మెయిన్ ఫీచర్

ఆడపిల్లను రక్షిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. గ్రహాంతర జీవనానికి సైతం మనిషి ఉరకలెత్తేస్తున్నాడు. స్ర్తి, పురుష సమానత్వ విషయంలో ఆలోచనలు మాత్రం ముందుకు వెళ్లడమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా 14 ఏళ్లలోపు వయసు కలిగిన అమ్మాయిలు చాలా గ్రామాల్లో మధ్యలోనే చదువు ఆపేసి ఇంట్లోనే ఉండిపోతున్నారు. ప్రపంచంలో నాలుగోవంతు 18 సంవత్సరాల లోపు బాలికలకు వివాహాలు చేస్తున్నారు. దీనివల్ల చిన్నవయసులో గర్భస్రావాలు జరిగి వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతున్నారు. బాగా చదువుకుని స్వశక్తితో ఎదగాలన్న ఆలోచన ఏ కోశాన వారిలో కనిపించకపోవడంతో బాలికలు వెనుకబడిపోతున్నారు. ప్రపంచంలో ప్రతి ఏడుగురు బాలికల్లో ఒకరు 16 ఏళ్ళలోపే తల్లులవుతున్నారు. రోజుకు పాతికవేలమంది చిన్నారులు పెళ్లికూతుళ్లవుతున్నారు. ప్రపంచంలో నిరక్షరాస్యుల్లో 64 శాతం మంది మహిళలే. ప్రపంచ బాలికల్లో కేవలం 30 శాతం సెకండరీ స్థాయివరకే పరిమితమవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.20 కోట్ల బాలికలను అక్రమంగా తరలిస్తున్నారు. లక్షన్నర మంది బాలికలు కాన్పుసమయంలో ప్రాణం కోల్పోతున్నారు. భారత్‌లో ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు బాల్య వివాహాల చట్రంలో నలిగిపోతున్నారు. యుక్తవయసు రాకుండానే రోజుకు 20వేలమంది బాలికలు బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఈ దుస్థితినుంచి వారిని తప్పించాలంటే విద్యకు మించిన సాధనం మరొకటిలేదు.
లింగవివక్ష - చదువుకు దూరం..
ఒకటవ తరగతిలో చేరిన ప్రతి వందమంది బాలురలో 76మంది మాత్రమే పదవ తరగతివరకు చదువుతున్నారు. అదే బాలికల్లో అయితే 53 మంది మాత్రమే చదువుతున్నారు. కుటుంబ కట్టుబాట్లు బాల్యవివాహాలు, వలసలు, లింగవివక్ష, అధిక సంతానం, అవిద్య, ఆర్థిక భరోసా లేకపోవడం, ఇంటి పనులు ఇత్యాది కారణాలవల్ల చదువు మధ్యలో మానివేయడం జరుగుతుంది. అసలు 5-14 ఏళ్ల లోపు 22 మిలియన్ల పిల్లలకు ప్రాథమిక విద్య అందుబాటులో లేదు. మగపిల్లలకే ప్రాధాన్యం ఇవ్వడంవల్ల ఆడపిల్లలు అశ్రద్ధకు, తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. దేశంలో చిన్నారులు పాఠశాలల్లో చేరకపోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని స్ర్తి పురుషుల నివేదిక 2017 గతంలో వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో ప్రతి 1000మంది బాలురకు కేవలం 918 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. 2031 నాటికి ఆడపిల్లల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. బేటీ పడావో, బేటీ బచావో వంటి పథకాలు, కెజిబివి పాఠశాలలవల్ల ఆడపిల్లల్లో కొంతమేరకు డ్రాప్‌అవుట్స్ శాతం తగ్గింది. ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది. విద్య ద్వారానే బాలికా సాధికారిత సాధ్యమవుతుంది. బాలికావిద్య, పౌష్ఠికాహారం, బాల్య వివాహాలు, న్యాయ, వైద్యపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2012 అక్టోబరు 11న బాలికా దినోత్సవాన్ని జరపాలని, 2011 డిసెంబర్ 9న నిర్ణయించింది. అప్పటి కెనడా స్ర్తి సంక్షేమ శాఖ మంత్రి రొనా ఆంబ్రోస్ ప్రతిపాదనతో ఈ దినోత్సవానికి ఒక రూపం వచ్చింది.
పేదరికమే శాపం..
‘‘బాల్య వివాహాలకు ముగింపు పలుకుదాం’’ అనే నినాదంతో 2012లో తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరపడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఆడపిల్లలు ఉన్నారు. లిథిమోనియా వంటి కొన్ని దేశాల్ని మినహాయిస్తే మిగతా దేవాలలో బాలుర సంఖ్యతో పోలిస్తే బాలికల సంఖ్య తగ్గిపోతుంది. నేటి బాలికే రేపటి మహిళ కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చే ప్రాధాన్యతను బాలికా దినోత్సవానికి కూడా ఇవ్వాలి. ఆప్ఘనిస్తాన్ కూడా బాలికల చదువు విషయంలో వెనుకే ఉందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ తన నివేదికలో పేర్కొంది. ఇక్కడి పాఠశాలల్లో 60 శాతం డ్రాపౌట్స్ నమోదైందని యూనిసెఫ్ పేర్కొంది. నిజానికి పేదరికమే బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. నిరుపేద కుటుంబాలలోని అత్యధికులు తమ అమ్మాయిలను చిన్నతనంలో పెళ్లిచేసి ఓ బృహత్కార్య బాధ్యతనుంచి స్వేచ్ఛ పొందినట్లుగా భావిస్తున్నారు. నిరక్షరాస్యులైన కుటుంబాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారత్ లాంటి అధిక జనాభా వున్న 100 దేశాల్లో బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. బాల్యం బాగుంటేనే భవిష్యత్తులో పౌరులు బాగుంటారు. లేకుంటే ఆరోగ్యపరంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరులతో దేశం మొత్తం బలహీనంగా తయారౌతుందని అందరికీ తెలుసు.
ఆందోళన కల్గిస్తున్న బాల్య వివాహాలు..
బాల్య వివాహాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందంటే ఆందోళన కల్గిస్తోంది. ప్రపంచంలోని బాల్య వివాహాల్లో 40 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని యునిసెఫ్ వెల్లడించింది. పేదరికం, అవిద్య, చిన్న వయసలోనే బలవంతపు పెళ్లిళ్లు, పోషకాహార లేమి, పేద బాలికల పట్ల శాపాలవుతున్నాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడిన సమస్యలు, బాలికల చదువు ప్రపంచానికి సిరులు కురిపిస్తుందని అంటారు. కానీ వారికి విద్యాబుద్ధులు చెప్పించకపోవడం, ప్రాథమిక విద్యకు దూరం చేయడంతో తీరని నష్టం వాటిల్లుతుందని గతంలో ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తంచేసింది. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 15 లక్షల కోట్ల డాలర్లు (1.027 లక్షల కోట్లు) నుంచి 30 లక్షల కోట్ల డాలర్లు (రు.2.055 లక్షల కోట్లు) సంపద నష్టం వాటిల్లుతుందని అంచనావేసింది. అల్పాదాయ దేశాలకు చెందిన బాలికల్లో మూడింట రెండింతలమందికంటే తక్కువమంది మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తిచేస్తున్నారని వివరించింది. కనీస విద్యకు నోచుకోని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్లమంది బాలికలు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, సిఈఓలు కాలేకపోతున్నారు. విద్యలో లింగ అసమానతలను తగ్గించేందుకు ఈ దినోత్సవమే సరియైన సమయం. విద్యకు దూరం కావడం ద్వారా అన్నిరంగాల్లో బాలికలు వెనుకబడిపోతున్నారని జనాభా పెరుగుదలకు, బాల్య వివాహాలకు ఇది కారణమవుతుందని ప్రపంచ బ్యాంకు విశే్లషించింది. అక్షరాస్యత స్థానంలో అన్ని రాష్ట్రాలకంటే అట్టడుగు స్థానంలో తెలంగాణ ఉంది.
ఆడపిల్ల ఆదిపరాశక్తి..
అందుకే ఆడపిల్లని బతకనిద్దాం- చదవనిద్దాం- ఎదగనిద్దాం. కిశోర బాలిక మహిళగా రూపొందే కీలక దశ కౌమారదశ. ఆమెకు వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ సాధికారితా దిశలో నడిపించడానికి ఆమెకు అవగాహన అవసరం. భారతదేశంలో 47 శాతంమంది మధ్య వయసు బాలికల్లో బరువు తక్కువగా ఉన్న లక్షణాలు కనిపిస్తాయి. ఆఫ్రికా ఖండంలో మాథ్యమిక విద్యలేని బాలికలు 2 కోట్లమందిగా నివేదికలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లమంది ఆడపిల్లల వివాహాలు 18 సంవత్సరాలలోగా జరుగుతున్నాయి. ఆడపిల్ల అంటే ఆటబొమ్మకాదు.. ఒక అద్వితీయ శక్తి అన్నాడో మహారచయిత. ఆడపిల్లలు చదువుకి దూరమయ్యేకొద్దీ ప్రపంచం పేదరికానికి దగ్గరవుతూనే ఉంటుందన్నది వన్ క్యాంపైన్ అధ్యక్షుడు గేల్ స్మిత్ అభిప్రాయం. నిజానికి మానవుని మనుగడకు, భవిష్యత్తుకు కేంద్ర బిందువు బాలిక. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కాదు.. పాడుపిల్లగా అనే అవగాహన నుంచి బయటపడితే మహిళలమీద జరుగుతున్న హింసకు అడ్డుకట్ట పడుతుంది.
తమ దేశంలో బాలికలకు పోషకాహార లోపాలు లేకుండా చైనా, బ్రెజిల్, వియత్నాం వంటి దేశాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో 68 శాతం బాలికలు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారని యూనిసెఫ్ నివేదిక కుండబద్దలుకొట్టింది. మన దేశంలో ఏటా 2.66 కోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్య బంగ్లాలో 39.3 లక్షలు, పాకిస్తాన్‌లో 18.3 లక్షలు, బ్రెజిల్‌లో 29.3 లక్షలు, మెక్సికోలో 12.8 లక్షలుగా ఉంది. రాజస్థాన్ 37 శాతంతో బాల్యవివాహాల్లో మొదటి స్థానం ఆక్రమించింది.
గర్భస్రావాలను అరికడదాం..
జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15.2 శాతం అమ్మాయిలకు 18 ఏళ్ళలోపే వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు రెండున్నర కోట్ల గర్భస్రావాలు అరక్షిత స్థితిలో అతి దయనీయంగా జరుగుతున్నాయి. చట్టప్రకారం 58 దేశాలు గర్భస్రావాన్ని అనుమతిస్తున్నాయి. మరోవైపు దీన్ని 101 దేశాలు నిషేధించాయి. పలు కారణాలవల్ల ప్రతి ముగ్గురు గర్భవతుల్లోనూ ఒకరికి గర్భవిచ్చిత్తి జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం 20 వారాలు నిండిన పిండాన్ని తొలగించడం చట్టవిరుద్ధం. 2030 నాటికి యువతులు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపు చేసేలా వివిధ రంగాల్లో రాణించాలంటే ప్రభుత్వాలు ధీటైన పథకాలు అందించాలి. గ్రామీణ బాలికలు ఎదుర్కొంటున్న సమస్య రక్తహీనత. అందుకొరకై వారికి ఇనుము, అయోడిన్‌తో సహా ఇతరత్రా పోషకాలు అందించాలి. ఈ పరిస్థితులు మారడానికి అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఏటా నిర్వహించాలని తద్వారా బాలికల సంక్షేమం దిశగా ప్రపంచ దేశాల దృష్టి మరల్చి సమస్యలకు పరిష్కారాలు అనే్వషించాలని ప్లాన్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ మొగ్గతొడిగింది. 1937లో ఏర్పడిన సంస్థ 60పైగా దేశాలలో బాలల హక్కుల సాధనకై కృషిచేస్తోంది. బాల బాలికలమధ్య తల్లిదండ్రులు, సమాజం చూపుతున్న విచక్షణను అంతమొందించడానికి ‘బికాజ్ ఐ యమ్ ఏ గర్ల్’ అనే కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ‘ఎంపరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైటర్ టుమారో’ పేరుతో బాలికల దినాన్ని జరుపుకోవడం సంతోషం. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు అని చాటుదాం. లింగవివక్షను రూపుమాపుదాం.

-కె.రామ్మోహన్‌రావు 9441435912