మెయిన్ ఫీచర్

‘శ్రమ’యేవ జయతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రమలేని జీవితం సుఖదాయకమే గానీ శుభదాయకం మాత్రం ముమ్మాటికీ కాదు. శాస్త్ర వినియోగం ద్వారా యాంత్రికమైన జీవితం నేటి ఆధునిక మానవులను శ్రమకు దూరం చేయడం- వారిని పరిశ్రమనుంచి పలాయనం చిత్తగించడం కళ్ళెదుట కనపడుతూన్న వాస్తవం. అలా కష్టాన్ని మరచిన మనకు సుఖపడటం అలవాటై శరీరంలో కండరాల కదలికలు, కీళ్ళ పనితీరులో మెళకువలు మరచిపోయే స్థాయికి ఎదిగిపోయాం. అందుకే అన్నారు- ‘‘జరిగితే జరిగినంత సుఖం లేదని- ఎక్కణ్ణుంచి లేవలేమంటే ఇక్కణ్ణుంచే లేవలేమని!’’ ఈ పెద్దల మాటలు- మాటలు కావవి మణిపూసలు కదూ. ఎస్కిలేటరుంటే మెట్లెందుకు?
పెరిగిన మానవుని మేధస్సు- భస్మాసుర హస్తమై పరిణమించిందని చెప్పటానికి శారీరక శ్రమ లేని జీవితమే ఒక ఉదాహరణ. పైగా నేటి బడాయి బాబుల వైనం- ‘్ఫలానా ఆధునిక పరికరం’ మీ ఇంట్లో లేదా? అని ఆశ్చర్యచకితులయి- ఆ మేరకు అవమానకరంగా తూలనాడడం, చులకనగా చూడడం! అంటే మనం మన ఇష్టానికి ‘కష్టాన్ని’ నమ్ముకుని ఒళ్లు వంచి మన పని మనం చేసుకోవడం కూడా నామోషీలో భాగమేనన్నమాట! టైం, ఎనర్జీ రెండూ కలిసొస్తుండగా మనకెందుకంత శ్రమ అవసరమా? అని అవమానకర వ్యాఖ్యల చేసే నేటి ఆధునిక ఆడంబర జీవులు తెలుసుకోదగిన నిజం ఏమిటంటే- మానవ శరీర అవయవ నిర్మాణం కూడా అవసరమైన శ్రమకు అచ్చంగా సరిపోయేదే! నిజానికి అవి పనులూ పరిశ్రమలూ కావు- అందుబాటులో చేయదగిన చేయాల్సిన చిన్నచిన్న వ్యాయామ క్రియలన్నమాట! వాటిని కూడా చేయకుండా వాటంగా- నాజూగ్గా శరీరం తయారవ్వాలంటే ఎలా అవుతుంది? అది సాధ్యమేనా? మన దైనందిన జీవితంలో నిత్యకృత్యాల వ్యాయామాలు (పనులు) చేయడం మానేసి- కడదాకా కాళ్లూ చేతుల కదలిక అదుపులో ఉండాలని ఆశించడం అత్యాశే అవుతుంది. వ్యాయామాల పేరున ‘జిమ్’ సెంటర్లకెళ్లి బరువులు బలవంతంగా ఎత్తేవాళ్లూ- గమనించవలసిన ధర్మసూక్షతం ఏమిటంటే- మన ప్రయాణ సౌకర్యాలలో మనమంతా విరివిగా- విచ్చలవిడిగా వాడుతున్న ‘ట్రాలీ బ్యాగులు’ మరియు సూట్‌కేసులు! ఒకనాటి ఇనుప (రేకు) ట్రంకుపెట్టెని బరువుగా భావించి తేలికపాటి లెదర్/్ఫమ్ లెదర్ బాక్సులు / బ్యాగులు కనిపెట్టి తేలికపడిన మనం- మరింత తేలికగా ప్రయాణాలు చేద్దామనే సదుద్దేశంతో అవతరించిన ‘ట్రాలీ’ విధానం- మనలో చిన్న చిన్న బరువులు మోసే జీవన ప్రయత్నం నుంచి కూడా విరమింపజేసింది! ప్రయాణం సుఖమయం, సౌకర్యవంతం కావడం హర్షణీయమే కానీ మనకు అవసరమయ్యే శారీరక శ్రమ మాటేమిటి? ఇదంతా ఎందుకనే ఆంగ్లేయుడు ఆదికాలం నాడే- ‘లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్’ అని అభిప్రాయపడ్డాడు. అయినా, మనలో మాట ఎవడో చెప్తే మనమెందుకు వింటాం? తోచిందే మనం చేస్తాం- అది అసౌకర్యమైనా! ఇహమున్నంతవరకూ అహమంటుంది కదా!
జీవితం చురుకుగా సాగిపోవాలంటే శారీరక సౌష్టవం ఎప్పటికీ దృఢంగా కొనసాగాలంటే ఎవరి పనులు వారే, ఓపికున్నంతవరకూ స్వయంగా చేసుకోవడం తప్పనిసరి- తప్పదు మరి! అదేమంత పెద్ద వ్యాయామ క్రీడ కూడా కాదు. ఉన్నంతలో ఉడతాభక్తి శారీరకశ్రమ. ముఖ్యంగా వయసు మీదపడినకొద్దీ మన శరీరావయవాలు మనమాట వింటూ మనం ఏ పనికీ మరెవరిపైనా ఆధారపడకూడదనుకుంటే అందుకు ఈ చిన్న చిన్న వ్యాయామాలు లాంటి దినచర్యలే సరైన ప్రత్యామ్నాయం! ఉదాహరణకు నడకకు ప్రత్యేమైన సమయాన్ని కేటాయించ వీలు కాని సందర్భాలలో ఇంటికి అవసరమయ్యే నిత్యావసరాలు పాలు, కూరలు, పళ్లు వగైరాది సరుకుల్ని వాహన ఉపయోగం లేకుండా నడిచివెళ్లి తెచ్చుకోగలిగితే ఆ సమయమే వ్యాయామ సమయంగా మారిపోతుంది. వ్యాయామం ప్రత్యేకించి చేయలేకపోతున్నామని చింతపడేవాళ్ళంతా ఇటువంటి సంయమన భావంతో ఆలోచించడం అవశ్యం, అనివార్యం! యంత్రాల వినియోగాన్ని కూడా ఎంత తగ్గించుకుంటే అంత మేలు జరుగుతుంది మన శరీర అవయవాలకు! రోలు రుబ్బడం, తిరుగలి తిప్పడం వంటి శారీరక శ్రమలు ఇంట్లోనే జిమ్‌ని మరిపించే అద్భుతాలని ఆవిష్కరిస్తాయి! మన తరువాతి తరం ఆ గృహోపకరణాలు మరిచిపోయే మహద్భాగ్యం మనకి కలుగకముందే వాటి వాడకం అప్పుడప్పుడైనా తెలియజేయడం తెలివైన పని! యంత్రాలపై ఆధారపడవద్దని ఎవ్వరూ సలహా చెప్పరు. కానీ యంత్రం లేనిది మనం జీవించలేమనే దుస్థితికి నేటి తరం దిగజారకూడదు. జీవితం పలు విధాలుగా ఆధునికమవడం అభిలషణీయమే అయినా జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ప్రేరణమైన చిన్న చిన్న పనుల్లాంటి వ్యాయామాలు వదలిపెట్టకూడదు. మనకున్న సమయాభావంవల్ల వ్యాయామాలకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించలేనప్పుడు - చిలికి చిలికి గాలివాన అన్నట్లు ఈ చిన్న చిన్న శారీరక శ్రమలే మన శరీరానికి కొండంత మేలు చేస్తాయి- కొసరంతా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మరెందుకింక ఆలస్యం- నేడే అటుంటి సరికొత్త (పాత) జీవనశైలికి శ్రీకారం చుట్టండి!

-- మరువాడ భానుమూర్తి