మెయిన్ ఫీచర్

మానవత్వమా.. నీవెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ గురించి నాలుగు మాటలు చెప్పండంటే, నలభై చెబుతామని ఆగమన్నా ఆగరు. సృష్టికి మూలం అమ్మ, అమ్మను మించిన దైవం లేదు, ఆదిగురువు అమ్మ, అమ్మా.. అమ్మా అంటూ ఎన్నో కవిత్వాలు, మరెన్నో వ్యాసాలు. పుస్తకాలు సైతం ముద్రించి అమ్మ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంటారు. కానీ సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం ఎందుకొచ్చింది? తమ పుత్ర సంతానంతో అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి కొంతమంది అమ్మలకెందుకు కలిగిందో ఆలోచించాల్సిన అవసరం వున్నది. కడుపులో పురుడు పోసుకున్నపుడు అమ్మకు కలిగే సంతోషానందాన్ని దేనితో వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం. తమ ప్రాణాలతో సమానంగా పిల్లలను చూసుకుంటూ, అల్లారుముద్దుగా గోరుముద్దలు తినిపిస్తూ, కంటికి రెప్పగా కాపాడుకుంటున్న విషయం సైతం అందరికీ తెలిసిందే. ఇంత తెలిసిన సమాజంలో ఇంకా అమ్మలు కష్టాలు పడుతున్నారంటే కారణమేమిటి? ప్రత్యేకంగా ధనవంతులు, అపారజ్ఞానం కలిగిన ఉద్యోగస్తులకు చెందినవారే వారి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వుంచుతున్నారంటే కారణం నేటి సమాజంలో మానవ సంబంధాలకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఆర్థిక సంబంధాలకే ఇస్తున్నారని అర్థంగాక మానదు.
తమ పిల్లలు తిన్నారో, ఎలాగున్నారో, ఎక్కడున్నారో, ఏమైనా బాధలు పడుతున్నారేమో అనుకుంటూ మదనపడే అమ్మ, ఒక్క ఫోన్ కాల్‌తో ఒక్క మాట మాట్లాడితే చాలు కడుపునిండిన సంతోషంతో సంబరపడిపోతుంది. కానీ అలాంటి ఆలోచన ఎందుకు తమ అమ్మా నాన్నలపై పిల్లలకు కలగదో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది. తమ పిల్లలకోసం ఎంత వయసు వచ్చినా ఆరాటపడే అమ్మను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుమారులపై వున్నది.
అధికారులుగా చెలామణి అవుతూ తమ తల్లిని వృద్ధాశ్రమాలలో ఉంచిన వ్యక్తిని, ఎందుకు సార్ ఇలా చేశారు? పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు, మీ అమ్మగారిని అక్కడ ఎందుకు ఉంచారంటే- మా అమ్మ అంటే నాకు అమితమైన ప్రేమ. అందుకే అక్కడ ఉంచాం. ఎందుకంటే నేను, మా ఆవిడా ఉద్యోగం చేయడం మూలంగా పొద్దున వెళ్లి, ఏదో చీకటిపడ్డాక ఇంటికి చేరుకుంటాము. రోజంతా అమ్మను ఎవరు చూసుకుంటారో తెలియక అక్కడ ఉంచాల్సి వచ్చిందని సెలవిచ్చారు. కానీ అమ్మ ప్రేమ తన బాగోగులకంటే, ఆమె కళ్ళముందు వారుంటేనే సంతోషంగా ఉంటుంది. అవసరమైతే సేవలు చేయడానికి ఎంతోమంది పేదలున్నారు. వారికీ పని కల్పించి ఇంట్లోనే అమ్మనుంచితే ఎంతో బాగుండేది కదా!
ఇంకొకరు, భార్య మూలంగా వృద్ధాశ్రమాలలో చేర్పుతారు. పనిచేసేంత ఓపిక, శక్తి ఉన్నంతవరకు ఇంట్లో అన్ని పనులకు వాడుకొని, చేతగాని సమయం ఆసన్నమైందంటే చాలు, ప్రతిదానికి వారిపై అరుస్తూ, చీటికి మాటికి మాటలతో వారి మనసును బాధకల్గించేలా, తమకు తాము ఇంట్లోనుండి బయటికెళ్లేలా చేస్తుంటారు. కానీ ఇక్కడ అలాంటివారు గమనించాల్సిన విషయం ఒకటుంది. ఎవ్వరూ ఎల్లప్పుడూ నిత్య యవ్వనంతో వుండరు. అందరూ ముసలివారు కావాల్సిందే. మనకీ అలాంటి దుస్థితి రావచ్చు. మనం వృద్ధులను అగౌరవపరిచినప్పుడు ఇంట్లో పిల్లలు చూస్తూ నేర్చుకొని భవిష్యత్తులో మనపై ప్రయోగించలేరని చెప్పగలమా? కాబట్టి ప్రతి ఒక్కరు వృద్ధాప్యంలో వున్నవారిని తల్లిదండ్రులుగా భావించి, చేదోడు వాదోడుగా వుంటూ, చిన్నతనంలో మనను ఎలా చూసుకున్నారో, వారిని సైతం అలా చూసుకుంటూ, ఇంట్లో పిల్లలకు సైతం అలాంటి మంచి విషయాలను బోధిస్తే, దృఢంగా నమ్మి అలా చేయడానికి ఆస్కారముంది. కాబట్టి ప్రతిఒక్కరు వృద్ధాప్యంలో అమ్మ, నాన్నలను కంటికి రెప్పలా చూసుకుంటూ వీలైనంత ఎక్కువ సమయాన్ని వారితో గడుపుతూ, వారి చివరి క్షణాలను ఆనందభరితం చేస్తే ఎంతో మేలు జరిగి జన్మ సార్థకమవుతుంది. అందరూ ఆ దిశగా పయనించాల్సిన అవసరముంది.
పల్లెల్లో సైతం ఆస్తి తగాదాల కారణంగా అమ్మా నాన్నలను దూషించడం, కొట్టడం, ఇంట్లోనుండి గెంటెయ్యడం లాంటి వాటిని అక్కడక్కడా చూస్తూంటాం. ఏ కోణంలో చూసినా నేటి సమాజంలో ప్రేమ, ఆప్యాయతల లాంటివి ఏనాడో కనుమరుగైపోయాయి. సమస్త లోకాన్ని కేవలం డబ్బే శాసిస్తుందనడానికి ఇదొక నిదర్శనం.
అమ్మ ప్రేమను, నాన్న ప్రేమను ఎక్కువ కాలం నోచుకోనివారు అప్పుడప్పుడు వారిలేని లోటును వివరిస్తూ కన్నీళ్ల పర్యంతం కావడం కూడా అప్పుడప్పుడు చూస్తూంటాం. వాస్తవానికి ఏదైనా మన దగ్గర వున్నపుడు దాని విలువ తెలియదు. దూరమైతేనే దాని విలువ తెలుస్తుంది. వృద్ధాశ్రమాల దగ్గరికి వెళ్లి వారిని కదిలిస్తే తెలుస్తుంది, వారు పడ్డ కష్టాలు, అనుభవిస్తున్న తీరు, ఆ తల్లుల మనోవేదనను ఆపడం ఎవ్వరితరమూ కాదు.
వ్యాపారస్తులు సైతం ప్రైవేటుగా సకల సౌకర్యాలు కల్పిస్తూ, హాస్టల్స్ మాదిరిగా వృద్ధాశ్రమాలు నెలకొల్పి, అన్ని సేవలకుగాను కొంత సొమ్ము చెల్లించే విధంగా అక్కడక్కడా ఆశ్రమాలు నెలకొల్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇలాంటి దుస్థితికి చేరుకుంటున్నారంటేనే మానవత్వం ఏ మేరలో పొంగి పొర్లుతుందో తెలియకనే తెలుస్తుంది. ఇప్పటికైనా యావత్ సమాజంలో ఇలాంటి ఆలోచనా ధోరణి కలిగివున్నవారిలో కొంత మార్పు వచ్చి, తల్లిదండ్రులకు తమ జీవిత చివరిదశలో వారిపై ప్రేమ, ఆప్యాయతలు కురిపిస్తూ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏది ఏమైనప్పటికీ మానవత్వం మరిచి తల్లిదండ్రులను వెలివేస్తున్న ఈ తరుణంలో వృద్ధాశ్రమాలు వారికి అండగా నిలుస్తూ, ఆశ్రయం కల్పిస్తున్న మహనీయులని అభినందిస్తూ-ఇలాంటి పరిస్థితులు నెలకొన్నందున చింతిస్తూ కనీసం ఇప్పటికైనా ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి వారి తల్లిదండ్రులకు చేసే సేవను అదృష్టంగా భావించి, ఇలాంటి పరిణామాలకు దారితీయకూడదని ఆశిద్దాం.

-డా॥ పోలం సైదులు