మెయిన్ ఫీచర్

‘ఉత్తమ కోడలు’ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు పెళ్లీడుకొచ్చిన అమ్మాయా?
ఇటీవలే పెళ్లి చేసుకుని అత్తారింట అడుగుపెట్టారా?
లేక మీ అమ్మాయికి ఏమీ రాదు.. గారాభంగా పెంచాను. అత్తారింటికి వెళ్లి ఎలాంటి తంటాలు పడుతుందో అని భయపడుతున్నారా?
మీ కూతురు అత్తారింట్లో కూడా పుట్టింట్లో కలిసిపోయినట్లు కలిసిపోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే..
పెళ్లీడుకు వచ్చిన అమ్మాయైనా, పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయైనా, ఇప్పుడిప్పుడే అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికైనా ఈ కథనం చాలా ఉపయోగకరం. అప్పుడప్పుడే అత్తారింట అడుగుపెడుతున్న అమ్మాయికి చాలా బెంగ ఉంటుంది. అత్తామామలు, ఆడపడుచు, మరుదులు, బావగారు, తోడికోడలు.. వీరంతా ఎలాంటివారో.. అసలు ఏమాత్రం పరిచయం లేని వీరి మధ్య కోడలిగా ఎలా ఉండాలి? ఎలా మసలు కోవాలి? అందరి మనసూ దోచుకుంటూ కోడలిగా ఎలా పేరు తెచ్చుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ తల్లిదండ్రుల తలంపుకు వచ్చాయో, లేదో తెలియదు కానీ ఓ విశ్వవిద్యాలయ అధిపతి(వీసీ) తలంపుకు మాత్రం వచ్చాయి. వచ్చిందే తడవుగా దానికి పరిష్కార మార్గాన్ని ఆలోచించడానికి బుర్ర బద్ధలు కొట్టుకున్నాడు. ‘‘అమ్మయ్యో! మన ఆడపిల్లలు.. వివాహానంతర జీవితంపై అవగాహన లేకపోవడంతో అత్తారింట అడుగుపెట్టినప్పటి నుంచీ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. పుట్టింట్లో అల్లారుముద్దుగా, పనిచేస్తే కందిపోతారేమో అన్నంతగా పెరిగిన వారు అత్తారింట్లో బిక్కమొహం వేస్తున్నారు. ఎంత అత్తింటివారి వెన్నుదన్ను లభించినప్పటికీ బెరుకుగానే ఉంటారు. అలాంటివారికి అర్జంటుగా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి’’ అనుకున్నాడు ఆ వీసీ. అందుకోసం కంకణం కట్టుకుని ఓ శుభ ముహూర్తాన వారికోసం ఓ కోర్సు ప్రవేశపెట్టి, అందుకు ఆమోదం తెలిపాడు. ఈ కోర్సు వ్యవధి మూడు నెలలు. వచ్చే సంవత్సరం నుండి అంటే 2019 నుండీ ఈ కోర్సు అమల్లో ఉంటుంది. ఇంతకీ ఆ కోర్సు పేరేమిటో తెలుసా.. ‘ఆదర్శ బహు’.
విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, సర్ట్ఫికెట్ కోర్సులు.. ఇలా అనేక రకాలైన కోర్సులు ఉన్నాయి. అయితే భోపాల్లోని బర్కతుల్లా యూనివర్శిటీ వారు మాత్రం 2019లో ఈ కోర్సును ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు, ప్రకటనలను జారీ చేసేశారు. తమ ఇంటికి వచ్చే కోడలు ఆదర్శవంతంగా, సంస్కారవంతంగా ఉండాలని అత్తింటివారు కోరుకున్నట్లే, అత్తగారింట్లో తమ కూతురు మంచి పేరు తెచ్చుకోవాలని పుట్టిల్లు గుర్తు రాకూడదని తల్లిదండ్రులూ కోరుకుంటారు. అలాంటి ఉత్తమ కోడలు లక్షణాలతో అత్తమామల్ని మెప్పించాలనుకుంటే.. బర్కతుల్లా యూనివర్శిటీలో చేరితే సరిపోతుంది. ఎందుకంటే ఈ ‘ ఆదర్శ్ బహు’ కోర్సులో.. కోడలు ఎలా ఉండాలి? అత్తమామల పట్ల ఎలా బాధ్యతగా మెలగాలి? అత్తవారింట్లో ఎలా నడచుకోవాలి? ఆడపడుచు, మరదులను ఎలా చూసుకోవాలి? వంటి అనేక విషయాల్ని ఈ కోర్సు ద్వారా నేర్పిస్తారట.
మహిళా సాధికారికతను పెంపొందించేందుకు ఆదర్శ బహు కోర్సును ప్రవేశపెట్టినట్లు యూనివర్శిటీ యాజమాన్యం తెలిపింది. 2019 నుంచి ఈ మూడు నెలల కోర్సును ప్రారంభించనున్నారు. ఈ కోర్సును ప్రవేశపెట్టాలన్న ఆలోచన అసలు మీకెందుకు వచ్చింది? అని ఆ యూనివర్శిటీ వీసీ డీసీ గుప్తాను అడిగితే.. ‘పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల జీవితంలో కొత్త దశ మొదలవుతుంది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త అలవాట్ల నడుమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ వాతావరణంలోని మార్పులకు వారు తొందరగా అలవాటు పడలేరు. అందుకోసమే ఈ కోర్సు.. కేవలం చదువు విషయంలోనే కాదు.. ఆడపిల్లలకోసం ఇలాంటి కోర్సులు పెడితే కాపురాల్లో ఎలాంటి కలహాలు చోటుచేసుకోకుండా.. ఆ కాపురం నందనవనంగా మారుతుందని మా అభిప్రాయం..’ అంటారు.
ఈ కోర్సులో మొదట విడతగా ముప్పై మంది విద్యార్థులను చేర్చుకుంటారట. ఇంతకీ ఇందులో సిలబస్ ఏం ఉంటుందంటే.. సైకాలజీ, సోషియాలజీ, ఉమెన్స్ స్టడీస్ సంబంధ అంశాలు మిళితమై ఉంటాయట. ఈ కోర్సు పూర్తయ్యాక వారు మరింత ఉన్నత స్థానంలో ఉండాలన్నది ఆ యూనివర్శిటీ ఆశయమట.. కానీ ఈ కోర్సు ప్రవేశ పెట్టాలన్న నిర్ణయంపై కొందరు విశ్రాంత ఆచార్యులు, విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ కోర్సు చేసిన ప్రతి మహిళా ‘ఆదర్శ బహు’గా పేరు తెచ్చుకుని అత్తారింట్లో అందరికీ తల్లో నాలుకలా మెలగాలని కోరుకుందాం.