మెయిన్ ఫీచర్

తెలుగింట బతుకమ్మ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతుకమ్మ పండుగ వర్షాకాలం వెళ్ళిపోతుండగా, చలికాలం వస్తుండగా వస్తుంది. అంటే దక్షిణాయనం, ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఎంగిలి పూల అమావాస్యగా మొదలవుతుంది. తొమ్మిది రోజుల బతుకమ్మ ఆశ్వయుజ శుక్ల నవమి పండుగతో ముగుస్తుంది.

తెలుగువారి సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేటటువంటి మహా పర్వదినం బతుకమ్మ పండుగ. తెలంగాణ ప్రాంతంలో ఇటు బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంటే, అటు ఆంధ్ర ప్రాంతంలో దసరా ఉత్సవాలు, నవరాత్రులు మొత్తం కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద పండుగే విజయదశమి. బతుకమ్మ అనగానే తెలంగాణ పల్లెలు గుర్తొస్తాయి. ఇది తెలంగాణలోని ఆడబిడ్డలు వేడుకగా చేసుకుంటారు. బతుకమ్మను తెలంగాణలోని ప్రతీ ఒక్కరు తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. కుల మతాలకు అతీతంగా చేసుకుంటారు. పేదవారు, ధనికులు అనే బేధం ఉండదు. బతుకమ్మ పండుగ అంటే ఒక విధంగా సమాజంలోని ప్రతీ ఒక్కరు సహజీవనం చేయడమన్నమాట. తెలంగాణలో ‘‘గౌరీదేవి’’కి ప్రతి రూపంగా బతుకమ్మను పూజిస్తారు, ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్యనాడు ఆరంభమై, మహర్నవమితో ముగిసిపోతుంది. అదే విధంగా విజయదశమి పండుగ శుక్లపాడ్యమితో ప్రారంభమై (విజయదశమి) దశమినాడు (దసరా) ముగుస్తుంది. తెలంగాణలో బతుకమ్మ అనేది ఇంటి పండుగ, ఇంటి ఆడబిడ్డల పండుగ. బతుకమ్మ పండుగ వస్తోందంటే ఆడబిడ్డలంతా వారం రోజులముందే పుట్టిల్లు చేరతారు. తెలంగాణ ప్రాంతంలో వచ్చే అన్ని పండుగల్లోకి బతుకమ్మ, దసరా అతి పెద్ద పండుగలు. దసరాను నవరాత్రులుగా జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగను శరన్నవరాత్రి అని కూడా పిలుచుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే ప్రతీ పండుగకు స్థానికంగా ఉండేటటువంటి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ, సంప్రదాయాలు ఉల్లాసంగా బంధుమిత్రులతో గడుపుకుంటారు. ఈనెలలో ప్రకృతి అంతాకూడా ఒక పూల వనం మాదిరిగా ఉంటుంది. రంగు రంగుల పూలతో పుడమి అంతా కప్పబడి ఉంటుంది. నేలంతా డెకరేట్ చేసినట్లుగా అన్పిస్తుంది. అంతకుముందు వచ్చిన వానలతో కుంటలు, చెరువులు అన్నీ పూర్తిగా నిండిపోయి నిండుకుండల్లా కన్పిస్తాయి. అందులోని నీరు బతుకమ్మను ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటాయి.
బతుకమ్మ అంటే తెలంగాణవారి జీవన విధి విధానాలు, ఆత్మీయతలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ బతుకమ్మ పండుగ వర్షాకాలం వెళ్ళిపోతుండగా, చలికాలం వస్తుండగా వస్తుంది. అంటే దక్షిణాయనం, ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఎంగిలి పూల అమావాస్యగా మొదలవుతుంది. తొమ్మిది రోజుల బతుకమ్మ ఆశ్వయుజ శుక్ల నవమి పండుగతో ముగుస్తుంది. ఇందులో 6వ రోజు మాత్రం బతుకమ్మను పేర్చరు. ఇది అనాదిగా వస్తోన్న ఆచారం. బతుకమ్మ ఒకప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆడేవారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక బతుకమ్మకు పెద్దపీట వేసింది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఏ పండుగకు కేటాయించనన్ని నగదును బతుకమ్మ పండక్కి కేటాయించింది. బతుకమ్మ అంటే ఎన్నోరకాల పూలతో తయారుచేసేది. గ్రామాల్లో పూలు ఎక్కువగా దొరుకుతాయి. నగరాలు, పట్టణాల్లో అతికష్టం అయినప్పటికీ తెలంగాణ ఆడపడుచులు వందల రూపాయలు ఖర్చుచేసి పూలుకొని మరీ బతుకమ్మలను పోటీపడి మరి పేరుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పూల గిరాకీ కూడా బాగా పెరిగింది. బతుకమ్మ పండుగ వస్తోందంటే ఇప్పుడు ఊర్లు, నగరాలు అన్నీ ఉత్సవ కళను సంతరించుకుంటున్నాయని చెప్పవచ్చు. పితృ అమావాస్య లేదా ఎంగిలిపూల అమావాస్యనాడు తొలి బతుకమ్మతో మొదలవుతుంది. ఈరోజున పితృకార్యాలు చేస్తారు. పితృకార్యాలు నిర్వహించిన తర్వాత ఇంట్లోఉన్న స్ర్తిలందరూ భోజనాలు ముగించుకున్నాక ఈ బతుకమ్మను పేరుస్తారు. కనుక ‘‘ఎంగిలిపూల అమావాస్య’’, ‘‘ఎంగిలిపూల బతుకమ్మ’’గా వాడుకలోకి వచ్చింది. ఇక మరుసటి రోజునుండి స్ర్తిలంతా రోజంతా ఉపవాసం ఉంటూ తంగేడు, గునుగు లాంటి పూలతో బతుకమ్మను పేరుస్తారు. పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మలో పెడతారు. తంగేడు పూలు ఎందుకు ఎక్కువగా వాడతారంటే.. అవి స్ర్తిల ఐదవ తనానికి సంకేతం. ఏ పువ్వు ఉన్నా, లేకున్నా తంగేడు పూలు ఖచ్చితంగా బతుకమ్మను పేర్చడంలో వాడాల్సిందే. అవి స్ర్తిల ముతె్తైదువ తనానికి నిదర్శనం. అందుకనే ప్రతీ బతుకమ్మలో కొన్నయినా తంగేడు పూలు కన్పిస్తుంటాయి. ఇక గునుగు పూలు, బంతి పూలు, చేమంతులు, నందివర్ధనం, పచ్చగనే్నరు పూలు, చెరువులో ఉండేటటువంటి అల్లిపూలు, తామర పూలు, ఇంకా రకరకాల పూలతో బతుకమ్మను ఎంతో సుందరంగా, భక్తిప్రపత్తులతో ఎంతో నిష్ఠతో పేరుస్తారు.
ఈ తొమ్మిది రోజులు కూడా బతుకమ్మలను కలిసి ఆడతారు. కానీ చివరి రోజయినటువంటి సద్దుల బతుకమ్మరోజు మాత్రం అందరూ కలిసి ఒకే దగ్గరకుచేరి ఊరుఊరంతా చెరువు గట్లకు చేరి బతుకమ్మను తమ ఆటాపాటలతో ఆడుతుంటే అక్కడ ఒక ఉత్సవ వాతావరణం కన్పిస్తుంది. ఎవరికున్నంతలోవారు ఖరీదయిన చీరలు, నగలు వేసుకొని ఆడుతుంటే అస్సలు కళ్ళుసరిపోవు ఆ దృశ్యం చూడటానికి. వారు వారిని మరిచిపోయి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతుంటే ఒళ్ళు మైమరచిపోవాల్సిందే. అంతటి ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో మైక్‌సెట్లు పెట్టేవారు. అదే యిప్పుడయితే డీజేలుపెట్టి బతుకమ్మలు ఆడుతున్నారు. బతుకమ్మ పండక్కి సంబంధించి పాటలే ప్రధానం. బతుకమ్మ పాటలు ఎక్కువగా జానపదాలకు, పల్లె పదాలకు సంబంధించినవే ఉంటాయి. తొమ్మిదో రోజున అందరి బతుకమ్మలు ఒక దగ్గిరపెట్టి అందులో ఉన్నటువంటి పెద్ద బతుకమ్మను మధ్యలోపెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. లయప్రధానంగా బతుకమ్మ పాటలుంటాయి. బతుకమ్మ పాటలన్నీ కూడా పల్లెల్లోని మనుషుల జీవన విధానాన్ని, పరిస్థితులనుకూర్చి పాడేవిగానే ఉంటాయి. ఇంకా కొనే్నమో గత చరిత్రలకు సంబంధించి ఉంటాయి. బతుకమ్మ పండక్కి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. అందులో కొన్ని-
* చోళ దేశాన్ని ధర్మాంగుడు అనే చక్రవర్తి పరిపాలిస్తుంటాడు. అయితే అతని భార్య అయినటువంటి సత్యవతి నూరు నోములు నోచి నూరుగురు సంతానాన్ని పొందింది. కానీ శత్రువుల చేతిలో వారందరూ చనిపోయారు. ఆ ఘోరాన్ని భరించలేక ఆ దంపతులిద్దరూ అరణ్యానికి వెళ్ళి, రాజు అక్కడ తపస్సుచేస్తుండగా లక్ష్మీదేవి కనిపించి, సాక్షాత్కరించి ఏంకావాలో వరం కోరుకొమ్మనగా తమ కూతురిగా లక్ష్మీదేవినే జన్మించమని కోరగా సత్యవతి గర్భంలో లక్ష్మీదేవి చేరి కూతురిగా జన్మించగా అది తెలుసుకున్నటువంటి వశిష్టాది మహర్షులందరూ అక్కడికి వెళ్ళి ఆ బాలికను ‘‘బతుకమ్మ’’ అని దీవించారు. బ్రతుకునిచ్చే తల్లిగా బతుకమ్మ అందరికీ చేరువయ్యింది. ఇక రానురాను అదే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ తరువాత కాలంలో శ్రీహరి చక్రాంగుడుగా వచ్చి ఆమెను వివా హం చేసుకోవడం, యుద్ధంచేసే శతృరాజులను ఓడించి, మామ అయినటువంటి ధర్మాంగుడికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం, ప్రజలు అంతాకూడా సుఖంగా జీవించడం జరిగింది. ఇది ప్రాచుర్యంలో ఉన్న ఒక కథ.
* ప్రజలందరూ పార్వతీదేవిని బతుకమ్మగా, గౌరమ్మగా పూజిస్తారు. అయితే దక్షయజ్ఞంలో అవమానం పాలయినటువంటి పార్వతీదేవి ఆత్మాహుతి అవడంవలన అక్కడున్న వారంతా ఏకకంఠంతో ‘‘బతుకమ్మ, బతుకమ్మా’’ అంటూ రోధించారనీ, వారి రోదనలు విన్నటువంటి పార్వతీదేవి వారిని కరుణిస్తూ, వారి మొర ఆలకిస్తూ మళ్ళీ జన్మించిందని, అందుకే ఆ రోజునుంచీ బతుకమ్మ చేస్తున్నారనేది ఒక విశ్వాసం.
* ఇంకొక చరిత్ర ఆధారం ఏమిటంటే కాకతీయ రుద్రమదేవి తన దాయాదులైనటువంటి వారిపై యుద్ధం చేసి అందులో గెలిచి రాజ్యానికి తిరిగి వచ్చి పెద్దఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించిందని ఒక కథ కూడా ఉంది. అలాగే సాహితీవేత్తలు ఆనాటి రుద్రమదేవి కాలంనాటి బతుకమ్మ పండుగకు బాగా ఆదరణ వచ్చిందని, ఆయన అభిప్రాయాన్ని ఒక జానపదంగా పాడితే, యుద్ధ్భూమిలో అజాత శత్రువు వెన్నుపోటు పొడవబోతే అప్పుడు ఒక స్ర్తి కాపాడిందని, అప్పుడు రుద్రమదేవిని కాపాడినందుకుగాను ఆ మహిళను ఒక దైవంగా భావించి పూజలు చేశారని.. అలా బతుకమ్మ పుట్టిందని ఓ కథ ఉంది.
బతుకమ్మను పేర్చడం గొప్ప కళ. పళ్ళెంలో అడుగున బీర ఆకులు పరిచి చుట్టూ తంగేడు పూలు పెట్టుకుంటూ, కడుపులో (లోపలి భాగంలో) చిక్కుడు ఆకులు, గుమ్మడి ఆకులు నింపుకుంటూ బ్యాలెన్స్ తప్పిపోకుండా ఒక్కొక్క వరుసగా పేరుస్తూ శిఖరంలా వచ్చేంతవరకు పేర్చి, పైన పసుపుముద్దతో గౌరమ్మను చేసి దానికి కుంకుమబొట్టును పెట్టి అగరువత్తులు, నైవేద్యం (సత్తుపిండి) పెడతారు. పూలను పూలతో పూజించేటటువంటి ఆచారం సృష్టిలో మన యిరు తెలుగు రాష్ట్రాల్లో తప్ప యింకెక్కడా కన్పించదు. దేవుళ్ళను పూలతో పూజిస్తాము. కానీ, పూలనే పూలతో పూజిస్తున్నామంటే ఆ పూలకు మనం దైవత్వాన్ని ఆపాదిస్తున్నాం అన్నమాట. అంతటి గొప్ప సంస్కృతీ, సంప్రదాయాలు కల్గిన చరిత్ర మన తెలంగాణ వాసులది.

- శ్రీనివాస్ పర్వతాల, 9014916532