మెయిన్ ఫీచర్

అంకెలు మారినా.. అతివలు తక్కువే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక సమరం ముగిశాక కొలువుతీరిన పదిహేడవ లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం కాస్త మెరుగైంది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే ఇపుడు అంకెల్లో కాస్త మార్పు కనిపించినప్పటికీ, ఆశించిన స్థాయిలో మహిళా ఎంపీల సంఖ్య పెరగలేదన్నది సుస్పష్టం. 543 సీట్లు ఉన్న లోక్‌సభలో ఈసారి 78 మంది మహిళలు (14 శాతం) విజయ కేతనం ఎగురవేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 62 మంది మహిళలు గెలుపొందగా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ముగ్గురు గెలుపొందడంతో 16వ లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 65కు చేరుకుంది. 1952 సార్వత్రిక ఎన్నికల నుంచి చూస్తే మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగానే పెరుగుతోంది. 2019లో మాత్రమే వారి సంఖ్య గరిష్టంగా 78కి చేరింది. దేశవ్యాప్తంగా 41 మంది సిట్టింగ్ మహిళా ఎంపీలు పోటీ చేయగా, వారిలో 28 మంది మాత్రమే తిరిగి గెలుపొందారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, హర్ సిమ్రత్‌కౌర్ బాదల్, సినీతారలు హేమమాలిని, సుమలత, నస్రత్ జహాన్, వివాదాస్పద సన్యాసిని స్వాధ్వి ప్రజ్ఞా ఠాకూర్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారిణి సునీతా దుగ్గల్ వంటి ప్రముఖులు ప్రజాక్షేత్రంలో విజయం సాధించారు. తమిళనాడులోని తూత్తుకూడి నుంచి డీఎంకే తరఫున కనిమొళి, అలహాబాద్ నుంచి రీటా బహుగుణ ఎన్నికల్లో గెలిచి, తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. చట్టసభల్లో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ, ఈసారి 30 శాతం ఎంపీ సీట్లను వారికి కేటాయిస్తానని బీజేడీ పార్టీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుగానే ప్రకటించి తన మాట నిలబెట్టుకున్నారు. దీంతో ఒడిశా నుంచి ఏడుగురు మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. దీంతో బెంగాల్ నుంచి 11 మంది మహిళలు ఎంపిక కావడానికి అవకాశం కలిగింది.
46 కొత్తముఖాలు..
పదిహేడవ లోక్‌సభకు మొత్తం 78 మంది మహిళలు ఎన్నిక కాగా, అందులో 46 మంది తొలిసారిగా చట్టసభలో అడుగుపెడుతున్నారు. ఉత్తరాదితో పోల్చి చూస్తే దక్షిణాది నుంచి ఎన్నికైన మహిళా ఎంపీల సంఖ్య తక్కువే. దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లనూ భారతీయ జనతాపార్టీ కైవశం చేసుకున్నా, మీనాక్షి లేఖి మాత్రమే ఏకైక మహిళా ఎంపీగా గెలిచారు. చండీగఢ్, కేరళ, అస్సాం, హర్యానా, మేఘాలయ, త్రిపుర, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు చొప్పున మహిళలు ఎన్నికయ్యారు. పంజాబ్, ఝార్ఖండ్, కర్నాటక నుంచి ఇద్దరేసి, రాజస్థాన్, తమిళనాడు నుంచి ముగ్గురేసి, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురేసి, మహారాష్ట్ర నుంచి ఎనిమిది మంది, ఒడిశా నుంచి ఏడుగురు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి 11 మంది చొప్పున మహిళా ఎంపీలు గెలిచారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఆరుగురు, ఒడిశా నుంచి ఆరుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు మహిళలు తొలిసారి ఎంపికైన వారిలో ఉన్నారు.
అత్యంత పిన్న వయసులో..
ఒడిశాలోని కియొంఝర్ నుంచి బిజూ జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయ కేతనం ఎగురవేసిన 25 ఏళ్ల చంద్రాణి ముర్ము లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా సరికొత్త రికార్డు సృష్టించారు. కేరళలోని అలతూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన రమ్యా హరిదాస్ ఈసారి లోక్‌సభకు ఎన్నికైన ఏకైక దళిత మహిళా ఎంపీగా వార్తల్లో నిలిచారు.
ఆ అయిదుగురూ కొత్తవారే..
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎన్నికైన అయిదుగురు మహిళా ఎంపీలు తొలిసారిగా ఎన్నికల్లో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన నలుగురూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందినవారే. అనకాపల్లి నుంచి డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, అరకు నుంచి గొడ్డేటి మాధవి, కాకినాడ నుంచి వంగా గీత, అమలాపురం నుంచి చింతా అనూరాధ గెలుపొందారు. తెలంగాణలోని మహబూబాబాద్ నుంచి తెరాస పార్టీ నుంచి మాలోత్ కవిత గెలుపొంది తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన 26 ఏళ్ల గొడ్డేటి మాధవి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ వైకాపా తరఫున బరిలో నిలిచి- కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్ర దేవ్ (తెదేపా)ను 2.21 లక్షల వోట్లతో ఓడించి చరిత్ర సృష్టించారు.
స్మృతి ఇరానీ సంచలనం..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అమేథీ నియోజకవర్గంలో పరాజయం పాలుచేసిన కేంద్రమంత్రి స్మతి ఇరానీ తాజా ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. 2014 ఎన్నికల్లో ఆమె రాహుల్‌పై ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న దృఢ నిశ్చయంతో పకడ్బందీగా ప్రచారం చేసి ఆమె విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చిరకాలంగా కంచుకోట లాంటి అమేథీలో ఆ పార్టీ అధ్యక్షుడిని ఓడించడంతో స్మృతి ఇరానీకి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది.
ఇంకా పెరగాలి..
లోక్‌సభకు 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో 22 మంది, 1957లో 22 మంది, 1962లో 31 మంది, 1967లో 29 మంది, 1971లో 22 మంది, 1977లో 19 మంది, 1980లో 28 మంది, 1984లో 42 మంది, 1989లో 29 మంది, 1991లో 37 మంది, 1996లో 40 మంది, 1998లో 43 మంది, 1999లో 49 మంది, 2004లో 45 మంది, 2009లో 59 మంది, 2014లో 62 మంది మహిళా ఎంపీలు గెలిచారు. లోక్‌సభతో పాటు శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఏనాడో అటకెక్కడంతో- రాజకీయ పార్టీల దయాదాక్షిణ్యాలపైనే మహిళలకు అరకొరగా టిక్కెట్లు దక్కుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి విజృంభిస్తున్నా- 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందనంత వరకూ చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంటుందన్నది కాదనలేని కఠోర వాస్తవం. తాజా లోక్‌సభ ఎన్నికలే ఇందుకు ప్రబల నిదర్శనం. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 724 మంది మహిళలు పోటీ చేశారు. ఇందులో 222 మంది స్వత్రంత్రులే కావడం గమనార్హం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ నుంచి 54 మంది, భాజపా నుంచి 53 మంది మహిళలు పోటీ చేశారు. వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి 691 మంది అతివలు బరిలో నిలిచారు. నలుగురు ట్రాన్స్‌జెండర్లు సైతం ఎన్నికల్లో పోటీ చేశారు.
పల్లె నుంచి ఢిల్లీకి..
ఎక్కడో మారుమూల పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఎకాఎకిన పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది.. తాజా లోక్‌సభ ఎన్నికల సమరంలో దేశం మొత్తం మీద గెలిచిన ఏకైక దళిత మహిళగానూ రికార్డు సృష్టించింది.. కేరళలోని అలతూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన రమ్యా హరిదాస్ (32) రాజకీయంగా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఇపుడు జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకొంది. కేరళ నుంచి ఈసారి ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీగానూ ఆమె మరో ఘనతను తన ఖాతాలో వేసుకొంది.
రమ్య తండ్రి దినసరి కూలీ. తల్లి టైలరింగ్ వృత్తి చేస్తోంది. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే రమ్యకు రాజకీయాల్లో రాణించాలన్న ఆకాంక్ష చిన్నప్పటి నుంచి ఉంది. పేదరికం కారణంగా పదవ తరగతి వరకూ చదివిన ఆమె ఉన్నత చదువులకు వెళ్లలేక ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల ఆసక్తి చూపింది. విద్యార్థుల సమస్యలపై గళం విప్పి పోరాడేది. విద్యార్థి సంఘ నాయకురాలిగా చేసిన సేవల గురించి తెలుసుకున్నాక, రమ్యను అలతూర్ నుంచి నిలబెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏరికోరి ఎంపిక చేశారు. ఎన్నికల ప్రచారంలో పాటలు పాడుతూ ఎంతో హుషారుగా పాల్గొన్న ఆమె ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నికల ప్రచారం చేసేందుకు చేతిలో డబ్బు లేకున్నా జనం తనను ఆదరిస్తారని ఆమె నమ్మింది. తన వద్ద 22,816 రూపాయల నగదు మాత్రమే ఉందని రమ్య ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొంది. అలతూర్‌లో సిట్టింగ్ ఎంపీ పీకే బిజూ (సీపీఎం)ను 1.59 లక్షల ఓట్ల ఆధిక్యతతో నిరుపేద రమ్య ఓడించడం సంచలనం సృష్టించింది.

-ఎస్‌ఆర్