పశ్చిమగోదావరి

మొరాయిస్తున్న ఇ-పాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 5: ఈ-పాస్ విధానంలో ఇటీవల ఏర్పడుతున్న సమస్యలను అధిగమించేందుకు, నిత్యావసర సరుకుల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ-పాస్‌ను ఎపి ఆన్‌లైన్ నుండి తప్పించి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసి)లోకి మార్పు చేశారు. ఈ కొత్తవిధానం అమల్లోకి వచ్చిన తొలిరోజే మరిన్ని సమస్యలు వెంటాడాయి. అప్పటి నుండి ఇప్పటివరకు కొత్త విధానం వల్ల డీలర్లకు తిప్పలు తప్పడం లేదు. ఈ -పాస్ యంత్రాలు పనిచేయక రేషన్ డీపోల వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని డిపోల్లో ఒక్క కార్డుకు కూడా సరుకుల పంపిణీ చేయలేకపోయారు. దీంతో డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని రేషన్ డిపోల ద్వారా లక్షలాదిమంది రేషన్ కార్డులకు ఆరు రకాల సరుకులు అందించేందుకు ప్రభుత్వం నిర్ధేశించగా, కొత్త విధానంతో పంపిణీకి ఇబ్బందులు తప్పడం లేదు. రాష్టవ్య్రాప్తంగా పౌరసరఫరాల శాఖ ఈ-పాస్‌ను అమలుచేసేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఎపి ఆన్‌లైన్ సహాయంతో ఈ-పాస్ అమల్లో ఉండగా, ఈ విధానంలో ఏర్పడిన సమస్యలను తొలగించేందుకు తాజాగా ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలని భావించింది. దీంతో ఫిబ్రవరి 1వ తేదీ నుండి కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు. ఎన్‌ఐసి 2.1 వెర్షన్‌ను అమలు చేస్తుండటంతో ఈ-పాస్ యంత్రాలు డీలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. డీలర్ గుర్తింపుకోసం బయోమెట్రిక్ తీసిన వెంటనే వినియోగదారుని కార్డు నెంబర్ చూపించారు. అనంతరం తదితర సరుకుల పంపిణీ వరకు సాఫీగా సాగుతున్నా అక్కడే అసలు చిక్కు వచ్చిపడుతోంది. సరుకులు విడుదలకాకపోగా, ఈ-పాస్ యంత్రాన్ని ప్రతీ కార్డుకు స్విచాఫ్ చేసి ఆన్ చేయాల్సి వస్తోంది. ఇలా సరుకుల పంపిణీకి తీవ్ర విఘాతం కలగడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా డీలర్లు తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని తమ సమస్యలను అధికారులకు వివరించారు. సాంకేతికపరమైన సమస్యలు ఎదురవ్వడంతో అవి ఎప్పటికి పరిష్కారమవుతాయో ఇటు అధికారులకు, అటు డీలర్లకు అర్థం కావడం లేదు. ఎన్‌ఐసి నుంచి నిపుణులు రావాల్సి ఉంది. ఈ-పాస్ కారణంగా సరుకుల పంపిణీలో పారదర్శకత ఏర్పడుతుందని, అర్హులకే సరుకులు అందుతాయని ప్రభుత్వం చెబుతుండగా, ఈ విధానం అమలులో ఇబ్బందులు నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించడం లేదని అధికారులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. గత నెలలో చంద్రన్న సంక్రాంతి సరుకులు తీసుకునేందుకు ఇబ్బందిపడిన వినియోగదారులు చివరకు ప్రభుత్వం దిగివచ్చి నేరుగా సరఫరాకు ఆదేశాలిచ్చింది. డిస్‌ప్లేలు చూపించకపోవడం వల్ల సరుకుల పంపిణీ నత్తలా సాగుతోంది. ఇక ఈ-పాస్‌లో స్టాక్ వివరాలు ఫీడ్ చేసినప్పటికీ నో స్టాక్ అని సమాచారమిస్తోంది. కొన్ని పరికరాలకైతే సున్నా చూపెడుతోంది. సిగ్నల్ లేకపోవడం కూడా ఒక కారణంగా డీలర్లు పేర్కొంటున్నారు. డీలర్ల వేలిముద్రలు కూడా పడకపోవడంతో చాలా ఇబ్బందులుపడుతున్నారు. కొన్ని దుకాణాలకు మ్యాపింగ్ కూడా చూపించకపోవడంతో అటు డీలర్లు ఇబ్బందిపడుతున్నారు. మొత్తం మీద కొత్త విధానం అధికార యంత్రాంగాన్ని, డీలర్లను, లబ్ధిదారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఇసుక రీచ్‌ల ఇ-వేలానికి 12 లోపు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చే యాలి
-కలెక్టర్ భాస్కర్
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 5 : జిల్లాలోని ఆరు రీచ్‌లకు ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న ఇ-వేలంలో పాల్గొనే వారు 8వ తేదీ లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం ఇసుక ఇ-వేలం ప్రక్రియలో పాల్గొనే వారికి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రామయ్యపేట, పందలపర్రు, పెండ్యాల కానూరు, తీపర్రు, సిద్ధాంతం, కరుగోరుమిల్లి రీచ్‌లకు ఈ నెల 12న ఇ-టెండర్ కం ఇ- ఆక్షన్ ప్రక్రి వుంటుందన్నారు. దీనిలో పాల్గొనేందుకు ఆసక్తి వున్న వారు ఈ నెల 8వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ పొందాలన్నారు. టెక్నికల్‌గా టెండరు డాక్యుమెంటు వేసి రిజిష్టర్ అయిన వారు మాత్రమే ఇ-టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. మ్యాన్యువల్‌గా టెండర్లు దాఖలు చేయదలచుకున్న వారు 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా గనుల శాఖ ఎడి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో వాటిని వేయవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా టెండర్, ఇ- ఆక్షన్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నర్సాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, మైన్స్ ఎడి సి మోహనరావు, కొవ్వూరు ఆర్‌డివో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, టిడిపి హయాంలో కాపుల పట్ల నిర్లక్ష్యం
పాలకొల్లు, ఫిబ్రవరి 5 : కాపులను బిసిలో చేరుస్తూ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో జిఒ 30ని విడుదల చేశారని, అప్పుటి నుండి కాపులు బిసీలుగా పరిగణించారని, అటు తరువాత వచ్చిన టిడిపి, కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోలేదని మాజీ మంత్రి చేగొండి వెంకట హరరామజోగయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో జోగయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక ఆరు మాసాల్లోనే కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తానని, ప్రతి సంవత్సరం కాపుల సంక్షేమానికి రూ. వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పారని, రెండేళ్లు కావస్తున్నా అమలు చేయలేదని చెప్పారు. ఏ కమిషన్ అయినా ప్రభుత్వం కోరినట్లు ఇస్తుందని, ఈ రిపోర్టు వ్యతిరేకంగా ఉన్నా ప్రభుత్వం తనకు తోచిన విధంగా రిజర్వేషను కల్పించే అధికారం కలిగి ఉంటారని ఆయన చెప్పారు. తునిలో జరిగిన హింసాత్మక ఘటనలకు కాపులకు సంబంధం లేదని, హింసాత్మక పనులు ఎవరు చేసినా శిక్షించాలని కోరుతున్నానని ఆయన అన్నారు. చంద్రబాబు బేషజాలకు పోకుండా వెంటనే స్పందించి కాపులు పోరాటానికి ముగింపు పలకాలని ఆయన కోరారు. కాపుల కోసం పోరాడే వంగవీటి రంగాను కోల్పోయామని, ఇప్పుడు ముద్రగడ దంపతులను కోల్పవడానికి కాపులు సిద్ధంగా లేరన్నారు. కాపులకు 15 శాతం తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు.
--యూనిట్లకు అనుగుణంగా--
లబ్ధిదారులకు రుణాలు
అధికారులను కోరిన కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 5 : జిల్లాలో వివిధ యూనిట్లు నెలకొల్పేందుకు యూనిట్లకు అనుగుణంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు అధికారులను కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందిన దరఖాస్తుల ఆధారంగా లక్ష్యాలు నిర్ధేశించుకుని రుణాలు మంజూరు చేయాలన్నారు. దరఖాస్తులను బ్యాంకు అధికారులు పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు వారు నెలకొల్పే యూనిట్ల ఆధారంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. యూనిట్ నెలకొల్పేందుకు లబ్ధిదారులు రూ. 80 వేలు రుణం కోరినప్పుడు బ్యాంకర్లు రూ. 50 వేలు మాత్రమే రుణం మంజూరు చేస్తే ఉపయోగం వుండదని పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం వలన లబ్ధిదారుడు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి నష్టపోయే ప్రమాదం వుంటుందని చెప్పారు. అంతేకాకుండా బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాలను కూడా చెల్లించలేక అప్పులపాలై యూనిట్లు మూసివేసే ప్రమాదం వుంటుందని పేర్కొన్నారు. నైపుణ్యంతో కూడిన యూనిట్లకు బ్యాంకర్లు అధిక ప్రాధాన్యతను ఇచ్చి రుణాలు మంజూరు చేయాలన్నారు. మధ్య, పేద వర్గాలకు చెందిన ప్రజలే ఎక్కువగా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అటువంటి వారికి బ్యాంకర్లు చేయూతను అందించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎజి ఎం సుబ్బారావు, ఎల్‌డి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, బిసి కార్పొరేషన్ ఇడి పెంటోజీరావు తదితరులు పాల్గొన్నారు.
బిసిలకు నష్టం కలిగిస్తే సహించం
*బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా
ఏలూరు, ఫిబ్రవరి 5 : బిసిలకు నష్టం జరిగే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ హెచ్చరించారు. స్థానికంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో రిజర్వేషన్లకు సంబంధించి గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో వున్న కాపు రిజర్వేషన్ల విషయంలో టిడిపి ప్రభుత్వం తొందరపాటు తనంగా వ్యవహరించడం వలన తుని సంఘటన చోటు చేసుకుందన్నారు. దీనికి ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ విభాగాల వైఫల్యమే కారణమన్నారు. బిసిల రిజర్వేషన్లకు భంగం కలగకుండానే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నివేదికను చిత్తశుద్ధితో స్వీకరించాలన్నారు. కాపులను బిసిల్లో చేరుస్తామని ప్రభుత్వమే చెబుతోందని, అయితే దీనివలన బిసిలకు నష్టం జరిగితేమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో బిజెపి నగర అధ్యక్షులు నాగం శివ తదితరులు పాల్గొన్నారు.
తుని విధ్వంసంపై దర్యాప్తునకు హైకోర్టులో పిల్
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 5: తుని విధ్వంసంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేస్తానని పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావు ప్రకటించారు. తుని విధ్వంసంపై రాష్ట్ర పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని, అందువల్లే సిబిఐ దర్యాప్తు కోరుతున్నట్టు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన స్పష్టం చేసారు. కాపు ఐక్య గర్జన సభ జరుగుతుండగా తునిలో రైలు, పోలీసు స్టేషన్లు దగ్ధం చేయడం ఖండించాల్సిందేనన్నారు. ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఎన్నో హామీలు ఇచ్చి, అధికారం చేజిక్కించుకున్నాక వాటిని నెరవేర్చలేక రోజుకో అబద్ధం ఆడుతూ రాష్ట్రంలో అత్యధిక అబద్ధాలు ఆడే సిఎంగా పేరు సంపాదించారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చురేపుతున్నారన్నారు. రైతులు, మహిళలు చంద్రబాబు వద్దకు వచ్చి రుణమాఫీ చేయమని కోరారా?, కాపులు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారా? అని ప్రశ్నించారు. నేడు రాష్టమ్రంతా చంద్రబాబుపై అసహనంతో ఉందని, అందుకే కాపు ఐక్య గర్జనకు భారీగా జనం వచ్చారన్నారు. . కాపులను బీసీల్లో చేర్చితే చంద్రబాబుకు నష్టం ఏమిటో తెలియడం లేదని, పైగా బీసీలను రెచ్చగొట్టి బీసీ నాయకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అస్థిరపరచి మరల అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. కాపు ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, తుని విధ్వంసంలో ప్రభుత్వ హస్తం ఉందని ముద్రగడే కాదు కాపులంతా భావిస్తున్నారని, అందుకే పిసిసి అధికార ప్రతినిధి హోదాలో తానే తుని విధ్వంసంపై సిబిఐ దర్యాప్తు కోరుతో హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో పిసిసి కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, పిసిసి సంయుక్త కార్యదర్శి మద్దాల ప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు ఉక్కుర్తి దుర్గారావు, ఆది వీరవెంకటరావు, బుద్దాల తాతారావు, గౌతు రాము తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు బ్యాగ్ లిఫ్టింగ్ దొంగలు అరెస్టు
70 గ్రాముల బంగారం స్వాధీనం: డిఎస్పీ వెంకటరావు
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 5: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణీకులనే లక్ష్యంగా చేసుకుని బ్యాగ్‌లు చోరీ చేయడం, బ్యాగ్‌లను కోసివేసి నగలు, నగదు చోరీ చేసే ఇద్దరు దొంగలను శుక్రవారం అరెస్టుచేసినట్టు స్థానిక డిఎస్పీ జె వెంకటరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం బుట్టాయగూడెంలో నివసిస్తున్న ఏలూరు మండలం పాలగూడెంకు చెందిన పొట్రు దానయ్య, వేలేరుపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఇంగోలి రమేష్‌లను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక బైపాస్ రోడ్డులో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద సిఐ జి శ్రీనివాస్, ఎస్సై ఎ ఆనందరెడ్డి, క్రైం పార్టీ సిబ్బంది సంయుక్తంగా నిఘావేసి అరెస్టుచేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుండి రూ.1.4 లక్షలు విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీరి కదలికలపై సస్పెక్ట్ షీట్ తెరచి నిఘా ఉంచనున్నట్టు తెలిపారు. వీరిద్దరూ బావ బావమరుదులని, వీరు ప్రయాణీకులను లక్ష్యంగా పెట్టుకుని నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. వీరిలో దానయ్య పాత నేరస్థుడని, కొవ్వూరు పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు ఉందని, కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయిందని చెప్పారు. వీరిద్దరు కలసి జీలుగుమిల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జంగారెడ్డిగూడెం మండల విఆర్వో మక్భుల్ భార్య అక్తరున్నీసా నగలు చోరీ చేసారని తెలిపారు. బుట్టాయగూడెం పోలీసు స్టేషను పరిధిలో కారెం చిట్టెమ్మ నగలు చోరీ చేశారని తెలిపారు. జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో పాతూరి హనుమంతరావు నగలు చోరీ చేసినట్టు తెలిపారు. ఈ మూడు కేసుల్లోను వీరి వద్ద ఒక నల్లపూసల గొలుసు, ఒక నక్లెస్, రెండు చైన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీరిని అరెస్టు చేసేందుకు కృషిచేసిన క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్స్ ఎన్‌వి సంపత్‌కుమార్, జి దిలీప్‌కుమార్, ఎన్ రాజేంద్రప్రసాద్, కానిస్టేబుల్ కె కిరణ్‌లను అభినందించి, రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు. సమావేశంలో సిఐ జి శ్రీనివాస్, ఎస్సై ఆనందరెడ్డి, బుట్టాయగూడెం ఎస్సై పాల్గొన్నారు.

‘పట్టిసీమ’కు చెల్లించినట్టే పరిహారం ఇవ్వాలి
రైతుల డిమాండ్
ఏలూరు, ఫిబ్రవరి 5 : పట్టిసీమ తరహాలో తమకు 30 లక్షలు ఎకరా ఒక్కింటికి చెల్లించాలని, లేనిపక్షంలో భూములు సేకరించేందుకు వీలు లేదని రైతులు హెచ్చరించారు. పోలవరం ముంపునకు గురయ్యే వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని నిర్వాసితులుగా మారే రైతాంగంతో శుక్రవారం సబ్ కలెక్టర్ షాన్ మోహన్ సమీక్ష నిర్వహించారు. మండలంలోని శివకాశీపురం, ఆశ్రం పాఠశాల ఆవరణలో రైతులతో జరిగిన ఈ సమీక్షలో సుమారు ఎనిమిది లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చిందని సబ్ కలెక్టర్ పేర్కొనగా రైతాంగం దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. పట్టిసీమ ప్రాంతంలో ఎకరం భూమిలో అయిదు క్వింటాళ్ల పత్తి పండటం గగనమవుతుందని, సారవంతమైన తమ భూముల్లో అదే ఎకరంలో 15 నుంచి 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని, ఇంత సారవంతమైన భూములను సర్వం కోల్పోయే తమకు ఆ స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండా ఏవో సాకులు చెప్పడంతో అర్ధమేలేదని సబ్ కలెక్టర్‌పై రైతాంగం ధ్వజమెత్తారు. రైతులనుంచి వచ్చిన ప్రతీ విన్నపాన్ని తాము నమోదు చేసుకుని జిల్లా కలెక్టర్ ముందు ఉంచి ఆ విధమైన న్యాయం జరిగేందుకు కృషి చేయగలనని కలెక్టర్ తెలిపారు. దీంతో రైతులు ప్రతీ కుటుంబానికి పది సెంట్లు స్థలంలో నాలుగు గదులు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువతీయువకులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలని, వితంతువులకు, వికలాంగులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పునరావాసం కల్పించాలన్నారు. కొత్త చట్టం ప్రకారం గతంలో భూములు సేకరించిన వారికి సైతం లక్షా 15 వేలు మినహాయించి మిగిలిన నష్టపరిహారం చెల్లించాలని తదితర అంశాలతో కూడిన వినతులను సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌కు అందజేశారు. సమావేశంలో ఇరు మండలాల తహశీల్దార్లు, రెండు మండలాలకు చెందిన నిర్వాసిత రైతులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

మళ్లీ చిరుత సంచారం
జీలుగుమిల్లి, ఫిబ్రవరి 5: గత నెల 26, 27 తేదీలలో మండలంలోని బర్రింగకలపాడు పంట పొలాలు, అడవిలో సంచరించిన చిరుతపులి గత రెండు రోజులుగా పి అంకంపాలెం సమీప పొలాలు, అడవిలో సంచరిస్తున్నట్టు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి పొలంలో కట్టివేసిన పశువుల మందపై చిరుత దాడి చేసిందని, దాంతో ఒక దూడ కట్లు తెంచుకుని రైతు ఇంటికి చేరుకుందని, దూడకు గాయం కావడంతో పశువుల మంద వద్దకు వెళ్ళి పరిశీలించగా, ఒకటి రెండు గేదెలకు చిరుత గాయపరచిన ఆనవాళ్ళు కనిపించాయని గ్రామస్థులు చెప్పారు. దీనితో పరిసర పొలాల్లో పరిశీలించగా చిరుతపులి అడుగు జాడలు కనిపించాయని చెబుతున్నారు. దీనిపై అటవీ అధికారులకు సమాచారం అందించారు.
కడప, పాకిస్తాన్ చేయాలని చూశారు
*రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి
ఏలూరు, ఫిబ్రవరి 5 : సస్యశ్యామలానికి ప్రశాంతమైన ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయ చిచ్చు పెట్టి మరో కడప, మరో పాకిస్తాన్‌లాగా చేయాలని సంఘ విద్రోహ శక్తులు తునిలో వ్యవహరించారని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. శుక్రవారం ఏలూరు మండలం వెంకటాపురం పంచాయితీ ఎన్‌టి ఆర్ కాలనీలో పర్యటించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ అల్లర్లు చేయడానికి దుష్ట పన్నాగాలు పన్నారని, తుని సంఘటనను తమ పార్టీ పూర్తిగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఆస్తులకు నష్టం చేయడం వలన ప్రజలపైనే అదనపు భారం పడుతుంది కదా అని అన్నారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం ఒక ప్రక్కన సన్నాహాలు చేస్తుండగా రాజకీయ లబ్ధి పొందాలని సంఘ విద్రోహులు దుత్సంఘటనలకు పాల్పడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు చట్ట బద్ధత కల్పించాలనే ఉద్దేశ్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వుందని, అదే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ ఒక్కరూ కూడా ఆందోళనలను తమ గళాన్ని తెలియజేయవచ్చునని, అయితే అదే క్రమంలో ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం, కష్టం కలగకుండా తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా వుందని తునిలో అలా జరగలేదని పేర్కొన్నారు. ఆమె వెంట ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎంపిపి రెడ్డి అనురాధ, జడ్పీటిసి మట్టా రాజేశ్వరి, వెంకటాపురం సర్పంచ్ చెరుకూరి దీప్తి ఉష, ఎంపిటిసిల ఛాంబర్ అధ్యక్షులు పైడి వెంకట్రావు, టిడిపి నాయకులు పాలి ప్రసాద్, గ్రామ కార్యదర్శి కె నాగేంద్ర వున్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం ఆందోళన
ఏలూరు, ఫిబ్రవరి 5 : కాపులను బిసిలుగా గుర్తించాలని కోరుతూ కాపు సంఘ నాయకులు ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా శుక్రవారం ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దెందులూరు, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన కాపు నాడు నాయకులు, కార్యక్తులు వినూత్న బిక్షాటన చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు జల్లా హరికృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాపు రిజర్వేషన్లను పునరుద్ధరించాలని కోరారు. ముద్రగడ నిరాహారదీక్షకు మద్దతును ప్రకటించారు. భోజనం చేసే ప్లేట్లపై స్ఫూన్లతో వాయిస్తూ వినూత్న నిరసన తెలిపారు. కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొవ్వూరులో రెండు చెక్‌పోస్టులు
కొవ్వూరు, ఫిబ్రవరి 5: కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన స్వగృహంలో సతీసమేతంగా చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా కొవ్వూరు నుండి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి వెళ్లేందుకు వీల్లేకుండా పోలీసులు రెండు చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. స్థానిక రోడ్డు కం రైలు వంతెన వద్ద, గామన్ ఇండియా రోడ్డు వంతెన వద్ద శుక్రవారం పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటుచేసి పహారా కాస్తున్నారు. రోడ్డుకం రైలు వంతెన వద్ద రూరల్ ఎస్సై ఎం సోమసుందరావు, దేవరపల్లి ఎస్సై ఆంజనేయులు, హెచ్‌సి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు పహారా ఏర్పాటుచేశారు. గామన్ ఇండియా రోడ్డు వంతెన వద్ద పట్టణ ఎస్సై డి గంగాభవాని ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. రెండు వంతెనల వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చెక్ పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. ముద్రగడకు మద్దతుగా కొవ్వూరు నుండి ఎవరైనా వెళుతుంటే వారికి నచ్చజెప్పి వెనుకకు పంపుతామని చెప్పారు. ఈ సందర్భంగా కొవ్వూరు డిఎస్పీ ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొవ్వూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో కొవ్వూరులో రెండు, విజ్జేశ్వరంలో ఒకటి, తణుకులో ఒక చెక్ పోస్టు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. జిల్లా అంతటా సెక్షన్ 30 అమలులో ఉందని, అనుమతులు లేకుండా సమావేశాలు, సభలు నిర్వహించరాదని డిఎస్పీ చెప్పారు.