మెయిన్ ఫీచర్

పోరాటానికి ప్రతీక సత్యభామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరక్షరాస్యత..
దేవదాసీ వ్యవస్థ..
వివక్ష..
గృహహింస..
మద్యపానం..
ఇవన్నీ తరతరాలుగా మహిళలని పట్టిపీడిస్తున్న సమస్యలు.. ఇవన్నీ ఒక్కరోజులో తీరిపోయే సమస్యలు కాదు. కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం సత్యభామ నిరంతరంగా శ్రమిస్తూనే ఉంది. ఆమె ఓ సామాజికవేత్త. ఆమె పూర్తి పేరు సత్యభామ సౌందర్మల్.. మహారాష్టల్రోని బీడ్ జిల్లాలో.. మద్యనిషేధం, మహిళా హక్కులు, దళితులు, పీడిత వర్గాల కోసం ఆమె పోరాడుతూనే ఉంది. ఈ పోరాటం ఎలా మొదలైంది అని పరిశీలిస్తే..

సత్యభామ బీడ్ జిల్లాలోని మాజల్గూన్‌లో జన్మించింది. ఉపాధి కోసం ఆమె తండ్రి ముంబై వెళ్లి.. అక్కడ రెండో పెళ్లి చేసుకున్నాడు. సత్యభామ తల్లి, అవ్వ ఇద్దరూ వారి స్వగ్రామంలోనే ఉంటూ అయిదుగురు పిల్లలను చదివించారు. నిరక్షరాస్యత వల్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో సత్యభామ అవ్వకు బాగా తెలియడం వల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలందరూ చదువుకోవాలన్నది ఆమె సంకల్పం.. దానితోనే అందర్నీ చదివించారు. అలా సత్యభామ పదోతరగతి పాసైన తర్వాత.. ఆమె, ఆమె అక్క దొంగతనం చేశారంటూ కొందరు వారిపై కేసుపెట్టారు. కొన్నాళ్లు సత్యభామ, ఆమె అక్క జైల్లో ఉన్నారు. అప్పుడు లాయర్ ఏకనాథ్ వీరిని జైలు నుంచి విడిపించాడు. లాయర్ ఏక్‌నాథ్‌కు ఓ సంస్థ ఉంది. ఆ సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా మానవ హక్కులపై పోరాడుతోంది. మహారాష్టల్రోని దళితులు, పోత్రాజ్ వర్గీయుల సంక్షేమం కోసం, దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ సంస్థ పోరాడుతోంది. ఆ సంస్థ ప్రతినిధి అయిన ఏక్‌నాథ్ సత్యభామకు అంబేడ్కర్ రచనలను పరిచయం చేశాడు. అదే సత్యభామ జీవితాన్ని మలుపు తిప్పింది. మొదట్లో సత్యభామ అంబేడ్కర్ గురించి చదివినా.. విద్య, సంఘటితం, పోరాటం అన్న ఆయన సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారు కానీ.. మహిళా హక్కులను, హిందూ కోడ్ బిల్లులో పాస్ చేయడాన్ని వ్యతిరేకించిన సందర్భంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం వంటివి సత్యభామకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిచేలా చేశాయి. ఏక్‌నాథ్‌గారి ప్రభావం కూడా సత్యభామపై చాలా ఉంది. డిగ్రీ పూర్తిచేశాక సత్యభామ పెళ్లి చేసుకుంది. తర్వాత మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్‌లో పీజీ పూర్తిచేసింది. ఎమ్మెస్‌డబ్ల్యూ చదువుతున్నప్పుడే ఆమె ప్రజలతో కలిసిపోయింది. అలా ఆమె సమాజసేవకు ఆకర్షితురాలైంది.
గృహహింస బాధితులతో పనిచేస్తున్నప్పుడు సమస్యకు అసలు కారణం ఎక్కడుందో తెలుసుకుంటుంది సత్యభామ. ‘ఏదైనా సమస్యను నిర్మూలించాలనుకున్నప్పుడు.. దాన్ని వేళ్లతో సహా పెకిలించాలి’ అన్న అంబేడ్కర్ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని పనిచేయడం మొదలుపెడుతుంది సత్యభామ. చాలా గృహహింస కేసుల్లో మద్యం తాగడమే ప్రధాన కారణమని తెలుసుకుని మద్యనిషేధంపై పోరాటాన్ని మొదలుపెట్టింది సత్యభామ. ఇందుకోసం ఆమె మహారాష్ట్ర మద్యనిషేధ చట్టం-1949ని అధ్యయనం చేసింది. మద్యపాన సమస్యలపై ప్రజలను చైతన్యపరిచేందుకు చాలా ప్రయత్నం చేసింది సత్యభామ. ఈ ప్రయత్నంలో భాగంగా వారికి అంబేడ్కర్ ప్రతిజ్ఞలను గుర్తుచేసేది. అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన సమయంలో.. 22 ప్రతిజ్ఞలను చేయాలని తన అనుచరులకు సూచించారు. అందులో ‘నేనెప్పుడూ మద్యం, మత్తు పదార్థాలను సేవించను’ అన్నది 17వ ప్రతిజ్ఞ.
మద్యపాన నిషేధం కోసం చేసిన పోరాటంలో సత్యభామకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అవార్డులతో పాటుగా ఆమె ఎన్నో ఇబ్బందులనూ ఎదుర్కొంది. ఆమె పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న మగవాళ్లు.. కొంతమంది మహిళలను సత్యభామపై దాడికి ఉసిగొల్పారు. అలా 2017 మార్చి నెలలో ఆమెపై దాడిచేసి, ఆమె బట్టలను చించేశారు. ఈ ఘటన తర్వాత ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయకపోగా రెట్టింపు శక్తితో, ఉత్సాహంతో పోరాటం చేయడం మొదలుపెట్టింది. ఈ సందర్భం గురించి ఎవరైనా అడిగితే.. ‘నేను అంబేడ్కరిస్టును.. నన్ను ఎవరూ ఓడించలేరు.. నన్ను రేప్ చేసినా, చివరికి చంపేసినా.. నా పోరాటం ఆగదు.. గతంలో కూడా చాలామంది పోట్లాడారు.. పోరాడారు.. చివరకి ఓడిపోయారు’ అంటుంది సత్యభామ. ‘సమాజంలో దోపిడీకి గురవుతున్నవారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే నా ప్రధాన లక్ష్యం. జీవితంలో చదువు ఆవశ్యకత గురించి ఆయనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందేశం నన్ను బాల్యంలోనే ఆకర్షించింది. నా ఆలోచనలపై చెరగని ముద్ర వేసింది. మొదట్లో.. కేవలం దళితుల నేతగానే అంబేడ్కర్‌ను అర్థం చేసుకున్నాను. కానీ ఆయన గురించి చదివాక, ఆయనెంత గొప్ప నాయకుడో అర్థమైంది’ అంటుంది సత్యభామ. అలా బీడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మద్యనిషేధం అమలు చేయడంలో సత్యభామ సఫలమయ్యింది. కేవలం మద్యపాన నిషేధమే కాక ఫ్యామిలీ కౌనె్సలింగ్, అనాథ శరణాలయం, శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది సత్యభామ. ఆమె భర్త కూడా సత్యభామ ‘దామిని మద్యనిషేధ కార్యక్రమం’లో కార్యకర్తలా పనిచేస్తాడు. అలా సత్యభామ అంబేడ్కర్ కలలుకన్న భారతదేశాన్ని ఆవిష్కరించాలని నడుం కట్టింది. ఆమె కృషికి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే..

-మహి