మెయిన్ ఫీచర్

మంగళకరం గౌరీదేవి వ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముతె్తైదువుల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటాయి. హిందువులు సకల శుభప్రదమైన శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించి.. భక్తి శ్రద్ధలతో చేసే వ్రతాల్లో ‘మంగళగౌరీ వ్రతం’ కూడా ముఖ్యమైనది. శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మహిళలు చేసే ఈ పూజను ‘శ్రావణ మంగళగౌరీ పూజ’ అని కూడా అంటారు. ‘కుటుంబానికి సకల శుభాలను, సంతోషాలను అందించి చల్లగా కాపాడు తల్లీ..’ అని ఆ జగజ్జనని పార్వతీ మాతను వేడుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలు.
పురాణాల ప్రకారం..
కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృత క్షీరసాగర మథనం చేసే సమయంలో ముందు కాలకూట విషం పుట్టింది. దాన్ని చూసి భయపడిన దేవదానవులు పరమేశ్వరుడిని వేడుకున్నారు. ఈ సమయంలో పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేం చేయాలి? అన్నట్లు పార్వతి వైపు చూశాడట. ఆ సర్వ మంగళ స్వరూపిణియైన జగన్మాత తన భర్త చూపులోని ఆంతర్యాన్ని గ్రహించింది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మన భక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక ఇంకెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్ర్తిల సౌభాగ్యసంపదనను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీదేవి తన మాంగల్యంపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశనానికి కారణమైన విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతించిందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి కరుణారూపిణి, సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీ దేవిని కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ‘మంగళగౌరీ వ్రతం’ ద్వారా పూజిస్తే వారికి గౌరీ మాత కటాక్షం లభిస్తుందని, అలాగే వారికి సౌభాగ్యం, సర్వసుఖాలు సంప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం.
ఈ మాసంలో ముఖ్యమైనవి మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ‘ఐదవతనం’ కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుడు వద్దకు వెళ్లి ‘అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు’ అని అడగ్గా.. శ్రీ కృష్ణుడు వెంటనే ‘మంగళ గౌరీ దేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమ శివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరి దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరిని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాల్లో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు’ అని చెప్పా డని పురాణ కథనం. పురాణ కాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.
శుభాలు కలిగే.. మంగళగౌరి వ్రతం శ్రావణమాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారుచేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్ర్తిలు మాంగల్యానికి అధిదేవత అయిన ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్ర్తిలు తమ మాంగల్యాన్ని పదికాలాలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదు సంవత్సరాల పాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోను, ఆ తరువాత నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలో ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాక, దీర్ఘసుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువల్ల పరమ శివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.
నియమాలు
* తొలిసారిగా నోము ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి.. పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే పూజ అయిన తరువాత తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముతె్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు.
* వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.
* వ్రతాన్ని పాటించే రోజు ఉపవాసం ఉండాలి.
* వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
* వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముతె్తైదువులను పేరంటానికి పిలిచి వాయనాలు ఇవ్వాలి.
* మంగళగౌరీ దేవి విగ్రహాన్ని ఆ మాసంలో వచ్చే నాలుగు వారాలు ఉపయోగించాలి. వారానికో కొత్త విగ్రహాన్ని మార్చకూడదు.
* ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వచ్చే వినాయకచవితి పండుగ పిదప వినాయకునితో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి.
* అమ్మవారి పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి.
పూజా విధానం
* వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయానే్న లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తర్వాత పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి.
* మండపం పైన బియ్యపుపిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన ఎర్రటి లేదా ఆకుపచ్చటి వస్త్రాన్ని తీసుకుని పూజా ప్రదేశంలో పరచాలి. పైన బియ్యం పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దీనిపై మరో జాకెట్ బట్టను ఉంచి, తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది. అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమపిండిని కలిపి మంగళగౌరిని తయారుచేసుకుంటే మంచిది. మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారుచేసుకోవాలి. అంటే పసుపు, గోధుమపిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్ని ఉంచాలి. ఈ విధంగా మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారుచేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి. పైన చెప్పినటువంటివే ప్రస్తుతం ‘మంగళగౌరి’ విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్‌లో దొరుకుతున్నాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. లేదా గౌరీదేవి ఫొటోని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్ని చేసుకోవాలి.
* బియ్యంతో నవగ్రహాలను తయారుచేయాలి. తర్వాత గోధుమపిండితో పదహారు మంది అమ్మవార్లను తయారుచేయాలి.
* మనం ఎక్కడైతే పూజ నిర్వహిస్తామో ఆ మండపానికి ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి.
* మనం అన్ని పూజలకు ఎలాగైతే కలశాన్ని అలంకరిస్తామో ఈ పూజకు కూడా అలాగే కలశాలంకరణ చేయాలి. తర్వాత దీపాలు వెలిగించాలి.
* గౌరీదేవి పూజ ప్రారంభానికి ముందు వినాయకుడి పూజ నిర్వహించాలి. అందుకోసం.. పసుపు, కుంకుమ, గంధం, తమలపాకులు, అక్షతలు, పూలు, పండ్లు.. మొదలైనవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
* ఇలా వరుసగా వినాయకుడికి, నవగ్రహాలకు, పదహారు మంది అమ్మవార్లకు పూజ చేసిన తర్వాత మంగళగౌరీ దేవికి షోడశోపచార పూజ నిర్వర్తించాలి.
* పదహారు రకాల పూలు, పండ్లు, అద్దం, దువ్వెన, గాజులు.. ఇవన్నీ అమ్మకు భక్తితో సమర్పించాలి. అనంతరం వ్రత కథ చదివి వ్రతాన్ని పూర్తిచేయాలి.
* ప్రసాదం, కుంకుమ, పసుపు.. మొదలైనవాటితో ముతె్తైదువులకు వాయనాలు ఇవ్వడంతో పూజ ముగుస్తుంది.
* పూజా విధానం, పూజ సమయంలో పఠించాల్సిన నామాలు, స్తోత్రాలు, వ్రత కథ మొదలైన వాటికోసం ప్రసిద్ధ పండితులు రచించిన పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి