మెయిన్ ఫీచర్

పల్లెకు ప్రగతి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహల్లో పల్లె చిత్రం ముగ్ధమనోహరం. గలగల పారే ఏరు... ఏటి పక్కన ఊరు. మట్టి పరిమళాల్ని వెదజల్లే ఎర్రెర్రని రాదారి... ఆధ్యాత్మికతతో అలరించే ఆలయ జేగంటల సవ్వడి. మనోయవనికపై ఏ చిత్రకారుడో అద్భుతంగా చిత్రీకరించిన పెయింటింగ్‌లా పల్లెసీమ ఆకట్టుకుంటుంది.
వాస్తవం మాత్రం అందుకు విరుద్ధం. కనీస సౌకర్యాలకు కూడా నోచని పల్లెలెన్నో ఇప్పటికీ ఇక్కట్లతో సహజీవనం సాగిస్తున్నాయి. అయితే, ఆ పల్లె బతుకుల్ని సమూలంగా మార్చి గ్రామీణ భారతాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు నడుంబిగిస్తూ ప్రవాస భారతీయులెందరో సంకల్పించడం ఆహ్వానించదగ్గ శుభ పరిణామం. ఆ దిశలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న రేవతి మెట్టుకూరు ఒకరు.
ప్రవాస భారతీయురాలైన రేవతి రెండు గ్రామాల్ని దత్తత తీసుకుని తాను స్థాపించిన ‘మనస్వ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్’(ఎంఐఎఫ్) ద్వారా అనేకానేక అభివృద్ధి కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కి దగ్గర్లోని మొయినాబాద్ మండలం బాకారం గ్రామంలో 2017లో స్వయంగా కొన్ని ప్రగతి పనుల్ని చేపట్టిన రేవతి... ఇటీవల సురంగల్ గ్రామాన్ని కూడా లక్ష్యం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ ప్రజలకు సౌకర్యం కలిగించే వివిధ పనులకు శ్రీకారం చుట్టారు.
జీవన నేపథ్యం
రేవతి మెట్టుకూరు 2005లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో పిజి చేసారు. వెనువెంటనే ఐటీ సంస్థలో చేరారు. ఆ సంస్థలో చేరిన అయిదేళ్ల స్వల్పవ్యవధిలోనే సీనియర్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. అనంతరం ఐటీ సంస్థనుంచి బయటకి వచ్చిన రేవతి అమెరికాలోనే మరో మూడు ప్రముఖ ఐటి సంస్థల్లో పని చేసారు. వృత్తిరీత్యా ఎంత ఎదిగినా ఆమెకి సంతృప్తి కలగలేదు. కారణం-తండ్రి బాల్‌రెడ్డినుంచి వారసత్వంగా వచ్చిన సేవాదృక్పథం తన చుట్టూ ఉన్న సమాజానికి ఇతోధికంగా ఏదో చేయాలనే తపన ఆమెని నిలువనీయలేదు. చిన్నతనంలో ఓసారి తన స్నేహితురాలు స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే.. తట్టుకోలేక తన మెడలోని బంగారు గొలుసునిచ్చేసిన సంఘటన ఇప్పటికీ ఆమెకి గుర్తే. తనలా చేసిందని తెలుసుకున్న తండ్రి ఆ బంగారు గొలుసుని తీసుకుని ఆ అమ్మాయి ఫీజు కూడా తనే కట్టడం కూడా ఆమెకి జ్ఞాపకమే. చేతనైనంతలో ఇతరులకు సాయపడమంటూ తండ్రి తరచూ హితబోధ చేస్తుండడం కూడా తనని సేవారంగంలో అంకితభావంతో పని చేసేందుకు ఎంతో ఊతమిచ్చిందని రేవతి తరచు చెప్తుంటారు.
వేతనంలోని 30 శాతం సమాజ సేవకే:
ఐటి ప్రొఫెషనల్‌గా చేరిన మొదటి నెలనుంచి తన వేతనంలో 30శాతం పక్కకు తీసి ఇండియాలోని తన తండ్రికి రేవతి పంపించేవారు. ఆ డబ్బు పేద విద్యార్థుల ఫీజులకు, రోగాల్తో బాధపడుతున్న వ్యక్తులకు తండ్రి వితరణ చేసేవారు. అంతేకాదు, హైదరాబాద్‌కి చెందిన వేగేశ్న ఫౌండేషన్ లాంటి సంస్థలకు ఎన్నోసార్లు రేవతి విరాళాలు సేకరించి సాయపడ్డారు. విరాళాల సేకరణ నిమిత్తం అమెరికాకి వచ్చే కళాకారులకు భోజన వసతి సౌకర్యాల్ని ఆమె సమకూర్చేవారు.
టెనె్నన్సీ తెలుగు సంఘం అధ్యక్షురాలిగా..
టెనె్నన్సీ తెలుగు సంఘం అధ్యక్షురాలిగా అతి చిన్నవయసులోనే రేవతి బృహత్తర బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. అధ్యక్షురాలిగా ఇంత చిన్నపిల్ల ఏంచేస్తుందని తెలుగు సంఘం సభ్యులు మొదట అనుమానించినా.. తర్వాత్తర్వాత ఆమె పనితీరుకి అబ్బురపడి అభినందించడం ఓ చరిత్ర అంతకుముందువరకూ ఆ తెలుగు సంఘం కేవలం చిన్నచిన్న సమావేశాలకు మాత్రమే పరిమితంకాగా.. రేవతి అధ్యక్షురాలిగా మారిన తర్వాత సేవామార్గంవేపు సంఘాన్ని ఉరుకులుపరుగులు పెట్టించిన ఘనత కూడా మరో చరిత్రే. అధ్యక్షురాలిగా ఉన్న రెండేళ్లకాలంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వచ్ఛంద సేవాసంస్థల కోసం నాలుగుకోట్ల రూపాయలు విరాళ రూపంలో రేవతి సేకరించారు. తను, తన పరిచయస్థుల ద్వారా సేకరించిన మరో రెండు కోట్లు అదనంగా ఇచ్చారు.
సింపుల్ మైండ్స్ వ్యవస్థాపకురాలిగా..
గ్రీన్‌కార్డ్ రావడంతో అమెరికాలో ‘సింపుల్ మైండ్స్’ అనే ఐటి సంస్థను రేవతి స్థాపించారు. ఐటి రంగంలో తెలుగు యువతను కూడా ప్రోత్సహించాలనే దృక్పథంతో భారత్‌లోనూ ‘సింపుల్ మైండ్స్’ శాఖను కూడా ఏర్పాటుచేసారు. సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం తన తనయుడు పేరిట ‘మనస్వ్ ఇంటర్నేషనల్’ ఫౌండేషన్‌ను స్థాపించారు. హైదరాబాద్‌లో ఉంటున్న తల్లిదండ్రులకోసం ఆరునెలలకోసారి వస్తూ ఇక్కడి సేవాకార్యక్రమాల్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు.
రెండు గ్రామాల ఆడపడుచు
ప్రస్తుతం రేవతి మెట్టుకూరు బాకారం, సురంగల్ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికోసం పాటుపడుతున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ ప్రజలమధ్య ఐక్యత ఉండేందుకుగాను ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాల్సిందిగా ఉద్బోధిస్తూ తనవంతుగా ప్రతి ఏటా సీతారామ కళ్యాణాన్ని స్వయంగా జరిపిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ్భారత్’ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామాల్లోనూ చీపురు పట్టి మరీ రహదారుల్ని శుభ్రం చేసారు. ఆమె అందించిన స్ఫూర్తితో గ్రామస్థులు కూడా నడుం బిగించి ఆమె వెంట నడిచారు. హోటళ్లలో ఎంగిలి పళ్లాలు కింద పడనివ్వకుండా ప్రత్యేక చెత్తబుట్టల్ని అందించడం ‘స్వచ్ఛ్భారత్’ కార్యక్రమంలో భాగం. ప్లాస్టిక్‌కి దూరంగా ఉండాలని సూచిస్తూ గ్రామాల్లో అనవసరమైన ప్లాస్టిక్ కనిపించకూడదంటూ సూచించారు.
బడి, గుడి ఎంత సమర్ధవంతంగా నిర్వహించిన గ్రామాలే ప్రగతి సాధిస్తాయన్న భావజాలానికి విస్తృత ప్రచారం కల్పించారు. ఈ రెండు గ్రామాల్లోనూ స్కూళ్లకు వెల్లవేసి, ప్రముఖుల చిత్రపటాల్తోపాటు వారు నినదించిన సూక్తుల్ని గోడలపైన లిఖింపచేసారు. స్కూల్ లైబ్రరీలలో ప్రాజెక్టర్, కంప్యూటర్ తదితర సౌకర్యాల్ని సమకూర్చారు.
‘బాకారం’ పచ్చళ్లు వెరీ స్పెషల్
బాకారం గ్రామస్థులకు పచ్చళ్ల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడమే కాకుండా ‘బాకారం పచ్చళ్లు’అనే బ్రాండ్ ఇమేజ్‌తో దేశవిదేశాల్లో ఈ పచ్చళ్ల వ్యాపారానికి విస్తృత వేదిక ఏర్పాటుచేసారు. వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా, గ్రామాల్లో నిరుద్యోగుల్ని గుర్తించి వారికి ఉపాధి అవకాశాల్ని అందించేందుకు విశేషమైన కృషి చేసారు. చేస్తున్నారు. ఇండియా వచ్చినప్పుడు స్వయంగా సేవా కార్యక్రమాల్ని పర్యవేక్షించే రేవతి.. తను అమెరికా వెళ్లినా ఇక్కడి పనులకు ఏమాత్రం ఆటంకం కలుగకుండా ఉండేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. ‘మనస్వ్ ఇంటర్నేషనల్’ ఫౌండేషన్ ప్రతినిధులు ఆమె పరోక్షంలో ఈ గ్రామాల్లో పర్యటించి అవసరాలకు తగ్గట్లు స్పందిస్తున్నారు.
ప్రవాస భారతీయురాలైన రేవతిని మనసా వాచా కర్మణా మరెంతమందో స్ఫూర్తిగా తీసుకుని సేవాదృక్పథంతో ముందుకు వస్తే పల్లెసీమల ముఖచిత్రాలు మరింత సుందరంగా రూపు దిద్దుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

- పి.వి.డి.ఎస్.ప్రకాష్ 9000544160