ఈ వారం కథ

బుగ్గలోడు.. (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుగ్గలోడు.. పేరుకు తగ్గట్టే ఎర్రగా, బుర్రగా, బూరెల్లాంటి బుగ్గలతో, పాల వనె్నతో మెరిసిపోతున్నాడు.. పేరూ, గీరూ లేదు వాడికి.. ఒక రోజు అర్ధరాత్రి ఎవరో పసిగుడ్డును తెచ్చి ఊరి మధ్యలో వదిలేశారు.. తెలతెలవారుతుండగా చంటిబిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుండగా అది విని ఊరు ఊరంతా మేల్కొని ఆడి చుట్టూ చేరింది. ఇంతలో లక్ష్మీ అనే ఆమె గుంపులోకి గబగబా వెళ్లిపోయి వాడిని అమాంతం చేతుల్లోకి తీసుకుని లగెత్తి లగెత్తి ఇంటికెళ్లింది.. ఆమె వెనకాలే ఊరంతా పరుగుపెట్టింది. వంట గదిలోకెళ్లి పాలు గోరువెచ్చగా కాచేసి గ్లాసులో పోసేసి స్పూన్‌తో చిటికెడు, చిటికెడు పట్టడం మొదలెట్టింది. కడుపులోకి పాలు పొయ్యేసరికి వాడి ఏడుపు రాగం కూడా తగ్గిపోయింది. నాలుగు చుక్కల పాలు బుల్లి బుజ్జి బొజ్జను నింపేసరికి చుట్టూ వున్న జనాన్ని చూస్తూ చిట్టిపొట్టి నవ్వులు విసిరాడు. అంతే అందరి మొహాల్లో సంతోషం నిండిపోయింది..
‘ఈడిని నేను పెంచుకుంటా’.. అని ఊరందరిముందు లక్ష్మీ అనేసరికి అందరి మొహాల్లో ప్రశ్నలే కనిపించాయి. ఇంతలో ఒక పెద్దావిడ గుంపు ముందరకొచ్చి ‘ఏమే లచ్చి.. ఎవరి బిడ్డో.. ఏంటో.. రేపెప్పుడైనా ఆడి కన్నతల్లి వచ్చి నా బిడ్డ ఏడి’ అని ఊరోళ్లను అడిగితే.. ఏం సేస్తావ్..? ఎందుకు అడుగుద్ది పెద్దమ్మా..? అసలా కన్నతల్లి ఎవరో మనకెవరికైనా తెలుసా..? లేదు గదా.. తల్లైతే కన్నబిడ్డను ఇలా ఊరు మధ్యన వదిలేసి పోదు గదా.. నవమాసాలు మోసి ఇలా పారేసే తల్లి కూడా ఒక తల్లేనా.. ఎవ్వరొచ్చినా ఈడు నా బిడ్డే..? ఎవ్వరికివ్వను.. ఎల్లిపోండి మీరంతా.. నాకు బిడ్డల్లేరని ఎగతాళి చేసారుగా.. ఇప్పుడు నాకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు.. కనకపోయినా ఈడు నా బిడ్డే.. అంటూ గుండెలకు హత్తుకుంది.. ఏటే..? ఏమాటాడుతున్నావ్..? ఆడు నీ బిడ్డ..? ఏడినించొచ్చాడే నీకు..? గుంపులోంచి కల్లు సీసాతో తూగుతూ వచ్చి లక్ష్మీ మీద చెయ్యెత్తాడు...
అక్కడున్న ఒక నలుగురు మగ మనుషులు తాగుబోతును పక్కకు తీసుకుపోయారు..
లక్ష్మీ ఏడుస్తోంది బిడ్డను చూస్తూ.. నెమ్మదిగా అందరు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. మత్తు దిగాక ఇంటికొచ్చి గొడవ పెట్టుకుని లక్ష్మీని ఇంట్లోంచి గెంటేశాడు. బిడ్డను ఎక్కడినుంచి తెచ్చావో అక్కడే వదిలేసి రమ్మని.. ఘీంకరించాడు.
మనసొప్పలేదు లక్ష్మీకి.. ఏడిస్తే పని జరగదు.. ఏదో ఒకటి చెయ్యాలి. ఈడు నా బిడ్డే.. అనుకుంటూ చీరని బొడ్లో దోపింది. గబగబా పరిగెత్తింది.. కాళ్లమధ్య చీర కుచ్చెళ్లు అడ్డుపడుతున్నా, రోడ్డేసేందుకు ఆ ఊరి సర్పంచి తెప్పించి అక్కడక్కడా పోయించిన కంకర కాళ్లకు గుచ్చుకుంటున్నా లెక్కచేయలేదు లక్ష్మీ. ఊరి చివరికి పరిగెత్తి. ఒక గుడిసె దగ్గరాగింది.
అవ్వా.. అవ్వా. ఓ పాలి బయటికి రాయే.. రొప్పుతూనే పిలిచింది.. చేతికర్రతో అవ్వొచ్చింది..
నా తల్లే.. ఏటైనాదే నీకు.. రా ఈడ కూకో.. అంటూ నులక మంచం మీద కొచోబెట్టింది. అవ్వ చేతికి బిడ్డనిచ్చి.. జరిగిందంతా చెప్పింది.
సర్లేవే.. బిడ్డను నేసూసుకుంటాగా.. నువ్ పొయ్యి ఆడితో గొడవపడక కాపురం సేసుకో.. అని పంపేసింది.. లక్ష్మీ రోజూ వచ్చి బిడ్డను సూసి తనివితీరా ముద్దులాడి.. ఆ మురిపాలను చీర కొంగులో మూటగట్టి గుడిసెకొచ్చి సంతోషంతో వండి వార్చేది..
తాగుబోతు మొగుడికి ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం మానేశాడు. ఇంట్లో బిడ్డైతే లేడు కదా.. అనుకుని ఊరుకున్నాడు. రోజులు గుడస్తున్నాయ్..
బుజ్జిగాడికి మూడేళ్లొచ్చాయ్.. బుచ్చి బుజ్జిగా మాట్లాడుతూ, నెమ్మదిగా ఊర్లో తిరగడం, పరిగెత్తడం మొదలెట్టాడు.. అందరిళ్లలోని పిల్లలతో స్నేహం చేసేవాడు. బుడి బుడి అడుగులకు పెద్దవాళ్లు కూడా మడుగులొత్తేవాళ్లు.. వాడికి పేరేమి లేకపోయేసరికి అందరూ ‘ఒరేయ్.. బుడ్డోడా.. ఒరేయ్ చిన్నోడా’.. అనడం మొదలెట్టారు.
ఒక రోజు కోమటి కొట్టుకెళ్లి అక్కడ ఒక బుట్టలో బెల్లం కనిపించేసరికి చిన్న ముక్క తీసి చటుక్కున నోట్లో పెట్టేశాడు... ఏదో పొట్లం కడుతున్న శెట్టిగారు ఇది చూసి ఓరోరి.. బడుద్దాయ్.. ఏం పెట్టావ్ నోట్లో.. తియ్ చూపించు లేకపోతే వీపు విమానం మోత మోగిద్ది.. అని ఎన్నిసార్లు బతిమాలినా తీసి చూపించలేదు.
రెండు దెబ్బలేశాడు.. బుగ్గలు నొక్కాడు.. ఏం చేసినా బుగ్గలోది బయటికి చూపించలేదు. చివరికి కొట్టుకొచ్చినవాళ్లు ఎంత నచ్చజెప్పినా చూపించలేదు. శెట్టిగారికి బాగా కోపం వచ్చేసి ‘ఒరే బుగ్గలోడా.. నోట్లో ఏం పెట్టేసావురా.. సూపెట్టరరేయ్..’ అంటూ తల బాదుకుంటుండగా.. వాడు భళ్లున నవ్వాడు.
అంతే నోట్లోంచి బెల్లం ముక్క తుపుక్కున కిందకు జారింది. అంతే కొట్లోవాళ్లందరి పెదాలమీద నవ్వులు విరిసాయ్.. శెట్టిగారూ నవ్వేశారు.. బెల్లం ముక్క కాబట్టి సరిపోయింది.. ఇంకేదైనా ఐతే ఆ లక్ష్మీ నన్ను బ్రతకనిచ్చేది కాదు.. అంటూ గొణుక్కున్నాడు. అది మొదలు ఆక్కడి శెట్టిపెట్టిన పేరు ‘బుగ్గలోడా’.. అనేదాన్ని అందరూ ఖాయం చేసేశారు. అలా ఊళ్లో చిన్నా చితక పనులు చేసేవాడు ఆ బుగ్గలోడు.. కొట్టుకెళ్లి పచారీ తేవడం.. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి కూరలు నింపిన గినె్నల్ని బట్వాడా చేయడం.. ఇలా లక్ష్మీ కూడా ఏం అనడంలేదు.
ఇంట్లో ఉంటే తాగుబోతోడితో పడలేం.. కాళ్లొచ్చిన పిల్లలు ఆగుతారా.. ఏదో కళ్ల ముందు ఇలా తిరుగుతున్నాడు.. ఊళ్ళో అందరికీ సాయం చేస్తున్నాడు.. అనుకుంటూ సంబరపడుతోంది. అలా పనులు చేయించుకుంటున్నందుకు వాడికి బెల్లం ముక్క, పంచదార పలుకులు, అప్పుడప్పుడు నిమ్మరసాలు, నిమ్మ బద్దలు, మామిడి తాండ్రలతో రెండు గుప్పిళ్లు నింపేవారు.. తినడానికి మాకే తిండి లేదు ఇంకా ఆడి కడుపేం నింపుతామని.. లక్ష్మీ కూడా ఎవరేమిచ్చిన ఏమనేది కాదు.. అలా ఆ ఊర్లో బుగ్గలోడు పే..ద్ద పాపులర్ అయిపోయాడు.
అలా నాలుగేళ్లు ఎలా గడిచిపోయాయో తెలీదు. బుగ్గలోడికి ఏడేళ్లొచ్చాయ్.. కొంచెం పెద్దవాడయ్యాడు. చెప్పింది అర్థం చేసుకోవడం.. అందరికీ ఇంతకుముందులానే సాయం చేయడం.. ఆచ్ఛాదన లేని ఛాతి. చిరుగురు నిక్కరుతో.. వాడి పని వాడిదే.. అందరి తలలో నాలుక వాడిప్పుడు.. ఎవరింట్లో ఏం జరుగుతోంది.. ఎవరింటికి ఎవరొస్తున్నారో... వగైరా సమాచారమంతా వాడి బుర్రలో ఉంటుంది..
ప్రశాంతంగా వున్న పచ్చని ఊరు కాస్తా పట్నం వాసనల్ని సంతరించుకుంటోంది.. బిజీ బిజీగా మారారు ప్రజలు కూడా.. గుడిసెలు బిల్డింగులయ్యాయ్.. రకరకాల సౌకర్యాలొచ్చాయ్.. లక్ష్మీ చిన్న పనికెళ్తోంది. తాగుబోతు మొగుడి సంగతి సరేసరి.. ఆడి కడుపునీ లక్ష్మే నింపుతోంది.
అలా గడిచిపోతున్న సమయంలో.. ఒక రోజు.. బర్రుమంటూ పెద్ద శబ్దంతో ఒక పోలీస్ జీప్ సైరన్‌తో వచ్చి ఊరిమధ్యన ఆగింది. ఎస్సై మైకందుకుని ‘‘ఊరి ప్రజలారా.. అందరూ వినండి.. మీ మధ్యలోకి ఒక సంఘ విద్రోహక వ్యక్తి వచ్చి తిష్టవేశాడు.. అతనితోపాటు బాంబులు, బెల్టు బాంబులు, ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి. మీరు మీ చుట్టుప్రక్కలవారిని గమనించండి.. అద్దెకు వచ్చేవారిని గమనించండి.. మేం ఊళ్ళో పహారా కాస్తుంటాం.. ఎలాంటి విషయమైనా మాకొచ్చి చెప్పండి’’ అంటూ చెప్పేసరికి అందరూ ఉలిక్కిపడ్డారు.
ఏంటిది.. ప్రశాంతతను పాడుజేసేవాళ్లు మన మధ్యలో వున్నారా.. కనిపెట్టడం ఎలా.. ఎవరై ఉంటారు.. అసలింతకీ ఇక్కడెందుకొచ్చినట్లు.. ఇలా వాళ్ళల్లో వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. కొన్ని రోజులు అలా పోలీసుల మధ్య బిక్కుబిక్కుమంటూ బతికారు. కొద్ది రోజులకు నెమ్మది నెమ్మదిగా పరిస్థితులకు అందరూ అలవాటుపడిపోయారు.
ఒక రోజు తెలతెలవారుతుండగా లక్ష్మీ భోరున ఏడుస్తూ కనిపించింది.. చుట్టుప్రక్కలవాళ్లంతా అక్కడికి చేరారు.
ఏటే లక్ష్మీ. ఏటైనాది.. అని ఒక్కొక్కళ్లూ అడుగుతుండేసరికి.. నా తాగుబోతు మొగుడు యాడికెళ్లిపోనాడో తెల్వదు.. ఇప్పటికి పది దినాలైంది వాడు ఇంటికి రాక.. ఎంత తాగినా రాతిరేళ ఇంటికొచ్చి సతికిలబడతాడు.. వాయమ్మో.. నా మొగుడ్ని ఎవరో ఏదో సేసేసినారు.. నా బొట్టు సెరిపేసినారు.. నా తల్లో.. నా కొడుకో.. బుగ్గలోడా.. ఏందిరా.. ఇలా జరింది.. పోరా.. ఎతికిరారారో నా బిడ్డో.. ఆడు ఏడున్నా తీసుకురారో నా కొడుకా.. అంటూ ఏడుస్తుండేసరికి అందరి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి.
బుగ్గలోడికి ఏం అర్థం కాకపోయినా ఏదో ఆపదొచ్చిందని అర్థం చేసుకున్నాడు. అమ్మా.. నువ్ కంగారు పడకే.. నేనున్నాగా.. సూసొస్తా.. అంటూ ఊరంతా గాలించాడు.. రెండో రోజు అణువణువునా ఎదికేశాడు.. ఎక్కడా జాడ లేదు.. మూడో రోజు. నాలుగో రోజూ.. పోలీసులూ అదే పనిమీదున్నారు.. చివరికి ఐదో రోజు చెరువుగట్టుకాడ బోర్లా పడున్నాడు మురుగొట్టిపోయి..
అయ్యా.. అయ్యా.. అంటూ ఒక్క అంగలో దూసుకెళ్లి ఎదరకు తిప్పుకుని చెంపల్ని కొట్టాడు.
లే అయ్యా.. లే.. అమ్మ ఎదురుసూత్తాంది నీ కోసం.. పదయ్యా.. అంటూ లేపుతున్నాడు. పోలీసు కానిస్టేబుల్స్ వచ్చి సోడా ఒకటి తెచ్చి ముఖంమీద జల్లి.. చెంపలమీద కొట్టారు.. ఒక్కదుటన ఆయాసపడుతూ లేచి కూర్చున్నాడు.
ఏటైనాది.. నేనేడున్నాను.. ఆడు ఏడి.. ఆ బద్మాష్ సాలేగాడు.. నా చేత తప్పుడు పనులు సేయించినాడు. కొందరిళ్లలో బాంబులెట్టించాడు.. తాగుడికి లెక్కపెట్టలేనంత డబ్బులిస్తానని ఎరేసి నన్ను వాడుకున్నాడు.. నేను కుదరదన్నాను. నన్ను కొట్టి, రక్కి బ్లేడుతో కోసి బాంబులెట్టించాడు.
-ళనఆఏథి ఏడాడు.. సంపేస్తా ఆడ్ని.. అంటూ ధారగా మాట్లాడేస్తున్నాడు.
ఎస్సై వచ్చి ఎవరు.. ఎవరతను.. చూస్తే గుర్తుపడతావా.. అని అడిగేసరికి గుర్తుపడతానయ్యా.. అల్లదిగో ఆ శెట్టిగారి కొట్టున్నాదే.. ఆడికి ఊరి సివర్న చిన్న పెంకుటిల్లుండాదే.. అందులో ఉంటాడు.. ఏదో భాష మాట్లాడతాడు.. ఏదేదో సేత్తాడు.. అంటూ చెప్పుకుపోతున్నాడు.
ఓహో.. ఆ ఎర్రగా కందగడ్డలా ఉంటాడే, చపాతీలు తింటాడే వాడా.. అంటూ బుగ్గలోడు మధ్యలో అడ్డుకున్నాడు.
నీకు తెల్సా వాడు... అడ్రసు చూపించు పట్టేసుకుందాం వెళ్లి. ఎస్సై మాటలకు బుగ్గలోడు నవ్వేశాడు.
ఆడెప్పుడు వత్తాడో, ఎప్పుడుంటాడో నాకే తెల్సు.. ఆదేరం ఏల అంతా సద్దుమణిగాక వత్తాడు.. సోమ, మంగళ ఇంటో ఉంటాడు. మళ్లీ బుధారం పొయ్యి ఆదారం వత్తాడు.. అంటూ మళ్లీ నవ్వాడు.. ఆడా ఆలా సేసింది. ఆడేదో సదుకుంటున్నాడని శెట్టోరు సెప్పారే.. అంటూ బుర్రగోక్కుంటున్నాడు.. మరి బాంబులు పెట్టించాడన్నావ్.. ఎక్కడెక్కడ పెట్టించాడు.. తాగుబోతును అడిగేసరికి.. కొందరు పెద్దోళ్ళిల్లో ఇంటెనక మరుగున, ఎవరికి కానరాని సోట్లో పెట్టించాడు ఎవరికి కానరాకుండా.. ఎందుకో తెల్వదు.. ఏదో ఉంది ఆడి సేతుల్లో.. అది నొక్కితే అన్నీ ఒకేపాలి పేలతాయట.
ఎవరికో ఫోన్లో సెప్తుంటే ఇన్నా.. అన్నాడు. అయితే రేపు ఆదివారం .. మనం ఎలాగైనా వాణ్ని పట్టుకోవాలి.. అంటూ బుగ్గలోడికి ప్లాన్ చెప్పాడు ఎస్సై.. ఆదివారం అర్థరాత్రైంది.. నెమ్మదిగా చడీ చప్పుడు లేకుండా.. ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుని పడుకున్నాడు చపాతీలు మాత్రమే తినేవోడు.. తెల్లవారింది సోమవారం వచ్చింది.. తలుపు దబాదబా బాదుతున్నాడు బుగ్గలోడు.
పిస్తోలు పట్టుకుని ఎవరు.. అంటూ కిటికీలోంచి చూసి.. ఓరే బుగ్గలోడా.. నువ్వా..రా.. ఏంటి ఇలా వచ్చావ్.. అనేసరికి, నీకు ఆకలైతది కదా ఇగో అట్లు తెచ్చినా.. తినుపో.. అంటూ ముందు పెట్టాడు.. ఆ ఇద్దరికి ఇది మామూలే.. చిన్నపిల్లాడని వాడిని ముద్దు చేస్తాడు చపాతీలు తినేవోడు. ఆకలి మీదున్నాడు కామోసు ఎవరు.. ఏంటి.. ఎందుకు తెచ్చావ్ అని అడగకుండా, వెనకా ముందు ఆలోచించకుండా మొత్తం తినేసి చెయ్యి కడుక్కోడానికి లోపలికి వెళ్లాడు.
ఇంట్లో మంచం కింద ఏదో వస్తువు చటుక్కున పెట్టేసి మళ్లీ మామూలుగా వచ్చి కూర్చున్నాడు బుగ్గలోడు. ఏరా ఊర్లో అంతా బాగున్నారా.. ఏం ప్రమాదం, గిమాదం లాంటిది జరగలేదుగా.. పోలీసులు ఎందుకొచ్చార్రా.. ఏం తెలీనట్టు అడుగుతున్నాడే.. అని మనసులో గొణుక్కుని ఏమో.. నాకేటి తెలుత్తాది.. మీ అసంటోరికే తెలుత్తాది కాని.. అని గోడకు జారగిలబడ్డాడు.
ఒరే కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టరా లోపలికెళ్లి... ఎంట్రా ఏం పెట్టావ్ నాకు.. కళ్లు తిరుగుతున్నాయ్.. ఏదో ఐపోతోంది నాకు... ఏయ్.. రా.. ఇటు.. లోపలికెళ్లకు.. పో బయటికి.. ఏయ్.. చిన్నపిల్లాడవనుకున్నా.. పోలీసులకు ఉప్పందిస్తున్నావా.. పోరా.. లేదా చం.. పే.. స్తా.. అంటూ దబ్బున నేలమీద పడిపోయాడు.
స్వతహాగా కొంచెం తెలివైనవాడే బుగ్గలోడు.. కాళ్లూ, చేతులూ పే..ద్ద తాడుతో కట్టేసి... మూతికి ప్లాస్టర్ వేసి, మంచం కింద ఇందాక పడేసిన కర్చ్ఫీ తీసి ముక్కుమీద పెట్టాడు.. మళ్లీ ఎక్కడ లేచి తనని చంపేస్తాడేమోననే భయంతో.. జేబుల్లోని సామానంతా తీసేసి చేతికి అందుబాటులో ఏం లేకుండా అన్నీ దూరంగా జరిపేసి.. గట్టిగా పిట్టలా ఒక అరుపు అరిచాడు.. అంతే పోలీసుల బూటు చప్పుళ్లు ఆ పెంకుటిల్లుని రౌండప్ చేసేశాయి..
ఊరు ఊరంతా లోపలున్న బుగ్గలోడిని వెతుకుతున్నాయి.. ఏమైందో నా కొడుక్కి.. అయినా పోలీసులకు నా కొడుకే కనిపించాడా.. ఏం జరిగిపోతోందో నా కొడుక్కి.. వాడేం సేసేత్తాన్నాడో.. నా కొడుకో..కొడుకా.. ఒరే బుగ్గలోడా.. నా కొడుకా.. ఎక్కడరా. అంటూ లక్ష్మీ ఒకటే ఏడుస్తోంది. లక్ష్మీ మొగుడు కూడా ‘నా బంగారు బిడ్డ రారా.. ఎక్కడరా నువ్వు.’ అంటూ ఏడ్వడం మొదలుపెట్టారు.
అంతలో చేతిలో ఏదో పట్టుకుని రయ్యిన గుంపులోంచి బుగ్గలోడు చెరువుకేసి పరిగెత్తడం మొదలెట్టాడు. ఏం జరిగిపోయిందో అనుకుంటూ ఊరంతా ఆడెనకాల పడింది. చెరువు గట్టుకాడ ఆగి.. పే..ద్ద వస్తువుని నీళ్లలోకి విసిరేశాడు.. ఎస్సై వచ్చి బుగ్గలోడిని ఎత్తుకుని పెద్ద ఫైవ్‌స్టార్ చేతిలో పెట్టాడు.. ఏందయ్యా ఇది.. ఎప్పుడూ తినలేదే.. అంటూ దాన్ని పైకి కిందకి మార్చి మార్చి చూస్తున్నాడు. ఇప్పుడు తిను.. ఇది తీపి మిఠాయి..
వీడిని ఊరూరా గాలిస్తున్నాం.. ఎక్కడా దొరక్కట్లా.. మీ ఊర్లోకి వచ్చి ఊరిని శ్మశానం చెయ్యాలనుకున్నాడు.. కాని బుగ్గలోడు మాకు సహకరించాడు. చెప్పినట్టే చేశాడు.. ఎవరెళ్లినా వాడికనుమానం వస్తదని తెలిసే ఈ అమాయకుడైన బుగ్గలోడిని పంపించాం.. సాధించి చూపించాడు.. మిమ్మల్ని, మీ ప్రాణాల్ని, మీ ఊరిని, మా పోలీసు వ్యవస్థ పరువును నిలబెట్టాడంటూ ఎస్సే చెప్తుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు.
లక్ష్మీ పరుగున వచ్చి ఆడిని ఎస్సై చేతిలోంచి లాక్కుని చంకనేసుకుని ఏడుస్తోంది.
నా బిడ్డవిరా.. నువ్వు.. ఎవరేమనుకున్నా.. నిన్ను నేను పోలీసుని సేత్తా. ఇంక మనకా కొంప వద్దు.. తాగుబోతు సచ్చినోడూ వద్దు.. పదరా బిడ్డా.. ఏదో ఒక ఊరెళ్లి బతుకుదాం.. అని బయల్దేరేసరికి కాళ్లకడ్డుపడ్డాడు తాగుబోతు.. ఏమే నువ్వు మాలచ్చిమివే.. అనవసరంగా కసురుకున్నానే.. బిడ్డను వదిలేయమన్నానే.. ఆడే నా పేనాల్ని కాపాడాడు.. కన్నతండ్రిని కాకపోయినా ఆడు నా కొడుకేనే.. ఆడిని ఇద్దరం కట్టపడి పోలీసుని సేద్దామే.. నువ్ సెప్పినట్టు ఇంటానే ఇంగ.. పదయే ఇంటికి.. పదే లచ్చి.. అంటూ ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్లాడు.
ఊరు ఊరంతా బుగ్గలోడికి పల్లకీ పట్టింది.. ఆడిని అందరూ కలిసి చదివించడం మొదలెట్టారు.. కాబోయే ఎస్సైకి జయహో.. అంటూ బుగ్గలోడికి కానిస్టేబుల్స్ అందరూ సెల్యూట్ చేసి సంఘ విద్రోహక వ్యక్తికి సంకెళ్లేశారు.. *

రచయిత సెల్ నెం:9059824800

-అమూల్యాచందు కప్పగంతు