మెయిన్ ఫీచర్

అమ్మే జగతికి వెలుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనురాగంలోని మొదటి అక్షరాన్ని మమకారంలోని మొదటి రెండక్షరాల్ని పెనవేసే బంధం అమ్మ. ‘అమ్మతనం’ అన్నదానికి విశిష్టస్థానం ఉంది. అమ్మంటే అద్భుతం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం. అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత పాలన సృష్టితత్త్వాన్ని సఫలం చేస్తే, జీవితాన్నిచ్చిన ఆమె ఆలన - జీవన సత్యాన్ని ఉటంకిస్తుంది.
యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తస్మై నమస్తస్మై నమో నమః- మాతృదినోత్సవం అంటూ హడావుడి. తల్లులను ఈ ఒక్క రోజు మాత్రమే గుర్తుచేసుకుంటే చాలా? దండం పెట్టి, బహుమతి ఇస్తే మన బాధ్యత తీరిపోయినట్లేనా? అమ్మకు ఎంత చేసినా ఆ రుణం తీర్చుకోలేం.. మనకు జన్మనిచ్చి, పెంచి, సమాజంలో పౌరునిగా మార్చిన తల్లిపట్ల ఒక్క రోజు కృతజ్ఞత చూపితే చాలదు. మాతృమూర్తిని ప్రతిరోజూ గౌరవించాలి. బాగోగులను పట్టించుకోవాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అమ్మకు కేవలం ఒక రోజు అంటే, సముద్రమును ఒక చెంచాతో తోడేయాలని ప్రయత్నించే ఒక వృధా ప్రయాస.
భారతీయ సంస్కృతి తల్లికి అగ్రస్థానం ఇచ్చింది. యుగాలతో సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను అందించటం ఆమెకు మాత్రమే సాధ్యం. తల్లి ఒడినే బడిగా, గుడిగా చేసుకొని తొలి పాఠాలు నేర్చుకుంటారు. పది మంది ఉపాధ్యాయులు ఒక ఆచార్యునితో సమానం. వందమంది ఆచార్యులు ఒక తండ్రితో సమానం. వెయ్యిమంది తండ్రులు ఓ తల్లితో సమానమని మన పెద్దలు అంటారు. మనిషి ఎంత ఎదిగినా అస్థిత్వాన్నిచ్చిన అమ్మను మరువలేడు. కుటుంబాలలో అనేక పాత్రలున్నా, బంధాలున్నా వాటన్నింటికీ ఆధారం అమ్మ. కాలాలు ఎన్ని మారినా పాశ్చాత్య పోకడలు ఎన్ని పొంగి పొరలి వచ్చినా తల్లి స్థానం చెక్కు చెదరదు. తన బిడ్డల ప్రతిభను, అందాన్ని ఎప్పుడూ ఉన్నతంగా చూసేవి ఒక్క అమ్మ కళ్లు మాత్రమే. అమ్మంటే అగుపించని త్యాగం, ఔదార్యం! ఆమె అందించే ప్రోత్సాహం, మెచ్చుకోలు ఉత్సాహం ముందు ఇతరులు పంచే అభినందనలు సాటిరావు. తాను ఎన్ని కొత్త రుచులు ఆహారంగా భుజించినా తన కడుపు నిండదట. పట్టెడన్నం తన బిడ్డలకు వండి పెట్టినపుడే అమ్మ కడుపు నిండుతుంది. ఆకలి, అలసట, కష్టాలు, నష్టాలు కలిగినపుడు అందరూ అనుకోకుండా గుర్తుచేసుకునే దైవనామం అమ్మ అనడంలో నిండు నిజం దాగి వుంది. అందుకే అమ్మ ఒక అమృత జలపాతం, సర్వదేవతా స్వరూపం.
భూమీ, ఆకాశం, నదీ, సముద్రం, చెట్టూ, పువ్వూ అన్నీ మాతృ స్వరూపాలే. ఆమె లోకానికి రూపు లేదు. అనంతమైన వాత్సల్యానికి నిర్వచనమే మాతృత్వం. లోకంలోని ప్రతిది మాతృస్వరూపమే. అందుకే ఆమెని ఆరాధనాభావంతో ఆదరించి గౌరవించాలి. ఆమె అంటే విద్యాలయం. ప్రవాహాల నదిలా, పరుగెత్తే వాగులా, ప్రశాంత సాగరంలా, కల్లోల కడలిలా అనేక అవతారాలనెత్తుతుంది. పరిస్థితులకనుగుణంగా ఒదిగిపోయే శక్తి కేవలం ఆమెకు మాత్రమే సొంతం. అమ్మంటే.. ఓర్పు.. నేర్పు. జీవన ఒరవడిని నేర్పే మహత్వం. అలుపెరుగని శ్రమతో, కష్టాలను కనపడనీయని కరుణతో, కొలమానమే లేని అసమానతల నడుమ అపురూపమైన అనురాగంతో నిత్యం అలలారే అమ్మ తత్త్వం గురించి ఎంత చెప్పిన తక్కువే. కరుడుగట్టిన హృదయాలను సైతం కరిగించే గుణం అమ్మ గుణం. అమ్మంటే ఔన్నత్యం. అమ్మంటే ఆలంబన. అమ్మంటే అనురాగం. మానవత్వానికి అద్దంపట్టే మాతృత్వపు ఛాయలో ఎదగాలి. అమ్మను గౌరవించే ప్రతీ ఒక్కరూ సమాజాన్ని సుహృద్భావనతో చూడాలి. అమ్మే సృష్టికి మూలం. అమ్మే జగతికి వెలుగు!
ఒక పరిశోధన
తల్లిగా మారాక స్ర్తిల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఇదే కాదు వారి మెదడులోనే మార్పు వస్తుంది అంటున్నారు పరిశోధకులు. 50 మంది తల్లి కాబోతున్న మహిళలపైన ఈ పరిశోధన చేశారు. ప్రసవానికి ముందు వారి మెదడు స్కాన్ చేశారు. గర్భం దాల్చిన తర్వాత వచ్చిన స్పష్టమైన మార్పును పరిశోధకులు గుర్తించారు. ఇతరుల అభిప్రాయాలను, అవసరాలను గమనించే మెదడు భాగంలో వచ్చిన మార్పు అమ్మలో అప్రమత్తతను పెంచేలా వుందిట. పసిపిల్లలు నోరు తెరిచి ఏదీ అడగకపోయినా వారి ఆకలిని, నిద్రను, అనారోగ్యాన్ని తెలుసుకొనే శక్తి ఈ మార్పు ద్వారా తల్లికి లభించిందని పరిశోధకులు చెప్పారు. రెండు మూడేళ్ళ తర్వాత ఆ మెదడు సాధారణ స్థాయిలో అంత అలెర్ట్‌గా లేకుండా ప్రశాంతతో ఉందిట. నిజమే ఏ శక్తితో బిడ్డ అవసరాన్ని చటుక్కున తెలుసుకొంటోంది తల్లి. ఈ పరిశోధన చాలా గొప్పగా వుంది.
అమ్మదనానికి ‘మెచ్చు’తునక
హృదయం వున్నప్రతి ఒక్కరినీ కదిలించే ఈ ఘటన చైనాలో జరిగింది. చైనాలోని ఓ టీవీ చానల్‌లో పనిచేస్తున్న 26ఏళ్ళ క్యూ యువాన్ యువాన్ గర్భం దాల్చింది. ఆమెకు కేన్సర్ చివరి దశలో వున్నట్లు వైద్య పరీక్షలలో తేలింది. ఆ వ్యాధికి చికిత్స కెమోథెరపీ మాత్రమే. అత్యంత శక్తిమంతమైన ఆ చికిత్స చేస్తే- కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకు ప్రమాదం. ఒకవైపు కేన్సర్ తనను కబళిస్తున్నా, బిడ్డ పుట్టేవరకు కెమోథెరపీ మాత్రం తీసుకునేది లేదని నిక్కచ్చిగా చెప్పేసింది. ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. సరిగ్గా బాబుకు 100 రోజులు నిండేసరికి ఆ తల్లికి నూరేళ్లు నిండిపోయాయి. చైనాలో పిల్లలు పుట్టిన వందోరోజును చాలా ఘనంగా జరుపుకుంటారు. సరిగ్గా అదే రోజు ఆ తల్లి మరణించడం విధి విలాసమే! అమ్మదనం అంటేనే నిస్వార్థప్రేమకు ప్రతిరూపం అన్న విషయాన్ని ఆమె తన అపూర్వ త్యాగంతో మరోసారి నిరూపించింది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి