ఈ వారం కథ

తడి తగిలిన పాదాలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
....................................................................

‘పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా సంప్రదాయ సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆదర్శ రైతు నాగయ్య ఇప్పుడు తన అనుభవాలను మనతో పంచుకుంటారు’- అని సభాధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు.
వేదికమీద రెండు వరుసల్లో కుర్చీలున్నాయి. ముందు వరసలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులున్నారు. వారితోపాటు పురుగు మందులు, రసాయన ఎరువులు, ఆధునిక వ్యవసాయ యంత్రాల తయారీదారులు, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు ఉన్నారు. వెనక వరసలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అక్కడి చివరి కుర్చీలోంచి పైకి లేచాడు నాగయ్య.
ఆరడుగుల పొడవున్న నాగయ్య- కొత్త నాగలి ‘నొగమాను’లా దృఢంగా ఉన్నాడు. తెలుపురంగు నూలు పంచె కట్టుకుని, పొడవు చేతుల నూలు చొక్కా వేసుకున్నాడు. లావుమీసాలను పైకి తిప్పాడు. కుడి వైపు పాపిట తీసి దువ్వాడు. అతని వయసును- వెండి రంగులో ఉన్న మీసాలు, జుట్టు చెప్పకనే చెబుతున్నాయి. ఠీవిగా నడుచుకుంటూ వేదిక వద్దకు వచ్చాడు. ఏసీ హాలులో వేదికపైన ఉన్నవారే కాదు, వేదిక ఎదురుగా కూర్చున్న రెండు వేలమంది కూడా నాగయ్యను ఆసక్తిగా చూస్తున్నారు.
ఆహూతులందరి చేతుల్లో ఏవేవో పేపర్లున్నాయి. మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో ఇప్పటివరకూ దాదాపు యాభై మంది పత్ర సమర్పణ చేశారు. దేశ వ్యాప్తంగా ముఖ్యమైన వారంతా సమావేశానికి హాజరయ్యారు.
‘అందరికీ నమస్కారం..’ అని తన మాటల్ని ఆపాడు నాగయ్య.
తెలుగులో అతడు మాటలు మొదలుపెట్టడంతో గుసగుసలు ప్రారంభమయ్యాయి.
‘దిసీజ్ వెరీ ఇంపార్టెంట్ డే టు మి, మై నేషన్ అండ్ మై ఆక్యుపేషన్’ అని అతనే అన్నాడు.
ఇంగ్లీషులో నాగయ్య మాట్లాడడం మొదలుపెట్టగానే గుసగుసలు ఆగిపోయాయి. అందరూ అతడినే ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన ఇంగ్లీషులో ఉపన్యాసం కొనసాగించాడు.
‘సెమినార్ ప్రారంభమైన రోజునుంచీ ఉన్నాను, అందరి ఉపన్యాసాలూ విన్నాను. ఇక్కడికి దేశవిదేశాల నుంచి ఎందరో వచ్చారు. వారి కొత్త ఆవిష్కరణలను ఈ వేదికపై వివరించారు. నాకు మాట్లాడే అవకాశం వస్తుందో రాదో అనుకున్నా. చివరకు ఐదు నిముషాలు ఇచ్చారు. నా వ్యవసాయ అనుభవాలు చెప్పమన్నారు. నా వయసు ఎనభై ఏళ్ళు. దాదాపు ఆరు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నా. ఆ అనుభవాలను ఐదు నిముషాల్లో చెప్పడం ఎలా సాధ్యం? అందుకే, ఇక్కడికి వచ్చిన చదువుకున్న మీ అందరికీ కొన్ని ప్రశ్నలు వేయదల్చుకున్నా.
మీరు ఇప్పటివరకూ ఎనె్నన్నో ఆధునిక వ్యవసాయ యంత్రాల గురించి మాట్లాడారు. సరికొత్త వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడారు.. ఎన్నో కోట్లు ఖర్చుచేసి, ఎన్నో ఏళ్లు శ్రమించి నూతన యంత్రాలను సృష్టించామన్నారు.
అయ్యా.. అవన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? డబ్బున్నవారికే కదా..? పదులు లేదా వందల ఎకరాలున్నవారికే కదా..? మన దేశంలో వందల ఎకరాలున్నవారు ఎంతమంది ఉన్నారు..? ఎకరా, అరెకరా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? వందల ఎకరాలున్నవారు వేలల్లో ఉంటారు.. ఎకరా, అరెకరా వున్నవారు కోట్లలో వుంటారు. మీరు చేసే పరిశోధనలు ఉపయోగపడాల్సింది కోట్లమందికా? వేలమందికా?
ఆధునిక యంత్రాలు చిన్న రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పురుగు మందులు వాడడంతో ఏ కాయగూరనూ ధైర్యంగా తినే పరిస్థితి లేదు. రసాయన ఎరువులు భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి.
వ్యవసాయంలో లక్షలు ఖర్చుచేసి ఆధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని, కోట్లు గడిస్తున్నారు కొందరు పెద్దలు. వాళ్లను చూసి సన్న, చిన్నకారు రైతులు తమ వొంటిని, నేలను గుల్ల చేసుకుంటున్నారు. అటు సంప్రదాయ సేద్యానికి దూరమై, ఇటు ఆధునిక సేద్యం వంటబట్టక ‘ఉట్టికీ స్వర్గానికీ’ కాకుండా ఉన్నారు.
రెండెకరాల పొలముంటే సొంత అన్నదమ్ములే కలిసి సేద్యం చేయరు. రోజూ గొడవలుంటాయి. మీ ఆవిష్కరణలన్నీ ఐదెకరాలు, పదెకరాలకే కదా..! రెండెకరాలను ఇద్దరు కలిసి సాగుచేయలేని స్థితిలో పదెకరాలను పదిమంది ఎలా కలిసి సాగు చేస్తారు? ఎలా ప్రశాంతంగా ఉంటారు?
ఈ పదిమంది నుంచీ భూములను ఇంకో డబ్బున్నవాడు కొనుగోలు చేస్తున్నాడు. పెట్టుబడులు పెడుతున్నాడు. మీ నూతన ఆవిష్కరణలన్నింటినీ అతనే ఉపయోగించుకుంటున్నాడు. ఈ పదిమందీ కూలీలుగా మారుతున్నారు. వీరిలో కొందరు వలసపోతున్నారు. దీనికెవరు బాధ్యులు?
‘కరవునేలలో పంటలు పండనప్పుడు- భూముల్ని అమ్ముకుని వలసపోక మరేం చేస్తారు?’అని మీరంటారేమో..
అదే పదెకరాలు కొన్న పెద్దరైతు బోర్లు వేసి బిందుసేద్యం తో, ట్రాక్టర్లతో పంటలు సాగు చేస్తున్నాడు కదా..? ఆ సౌకర్యాలను ఈ పదిమందికి విడిగా ఎందుకు అందుబాటులోకి తీసుకురారు?
నాకున్నది నాలుగెకరాలే. మా తల్లిదండ్రులకు నేనొక్కడినే కొడుకును. నేను వ్యవసాయ శాస్త్రంలో పట్ట్భద్రుడిని. వ్యవసాయంలో ఆధునికత పేరుతో చాలామందికి ఉపాధి లేకుండా చేయబోతున్నారని నేను యాభై ఏళ్ళ క్రితమే గమనించా. నా వంతుగా నేను నాకున్న నాలుగెకరాలను కాపాడుకునేందుకు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నా.
మనది వ్యవసాయ దేశం. జనాభా ఎక్కువున్న దేశం. ఇక్కడ యంత్రాలను ప్రవేశపెడితే మనుషులకు పని ఎవరిస్తారు? అందుకే చాలామందికి పనిలేక వలసబాట పట్టారు. వారందరికీ పని కల్పించేందుకు మళ్లీ మరో ఉపాధి హామీ పథకం. దీనికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు? ఈ ఖర్చునుంచి ఆదాయం ఎంత వస్తోంది? తిరిగి అందులో ఎంత ఖర్చుచేస్తున్నారు? ఏమీ లేదనే చెప్పవచ్చు.
అదే.. ఆ లక్షల కోట్లను రైతులు పండించే వాటికి ఇస్తే.. గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తే.. అరెకరం సాగుచేసినా అందులో పండే పంటలు ఒక కుటుంబం హాయిగా జీవించేలా, దిగుబడులకు ధరలు ఉంటే.. దానికి అనుగుణంగా వ్యవసాయ కూలీలకు ఆదాయం పెరుగుతుంది.. వాళ్ల వలసలూ ఉండవు. ఆధునిక యంత్రాల అవసరమూ ఉండదు.. మనుషుల మధ్య మనసులతో సంబంధాలు ఉంటాయి.. ఇప్పుడన్నీ యంత్ర సంబంధాలే కదా ఉన్నాయి.
నాకున్న నాలుగెకరాల్లో పంటలు సాగుచేస్తున్నా. పురుగు మందులు వాడను. విత్తనాలు కొనుగోలు చేయను. రసాయన ఎరువులు ఉపయోగించను. నా దగ్గర ఆరు పాడి ఆవులున్నాయి. పొలాన్ని ఇప్పటికీ నేను నాగలితోనే దున్నిస్తాను. నా దగ్గర నాలుగు కోడెలున్నాయి. నాలుగెకరాల సేద్యంపైన రెండు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
పెట్టుబడి తక్కువ, మనిషి శ్రమ ఎక్కువ ఉంటే.. వ్యవసాయంలో లాభం వస్తుంది. లాభం రాకపోయినా నష్టం రాదు. ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుబడులు ఎక్కువ, మనిషి శ్రమ తక్కువ. నష్టం వస్తే రైతు కోలుకోలేడు.
అందుకే ప్రతి రైతుకూ లక్షల్లో అప్పులున్నాయి. దీనికెవరు బాధ్యులు? పాతికేళ్ల ముందు రైతుల అప్పులెంత? ఇప్పుడున్న రైతుల అప్పులెంత? ఊహకందనంతగా పెరిగాయి.. గణాంకాలు పరిశీలిస్తే మీకే తెలుస్తుంది ఈ వ్యత్యాసం.
నాకూ ఒక్కడే కొడుకు. వాడు సేద్యం వద్దని ఉద్యోగం కోసం పట్టణం, అక్కడినుండి నగరం చేరుకున్నాడు. ఇప్పుడు వాళ్లు ఢిల్లీలో ఉన్నారు. అక్కడే ఇల్లు కట్టుకున్నారు. స్థిరపడిపోయాడు. వాడి ఇంటి విలువ ఆరు కోట్లు. నాకున్న నాలుగెకరాల పొలం నాలుగు లక్షలు కూడా చేస్తుందో చేయదో? అయితే, వాడి ఇల్లు ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు, నలుగురికి మాత్రమే ఉపయోగపడుతుంది. లేదూ ‘్ఢల్లీలో మాకు ఇల్లుంది’ అని గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తుందేమో. అదే నా నాలుగెకరాలు..? దీనిపై ఆధారపడి రెండు కుటుంబాలున్నాయి. ఆ రెండు కుటుంబాల్లో ఎనిమిదిమంది ఉన్నారు. వారి ఆశలు, ఉద్వేగాలు, సంతోషాలు, బాధలు, కష్టాలు.. అన్నీ కూడా ఆ నాలుగెకరాలతోనే ముడిపడి వున్నాయి. నా దగ్గర వున్న ఆరు పాడి ఆవులకు, నాలుగు కోడెలకు ఆ పొలమే జీవనాధారం. ఆ రెండు కుటుంబాల దగ్గర, నా దగ్గరా కలిపి ఐదు కుక్కలున్నాయి. పదికిపైగా పిల్లులున్నాయి. వందకుపైగా కోళ్ళున్నాయి. ఇవన్నీ నా కంటికి ప్రత్యక్షంగా కనిపించేవి. నాపైన ఆధారపడ్డవి. ఇక పంటలపైన ఆధారపడి బతికే జీవరాశులెన్నో. వానపాములు, ఎలకలు, పాములు మొదలైన పక్షులదాకా.. కొన్ని వేలుంటాయి..
అంటే- నేను సాగు చేసే నాలుగు లక్షల రూపాయల విలువచేసే నాలుగెకరాల పొలంలో కొన్ని వేల జీవరాశులు జీవిస్తున్నాయి. అదే, నా కొడుకు ఢిల్లీలో ఉండే ఆరు కోట్ల విలువ చేసే ఆరువందల గజాల స్థలం ఎన్ని ప్రాణులకు జీవం పోస్తోంది?
నా కొడుకు, మనవడు, నాకు కొన్ని ప్రశ్నలు వేశారు. ఇలాంటి ప్రశ్నలే మీరు కూడా పల్లెల్లో ఉండే మీవారికి వేసే ఉంటారు.
ఒక్కోసారి పంటలు పండవు కదా? అంటారు. ఈరోజుగాకపోయినా రేపయినా పండుతాయి. కానీ, పంటలు లేవని మనిషి ఒక్కపూట తినడం ఆపలేదు. నిన్ను నమ్ముకుని- ఆఖరికి నీ అమ్మానాన్న లేదా నీ పిల్లలు కూడా లేకపోవచ్చు. నన్ను నమ్ముకుని ఎన్నో జీవులున్నాయి..
నోరులేని జీవి మనపై ఆధారపడి ఉంటే, దానిని మనం సంరక్షిస్తే అందులో వుండే ఆనందం అనుభవిస్తే కానీ అర్థం కాదు. కోటి రూపాయలను కోటిసార్లు లెక్కపెట్టినా అందులో మార్పు ఉండదు. ఆనందమూ పెరగదు. అదే పంట గింజలు వేసింది మొదలు మొలకెత్తి పెరిగి , పంట చేతికొచ్చేవరకూ దాంతో ఉన్నామంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము.
నేను పల్లెలోనే పుట్టను.. అక్కడే పెరిగాను.. ఆనాటిలా మనుషులు లేరు.. నిజమే.. ఇక్కడున్న వారిలో నగరంలో ఉన్నంత కాలుష్యం లేదు..
నా చుట్టూ ఆనాటి పొలాలు లేవు. బీళ్లుగా, ఇళ్లుగా మారాయి.. నిజమే.. ఉండే పొలాలు వాన వస్తే చిగురించటానికి సిద్ధంగా ఉంటాయి.. నీళ్లు లేవు.. నిజమే.. సంరక్షణ చర్యలు చేపడితే ఎప్పటికైనా నీళ్లొస్తాయి.. మనం అనుకుంటున్నాం.. ప్రకృతిపైన విజయం సాధిస్తున్నామని. అదంతా కేవలం భ్రమ.. అది గెలుపు కాదు.. ఓటమి..
ప్రకృతిని కాపాడడం, ప్రకృతిలో కలిసిపోవడమే గెలుపంటే.. నేలను.. నీళ్లను.. చెట్లను.. మనుషులను ధ్వంసం చేయకుండా, వాటిని కాపాడుకునేదే నిజమైన గెలుపు.. వాటికి దోహదం చేసేవే గొప్ప పరిశోధనలు.. గొప్ప ఆవిష్కరణలు..
ఒక గింజ కోసం పాటుపడని..
ఒక గింజను బతికించడం కోసం కృషి చేయని జీవితం వృథా.. బురద మడిలో తడి తగలని పాదాలు ఎండిపోతాయి.. ఇప్పుడంతా నిలువెల్లా ఎండిపోయిన మనుషులే.. పచ్చటి చెట్టు ఎండిపోతే ప్రకృతిలో ఎంత క్షామమో.. మనిషి ఎండిపోయినా సమాజంలో అంతకంటే ఎక్కువ క్షామం. ఎక్కడా ఎవ్వరికీ ప్రశాంతత ఉండదు.. నిలువ నీడ ఉండదు.. ఉన్నా అది నీడలా ఉండదు.
అతి తక్కువ ఖర్చుతో మనిషి జీవించేలా చేసేదే గొప్ప ఆవిష్కరణ. అది వ్యవసాయం తప్ప మరొకటి కాదు. వ్యవసాయాన్ని మీరు ఆర్థిక వనరుగా భావించకండి.. జీవన వనరుగా మాత్రమే చూడండి. అప్పుడే కాలుష్యం తగ్గుతుంది. పని పెరుగుతుంది. వలసలు తగ్గుతాయి. ఆకలి చావులు ఉండవు. దేశం బాగుపడుతుంది. ఏసీ గదుల్లో యంత్రాల మధ్య పరిశోధనలు కాదు.. తడి మట్టిలో గింజను మొలకెత్తించే పనులు చేయండి..
పచ్చదనానికి దూరంగా ఉన్నామంటే, నాలుగ్గోడల మధ్య సుఖంగా ఉన్నట్టు కాదు. ఎవరికివారు ఇనుప సంకెళ్ళతో బంధించుకున్నట్టే. ఆ సంకెళ్లు తెగితేనే అందరికీ శాంతి, సౌఖ్యం..’ అంటూ ముగించాడు నాగయ్య.
ఒక్క క్షణం నిశ్శబ్దం. మరుక్షణం వేదికపైన ఉన్నవారితో సహా అందరూ లేచి మరీ చప్పట్లు కొట్టారు. నాలుగెకరాల పొలాన్ని ఏకబిగిన దున్నినా అలుపురాని కోడెలా ఠీవిగా నడుచుకుంటూ వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు నాగయ్య. *

రచయత సెల్ నెం: 9949 11 8082

-సుంకోజి దేవేంద్రాచారి