పెరటి చెట్టు

పెరటి చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుగులేని, తరుగులేని, తెలుగుజాతి మనది!
తెలుగుజాతి గురించిన ప్రస్తావన పురాణాలూ, బ్రాహ్మణాలూ, ‘హరివంశం’లాంటి పౌరాణిక కావ్యాల్లో ఎక్కడెక్కడుందో చెప్పడంతోనే మన కథ మొదలుపెట్టడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రులు అనే పేరిట తెలుగువాళ్ళు క్రీస్తుకు పూర్వం వెయ్యేళ్లకు ముందు నుంచీ ఉనికిలో ఉన్నారని చెప్పుకున్నంత మాత్రాన మన ఘనత పెరిగిపోతుందనీ, అది కాదనుకుంటే తలకొట్టినంత పనయిపోతుందని కానీ నేను అనుకోవడం లేదు. విశ్వసనీయమయిన ఆకరాలూ ఆధారాలూ రుజువు చేస్తున్న మేరకే మన జాతి చరిత్రను పేర్చడం నా ప్రయత్నం. అందుకే తెలుగు ఆంధ్ర జాతి కథను నేను నాకు ఉచితమనిపించే రీతిలో మీ ముందుంచుతున్నాను.
జాతిపరంగా మనకి కనీసం మూడు పేర్లున్నాయని పరిశోధకులంటారు. అంతేకాదు ఒక్కో సందర్భంలో వాటిని జాతివాచకాలుగానూ, వేరే సందర్భంలో భాషావాచకాలుగానూ ప్రయోగించినట్లు చెప్తారు. దీనే్న మరోరకంగా కూడా చెప్పుకోవచ్చు. తెలుగులకు సంబంధించినంత వరకూ జాతివాచకాలూ, భాషవాచకాలూ, ప్రాదేశిక ప్రస్తావనలకు సంబంధించిన నామవాచకాలూ కూడా కలిసిపోయివున్నట్లు కనిపిస్తుంది. అంధ్ర, అంధక, ఆంధ్ర, తిలింగ, తెలింగ వగయిరా పేర్లు సాధారణంగా జాతివాచకాలుగానే కనిపిస్తాయి.
అయితే, క్రీస్తుకు పూర్వం నాలుగయిదు శతాబ్దాలనాటి వాడయిన మెగస్తనీస్ (చంద్రగుప్తుడి దర్బారులో గ్రీకు రాయబారిగా ఉన్నవాడు) ఆంధ్ర ‘రాజ్యం’ శక్తిమంతమయినదని ప్రస్తావించాడట. క్రీ.పూ. నాలుగో శతాబ్దానికే చెందినవని చెప్పే జాతకకథల్లో ‘ఆంధ్ర’ శబ్దం ఓ ‘పురం’గా కనిపిస్తుంది. అందులోనే, తెలివాహ(తెలుగు వాహిని?) గురించిన ప్రస్తావన కూడా ఉంది. ‘తెలివాహ’ నది ఒడ్డున ఉన్న ‘అంధపురం’లో ఈ ‘సెరి వాణిజ జాతక కథ’ జరిగినట్లు శాస్త (అంటే గౌతమ బుద్ధుడే!) చెప్తాడు. తెలివాహ అంటే గోదావరి నదేనని కొందరి వాదన. ఇదే కాలానికి, అంటే క్రీ.పూ. నాలుగో శతాబ్దం నాటికే, తెలంగాణ ప్రాంతంలోని తెలివాహ తీరం నుంచి కొన్ని జనసమూహాలు బర్మా (నేటి మయన్మార్)కి వలసపోయినట్లు చరిత చెప్తోంది. వాళ్లను ఇప్పటికీ ‘తైలాంగులు’ అనే పిలుస్తారు. తెలుగులకి కొన్ని ప్రాంతాల్లో ‘తెలుంగులు’ అనే పేరున్న సంగతి అందరికీ తెలిసిందే కదా! కాగా, కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడులో దొరికిన అశోకుడి శిలాఫలకం క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందినదని నిపుణుల అభిప్రాయం. అందులో ఆంధ్ర శబ్దాన్ని రఠ్ఠిక, పుళింద, భోజులతో కలిపి ‘జాతి’వాచకంగా ప్రయోగించారట. క్రీస్తుకు పూర్వం 28లో, పూజ్యపాదుడనే కన్నడకవి కాణ్వ వ్యాకరణం అనే ‘ఆంధ్ర’ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. ( ఈ పూజ్యపాదుడూ, కాణ్వుడూ ఇద్దరూ తెలుగువాళ్లేననేది కొందరి నమ్మకం అదలా ఉంచండి!) అప్పటికే తెలుగు భాషకి వ్యాకరణం ఉందంటే, ఆనాటికే చెప్పుకోదగిన పరిమాణంలోనూ, ప్రమాణంలోనూ తెలుగు సాహిత్యం ఉండేవుండాలన్నది ఓ వాదన. అయితే, ఇంతవరకూ ఇందుకు ఆధారాలు దొరకలేదన్నది వాస్తవం.
క్రీస్తుశకం 77 నాటి గ్రీకు రచయిత, యాత్రికుడు ప్లీనీ (ప్లీనీ ద ఎల్డర్) కూడా ఆంధ్ర ‘రాజ్యం’ గురించి మెగస్తనీస్ రాసినదానే్న తిరిగి చెప్పాడు. (ఇతగాడే, భారతదేశాన్ని ‘పసిడి పాతర’గా అభివర్ణించాడు, అది వేరే సంగతి!) ఆంధ్ర జాతిని ప్లీనీ ‘జెన్స్ ఆందరే’ పేరిట ప్రస్తావించాడు. క్రీస్తు శకం అయిదో శతాబ్దానికి చెంది బౌద్ధ (్థరవాద) గ్రంథం ‘సమంత సాపాదిక’లో ‘ఆంధ్ర’జాతి ప్రస్తావన ఉంది. ఎటొచ్చీ బుద్ధఘోషుడు అనువదించాడని చెప్పే ఈ ఉద్గ్రంథం ‘ఆంధ్రు’ల్ని, దమిళుల్ని మ్లేచ్ఛులుగా జమకట్టిందట! ఇదిలా ఉండగా తమిళులు మనల్ని వడగర్లు అంటారు. అంటే, ఉత్తరాది వాళ్ళమని అర్థం. తమిళనాడుకు తక్షణ ఉత్తరాది తెలుగునాడే కదా?
క్రీస్తుశకం పదో శతాబ్దంలోనే రాజశేఖరుడనే సంస్కఋత కవి ‘విద్ధ సాలభంజిక’ అనే నాటకంలో ‘త్రిలింగాధిపతి’ అనే పాత్రను ప్రవేశపెట్టాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఈ కవి నాటక కర్తకి తెలుగునాడు గురించి ఒక మేరకు తెలిసివుండే అవకాశం ఉంది. ఇక, పధ్నాలుగా శతాబ్దం నాటి ‘ప్రతాప రుద్రీయం’లో, విద్యానాథుడు తెలుగు దేశాన్ని ‘త్రిలింగాఖ్యయా’ అంటూ తొలిసారి ప్రస్తావించాడు. శ్రీశైలం కాళేశ్వరం దక్షారామం అనే త్రిలింగాలకూ విస్తరించిన ‘కాకతి రాజకీర్తి విభవం’ గురించి విద్యానాథుడు తన అలంకార శాస్త్రంలో ఘనంగా చెప్పాడు. విన్నకోట పెద్దన, కాకునూరి అప్పకవి తదితరులు ఇదే మాట ప్రతిధ్వనించారు. నన్నయ మాత్రం వేరువేరు చోట్ల ఆంధ్రం, తెనుగు అనే రెండు మాటల్నీ మన భాషకే వాడాడు. ఒకటి సంస్కృతంలో ఉన్న నందంపూడి శాసనంలో అయితే, మరొకటి తాను అనువదించిన మహా భారతంలో. ఇంతవరకూ ఆంధ్రులూ తెలుగులూ వేరువేరని చెప్పే ఆధారాలెక్కడా కానరాలేదు. ఆ విధంగా, మనలో భాషకూ, జాతికీ ఒకే పేరు వాడడమే ఆనవాయితీగా స్థిరపడివుంది.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఒకటుంది. వందల సంవత్సరాలకు విస్తరించిన సామాజిక, రాజకీయ, చారిత్రక కారణాలవల్ల తెలుగు సంస్కృతి ఏకశిలా సదఋశంగా లేదు. వాస్తవానికి క్రియాశీలకంగా ఉండే ఏ జాతి అయినప్పటికీ అఖండైక శిలాసదఋశంగా ఉండజాలదు. ఇది తెలుగు జాతికే పరిమితమయిన విషయమేమీ కాదు. ఇండో యూరోపియన్ జాతులుగా ప్రసిద్ధాలయిన స్లావిక్ జాతులు కనీసం ఇరవయి వరకూ ఉంటాయి. యాంగ్లో శాక్సన్లు ఒకదశలో ముప్పై రాజ్యాలుగా జాతులుగా విస్తరించి వుండేవారు. ఒక లెక్క ప్రకారం జెర్మానిక్ జాతులు పది వరకూ ఉంటాయి. శ్పానిష్ అధికార భాషగా కలిగివుండే జాతులు ఇప్పటికి ఇరవయి వున్నాయి. జాపాన్ దేశ జనాభా అంతా ఒకే జాతికి చెందినదని చెప్తారు కానీ, ఆ దేశంలో కూడా కనీసం మరో మూడు జాతుల వాళ్లున్నారని ఐ.రా.స. చెప్తోంది. చైనాకి సైతం ఇదే వర్తిస్తుంది. ఆ దేశంలో హాన్ జాతీయులే కాకుండా, మంగోలియన్లు, టిబెటన్లు, మరో 54 జాతులూ తెగల ప్రజలు ఒకే అధికార భాష మాట్లాడుతూ బతికేస్తున్నారు. ఆధునిక నాగరికత దీనే్న ఏకత్వంలో భిన్నత్వంగా గుర్తించింది. మన తెలుగు జాతి కూడా ఏకత్వంలో భిన్నత్వానికి పెట్టింది పేరు. దాన్ని మన జాతి లక్షణంగా గ్రహిస్తే ఏ గొడవా ఉండదు!

-మందలపర్తి కిషోర్ 81796 91822