్ర్తియ నృత్యాలు ఉన్నాయి. అవికాక అసంఖ్యాకమైన జానపద నృత్య రీతులు ఉన్నాయి. మన తెలుగు వారికి కూచిపూడి మకుటము వంటిది. కూచిపూడిలో పదము ఎంతో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుంది. పద కర్తలలో అన్నమయ్య పున్నమి చంద్రుడు, సారంగపాణి కలహంస. సారంగపాణి రాసిన ఎన్నో పదములు కూచిపూడిలో ప్రదర్శింపబడుతున్నవి. అతడు స్వయంగా స్ర్తి వేషం వేసుకుని, ఆడిపాడి సభికులను ఆహ్లాదపరిచాడుట.
నృత్యంలో ఎక్కువగా వాడే పదములు
నేడు నృత్యములో అన్నమయ్య రాసిన పదములు, క్షేత్రయ్య మరియు సారంగపాణి పదములు ఎక్కువగా వాడుతున్నారు.
సారంగపాణి పదములు - ప్రదర్శనానుకూలత
సారంగపాణి స్వయంగా రాసి, వాడి, నర్తించాడు. ఈయన పదాలలో ఎక్కువగా శృంగారం, భక్తి, వైరాగ్యం కనిపిస్తున్నాయి. శృంగారం రసరాజము. ఇక భక్తి చేత, భక్తి కొరకు నృత్యం ఉన్నది కదా! నృత్యము పథము, గమ్యము భక్తియే! అందువలన సారంగపాణి పదములు నృత్యమునకు అనుకూలంగా ఉంటాయి.
పదము - ఆరంభ - వికాసములు
పదము అంటే పాట. మానవుడు తనకు కలిగిన సుఖదుఃఖములలో ఆడి పాడుకోవటంలో పదము పుట్టింది. పదము జానపద సాహిత్యానికి, శిష్ట సాహిత్యానికి మధ్యగల వారధిగా గ్రహించవచ్చు. సంగీత సాహిత్యాలకు ఇదొక సేతువు. శృంగారమయమై, ఎక్కువగా విలంబన కాలములో, కొంచెముగా మధ్యమ కాలములో నడుస్తూ, పల్లవి, అనుపల్లవి, రెండు లేదా మూడు చరణములు కలిగి ఉంటుంది.
పదము - వస్తువు
పదము దేవతాస్తుతికే ఉండాలని, పదములో శృంగారము దేవతాపరంగా ఉండాలని తెలుస్తోంది. కానీ అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు తప్ప మిగిలిన పదకవులు నరాంకితములైన పదములు రాశారు.
వాగ్గేయకారుడు
పదంలోని వాక్కుని గేయముగా చేయగలవాడు వాగ్గేయకారుడు. భాషా వ్యాకరణ పరిజ్ఞానం, నిఘంటువుల పరిచయం, మార్గదేశి ఛందోజ్ఞానం, అలంకార కౌశలం, భాషాపరమైన సంపూర్ణ పాండిత్యం కలవాడు వాగ్గేయకారుడు.
ముద్ర
పదకర్త ఎవరికి అంకితముగా పదముని రాస్తాడో ఆ స్వామి పేరున రచన చేయడము పదముద్ర అంటారు. సారంగపాణి కొన్ని నరాంకితము చేసినా, ముఖ్యంగా తనకిష్ట దైవమైన వేణుగోపాలస్వామికి అంకితమిచ్చాడు.
చరణముల సంఖ్య
సారంగపాణి పరవశములో మూడు నుండి పది చరణముల వరకూ పదములు రాశాడు.
కూచిపూడిలో పదము
నేడు పదము అంటే కేవలము శృంగారపరంగా ఉన్నవి మాత్రమే అని పరిగణిస్తున్నారు. క్షేత్రయ్య పదములు, సారంగపాణి పదములు ఎంతో ఇష్టంతో నర్తిస్తున్నారు నర్తకీమణులు. పదము సంస్కృతము, తమిళం, కన్నడ, తెలుగు ఇంకా ఎన్నో భారతీయ భాషలలో విలసిల్లింది.
కొందరు పద కవులు
జయదేవుడు, లీలాశుకుడు, అన్నమయ్య, నారాయణతీర్థులు, క్షేత్రయ్య, సారంగపాణి, త్యాగయ్య, రామదాసు మొదలగు ఎందరో పదకర్తలున్నారు. వీరి వలన మన సంగీత, సాహిత్య, నృత్యములు ఎంతో వర్థిల్లాయి.
సారంగపాణి జీవితము
కార్వేటి నగరంలో వర్థిల్లిన వాగ్గేయకారుడు సారంగపాణి. ఇతను క్రీ.శ.1680 - 1759 మధ్య జీవించి ఉండవచ్చని బాలాంత్రపు రజనీకాంతరావు, గంగప్ప వంటి పండితులు భావిస్తున్నారు. గల్లా చలపతి వంటి కొందరు పండితులు, సారంగపాణి క్రీ.శ.1800 - 1869 ప్రాంతం వాడని అంటున్నారు. అయితే ఎవరూ చేయని ఒక పరిశీలన ఈ విధంగా ఉంది. సారంగపాణి మనుమడు గరిమళ్ల వేంకట సుబ్బయ్య, క్రీ.శ.1867లో తాతగారి పదములను ముద్రించాడు. సాధారణంగా తాత మనవల మధ్య వయస్సు అంతరం 50 లేదా 60 ఏళ్లు ఉంటుంది. మనుమడు క్రీ.శ.1867లో బతికి ఉంటే 200 ఏళ్ల క్రితం 1680 ప్రాంతంలో సారంగపాణి ఎలా బతికి ఉంటాడు? అది అసంభవం. కానీ వాగ్గేయకారుడు క్రీ.శ.1750 ప్రాంతంలో పుడితే, మనుమడు క్రీ.శ.1800 ప్రాంతంలో పుట్టినా, క్రీ.శ.1867లో తాతగారి పదములను పైకి తీసుకు వచ్చాడనవచ్చు. కాబట్టి, వాగ్గేయకారుడు సారంగపాణి క్రీ.శ.1750 - 1850 మధ్య జీవించి ఉండవచ్చు.
కార్వేటి నగరం
చిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకా వద్ద, ఎనిమిది మైళ్ల దూరంలో కార్వేటి నగరము ఉంది. ఇది నగరి, నారాయణవనము మొదలగు నదుల దగ్గరగా నిర్మింపబడింది. ఈ సంస్థానాన్ని వేంకట పెరుమాళ్రాజు వంటి రాజులు పాలించారు. ఈ నగరములో పద కర్త సారంగపాణి వర్థిల్లాడు.
సారంగపాణి పదములలో రసము
సారంగపాణి ముఖ్యంగా శృంగారంతో కూడిన పదములనే రాశాడు. భక్తితో కూడిన కీర్తనలు కూడా రచించాడు. మరి యవ్వనోద్రౌకంలో శృంగారము, వార్ధక్యంలో భక్తి పదములు రచించాడా? ఈ విషయం సరిగ్గా తెలియటంలేదు.
సారంగపాణి పదములలో నాయిక
సారంగపాణి అన్నమయ్యలాగా దివ్య అలౌకిక శృంగారం రాయలేదు. వేణుగోపాలస్వామికి అంకితం చేసినా, అతడు వర్ణించింది లౌకిక ‘సామాన్య’ శృంగారం. ఇతడు రచించిన ఎన్నో పదములలో నాయిక సామాన్య, కేవలం ధనము, నగలు, పట్టుబట్టల మీద ప్రేమ ఉన్న వేశ్య.
వేశ్య నాయిక ఎలా అయింది?
సారంగపాణి తను రాసిన పల్లె పదములు, భక్తితో రాసిన కీర్తనలతోపాటు శృంగార పదములు కూడా వేణుగోపాలుడికే అంకితం చేశాడు. అయితే ఇతని చాలా పదములలో నాయిక సామాన్య అవడం వలన, వేణుగోపాలస్వామిని ఒక విటుడిగా మార్చాడు. ఇది ఎందుకు జరిగిందో క్షణకాలం పరిశీలిద్దాం. సమాజం కళను ప్రతిబింబిస్తుంది. కళ సమాజం నుండి స్ఫూర్తి చెందుతుంది. అయితే, సారంగపాణి ఆదర్శమునకు ఎంతో దూరంగా, వాస్తవికతకు దగ్గరగా రాశాడు. ఆదర్శవాదానికి, యదార్థవాదానికి కొన్ని వేల సంవత్సరాలుగా సంఘర్షణ జరుగుతోంది. కానీ, వేశ్యల శృంగారము వర్ణించిన పదములు భగవంతుడికి ఎందుకు అంకితం ఇచ్చాడు? మనము పండ్లు, మిఠాయిలు, కారపు తినుబండారాలు అన్నీ భగవంతుడికి నైవేద్యం పెడతాము. అందులో తీపి, పులుపు, కారం అన్న భేదం చూపించము. అలాగే, తను రచించిన పదములన్నీ భగవంతుడికే అంకితం చేశాడు ఈ వాగ్గేయకారుడు. ఆడవారి మనస్సుకి దగ్గరగా, సంసార స్ర్తిలకు సానుభూతితో వేశ్యలను గర్హిస్తూ రాశాడు. ఒక స్ర్తి మనస్సు ఎంతో క్లిష్టమయింది. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్. అయినా స్ర్తి మనస్సును అర్థం చేసుకున్నాడు సారంగపాణి. జయదేవుడు, నారాయణ తీర్థులు, క్షేత్రయ్య, రామదాసు వంటి కవులు ఇంత వైవిధ్యం చూపలేదు. గుర్రపు చూపుతో కేవలం ఒకే బాటలో పయనించారు. అన్నమయ్య వైవిధ్యం చూపించినా అది వయస్సుతో పాటు అతను రాసిన పదముల శైలి మారిందని తెలియవస్తున్నది. సారంగపాణి కేవలం భక్తి లేదా శృంగారం రాయకుండా, ఒకవైపు పచ్చి శృంగారం, మరొకవైపు ఒడలు మరిపించే భక్తి వర్ణించాడు. ఇందులో ఒకటి ఉచ్ఛము, ఒకటి నీచము అని అనటానికి వీలులేదు. తను ఏది చూసాడో, దేనికి స్పందించాడో, దేనితో ఏకమై, లీనమై తాదాత్మ్యం చెందాడో అవే వర్ణించాడు. అవే కళాసృష్టి చేశాడు. ఏ కళాకారుడు అయినా తన మనస్సుని వంచించడు. తనకు మనస్సుకి దగ్గరగా ఉండేదే మళ్లీ, మళ్లీ సృష్టిస్తాడు. కొన్నిసార్లు తన ప్రతిబింబాన్ని తన సృష్టిలో చూసుకుంటాడు కళాకారుడు. కొన్ని తనను చాలా ప్రభావితం చేసిన మనిషిని, ఘటననూ ప్రతికల్పనలో చూసుకుంటాడు. ఆ వ్యక్తిని తన సృష్టిలో బంధిస్తాడు. వేశ్యలను ఇంత స్పష్టంగా వర్ణించిన సారంగపాణి వారితో దగ్గరగా మసలుకున్నాడని ఒక సందేహం కలుగుతుంది. ఆదర్శానికి దూరంగా వాస్తవికతకు దగ్గరగా వేశ్యల శృంగారాన్ని వర్ణించడం సారంగపాణి విజయమూ, పరాజయమూ కూడా.
క్షేత్రయ్య - సారంగపాణి
సారంగపాణిపై ఎందరో వాగ్గేయకారుల ప్రభావం పడింది. కానీ క్షేత్రయ్య, సారంగపాణి పదములు అర్థం, భావం, భాషలో ఎంతో దగ్గరగా కవల పిల్లలలాగా ఉంటాయి. అలాగే, సారంగపాణి పదములు వేణుగోపాలునికి అంకితం, క్షేత్రయ్య పదములు మువ్వగోపాలునికి అంకితం. మరి కాల ప్రవాహంలో లేఖకులు చేసిన పొరపాటో, నర్తకులు చేసిన తేడానో తెలియదు. కొన్ని పదములు క్షేత్రయ్య మరియు సారంగపాణి, ఇద్దరి పదములలో కలిసిపోయాయి. ఇది నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ఎవరు రాశారో తెలియటంలేదు. (మిగతా వచ్చే సంచికలో)

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి