ఈ వారం కథ

అమ్మకు ఉత్తరం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ కూతురు ఉష నీకు నమస్కరించి రాస్తున్నది- మనింట్లో నీ వాటాలో నువ్వు, రెండో వాటాలో నాన్నా క్షేమమే కదా! అమెరికాలో తమ్ముడు క్షేమమేనట, నిన్న స్కైప్‌లో కనిపించి చెప్పాడు. నేను క్షేమమేనమ్మా..
ఓ శుభవార్త! నేను పెళ్లిచేసుకోబోతున్నాను! శుభలేఖ పంపిస్తాను, నువ్వు తప్పక రావాలి. నీకు, నాన్నకు చెడిందిగానీ మీకు, నాకు చెడలేదు కదా! కనుక నా కోసం తప్పకుండా మీరిద్దరూ రావాలి. నా పెళ్లి జరిపించాలి. ఓ.కెనామ్మా!.. పెళ్లికొడుకు ఎవరంటావా?.. ఇక్కడే బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నేను కోరుకున్నట్లుగా ముఖ్యంగా.. ముఖ్యంగా.. పెద్ద బంధువర్గం కలవాడు. అతనిది చాలా పెద్ద కుటుంబమమ్మా! అన్నలూ, తమ్ముళ్ళూ, అక్కలూ, చెల్లెళ్లూ, బాబాయిలూ, పెదనాన్నలూ- అందరూ ఉన్నారు అతనికి! అందరూ అతనికి మంచికోరేవారే! అతను నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సరే, అతని ఆ బంధువర్గం అంతా నన్ను పల్లకీలో కూర్చోబెట్టి మోసేందుకు సిద్ధంగా ఉన్నారు! కారణం.. కారణం.. నేను కూడా బి.టెక్ చదివి ఉండటం అనుకుంటున్నావా..?
కాదు, కాదు. ఒక పూర్తిస్థాయి పచ్చని కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని నేను పడే ఆరాటం! దాన్ని రేపు నా పిల్లలకి అందివ్వాలని నేను పడే తపన!!
అవునమ్మా! నాది ఆరాటమే. తపనే!.. ఉండటానికి, నిజానికి, నాకు బాబాయిలూ, పిన్నీ, అమ్మక్కయ్యా, మేనత్త, మేనబావ, మేనమామ ఉన్నారు. అమ్మమ్మ, నాయనమ్మ, తాతలూ- ఓహ్ అందరూ ఉన్నారు. కానీ, కానీ ఎవ్వరూ లేరు! ఒక్క నా సొంత తమ్ముడు మాత్రం ఉన్నాడు, నన్ను హత్తుకుపోయి ‘అక్కా అక్కా!’ అని ఏడ్వడానికి. పిచ్చివెధవ!
సారీ, నాకు నువ్వూ, నాన్నా కూడా ఉన్నారు.. అవును ఉన్నారు గదా!
ఇంతకీ పెళ్లికొడుకు ఎవరంటావా, కేశవుడు.. నీకు తెలిసిన మనిషే. పదేళ్ల కిందకి నువ్వు వెళ్లగలిగితే అతను నీకు జ్ఞాపకం వస్తాడు. వెళ్లగలవా? బిజీగా ఉన్నావా? పోనే్ల, బిజీ లేనప్పుడు జ్ఞాపకం తెచ్చుకో!..
అన్నట్లు అసలు నువ్వు బిజీగా లేంది ఎప్పుడమ్మా! .. నాకు జ్ఞానం తెలిసిన ఏడేళ్ల వయస్సునించీ, అంటే, నా రెండో క్లాసునించీ నువ్వు బిజియే.
అప్పుడు తమ్ముడికి నాలుగేళ్లు. మా స్కూలు బస్సు మా ఇద్దర్నీ అప్పుడు మనం ఉంటున్న అపార్టుమెంటు గేటులో వదలిపెట్టి వెళ్లిపోయేది. అపుడు సాయంత్రం ఐదు గంటలు. మేమిద్దరం అక్కడే ఉన్న అపార్టుమెంటు పిల్లల్తో ఆ సైకిళ్లూ, బైకులమధ్య దాగుడుమూతలు ఆడుకొనేవాళ్లం. ఆరు గంటలయ్యేసరికి ఆ పిల్లలందర్నీ తీసికెళ్లిపోవడానికి వాళ్ల అమ్మలొచ్చేవాళ్లు. మా ఇద్దరికీ మాత్రం, మా అమ్మ వచ్చేది కాదు!
కారణం ఉద్యోగం! నీకు ఉద్యోగం!
నువ్వొచ్చేటప్పటికి ఆరున్నర, ఏడు అయ్యేది! తమ్ముడు, ‘అమ్మ, అమ్మ’ అని ఏడ్చేవాడు. నేను వాణ్ణి ఏమని సముదాయించను? నాకే ఏడుపొస్తూంటే! గేటుకేసి చూస్తూ ఆ మెట్లమీద కూర్చొనుండేవాళ్లం. అపార్టుమెంటులో ఉంటూన్నవాళ్ళు మమ్మల్ని రాసుకుంటూ మెట్లెక్కిపోతుంటే మమ్మల్ని ఎక్కడ తొక్కుతారో అని పక్కకి ఒదిగి ఒదిగి గొడకి అతుక్కుపోయేవాళ్లం! బయట రోడ్డుమీద కుక్కలు అరిస్తే అదిరిపడేవాళ్లం. పైనించి బల్లిపడితే దడ, వర్షం వస్తే భయం, చలేస్తే ఒణుకు. ఆకలి, భయం, నీ మీద కోపం!.. ఇంతలో ఆటో దిగి నువ్వొచ్చేదానివి. చాలా తేలిగ్గా ‘‘రండి పిల్లలూ’’ అనేదానివి. నీ వెనకాల మేం పరిగెత్తి కాళ్లమీద పడిపోయేవాళ్లం. నువ్వనేదానివి, ‘‘మీరు గొప్పవాళ్ళు కావాలని నా కోరిక. అందుకు డబ్బు కావాలి. అందుకే నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. మీరు ఇలా భయపడకూడదు, ఏడవకూడదు’’- అహా, ఏం అమ్మవి!
మా స్కూలుకు సెలవొస్తే ఆరోజు మాకు నరకం! నువ్వు పొద్దునే్న ఆఫీసుకెడుతూంటే నేను, ‘‘నువ్వు కూడా లీవు పెట్టేయమ్మా’’ అని ఏడ్చేదాన్ని. తమ్ముడు నీ చీర కుచ్చిళ్ళు పట్టుకుని అడ్డంగా వేళ్లాడేవాడు. దొర్లేవాడు, వెళ్లొద్దని ఏడ్చి రాగాలు పెట్టేవాడు. అపుడు నువ్వు చేసిందేమిటి, మాకు లంచాలు మరిగించటం కదూ! కుర్కురేలు, చిప్స్, చాక్‌లెట్లు, చెత్తా చెదారాలు!... సాయంత్రం నాలుగయ్యేసరికి క్రెషీలోని చిన్నపిల్లల్ని ఆయాలు తీసుకొచ్చి అపార్ట్‌మెంటు మెట్లమీద వదిలిపెట్టి వెళ్లేపోయేవారు. వాళ్లు ‘అమ్మా, ‘అమ్మా’ అని ఏడుస్తూంటే నాకూ, తమ్ముడిక్కూడా ఏడుపొచ్చేది! ఒకళ్లనొకళ్లం హత్తుకుని మేమిద్దరం బావురుమని ఏడ్చేవాళ్లం!
నువ్వొచ్చేదానివి, రాత్రి ఏడు గంటలకి! నీ చేత్తో పెడితేనేగానీ తమ్ముడు అన్నం తినేవాడు కాదు. నువ్వు ఏదో ఎటో ఆలోచిస్తూ వాడి నోట్లో అన్నం కుక్కేదానివి. ఎట్లాగో అయిందనిపించేదానివి.
మేమిద్దరం నీ పక్కనే పడుకునేవాళ్లం. కథ చెప్పమనేవాళ్లం. నువ్వు ఆవులిస్తూ ‘అనగనగా ఒక రాజు, అతను వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చాడు. వాటిని ఎండబెట్టారు..’’ అంతే, నీకు నిద్రొచ్చేది. తమ్ముడు నిన్ను కుదిపేవాడు. నీకు కోపం వచ్చి వాణ్ణీ నన్నూ ఒక్కటి తగిలించేదానివి. ఇంతలో వరంగల్ నుంచి నాన్న ఉసూరుమంటూ వచ్చేవాడు. ఆయనకు అక్కడ మూడు షిఫ్టుల్లో లెక్చరర్ ఉద్యోగం. నీకు ఇక్కడ అబిడ్స్‌లో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం! నువ్వు విసుక్కొంటూ, సణుక్కుంటూ లేచి వెళ్లి ఆయన సేవలో పడిపోయేదానివి. ఆయన సేవలోనా, ఆయన ఒడిలోనా- నేను అప్పుడప్పుడు చూసేదాన్నిలే!- ఏడ్చి ఏడ్చి తమ్ముడు నిద్రపోయేవాడు!
సంక్రాంతి సెలవుల్లో అపార్ట్‌మెంటులో వాళ్లంతా వాళ్ల ఊళ్లకి వెళ్లిపోతే నువ్వు, నన్నూ తమ్ముణ్ణీ ఇంట్లో పెట్టి బయట తాళం పెట్టి ఆఫీసుకి వెళ్లిపోయేదానివి, గుర్తుందా? నువ్వు ఆఫీసు నుంచి ఫోన్ చేస్తావేమోనని ఫోన్ దగ్గర ఇద్దరం కాచుక్కూచునేవాళ్లం. ఉహూ, మీ ఆఫీసరు ఊరుకోడని నువ్వు చేసేదానివి కాదు! ఆ రోజుల్లో మేం పడిన వ్యధల గాథలన్నీ నేను ఇప్పుడు చెబుతా.. ఎవరన్నా సినిమా తీస్తానంటే! ఆ హక్కులన్నీ నీకే ఇస్తా.
ఉచితంగా నీకు బోలెడు డబ్బు! డబ్బేగామ్మా నీకు అతి ముఖ్యమైనది!
****
బావతో, వదినలతో, అన్నయ్యలతో నేను కలిసున్న రోజలు ఏవైనా ఉంటే అవి నా పసితనంలోనివే.. బుద్ధెరిగాక నేను వాళ్లను కలిసింది లేదు. తమ్ముడికి అసలే తెలియదు! మమ్మల్ని నువ్వు ఆ ఇళ్లకి తీసుకెళ్లింది లేదు. పెద్దమ్మ, పిన్ని, అత్త వాళ్లను నువ్వు ఆహ్వానించింది లేదు!.. ఎందుకంటే మాకు ట్యూషన్లు దెబ్బతింటాయని నీ బాధ. నేనూ, తమ్ముడూ ఫస్ట్‌ర్యాంకులు తెచ్చుకోవాలి. నేను ఐఐటియన్‌ని అవ్వాలి. వాడు కలెక్టర్ అవ్వాలి- ఇది నీ కోరిక! కనుక ఇదే నీ నిర్ణయం! నీ నిర్ణయం మేరకే మేం అంతా నడుచుకోవాలి! మాకంటూ టాలెంటూ, సరదాలూ ఉండవు, ఉండకూడదు! నాకు రాబోయే మొగుడు కూడా కలెక్టరో, కలెక్టర్‌ను బాబుగా కలవాడో అయ్యుండాలి! ఆ సన్నాసికి ఇటూ అటూ నా అన్నవాళ్లు ఎవరూ ఉండకూడదు. అమెరికా పౌరుడైతే మరీ మంచిది. వాడి తల్లీ దండ్రి సుత్తుల్లాగా ఉంటూనే ఎక్కడో దూరంగా ఏడుస్తూ ఉండాలి. కాని నా ఇంటికి రాకూడదు! వాడు పరమ పిరికివెధవైనా, పచ్చి లోభి అయినా, లంచగొండి లుచ్ఛాగాడైనా, స్కామువీరుడైనా, దేశాన్ని అమ్మేసే లోఫరైనా, రహస్యంగా టెర్రరిస్టు అయి ఉండినా సరే నీకు ఫర్వాలేదు! డబ్బు, హోదా ఉంటే చాలు ఇవన్నీ నీ కోరికలు! నువ్వు ఆంటీలతో చెబుతుంటే నేను విన్నవి.
****
నాకు 12 ఏళ్లు వచ్చాయి. వ్యక్తురాలనయ్యాను. చాలా విషయాలు కొత్తకోణంలో నాకు తోస్తున్నాయి. కానీ మనస్సు లోపలి పొరల్లో ఏవో తికమకలు! ఏదో భయం! ఎవరిమీదో కోపం! మొత్తం, అభద్రతాభావం!... అపార్ట్‌మెంట్‌లోని ఆంటీల ఇళ్లకు అప్పుడప్పుడు చిక్కడపల్లిలోని వైదేహీ హాస్టల్ నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేవారు. వాళ్లు కథలు చెప్పేవారు. వాళ్లు చెప్పే ఝాన్సీరాణి, రాణి చెన్నమ్మ, శివాజీ మహరాజ్‌ల కథలు విన్నప్పుడల్లా నాకూ తమ్ముడికీ మనస్సు ఉప్పొంగిపోయేది. రక్తం మరిగేది. ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్లి పడిపోవాలనిపించేది.. ఇట్లాంటి కథలు తాతలు, మామ్మల దగ్గర బోలెడు ఉంటాయట. మాక్కూడా తాతలు, మామ్మలు దగ్గర ఉంటే ఎంత బాగుండేది!...
అప్పుడప్పుడు మీ మేనేజర్ నిన్ను తన కారులో తన పక్కన కూర్చోబెట్టుకుని తీసుకువచ్చి మన గేట్‌లో దింపి వెళ్ళేవాడు. నువ్వు లోపలికి వస్తూంటే నీకు ఒళ్లు తూలుతూ ఉండేది. నీ నోట్లోంచి ఏదో పిచ్చివాసన!... ఇదా అమ్మా! గొప్పతనమంటే! ఇది తప్పా, ఒప్పా! న్యాయమా, అన్యాయమా! మాకు ఇదొక తికమక!
***
ఆ సెలవల్లో ఓ ఆదివారంనాటి సాయంత్రం ట్యూషన్ నుంచి నేను, తమ్ముడు ఇంటికొచ్చేసరికి రాత్రి 7 అయ్యింది. కరెంటు పోయింది. తమ్ముడు తాళం చెవి కోసం పైవాటాలో ఉన్న సుజాత ఆంటీ దగ్గరకు పరుగెత్తాడు. నాకు సన్నగా ఏడుపు వినిపించింది. మెట్లు ఎక్కబోయినదాన్నల్లా ఎక్కకుండా నేను ఆ మూలగా మొక్కల మధ్య ఉన్న పాత సామాన్ల గదివైపు వెళ్లాను. లోపల నీ మేనేజరు కారుడ్రైవరు ఫ్రెండు జానీ చేతుల్లోంచి మా ఫ్రెండ్ సరిత పెనుగులాడుతోంది. ‘‘వదులు, వదులు, ననే్నం చేయకు, ప్లీజ్ వదులు’’ అంటూ ఏడుస్తోంది. నన్ను చూసి ఆ జానీ నాతో వెకిలిగా ‘‘మీ అమ్మకి క్యాంపు ఉందట, ఎంచక్కా మేనేజర్‌గారితో కలిసి వెళ్లింది. రేప్పొద్దున వస్తానని చెప్పమంది అందుకే వచ్చాను’’ అన్నాడు.
నాకు కోపం ఆగలేదు. నేను, ‘‘రాస్కెల్, వదులుతావా వదలవా!’’ అంటూ ఒక్క ఉదుటన వెళ్లి వాడిమీద పడ్డాను. వాడు తూలి విరిగిపోయి ఉన్న కుర్చీ కోడు మీద పడ్డాడు. తల నించి రక్తం కారింది. వాడూ, ‘‘యూ బిచ్’’ అంటూ నా మీదకి రాబోయాడు. నేను గది బయటకు, గేటులోకి, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డమీదకు పరిగెత్తాను. అప్పుడే ఎదురొచ్చాడు ఒక యువకుడు. అంతే, అతను ఒక్క ఉదుటున జానీమీదకి దూకాడు. కరాటే నేర్చుకొనున్న టైపులో వాడి కడుపులోకి, మొహమీదకి, తొడల్లోకి ఫెడి ఫెడి ఫెడి గుద్దాడు. జానీ కిందపడిపోయాడు. చటుక్కున లేచి దూరంగా ఉన్న వాడి బైక్‌మీదకి ఎక్కి పారిపోయాడు.
ఆ యువకుడు నాతో ‘‘ఒంటరిగా రాత్రి పూట ఇంట్లోంచి ఎందుకు వచ్చావు? మీ ఇల్లెక్కడ?’’ అంటూ నన్ను తీసుకువచ్చి సుజాత ఆంటీ దగ్గర దింపి వెళ్లిపోయాడు.
మర్నాడు నువ్వు రాగానే ఈ విషయం నీకు చెప్పాను. నువ్వు చాలా తేలిగ్గా, ‘‘జానీ మా ఆఫీసులో అటెండరు. చాలా ముఖ్యమైనవాడు. మా ఫైళ్ళన్నీ వాడి చేతుల్లోంచే నడుస్తాయి. వాడితో మంచిగా మాట్లాడి ఉండవలసింది’’ అన్నావు! నువ్వు నాకు అమ్మవి. నాకు నువ్వున్నావు- ‘నాకూ ఒక అమ్మ ఉంది’ అని నేననుకొంటూండడానికి మాత్రమే, కదమ్మా!
ఆ యువకుడు ఆ తర్వాత అప్పుడప్పుడు నాకు తారసిల్లేవాడు. అతనితోపాటు ఇంకా ఒకళ్లిద్దరు యువకులు ఉండేవారు. దూరం నుంచి అతను నా క్షేమ సమాచారాలు అడిగేవాడు. అతను వౌలాలిలోని ‘వాత్సల్య సింధు’ అనే హాస్టల్‌లో పెరిగిన యువకుడట.. క్రమంగా అతని పట్ల నాకు వాత్సల్యం పెరగనారంభించింది. అయితే ఆ తరువాత నేను అతన్ని కలుసుకోవడం పడలేదు.
నువ్వు మాకు అమ్మవు అవ్వడంకన్నా నీ వలన మాకు ఉపయోగమేమిటమ్మా?.. నాకూ తమ్ముడికీ బాల్యాన్ని భయంతో నింపేసి, ఎదుగుదలని ఎండగట్టి, నా మానమర్యాదలు కాలిపోయినా ఫర్వాలేదన్నట్లు మొహం తిప్పుకుని, మేము కూడా మా పిల్లల్ని అట్లాగే పెంచాలని మాకు నేర్పి... ఇన్ని చేసి నీవేం సాధించావమ్మా! డబ్బుతో వచ్చిన నీ స్వేచ్ఛపు తిరుగుళ్ళని భరించలేకనేకదా నాన్న నీతో విడిపోయి పక్కవాటాలో ఉంటున్నాడు! విడాకులు ఒకటే తక్కువ! అయితే నువ్వు ఇప్పటికి బోలెడు డబ్బు సంపాదించావు. బాగుంది. కానీ, మనిషి జన్మ అందుకేనమ్మా!
ఆ డబ్బుతో మా బాల్యాన్ని మాకు తెచ్చివ్వగలవా?
అసలు, అసలు నీకు ఉద్యోగం ఎందుకమ్మా? నాన్న సంపాదన చాలదా?
నీ చదువుతో మాకు ట్యూషన్లు నువ్వే చెప్పి వుంటే, వీధిలో కాకుండా నీ ఒడిలోనే మేం ఎదిగేవాళ్లం కదమ్మా! ఇవాళ మా మనసుల్లో ఈ భయం ఉండేది కాదు కదమ్మా!
సంతాన భవిష్యత్తు చట్టుబండలయ్యేటప్పుడు ప్రతి ఆడదానికి ఉద్యోగం అవసరమేనామ్మా?
ఆ తప్పు నేను చేయను. అందుకే నేను ఉద్యోగం చేయను.
సమాజాన్ని మోసేది భర్త అయితే, గృహాన్ని కల్పన చేసేది గృహిణి అమ్మా!.. నువ్వు గృహిణివేనామ్మా?
నేను గృహిణిని అవుతాను. అవసరమైతే ఇంట్లో కూర్చొనే నా భర్తకు వేన్నీళ్ళకు చన్నీళ్లు అందిస్తాను. నా పిల్లల్ని కంట్లో పాపల్లాగా ప్రతిక్షణము కనిపెట్టుకొని ఉంటాను. సంసారము, సమాజము, దేశము, ధర్మము- వీటి సారాన్ని నేను తెలుసుకుని వాళ్ళకు నేర్పుతాను. అంతేకాని జానీలకు వదిలేయను. నా పిల్లలు అబ్దుల్ కలాంలూ, ఎం.ఎస్.సుబ్బులక్ష్ములు కాకపోవచ్చు. కానీ జానీలు మాత్రం కారు, కానివ్వను!!
***
తమ్ముడు! పాపం, పిచ్చివెధవ! నేనిటు బిటెక్‌కు బెంగుళూరు రాగానే వాడటు అమెరికాకు పారిపోయాడు. ఎవరో కెనడియన్ అమ్మాయట. గుర్రాల వ్యాపారి కూతురట. ఆ అమ్మాయి ఒక అమ్మలాగా, అమ్మమ్మలాగ, అత్తలాగ తమ్ముణ్ని లాలించిందట, సేవించిందట, ప్రేమించిందట, అతుక్కుపోయిందట. అదేమంటే, ‘‘ఇండియన్ అబ్బాయిలు పెళ్లాలకు అతుక్కుపోతారట కదా!’’ అందట. నాన్న ముచ్చటపడ్డ తమ్ముడు ఇట్లా అమెరికా వెళ్లి అశ్వమేథాలు చేసే కుటుంబంలో పడ్డాడు! వాడింక ఇండియా రాడమ్మా! నినే్ననే స్కైప్‌లో కనిపించి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు! పాపం, పిచ్చి సన్నాసి!
నువ్వు ఇప్పుడు కంపెనీ సెక్రటరీవి. నా తమ్ముడిని నాకు తెచ్చివ్వగలవామ్మా?
నాకు అందరూ ఉన్నారమ్మా. కానీ ఎవరూ లేరమ్మా!
అందుకే, అందుకే, అందుకే ఎందరో ఉన్న అబ్బాయిని.. సర్లేమ్మా నా దుఃఖం నీకెందుకులే!
***
ఇంతకీ ఈ కేశవుడనే అబ్బాయి ఎవరో చెప్పలేదు కదూ.
12 ఏళ్ల కిందట నన్ను జానీ నుంచి కాపాడిన ఆ సాహస యువకుడే ఇతను. ‘వాత్సల్య సింధు’ అనే అనాథ శరణాలయంలో సమాజ సేవకు జీవితాల్ని త్యాగం చేసిన మహాత్ముల పెంపకంలో పెరిగిన ఒక అనాథ! వైదేహీ అనాథాలయంలో వున్న మహిళలందరూ ఇతనికి అమ్మలూ, అక్కలూ, పిన్నులూ- అట!
ఇక్కడ మేమిద్దరం చాలాకాలం తరువాత కలుసుకున్నాం. ఇప్పుడు ఒకటి కాబోతున్నాం.
విడిగా ఉంటున్నా నువ్వు పిలిస్తే నాన్న వస్తాడులే కనుక నువ్వూ నాన్నా తప్పక రావాలి. వస్తారు కదూ! బెంగుళూరు.
ఇట్లు
నీ కూతురు ఉష

.....................
రచయిత సెల్ నెం:9885798556

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు