మెయిన్ ఫీచర్

సాధికారత దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..
యత్రే తాస్తున పూజ్యంతే సర్వాస్తత్రా అఫలాః క్రియా!

ఏ ఇంట్లో స్ర్తిలు గౌరవింపబడుదురో ఆ ఇంట దేవతలు ఆనందంతో నాట్యం ఆడుతుంటారు. ఏ ఇంట్లో స్ర్తిలు అవమానమును పొందుతుంటారో ఆ ఇంట్లో జరిగే కార్యాలన్నీ నిష్ఫలం అవుతాయి. ప్రాచీనకాలం నుంచి నేటివరకు ఎందరో స్ర్తిలు మన ముందు ఆదర్శమూర్తులుగా, పతివ్రతా మూర్తులుగా, యుద్ధవీరులుగా, సంఘ సంస్కర్తలుగా మనందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆధునిక కాలంలో ఆడది వంటింటికి పరిమితం కాదు. ఆమె అడుగు అంతరిక్షందాకా అని నిరూపించిన కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, క్రీడల్లో ముందుంటామని నిరూపించిన పి.టి.ఉష, కరణం మల్లీశ్వరి, మిథాలీరాజ్, పి.వి.సింధు, నైనా సెహ్వాల్, రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, ముఖ్యమంత్రులుగా మమతా బెనర్జీ, జయలలిత, వసుంధరారాజే, ఇలా ఏ రంగంలో చూసినా మహిళలు ఎంతో ముందున్నారు.
విద్య, వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, పోలీసు, ఆర్మీ, నేవీ, ఆటో, బస్‌డ్రైవర్, సామాజిక సేవ-ఇలా ఒకటేమిటి అవకాశం వస్తే అన్ని రంగాల్లోనూ సత్తా చాటగలమని నిరూపిస్తున్నారు మహిళలు. పిల్లలకు కంటిపాపలా- భర్త కష్టసుఖాల్లో తోడునీడగా, కుటుంబమనే నావకు చుక్కానిలా- ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ అన్ని ప్రాంతాల్లోనూ ఒదిగిపోతున్నారు. సమాజంలో ఆమెది ఎప్పటికీ పెద్దపీటే. కుటుంబ వ్యవస్థ, దేశాభివృద్ధిలో కీలకభూమికను పోషిస్తున్నది మహిళలే. మహిళలు సమాజానికి దేవుడిచ్చిన వరం. సమాజానికి స్ఫూర్తిదాయకం భారతీయ మహిళలు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినపుడే ఏ సమాజమైనా సంపూర్ణంగా పురోగమిస్తుంది. మహిళలు సాధికారత సాధించడం కోసం యావత్ సమాజం అండగా నిలవాల్సిన అవసరం వుంది.
ప్రతి మగాడి విజయంలో స్ర్తి పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుష శక్తికి తానేమీ తీసిపోమని చాటి చెబుతున్నది స్ర్తి శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషలకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. అందుకే ‘కార్యాషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా, శయనేషు రంభా, క్షమయాధరిత్రి, షట్కర్మయుక్తాం కుల ధర్మపత్ని’ అనే కవి శ్లోకాన్ని సార్థకం చేసుకుంటున్నారు నేటి స్ర్తిలు.
నేడు అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరుగుతున్నది కానీ వారికి మొదటి శత్రువు ఇల్లే. తల్లిదండ్రులు కూడా మగవారిని ఒకరకంగా ఆడవారిని ఒకరకంగా చూడకూడదు. ‘వాడు మగాడు’, ‘నువ్వు ఆడపిల్లవు’ అనే మాట రాకూడదు. వాడితో సమానంగా నువ్వు అన్నమాట వచ్చినపుడు మాత్రమే ప్రగతి సాధ్యమవుతుంది.

లింగ వ్యత్యాస సూచీలో భారత్‌కు 108వ ర్యాంకు
ప్రపంచ ఆర్థిక ఫోరం తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ వ్యత్యాస సూచీ భారత్ 108వ స్థానంలో వుంది. డబ్ల్యూఇఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం లింగ వ్యత్యాసంలో రెండేళ్లుగా భారత్ పరిస్థితి ఒకే విధంగా ఉన్నట్లు స్పష్టమైంది. విద్య, ఆరోగ్యకరమైన జీవనం, ఉపాధి అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యం- ఈ నాలుగు అంశాల ఆధారంగా డబ్ల్యుఇఎఫ్ లింగభేదాన్ని లెక్కిస్తుంది. కాగా స్ర్తి పురుష వేతనాల్లో మాత్రం రికార్డు స్థాయిలో మెరుగైన పరిస్థితి చోటుచేసుకుందని, ఒకే పనికి స్ర్తి పురుషులు ఇద్దరికీ సమాన వేతనం అందుతుందని తెలిపింది. విద్యలో స్ర్తి పురుష భేదం తగ్గిందని పేర్కొన్నది. భారత్‌లో వృత్తి, విద్యతో సహా వివిధ రంగాల్లో మహిళల ప్రాధాన్యం మరింత పెరగాల్సిన అవసరం వుందని డబ్ల్యుఇఫ్ నివేదిక పేర్కొంది. ఉపాధి అవకాశాల కల్పనలో భారత్ 142వ స్థానంలో ఉందని తెలిపింది. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం మన దేశంలో 12 శాతం, బంగ్లాదేశ్‌లో 20శాతం, పాకిస్తాన్‌లో 17.5 శాతం వుంది. స్కాండినేవియన్ దేశాలైన డెన్మార్క్, నార్వే, స్వీడన్‌లలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఎప్పటినుంచో వుంది. మహిళాసాధికారికతతోనే సమాజ పురోగతి సాధ్యం అని అందరూ గుర్తించాలి. కానీ కేంద్ర మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం ప్రతి 44నిముషాలకు ఒక కిడ్నాప్, 17 నిముషాలకు ఒక వరకట్న హత్య జరుగుతున్నాయి.
మన దేశంలో రోజూ కనీసం 150 నుంచి 200 మంది అత్యాచారానికి బలవుతున్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 65 దేశాలలో ఏటా 2.20 లక్షల అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయట. భారత్‌లో జరుగుతున్న నాలుగు ప్రధాన నేరాల్లో ఒకటి అత్యాచార సంఘటనే అని అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా అర్థరాత్రి ఆడది ఒంటరిగా నడవాలని కలలుగన్న జాతీయ నాయకుల కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకుంటున్న భారతదేశంలో ఇటుక బట్టీల్లో, వ్యవసాయ కూలీల్లో, రైస్ మిల్లుల్లో ఏదో ఒక మూలన రోజూ మహిళలు దోపిడీ అణచివేతకు గురవుతూనే వున్నారు. ఆకాశంలో సగభాగమైనప్పటికీ హక్కుల సాధనలో శూన్యంగానే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం వేగవంతంగా దూసుకెళ్తున్నా క్షేత్ర స్థాయిలో మహిళలు సంపూర్ణమైన స్వాతంత్య్రాన్ని ఇంకా అంతగా సాధించలేదని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నిరక్షరాస్యులు కావడంతో సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధిలో మాత్రం ముందుకు వెళ్లడం లేదు. 2012 డిసెంబరు నాటి నిర్భయ ఉదంతం తర్వాత ప్రభుత్వం కఠిన చట్టం తీసుకువచ్చిన పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావటంలేదు.
వేదకాలంలో స్ర్తిలు పురుషులతో సమానంగా గౌరవం పొందారుకానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. స్ర్తిలను పిల్లల్ని కనే యంత్రాలుగా చూస్తున్నారు. స్ర్తిలపై లైంగిక దోపిడీ, హింసలు ఎక్కువ అయ్యాయి. లైంగిక దోపిడీ, హింసకు వ్యతిరేకంగా 2017 అక్టోబరులో మొదలైన ఉద్యమం భారతదేశాన్ని కుదిపేస్తున్నది. తమకు జరిగిన అన్యాయం చెప్పగలుగుతూ అత్యాచార బాధితులు డిగ్నిటీ మార్చ్ చేస్తున్నారు. 2018లో మొదలైన ఈ మార్చ్ స్ర్తిలు తమ బాధల పట్ల వౌనంగా ఉండొద్దని, నిశ్శబ్దాన్ని ఛేదించాలని, నోరు విప్పితే పోయేది ఏమీ లేదు పీడన తప్ప అనుకోవాలని నినాదమిచ్చారు. దీనివల్ల లైంగిక హింస గురించి మాట్లాడానికి స్ర్తిలకి ధైర్యం వచ్చింది.
శక్తి స్వరూపిణికి ప్రతీక అయిన స్ర్తి, పురుషుని జీవితంలో ఎంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుందో వివాహం ద్వారా అవగతమవుతుంది. గృహిణిలేని ఇల్లు అరణ్యంతో సమానము. కానీ ప్రస్తుతం మహిళల్లో అక్షరాస్యత శాతం కేవలం 54 శాతంగానే ఉంది. రాజకీయ సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళాభివృద్ధి సాధించనంతవరకూ సామాజిక భద్రత రాదు. స్ర్తిలలో సామాజిక విప్లవ చైతన్యాన్ని పెంపొందించాలి. స్ర్తిల తక్షణ సమస్యలు తక్షణ డిమాండుగా మార్చాలి. వాటికై సమిష్టి ఉద్యమం కావాలి. వ్యక్తి జీవితంలో విద్య విలువైన సాధనం. స్ర్తికి సహజంగా ఆలోచించే శక్తి ఉంటుంది. చదువుకోవడంవల్ల స్ర్తి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా తనంతట తానే నిలబడే శక్తిని సంపాదిస్తున్నది. ఒక అమ్మాయికి విద్య నేర్పితే మొత్తం కుటుంబానికి విద్య నేర్పడం అంటారు నెహ్రూ.
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం మహిళలు వేతనం లేకుండా చేస్తున్న అనేక పనులకు సమాజంలో గుర్తింపు ఉండటంలేదు. ప్రపంచం మొత్తంగా మహిళలు జీతభత్యాలు లేకుండా చేస్తున్న పని విలువ సంవత్సరానికి సుమరు రూ.716లక్షల కోట్లు. ఇది మొత్తం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 8వ వంతు. 2018లో నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో లెక్కల ప్రకారం మహిళలపై హింసకు పాల్పడ్డ నేరగాళ్ళు 5 లక్షల పైచిలుకే. లైంగిక వేధింపుల నిరోధక బిల్లును చట్ట రూపంలోకి తేవటానికి 10ఏండ్లు పట్టింది. అయినా కనీసం 10శాతం సంస్థల్లో కూడా అమలుకావడంలేదు. ఆడపిల్లలను పిండదశలోనే నులిమేసే భ్రూణహత్యల నివారణకు చర్యలు తీసుకున్నా, ప్రతి వేయిమంది పురుషులకు కేవలం 943 మంది స్ర్తిలు మాత్రమే ఉన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నివేదిక ప్రకారం 15-18 ఏండ్ల వయసున్న బాలికల్లో 39.49 శాతంమంది ఇంకా విద్యకు దూరంగా ఉన్నారు.
అబల కాదు సబల
అంటార్కిటిక్‌ను ఈదిన తొలి మహిళ భక్త శర్మిష్ట, సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన భర్త ఆశయాన్ని కొనసాగించడానికి సైన్యంలో చేరిన ప్రియా సెమ్యాల్, దేశంలో మొట్టమొదటిసారిగా ఆటో నడిపిన షీలా దేశ్, పదహారు సంవత్సరాల వయసులోనే బైక్ హ్యాండిల్ చేపట్టి కశ్మీర్ నుండి కన్యాకుమారి చుట్టిన రోషిణి శర్మ, పదిహేనేండ్ల వయసులోనే ఈ దేశపు కీర్తిని ప్రపంచ యవనిక మీద ఎలుగెత్తి చాటిన సీల్‌సాహు 2011లో ఏథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్‌లో 200 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. దేశపు తొలి ఫైర్ ఫైటర్‌గా హర్షిణి - వీరందరూ చరిత్ర సృష్టించినవారే.
మహిళలు సమాజంలో రాణించాలంటే తపన, పట్టుదల, అంకితభావం ఉండాలి. 2001 సంవత్సరాన్ని భారతదేశం మహిళా సాధికారతా సంవత్సరంగా ప్రకటించింది. మహిళల కొరకు అనేక పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బేటీ బజావో భేటీ పడావో పథకం, మహిళా భద్రతకు షీ టీమ్స్ (తెలంగాణ రాష్ట్రంలో) ఏర్పాటుచేశారు. వరకట్న నిషేధ చట్టం, గృహహింస నిరోధక చట్టం, నిర్భయ చట్టం, మహిళ, శిశు రక్షణ హక్కుల్ని పర్యవేక్షించేందుకు ఒక ఛైర్ పర్సన్, ఆరుగురు సభ్యులతో కలిసి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసింది.
ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో ఐక్యరాజ్యసమితితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇస్తుంది. ఈ సంవత్సరం థీమ్ బెటర్ ద వరల్డ్.. బ్యాలెన్స్ ఫర్ బెటర్ అనే థీమ్ నిర్ణయించారు. లింగ వివక్ష లేని సమానత్వ ప్రపంచాన్ని చూద్దాం అంటూ నినదించనున్నాయి. ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా సమాజంలో మహిళలపట్ల మార్పు రావాలని ఆశిద్దాం. లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం.

-కె.రామ్మోహన్‌రావు, గద్వాల