పెరటి చెట్టు

పదునెక్కిన పాతపాళీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాప్రపూర్ణ, పద్మభూషణ, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రతిభ ఎంత గొప్పదంటే, ఆయన గురించి అతిశయోక్తులు చెప్పడం అసాధ్యమన్నారు దివాకర్ల వెంకటావధాని. అంటే అర్థమేమిటంటే, విశ్వనాథ గురించి చెప్పే స్వభావోక్తులే, అత్యుక్తుల్లా వుంటాయన్నమాట! దాదాపు అరవయి నవలలు, ముప్పై - నలభై కావ్యాలు, డజన్ల కొద్దీ కథానికలు, పదుల లెక్కన నాటకాలు, ఎనె్నన్నో ప్రసంగ - వ్యాసాలు, లెక్కలేనన్నివనిపించే ఖండకావ్యాలు రాసిన విశ్వనాథ ఫలాని కవితాధోరణికి చెందుతారని కేటాయింపుగా చెప్పడం కూడా అసాధ్యమే. ‘సనాతన ధర్మం రాదు. కానీ, వేద మతానుసరణం తప్పదు’ అన్న వాస్తవికవాదిని సనాతనిస్టు అనలేం. ‘ఏ యిజమూ గట్టెక్కించదు - వేదిజమే శరణ్యం!’ అని నిష్కర్షగా చెప్పిన విశ్వనాథని సంప్రదాయవాది అనకపోతే ఏమంటాం? ‘సంస్కృతంలో రాసివుంటే, ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యిన్నొకటోవాణ్నో అవుతాను - తెలుగులో నంటారా? పనె్నండుగురు ప్రాచీన మహాకవుల తర్వాత పదమూడో వాణ్ణి నేను’ అని ‘రొమ్ము విరుచుకుని చెప్పగలిగిన దమ్మున్న దక్షుడు’ విశ్వనాథ. ఆయనకి ముందున్న పనె్నండుగురు ప్రాచీన మహాకవులు ఎవరన్న విషయం మీదే చర్చంతా - పదమూడో ప్రాచీన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారేననడంలో ఎవరికీ అభిప్రాయ భేదం ఎప్పుడూ లేదు!
పందొమ్మిదో శతాబ్ది ప్రథమార్ధంలోనే తెలుగులో ఆధునిక సాహిత్యం చివురుతొడిగినా, అది ఆ శతకం చివరినాళ్లలోనే జవజీవాలు పుంజుకుంది. ఇది, ఆధునిక తెలుగు కవిత్వం విషయంలో మరింత వాస్తవం. గురజాడ - కట్టమంచి- రాయప్రోలు - తిరుపతి వెంకట కవులు తదితరులెందరో ఆధునిక తెలుగు కవిత్వం రూపరేఖల్ని తీర్చిదిద్దిన వాళ్లలో ముఖ్యులు. ముఖ్యంగా, పింగళి - కాటూరి కవులు అన్నట్లుగా, తిరుపతి వెంకట కవుల ‘వాక్కు ప్రాచీన సరణికి భరతవాక్యము; నవీన సరణికి నాందీవాక్యము’ అయింది. తిరుపతి వెంకటకవుల ‘శ్రవణానందము’ ‘పాణిగృహీత’, కావ్యాలు - వస్తువు దృష్ట్యా - ఆధునికతను సంతరించుకున్న మాట నిజం. సి.నారాయణరెడ్డి అన్నట్లుగా, వేశ్యావృత్తికి వ్యతిరేకంగా వీరేశలింగం చేపట్టిన ఉద్యమానికి ఇవి నైతిక మద్దతు ప్రకటించాయి. అయితే, తెలుగు కవులలో నూరు శాతం ఆధునిక, అభ్యుదయ భావాలు వ్యక్తం చేసిన కవి గురజాడ అప్పారావు. ఆయనకి ముందే చిలకమర్తి రైతుల సమస్యల గురించి ఆశుకవితా ధార చెప్తూ ప్రజా సమస్యలని కవిత్వంలో ప్రకటించిన మాట చారిత్రికంగా వాస్తవమే. కానీ, ఆధునిక కవిత్వతత్వం నిరూపించి, స్థాపించిన కవిగా గురజాడ స్థానం పదిలం. ఆ తరానికి వారసులుగా పుట్టుకొచ్చిన కవుల్లో వాళ్లే బసవరాజు - నండూరి - అబ్బూరి - రాళ్లపల్లి - పింగళి, కాటూరి - దేవులపల్లి తదితరులు. ఇదే తరానికి చెందిన విశిష్టమయిన కవి విశ్వనాథ సత్యనారాయణ.
‘నవ్య ప్రాచీన ప్రాచీన నవ్యుడి’గా విశ్వనాథ వారిని అభివర్ణించిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్ర్తీ, ‘నీదు మార్గాన నీయంత నేత లే’డని కూడా ఆయన అద్వితీయతను ప్రకటించారు. ‘పంచారించి వేధించకో పాషాణ పాకప్రభో’ అనేది, జరుక్ చమక్ మాత్రమేనని గ్రహించ ప్రార్థన. నూటికి తొంభై తొమ్మిది మంది తెలుగు కవుల్లో కనిపించే జాతిపరమయిన ఆత్మముగ్ధత్వం విశ్వనాథ వారిలోనూ మొదట్లో - 1920 దశకం తొలినాళ్లలో - ముమ్మరంగా ఉండేదనిపిస్తుంది. విశ్వనాథ తొలి (ప్రచురిత) కావ్యం ‘ఆంధ్ర ప్రశస్తి’. ప్రాచీన కాలంలో ఆంధ్రుల ప్రభ ఎలా వెలిగేదో చెప్పిన ఎనిమిది ఖండకావ్యాలు ఇందులో వున్నాయి. అమరావతిలో బౌద్ధులు ఓ వెలుగు వెలిగినప్పటి ఘనతను గొప్పగా ప్రస్తావిస్తూ, ‘గోదావరీ పావనోదార వాఃపూర్వ మఖిల భారతము మాదన్ననా’టి పురావైభవాన్ని నోరారా కీర్తించారు విశ్వనాథ. ఆంధ్ర చరిత్రను శాస్ర్తియంగా పునర్నిర్మించి, పుణ్యం కట్టుకున్న మల్లంపల్లి సోమశేఖర శర్మగారికే ఈ కావ్యం అంకితం కావడం, అన్ని విధాలా ఉచితం. ‘ఆంధ్ర పౌరుషము’ దీనికి చెల్లెలే - కాదు అక్కేనేమో! ఆయన రాసిన ‘తెలుగు రుతువులు’ (‘రుతు సంహారం’?) కావ్యంలో ఆరు రుతువుల్లోనూ గ్రామీణాంధ్ర సంస్కృతిని మనసారా వర్ణించారు విశ్వనాథ. ఇక ‘కోకిలమ్మ పెళ్లి’ ‘కినె్నరసాని పాటలు’ ‘గిరికుమారుని ప్రేమ గీతాలు’ -ఆనాటి - యువ పాఠకుల హృదయాలను కొల్లగొట్టాయి. ఈ దశకు చేరుకోక ముందు, విశ్వనాథపై గురువు చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీ ప్రభావం ప్రగాఢంగా ఉండేది. బహుశా ఆ ప్రభావంలోనే, విశ్వనాథ తన మిత్రుడు కొడాలి ఆంజనేయులుతో కలిసి - సత్యాంజనేయ కవులు పేరిట - జంట కవిత్వం చెప్పడానికి కూడా ప్రయత్నించారు. కానీ, విశ్వనాథ మహత్వాకాంక్షకి సరితూగే రీతిలో జంట కవి దొరకడమనేది - అప్పుడే కాదు, ఎప్పుడూ - ఊహించలేని విషయం.
1930 దశకానికి అటూ ఇటూగా, గుంటూరు ఏసీ కాలేజీలో పనిచేసిన రోజుల్లో, విశ్వనాథ వ్యక్తిగత - సాహిత్య జీవితాల్లో పెనుమార్పులు సంభవించాయి. భార్య వరలక్ష్మి కన్నుమూయడం - ఆ వెనకే ఉద్యోగం పోవడంతో, విశ్వనాథ అంతర్యానం లోలోతులకి సాగివుంటుంది. అది, ప్రపంచం మెల్లిగా ఆర్థిక మాంద్యం ప్రభావంలోకి చేరుకుంటున్న దశ అని మనం గుర్తుంచుకోవాలి. మృతిచెందిన సతీమణి గురించి రాసిన స్మృతికావ్యం ‘వరలక్ష్మీ త్రిశతి’లో ఈ అంతర్యానం జాడలు కనిపిస్తాయి. అలాంటి మానసిక దశలో సంప్రదాయం పట్టే గొడుగు కిందికి చేరుకోవాలని తహతహలాడడం సహజం కాకపోయినా, సామాన్యం. సరిగ్గా ఈ కాలంలోనే, స్వామీ కల్యాణానంద భారతి ప్రత్యక్ష ప్రభావంలో వేదాంత గ్రంథాలు చదివారట విశ్వనాథ. అంతవరకూ, ఉదార హిందూవాదిగా ఉండిన విశ్వనాథ నూరుశాతం సనాతనవాదిగా పరిణమించిన దశ అది అని, రామరాజుగారు రాసిందాన్నిబట్టి అర్థమవుతుంది. బహుశా, ఈ పరిణామం ఇంత యాంత్రికంగా జరిగి వుండదు- ఎందుకంటే, అంతకు కొనే్నళ్లు ముందరే, మచిలీపట్నంలో పనిచేసే రోజుల్లోనే, స్వామీ విమలానంద భారతీ ప్రభావంలో, ప్రాచీన భారతీయ సంప్రదాయాన్ని అధ్యయనం చెయ్యడంలో విశ్వనాథ తీవ్రంగా నిమగ్నులయ్యారని, రామరాజే రాసివున్నారు.
మొత్తానికి, ‘వేయిపడగలు’ నవల రాసేనాటికి, విశ్వనాథ సనాతన ధర్మం ప్రభావ పరిధిలో ఉన్నారని దీన్నిబట్టి తెలుస్తోంది. అదే మానసికత ఆ నవల్లో ఆద్యంతం ప్రతిఫలించే మాట అందరికీ తెలిసిందే. వర్ణాశ్రమ ధర్మం - దేన్నయితే, అప్పటికి రెండున్నర దశాబ్దాలకి ముందే ‘అధర్మ ధర్మ’మని గురజాడ ప్రకటించి వున్నాడో అదే వైదిక సనాతన ధర్మం యొక్క ప్రాతిపదిక - తాలూకు వేయి పడగల్లో ఒక్కో పడగా రాలిపోతోందని ఒప్పుకోగల నైతిక ధైర్యం విశ్వనాథ సొంతం. అలా జరగడం ఆయనకి ఇష్టం లేదనే విషయం విశ్వనాథ దాచుకోరు. కానీ, జరుగుతున్నదాన్ని వక్రీకరించి చెప్పకపోవడం విశ్వనాథ వైశిష్ట్యం. భూస్వామ్య సమాజంలోని పెత్తందార్లకి కల్పితమయిన ఔదార్యమూ, తెచ్చిపెట్టిన అభ్యుదయ సంస్కారమూ ఆపాదించడమనే అకృత్యానికి విశ్వనాథ తెగబడలేదు. వాళ్లు - వర్తమాన సామాజిక వ్యవస్థను నియంత్రించే పెట్టుబడిదార్లకన్నా- కొన్ని విషయాల్లో మెరుగయిన మనుషులనే మాట వాస్తవమే కావచ్చు. కానీ, అది ఉద్ధరణవాదం నుంచి పుట్టుకొచ్చిన ఔదార్యమో, ఆయా వ్యక్తుల మంచితనమో అయి వుండాలే తప్ప అభ్యుదయ సంస్కారం కాదు. కలం మన చేతిలోనే ఉంది కదాని, రాసేది కాల్పనిక సాహిత్యమే కదాని ‘్భవ స్వాతంత్య్రాన్ని’ విశ్వనాథ దుర్వినియోగం చెయ్యలేదు. అలాగే, గిడుగు రామమూర్తి వ్యావహారిక వాదం విషయంలో కూడా విశ్వనాథ వాస్తవిక వాదమే ప్రదర్శించడం గమనార్హం. ‘రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట. ఆయన వాదాన్ని అర్థం చేసుకోలేక, దురర్థం కల్పించి తెలుగువాళ్లు ఎంతో నష్టపోయా’రన్నారట విశ్వనాథ సత్యనారాయణ. మహామహోపాధ్యాయు లనిపించుకున్న పండితమాన్యు లెందరో గిడుగు మాటల్లోని సామంజస్యాన్ని - కాస్త ఆలస్యంగానే అయినా - గ్రహించారు. ‘ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులుగారికి దోసిలొగ్గి, సమర్పించుకొని మళ్లీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే!’ అన్నారట చెళ్లపిళ్ల వెంకట శాస్ర్తీగారు.
ఇక, కవిగా విశ్వనాథ తొక్కని పంథా లేదు. ఆచార్య బిరుదురాజు రామరాజు ఓ సందర్భంలో అన్నట్లుగా, తనకన్నా ఇరవైయేళ్లు ముందు కాలానికి చెందిన వారి లక్షణాలనూ, తన తరంలోని వారి లక్షణాలనూ, తనకు పాతికేళ్ల తర్వాతివారి లక్షణాలను కూడా పొదివిపుచ్చుకున్న విశిష్ట రచయిత విశ్వనాథ. కాల్పనిక సాహిత్య రచయితగా ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. వేల సంవత్సరాల సనాతన దృక్పథం మొదలుకుని అతినవ్య పోకడల వరకూ ఆయన చిత్రించని వృత్తాంతం లేదు. అద్భుత బీభత్సాది రసాలు మొదలుకుని శోక, వీర రసాల వరకూ ఆయన పోషించని రసం లేదు. మధ్యాక్కరలలాంటి అరుదయిన ఛందస్సుల మొదలుకుని ముత్యాలసరాల వరకూ ఆయన చేతికి ఒదగని సంవిధానం లేదు. ‘గిరికుమారుని ప్రేమ గీతాలు’ మొదలుకుని ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ వరకూ ఆయనకి అలవికాని కావ్యప్రక్రియ లేదు. ‘ఏమి సంబంధము?’ లాంటి కథ మొదలుకుని ‘అది ఒక విధము!’ లాంటి కథానిక వరకూ ఆయన ప్రయత్నించని ప్రయోగం లేదు. ‘హాహాహూహూ’ మొదలుకుని ‘పులిమ్రుగ్గు’ వరకూ ఆయన సృష్టించని అద్భుతం లేదు. ‘బద్దన్న సేనాని’ మొదలుకుని ‘చెలియలికట్ట’ వరకూ ఆయన స్పృశించని నైతిక సమస్యలు లేవు. ‘ఏకవీర’ మొదలుకుని ‘వేయిపడగలు’ వరకూ ఆయన విశే్లషించని సామాజిక ఇతివృత్తాలు లేవు. సుదీర్ఘకాలం జీవించిన మహారచయితలు ఎందరో చెయ్యని - బహుశా చెయ్యలేకపోయిన- ఓ గొప్ప పని విశ్వనాథ సత్యనారాయణ చేశారు. మారుతున్న సమాజంలో అనివార్యం సంభవించే పరిణామాలను గుర్తించడానికి ఆయన ఎన్నడూ నిరాకరించలేదు. అయితే, ఆ మార్పులు తనకి నచ్చలేదన్న విషయాన్ని దాచుకోకుండా ప్రకటించారు. రచయితలకి వుండే వైయక్తిక స్వాతంత్య్రాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే, తన సామాజిక - సాహిత్య పాత్రతను కూడా అంతే బాధ్యతాయుతంగా నిర్వర్తించారాయన. రష్యన్ మహారచయిత కౌంట్ ల్యోఫ్ తల్‌స్తోయ్ (లియో టాల్‌స్టాయ్) కన్నుమూసినప్పుడు ‘సోత్సియల్ జీమక్రాత్’ (సోషల్ డెమక్రాట్) పత్రికలో లెనిన్ ఓ వ్యాసం రాశాడట. ఆ వ్యాసంలో, తల్‌స్తోయ్‌ని ‘మహత్తర వాస్తవికవాది - అభివృద్ధి నిరోధకుడయిన తత్వవేత్త’గా లెనిన్ అభివర్ణించాడట. విశ్వనాథ సత్యనారాయణగారి అదే అభివర్ణన యథాతథంగా సరిపోతుందని మా గురువు రాంభట్ల కృష్ణమూర్తి అనేవారు. ఆ మాట అక్షరాలా నిజం!

-మందలపర్తి కిషోర్.. 8179691822