మెయిన్ ఫీచర్

విద్యాప్రదాయిని సావిత్రిబాయి పూలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రమించి పనిచేయండి. శ్రద్ధగా అధ్యయనం చేయండి. మంచి మార్గంలో నడవండి- సావిత్రిబాయి పూలే
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. నేడు భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా పుస్తకాలతో కళకళలాడుతూ ఆడబిడ్డలు బడికిపోతూ కన్పిస్తారు. కొన్నివేల సంవత్సరాల నుండి వైదిక బ్రాహ్మణీయ సమాజం స్ర్తిలకు, శూద్రులకు చదువును నిరాకరించింది. జ్ఞానానికి వారిని దూరంగా ఉంచింది. కానీ నేడు ఇంతమంది స్ర్తిలు, శూద్రులు చదువుకుంటున్నారంటే, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పరిపాలకులుగా అన్ని రంగాలలో సమాన అవకాశాలు పొందుతున్నారంటే దానికి మూల బీజం వేసింది పూలే దంపతులు. వారి త్యాగం, ధైర్యం, పట్టుదలవల్ల స్ర్తిలకు, శూద్రులకు చదువు సాధ్యమయింది. ఆధునిక భారతదేశంలో శూద్రులకు, అతి శూద్రులకు, స్ర్తిలకు విద్యను అందించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసి కోట్లమందికి విద్యాప్రదాయిని అయింది మన చదువుల తల్లి క్రాంతి జ్యోతి సావిత్రి బాయి పూలే.
జనవరి 1831వ సంవత్సరం జనవరి 3న మహారాష్టల్రోని సతారా జిల్లా ఖండాలా ప్రాంతంలో శిఖాల గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోగల నాయిగావ్ అనే గ్రామంలో జన్మించింది. తల్లి లక్ష్మిబాయి, తండ్రి ఖండోజీ. చిన్నప్పటినుంచే ఆకట్టుకునే మాట తీరు, ధైర్యసాహసాలు, చలాకీతనం, తెలివితేటలు, చురుకుదనం ఆమె సొంతం.
వివాహం
తొమ్మిదేళ్ల వయసులో పనె్నండేళ్ల జ్యోతిరావుకిచ్చి ఆమె తండ్రి వివాహం జరిపించాడు. ఆడదిక్కులేని ఆ కుటుంబ బాధ్యత చిన్న వయసులోనే సావిత్రిబాయి అందుకుంది. తన భార్య సావిత్రిబాయి ఎందుకు చదువుకోకూడదు అని ఆలోచించిన జ్యోతిరావు పూలే తానే స్వయంగా సావిత్రికి చదువు నేర్పాడు. ఈ విధంగా సావిత్రి మరాఠీ, ఆంగ్లంలో రాయడం నేర్చుకుంది. సావిత్రిబాయి చదువు నేర్చుకోవడం ఆమె జీవితానికి గొప్ప మలుపు. అంతేకాక భావి భారతానికి సరైన మార్గం చూపిస్తూ చరిత్రకెక్కింది. అది ఆమె వేసిన తొలి అడుగు అని చెప్పవచ్చు. 20 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన పూలే తన మిత్రుల సహాయంతో 1848 జనవరి 1న పూనాలోని, బుధవారపేట నివాసి భిడే గృహంలో బాలికా పాఠశాలను ప్రారంభించారు. బాలికా విద్యకోసం భారతదేశంలోనే తొలిసారిగా స్థాపించిన ఈ పాఠశాలనందు ముఖ్య ఉపాధ్యాయినిగా సావిత్రిబాయి నియమింపబడింది. ఈ విధంగా సావిత్రిబాయి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయినిగా చరిత్రకెక్కింది.
ఆడపిల్లలు చదువుకోవడం చెడిపోవడానికి తొలిమెట్టుగా భావించి, తమ ఆడబిడ్డలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించేవారు. బ్రాహ్మణవాదుల, సంప్రదాయవాదుల అవహేళనలు ప్రతికూల పరిస్థితుల మధ్య సావిత్రిబాయి ముందుకు సాగింది. వారిని ఒప్పిస్తూ, బాలికల అభిమానాన్ని, ప్రేమను సంపాదించి, వారిని పైకి తీసుకురావాలని దృఢ సంకల్పంతో బాలికల మానసిక వికాసానికి తన శక్తియుక్తులను వెచ్చించింది.
ఇదేవిధంగా బాలికల పాఠశాలలను ఒకవైపు విస్తృతపరుస్తూనే, మరోవైపు 1852 మార్చి 3వ తేదీన అస్పృశ్యుల కోసం (దళితులకోసం) బేతాళపేటలో ఒక పాఠశాలను ప్రారంభించారు. ఇది భారతదేశంలో అస్పృశ్యుల కోసం ప్రారంభించిన తొలి పాఠశాల. అలా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా సావిత్రిబాయి నియమింపబడ్డారు. అస్పృశ్యత అనే దుర్మార్గ విధానాన్ని ఎదిరించి సమానత్వం కోసం కృషిచేయాలన్న సద్బుద్ధితో మహాత్మా జ్యోతిరావు పూలే ఈ పాఠశాలను స్థాపించాడు.
సావిత్రిబాయి పూలే 1852 జనవరి 14న 3తిలగుండ్ సమారోహ్2 అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఇది భారతదేశంలోనే స్థాపించిన తొలి మహిళా సంస్థ. పూలే స్థాపించిన పాఠశాలలన్నింటినీ తీర్చిదిద్ది, వాటిని విజయపథంలో నడిపించడంలో సావిత్రి కృషి అనన్య సామాన్యమైంది.
భర్త చేసే సామాజిక కార్యక్రమాలలో అత్యధిక భారం సావిత్రిబాయి మోసింది. సమాజ సంస్కరణ, సామాజికసేవలను ఎంచుకున్న పూలే దంపతులు ఎదుర్కొన్న కష్టాలు, వారికి ఎదురైన దుర్భర పరిస్థితులు ఎంతో భయంకరమైనవి. స్ర్తివిద్య, సమాజ సేవ ఉన్నత లక్ష్యాలను తలకెత్తుకున్న సావిత్రిబాయి తను ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వదులుకోలేదు. తన బుద్ధి, తన జ్ఞానం బహుజనులకు, ప్రజలకు ఉపయోగపడాలనే లక్ష్యంతో తన జీవిత ప్రయాణం కొనసాగింది.
1876-77 సంవత్సరకాలంలో మహారాష్టల్రో భయంకరమైన కరవు వచ్చింది. మహాత్మా పూలే ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ భోజన కేంద్రాలు ప్రారంభించి అన్నదానం కొనసాగించారు. వారి పాఠశాలల్లో చదివే రెండువేల విద్యార్థులకు ఆహారం ఉచితంగా అందించే బాధ్యత సావిత్రి బాయి తీసుకుంది. కరవు కాలంలో సావిత్రిబాయి కొన్ని వందలమందికి ప్రాణదానం చేసిందంటే అతిశయోక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి మహారాష్ట్ర సమాజానికి సావిత్రిబాయి తల్లిలా మాతృత్వం పంచింది.
1953 జనవరి 28 బాల హత్య ప్రతిబంధక్ గృహాన్ని స్థాపించింది. ఒక్క సంవత్సరంలోనే 32 మంది గర్భవతులకు పురుడుపోసింది. 56 మంది వితంతువులు తమ బిడ్డలను తమ ఇంటి ఆవరణలోని ఊయల తొట్టిలో వేసి వెళ్లారు. ఆనాటి సామాజిక కట్టుబాట్లకు విరుద్ధంగా గర్భయతియై భయంతో ఆత్మహత్య చేసుకోబోతున్న బ్రాహ్మణ వితంతువును రక్షించి తమ ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఆ బ్రాహ్మణ వితంతువు ఖాసీబాయి కన్నబిడ్డ యశ్వంతరావును దత్తత తీసుకొని చదివించి డాక్టర్ను చేసి, జ్యోతిబా మరణానంతరం సత్యశోధక్ సమాజ్‌ను నడిపిన ధీశాలి సావిత్రిబాయి పూలే. మహాత్ముడు జ్యోతిబా పూలే అంత్యక్రియలను తానే నిర్వహించిన సంఘ సంస్కర్త.
1896లో వచ్చిన కరువులోనూ తాను ముందుండి సహాయ కార్యక్రమాలను నిర్వహించిన మానవతామూర్తి. కరువు తరువాత 1879లో పూణే ప్రాంతాన్ని ప్లేగు మహమ్మారి చుట్టుముట్టింది. ప్రాణాంతక వ్యాధి అది తెలిసినా సాటి మనుషులకు సహాయం చేయకుండా ఉండలేనితనం వల్లనే ప్లేగు సోకిన బాలుడిని భుజాన వేసుకుని ఆసుపత్రిలో చేర్చింది. ఆ బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మాతృమూర్తి సావిత్రిబాయి ప్లేగు బారినపడి మరునాడు ఉదయం తుదిశ్వాస విడిచింది. ఒక ఊపిరి ఆగిపోయింది. భౌతికంగా విశ్వంలో కలిసిపోయింది. ప్రజల ఉన్నతిని కాంక్షించిన పూలే దంపతులు కృషి కోట్లమంది విద్యావంతులను ప్రజ్వలింపజేస్తూనే ఉంది.
శూద్రులైన మగవాళ్ళు చదువుకోవడమే తప్పైన కాలంలో స్ర్తిగా సావిత్రిబాయి చదువుకుంది. బ్రాహ్మణ వితంతువులకు ఆసరగా ఉండడమే కాకుండా వారికి గుండు గీయించటానికి వ్యతిరేంగా మంగలి పనివారి సమ్మెకు నాయకత్వం వహించింది. భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయిని, ఆపన్నులను అక్కున చేర్చుకున్న కరుణామయి సావిత్రిబాయి. మరాఠా సాహిత్యంలో తొలితరం రచయిత్రి ఆమే కావడం విశేషం. నేడు మనమందరం నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని స్మరించుకోవాలి. ఆమెను అవగాహన చేసుకోవాలి. సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి. ఆమె ఆశయ సాధనకోసం కృషిచేయాలి.

- వాసిలి సురేష్ 94946 15360