మెయిన్ ఫీచర్

స్వయం నియంత్రణతో వ్యక్తిత్వ వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రాఫిక్ ఎక్కువగా లేని తారురోడ్డుమీద కారును స్పీడ్‌గా వాయువేగంతో నడిపించటం డ్రైవర్‌కు చాలా తేలికైన పని.. కానీ జనసమ్మర్థంతో కిటకిటలాడుతున్న రోడ్డుమీద అటూ ఇటూ, ముందూ వెనకా గమనిస్తూ అతి జాగ్రత్తగా నెమ్మదిగా కారు నడపటం చాలా కష్టమైన పని. ఏదైనా అంతే! ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వ్రాయడం, అలవికాని చోట తన ఆధిక్యతను చూపటం వంటివి తేలిక. ఆచి తూచి మాట్లాడటం ఎంత అవసరమో అంతే వ్రాయడం, ఎదుటివాళ్ళ స్థాయిని బట్టి తన పాండిత్య ప్రయోగాన్ని ఎక్కువ తక్కువలు చేసుకోవటం వంటివి కొంచెం శ్రమతో, సాధనతో, సమయస్ఫూర్తితో మాత్రమే సాధ్యమయ్యే పనులు. దీనికి కావలసింది స్వయం నియంత్రణ.
ఎవరో వచ్చి మన చెయ్యి పట్టుకుని నడిపించడం, మంచి చెడులు.. ఎక్కువ తక్కువల గురించి చెప్పడం.. మన అతి వేగాన్ని తగ్గించడం అనేది ఎవరికైనా కొంత వయసు వరకే విద్యార్థి దశలోనే సాధ్యం అవుతుంది. ఆ తరువాత ఆ శిక్షణను ఆధారంగా చేసుకొని ఎవరికివారే స్వయం నియంత్రణను నేర్చుకుని అలవాటు చేసుకోవాలి. తనకు తానే శిక్షకుడిగా గురువుగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా మారి తన జీవన శైలిని తీర్చిదిద్దుకుంటూ వ్యక్తిత్వ వికాసం వైపు క్రమక్రమంగా అడుగులు వేయాలి. స్వయం నియంత్రణ అనేది ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉండటం జరుగుతుంది.
కొంతమంది మాట్లాడుతుంటే వినబుద్ధవుతుంది. ఎందుకంటే ఆ మాటల్లో అనవసర ప్రసంగాలు, అధిక వ్యాఖ్యలు, హితబోధలు, అసంబంధిత విషయాలు అస్సలు ఉండవు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు.. ఏం చెప్పదలచుకున్నారో అదే చెబుతారు. సూక్తులు, సుభాషితాలు, సందేశాలు వంటివి అందులో ఏం ఉన్నా అవన్నీ అన్యాపదేశంగానే గానీ నీతి పాఠాలు చెబుతున్నట్టుగా కాదు. మరికొంతమంది దీనికి భిన్నంగా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్లి గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక పద్ధతి, నియమం లేకుండా ఏదేదో మాట్లాడుతుంటారు. ఈ ఫార్స్ చూడాలంటే సభలే సరియైన స్థలాలు. మైకాసురులు అని కొంతమంది ఉంటారు.. వీళ్ళకు మైకు దొరకడం ఆలస్యం.. ఒక అర్థం పర్థం, సమయం, సందర్భం వంటివేవీ పట్టించుకోకుండా గంటల తరబడి అలా మాట్లాడుతూనే ఉంటారు. ఆ రోజు మాట్లాడాల్సిన అంశాన్ని పక్కకు పెట్టి, లేకుంటే టోటల్‌గా మర్చేపోయి.. సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయి అనవసరమైన సొల్లు వాగుడంతా వాగుతూ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతూ ఉంటారు. సదరు వ్యక్తి మాట్లాడటం అయిపోయాక ‘ఇందులో వినదగిన అంశాలు, నేర్చుకోవలసిన విషయాలు, మనసులోనే అండర్‌లైన్ చేసుకుని భద్రంగా దాచుకోదగ్గ జ్ఞానగుళికలల్లాంటి మాటలు ఏమైనా ఉన్నాయా అంటే జవాబు ‘లేవు’ అనే వస్తుంది. పైగా వీరావేశంతో ఏం మాట్లాడుతోందీ, వొంటిమీద తనకే స్పృహ లేని స్థితిలో ఆత్మప్రశంస, పరనింద చేసి ఎదుటివాళ్ళను కించపరచడం కూడా జరుగుతుంటుంది. స్వయం నియంత్రణ లేకపోవటం అంటే ఇదే.. దాని ఫలితాలూ ఇలాగే తీవ్రంగా వుంటాయి. అందుకే అన్నారు పెద్దలు - ‘కాలు జారినా వెనక్కు తీసుకోవచ్చుగానీ- మాట జారితే తీసుకోలేం’ అని! ఒకసారి ఒకరి నోట్లోనుంచి వచ్చిన మాట ఎదుటివాళ్ళ మనసులమీద అంతగా ప్రభావం చూపిస్తుంది.
కొంతమంది రచయితల రచనలు చదువుతుంటే ఆ శైలి, ఆ కథాకథన చాతుర్యం, ఆ పద ప్రయోగం అద్భుతం అనిపిస్తుంది. ఆ చదివించే గుణం చదువరులను కట్టిపడేస్తుంది. రచనా విధానంలో పేజీలకు పేజీలు అనవసరంగా వ్రాయడంకన్నా.. ఒక్క పదం కూడా వృధాగా వాడకుండా అల్పాక్షరాలలో అనల్పార్థం అన్నట్లుగా పొదుపుగా మాటలు వాడుతూ తక్కువగా వ్రాయటం గొప్ప. దానివల్ల ఆ రచనకు చక్కదనం, చిక్కదనం వచ్చి పాఠకులను విసిగించకుండా ఆసక్తిగా చదివించేలా చేస్తుంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న ఆర్యోక్తిని స్వయం నియంత్రణను సాధన చేసేవాళ్ళు తప్పక పాటించవలసిన నియమం. స్కూలులో పిల్లలకు కాంప్రెహెన్షన్ లేక ‘క్లుప్తముగా వ్రాయుము’ అని ఒక ఎక్సర్‌సైజ్‌ని ఇస్తారు. ఇరవై లైన్లు ఉన్న ఒక విషయాన్ని పది లైన్లలో సంక్షిప్తంగా వ్రాయాలి. ఇలాంటివాటి ఉద్దేశం అదే.. నియంత్రణ. అది చిన్నప్పటినుంచే పిల్లలకు అలవాటు చేయడం మంచి పద్ధతి.

-కొఠారి వాణీచలపతిరావు