మెయిన్ ఫీచర్

అందమే కొలమానమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహిళలంటే అందంగా కనిపించాలా?
అందంకోసం బ్యూటీపార్లర్ల వెంట పరుగులు తీయాలా?
అలా పరుగెత్తి పరుగెత్తి అలసిపోతున్నాం..
అందంగా లేకపోతే మాకంటూ ఓ అస్తిత్వం లేదా?
ఓ మనిషిగా మాకు విలువ లేదా?
అందమనే పేరుతో మాపై ఒత్తిడి ఎందుకు?
బాహ్య సౌందర్యం కోసం ప్రయత్నించి.. ప్రయత్నించి.. ఆత్మను కోల్పోతున్నాం.. అందుకే మమ్మల్ని ఇలా బతకనివ్వండి’ అంటోంది హబీబా అనే బంగ్లాదేశ్ ఫొటోగ్రాఫర్. ఈమె వయస్సు 29 సంవత్సరాలు. పేరు హబీబా నౌరోజ్. అందం వెనుక పరుగులు తీస్తూ అస్తిత్వాన్ని కోల్పోతున్న అమ్మాయిలకు ముసుగేసి ఫొటోలు తీస్తోంది. హబీబా ఫొటోల్లోని మహిళలు మంచి శరీర వర్ఛస్సును కలిగి ఉంటారు. కానీ వారి ముఖాలు మాత్రం కనిపించవు. బాహ్యసౌందర్యం కోసం ప్రయత్నించి, ప్రయత్నించి ఆత్మను కోల్పోతున్నాం.. అన్న భావన ప్రతిఫలించేలా, ముఖాలు కనిపించకుండా ముసుగు ధరించి ఉంటారు చిత్రాల్లోని మహిళలు. ఫొటోలు ఇలా తీయడానికి కారణం ఏంటి? అని హబీబాను అడిగితే.. ఇలా బదులిస్తోంది..
‘ఓ మహిళగా అందంగా కనిపించాలి అనే ఒత్తిడి మాపై ఎక్కువగా ఉంటోంది. బంగ్లాదేశ్‌లో మహిళలు అందంగా కనిపించాలి. ఎందుకంటే వారి అందమే కుటుంబ గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల అక్కడ మహిళలు తాము ఆకర్షణీయంగా కనిపించడం కోసం వారు ఓ రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారిని చిత్రించాలన్నదే నా ప్రయత్నం. అందంగా కనిపించాలనే ప్రయత్నం మమ్మల్ని మేము కోల్పోవలసి వస్తోంది. మాకు మేము అనామకులుగా మిగిలిపోతున్నాం. మా అస్తిత్వం మరుగున పడుతోంది. ఇతరుల ఆనందం కోసం బంగ్లాదేశ్ మహిళలు ఎలా రాజీపడవలసి వస్తోందో.. అన్న అంశంపై అందరి దృష్టినీ మళ్లించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవం నుంచి నాకు ఈ ఆలోచన వచ్చింది. యూనివర్శిటీలో నా చదువుపూర్తయిన తరువాత నా చుట్టూ ఉన్న వాళ్లకు నాపై ఎన్నో అంచనాలు ఉండటం నేను గమనించాను. చదువయ్యాక పెళ్లి చేసుకోవాలి. మంచి జీతం వచ్చే ఉద్యోగం చేయాలి. ఇలా నాకు ఎన్నో ఆశలు.. అంచనాలు.. నాకు మాత్రమే కాదు.. నా చుట్టూ ఉన్న ఎందరో అమ్మాయిల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. దాన్ని నేను గమనించాను. నిజంగా వాళ్లకు ఏం కావాలో కూడా మరిచిపోయేట్లు చేస్తోంది సమాజం. ఫొటోగ్రాఫర్‌గా జీవితం ప్రారంభించిన నాకు మొదటి ఏడాదిలో ఎంత కష్టపడి పనిచేసినా, తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ఓ ఉద్యోగంలో మహిళ తనను తాను నిరూపించుకోవాలని భావిస్తే, పురుషుడి కంటే రెండింతలు ఎక్కువగా కష్టపడాలి. కష్టపడి పనిచేస్తుంది కూడా.. అంతచేసినా గుర్తింపు మాత్రం శూన్యం. ఒక మహిళకు చేసిన పనికంటే ఆమె అందంతోనే గుర్తింపు.. అలాంటప్పుడు ఒక మనిషిగా నా అస్తిత్వం కోల్పోతున్నట్లుగా అనిపించేది. నేను చేసే పనికి విలువలేదా? అనే ఆత్మన్యూనత మొదలవుతుంది. దీన్ని నేనో ఛాలెంజింగ్ తీసుకున్నాను. అప్పటినుంచి కేవలం నా ఆనందం కోసమే పనిచేయడం మొదలుపెట్టాను. అలా ఫొటోగ్రాఫర్‌గా ఆరు సంవత్సరాలు పనిచేసిన తరువాత ‘కంసీలెడ్(గుప్తమైన)’ పేరుపై మహిళల ఫొటో సిరీస్‌ను ప్రారంభించాను. నాకు, నా తోటి మహిళలకు ఎదురైన చేదు అనుభవాలను వ్యతిరేకిస్తూ, మహిళలపై ఇతరుల ఆశలు, అంచనాలను విభేదిస్తూ ఈ సిరీస్‌ను ప్రారంభించాను. నేను చెప్పాలనుకున్న ఈ విషయాన్ని మహిళలు త్వరగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నేను చెప్పే విషయం చాలామంది మహిళలకు అనుభవమై ఉంటుంది. కానీ పురుషులు దీన్ని త్వరగా అర్థం చేసుకోలేదు. అనాదిగా పురుష భావజాలమే అది కదా.. ఇది సహజమే.. అందుకని పురుషులకు మాత్రం కాస్త వివరించాల్సి ఉంటుంది. మహిళా ఫొటోగ్రాఫర్ల సృజనాత్మకతను విలువ ఇచ్చే వ్యక్తులు కూడా ఈ రంగంలో ఉంటారు. బంగ్లాదేశ్ మహిళలు కూడా అందరిలాగే బలవంతులుగా ఉండాలని.., మిత్రులెవరో, శత్రువులెవరో పసిగట్టగలిగేలా ఉండాలని నేను కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఎప్పుడైనా, ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు వారిని అందంతో కొలవకుండా, వారు చేసే పని, వారు కష్టపడే తత్త్వంతో కొలిస్తేనే వారికి అస్తిత్వం కల్పించినట్లు.. వారిని గౌరవించినట్లు..’ అని చెబుతోంది హబీబ్.
హబీబా.. తన ఫొటోలను 2016లో ఢాకాలో ప్రదర్శించారు. ఆ ప్రదర్శన పట్ల చాలామంది ఆసక్తి కనబరిచారు. ఈ ఫొటోల వెనకున్న సందేశాన్ని మహిళలు సులవుగానే అర్థం చేసుకున్నారు. కానీ పురుషులకు కాస్త వివరించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో ఎక్కువమంది మహిళా ఫొటోగ్రాఫర్లు లేరు. ఇక్కడ అది కూడా ఓ సమస్య. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా మహిళలు అందం కోసం కాక, సంస్కృతి-సంప్రదాయలను పాటిస్తూనే వ్యక్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో జీవించాలని కోరుకుంటారు, జీవిస్తారు కూడా.. అని నిరూపిస్తున్నారు.

-సన్నిధి