మెయిన్ ఫీచర్

దుస్తులు చెప్పే దారుణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది బెంగళూరులోని ఓ చిన్న గది. ఆ గదిలోనికి వెళితే వందల్లో దుస్తులు కనిపిస్తాయి. యువతులు, మహిళలు, పిల్లలు ధరించిన దుస్తులే. ఒక్కొక్క డ్రెస్స్ వెనుక ఒక్కొక్క కథ దాగివుంది. ఈ దుస్తులను సేకరిస్తుంది బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త జాస్మిన్ పతేజా. దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులకు వస్త్ధ్రారణే కారణం అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అత్యాచారానికి గురికావటానికి, వారు ధరించిన దుస్తులతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించేందుకు నడుం బిగించారు జాస్మిన్ పతేజా. ఈ నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు ఆమె ఓ మ్యూజియం ఏర్పాటుచేసి అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైన బాధితుల దుస్తులను సేకరించి అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటుచేస్తోంది. జాస్మిన్ పతేజా చేస్తున్న సామాజిక సేవకు పలువురి నుంచి మంచి స్పందన సైతం లభిస్తోంది. ఈ దుస్తులను చూస్తుంటే జరిగిన దారుణానికి, దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని ఆ మ్యూజియంను సందర్శించినవారికి అవగతమవుతోంది.
ఎరుపు,బ్లాక్ రంగుల్లో ఉన్న జంప్‌సూట్ దుస్తులు ఓ యువతివి. ఆమె నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని వస్తుండగా లైంగిక వేధింపులకు గురైంది. ఆరోజు అందరు ఆడపిల్లల వలే సింపుల్‌గా ఉండే దుస్తులే ధరించింది. క్రీమ్ కలర్ కుర్తా, ఎరుపు, నలుపు ప్రింట్స్ ఉన్న దుస్తులు వేసుకుంది. సంప్రదాయ దుస్తులు వేసుకున్నా ఆ ముష్కరులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలైన ఆ యువతి ఓ రోజు కొయంబత్తూర్‌కి రైలులో వెళుతుండగా.. ఆ ప్రయాణంలో ఓ మహిళ పరిచయం అయింది. ఆ కొద్ది గంటల వ్యవధి పరిచయంతోనే వారు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆమె ఆ యువతికి ఈ డ్రెస్స్‌ను ప్రెజెంట్ చేసింది. అలాంటి డ్రెస్స్‌లో నూతన సంవత్సర వేడుకలకు వెళ్లి వస్తూ లైంగిక వేధింపులకు గురైంది. మరొక పింక్ డ్రెస్స్ చూపిస్తూ.. ఈ దుస్తులు వేసుకున్న బాధితురాలు ఈ డ్రెస్స్‌ను తనకు అందజేస్తూ.. ‘‘ఈ డ్రెస్స్‌ను తీసుకుపోండి. వీటిని చూస్తుంటే విపరీతమైన బాధకు గురవుతున్నాను. ఒక్కొక్కసారి అనారోగ్యానికి సైతం గురవుతున్నానని’’ ఆవేదన వెళ్లబుచ్చింది. అలాగే వైట్ డ్రెస్స్, స్విమ్‌సూట్, తొమ్మిదేళ్ల చిన్నారి గౌను, స్కూలు యూనిఫాం కూడా ఉన్నాయి. వీటి వెనుక దాగి ఉన్న దారుణ సంఘటనలు వింటుంటే.. అసలు దుస్తులకు, ఈ దారుణానికి ఎలాంటి సంబంధం లేదని చూసేవారికి అర్థమవుతోంది.
పదిహేనళ్ల నుంచి పోరాటం..
అత్యాచారాలు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఆమె పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ‘ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్’ అనే ప్రాజెక్టు పేరుతో తన ఇంట్లోనే మ్యూజియం ఏర్పాటు చేసి బాధితుల నుంచి దుస్తులు సేకరించటం ప్రారంభించింది. ఆ దుస్తులు వెనుక జరిగిన సంఘటన వివరాలు, వేసుకున్న దుస్తులు, ఎక్కడ? ఎలా జరిగిందో తదితర వివరాలను ఆ దుస్తులు వెనుక రాసి పెడుతుంది. ఓ రోజు ఓ గదిలో అమ్మాయిలు సమావేశమయ్యారు. ఆ గదిలోనికి వెళ్లి మీరు లైంగిక వేధింపులకు గురైతే.. వాటి వివరాలను పేపర్ మీద రాయమని అడిగాను. వారు రాసిన వివరాలు చూస్తే.. అందులో ప్రతిఒక్కరూ బాధితులే. అశ్లీలంగా మాట్లాడటం, తాకడం, నిరసన ధ్వనులు చేయడం, అసభ్య చర్యలకు పాల్పడటం చేశారని ప్రతిఒక్కరూ రాయటం ఆశ్చర్యం కలిగించింది. బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి వేధింపులు సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి వికృత చర్యలకు, దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడైంది. రాత్రికి ఇంటికి ఆలస్యంగా రావడం, ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించటం, తాగి ఉండటం వంటి కారణాలు కనిపించలేదు. వితంతువులు ఎరుపు రంగు దుస్తులు ధరించినా వేధింపులకు గురైన సందర్భాలు ఉన్నాయని జాస్మిన్ వెల్లడించింది. పద్నాలుగేళ్ల ఆడపిల్లల నుంచి 30-40 సంవత్సరాల నడివయస్సు స్ర్తిలు, వృద్ధ మహిళలు సైతం ఈబాధితుల్లో ఉన్నారు. కోల్‌కతా నుంచి బెంగుళూరుకు వచ్చిన జాస్మిన్ ఇలాంటి బాధిత మహిళలు, యువతులు, పిల్లలు దుస్తులు సేకరించి సంఘటన వివరాలు రాసి ఈ మ్యూజియం సందర్శించిన వారిలో అవగాహన కల్పిస్తోంది.