మెయిన్ ఫీచర్

ఆలోచనలను ఎలా మలచుకోవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరిలోనూ శక్తి సామర్థ్యాలనేవి ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ బలహీనతల్ని, సమస్యల్ని అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులు పటిష్టం చేసుకోవడంకోసం, అంతిమవిజయం సాధించట కోసం మీ ఆలోచలను మార్చుకోవచ్చు. మంచి ఆలోచనలతో మనల్ని మనం మలచుకోవడంలోనే విజయం దాగివుంది. ఒక లక్ష్యంతో ఆలోచనలవైపు, ఆచరణవైపు అడుగులు పడితే విజయం మీ స్వంతం.
ఆలోచనలే ఆచరణగా పరిణమిస్తాయి. ప్రతి వ్యక్తి బహ్యప్రవర్తనకు మూలాలు ఆలోచనల్లోనే ఉంటాయి. ఆలోచించకుండా అసంకల్పితంగా ఏపనీ ఎవరూ చేయలేరు. క్లుప్తంగా చెప్పాలంటే మనిషి కృషి వెనుక వున్న అసలైన శక్తి ఆలోచనా స్రవంతే కాబట్టి వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఆలోచనలకు చాలా ప్రాముఖ్యం ఉంది.
ఆలోచనలనేవి రెండువైపులా పదును వున్న కత్తి లాంటివి. అవి మనిషిని ఎంత ఉత్తేజపరచగలవో అంత నిరాశపరచగలవు. ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని జయిస్తాడా? లేక లక్ష్యంచే జయించబడతాడా? అనే విషయాన్ని అతని ఆలోచనాసరళిని బట్టి తేలిగ్గా చెప్పవచ్చు.
జయాపజయాలనేవి కేవలం ఆలోచనా జనితాలు తప్ప బాహ్య శక్తులచే నిర్ణయించబడే దృగ్విజయాలు కావు. అసలు ఒక మనిషి విజయం సాధించడానికి కావాల్సింది ఇతరుల సహకారమో లేక పరిస్థితులు అనుకూలించడమో కాదు. నిజానికి అవి ప్రతికూలంగా పనిచేసినా అతని ఆలోచనలు సహకరిస్తే చాలు విజయం దానంతట అదే సిద్ధిస్తుంది. అందుకే ప్రపంచ చరిత్రంతా కేవలం కొద్దిమంది ఆలోచనాపరుల చరిత్రేనని భావిస్తారు. జీవితంలో ఇంత ప్రాముఖ్యం ఉన్న ఆలోచనల పట్ల చాలామంది నిర్లక్ష్యభావం వహిస్తారు. ఇలాంటివారు ఆలోచనలను సవ్యమైన రీతిలో మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా వీరి యోచనా స్రవంతిలో అనవసర అంశాలే ఎక్కువగా చోటుచేసుకుంటాయి.
సగటు మనిషి తన జీవితంలో ఇంచుమించు సగభాగాన్ని అనవసర ఆలోచనాలతోనే వృధా చేస్తాడని అంచనా! ఆలోచనలు ఎంత ఉపయుక్తమైనవో, అంత ప్రమాదకరమైనవని మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతుంది. అందుకే ఆలోచనాస్రవంతిని వరదనీటితో పోలుస్తారు. కట్టలువేసి వరద నీటిని జాగ్రత్తగా వినియోగించుకొంటే బీడు భూములు సుక్షేత్రాలవుతాయి. అలా వదిలేస్తే అవి మరుభూములుగా మారుతాయి. అలాగే ఆలోచనలను అదుపు చేసి సక్రమ మార్గంలో నడిపిస్తే మనోక్షేత్రం సస్యశ్యామలవుతుంది. లేకుంటే ఎడారిగా మారుతుంది. కాబట్టి ఆలోచనలను అదుపుచేయడం, అవసరాలకు అనుగుణంగా మలుచుకోవడం అవసరం.
మనం ఆలోచనలకు లొంగిపోవడంకంటే, ఆలోచనలను మనకు అనుకూలంగా మలుచుకోవడం ఉత్తమం. అనుకూలమైన ఆలోచనలంటే మన లక్ష్యానికి, చేస్తున్న కృషికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం. మనిషి తన ఆలోచనలపై పట్టు సాధించడమంటే ఇదే! ఆలోచనలను అదుపు చేసుకోగలిగిన వ్యక్తి దేనినైనా సాధించగలుగుతాడు. ఇంట గెలిస్తేనే కదా రచ్చ గెలిచేది? అయితే చాలామంది ఈ విషయాన్ని గుర్తించలేరు. లక్ష్యానికి అనుగుణంగా ఆలోచనలను మలచుకోలేకపోవడం వల్ల వీరి బాహ్యప్రవర్తనకూ, అంతర ప్రవృత్తికీ మధ్య ఎడతెగని ఘర్షణ జరుగుతుంది. ఈ విధమైన ద్వంద్వత్వంవల్ల సర్వశక్తులు లక్ష్యంపైకి కేంద్రీకరించడం కుదరదు. వ్యతిరేక ఆలోచనా స్రవంతి ప్రయత్నాన్ని అడ్డగించి, లక్ష్యాన్ని దారుణంగా నీరుగారుస్తుంది. నూటికి తొంభై మంది అభ్యర్థులు తమ లక్ష్యానికి అనుగుణంగా కృషి చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఇదే.
అయితే తమ ఆలోచనాసరళిని మార్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తే ‘మార్పు’ అనేది తనంతట తనే వస్తుంది. ముందుగా మనసుపై అదుపు సాధించడం మానవమాత్రులకు సాధ్యమయ్యేది కాదు. అది ఋషులకు మాత్రమే సాధ్యం అనే భావనను వదిలిపెట్టాలి. కృషి వుంటే మనుషులు ఋషులవుతారన్నాడో కవి. కృషి వుంటే మనిషి సాధించలేనిదంటూ ఏమీ ఉండదని గ్రహించాలి. తలచుకొంటే ఎవరైనా తమ ఆలోచనలను మార్చుకోవచ్చన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఇది శాస్ర్తియంగా కూడా నిరూపణ అయింది.
ఒకరకంగా మనిషి మస్తిష్కం కూడా కంప్యూటర్ వంటిదే! దీనిలోకి ఎలాంటి ఆలోచనలు ప్రవేశపెడితే తిరిగి అలాంటి ఉత్పత్తి వస్తుంది. పుట్టిన ప్రతి మనిషి మస్తిష్కం కూడా శూన్యంతో ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత కొన్ని భావాలు మనసులోకి చొరబడతాయి. క్రమంగా వివిధ భావాలమధ్య సమన్వయం ఏర్పడి స్వతంత్ర ఆలోచనా శక్తి, సృజనాత్మకత వృద్ధి చెందుతుంది. అంటే మనసులోకి ప్రవేశించిన భావాలు, ఆలోచనల మథనం నుండే సృజనాత్మకత పుడుతుందన్నమాట!
దీనిని బట్టి మనిషి అంతరంగంలోకి ప్రవేశపెట్టుకున్న భావాలు, ఆలోచనలే అతని భవిష్యత్ ఆలోచనకు, వ్యక్తిత్వానికి పునాదిరాళ్ళని తెలుస్తోంది. కాబట్టి ఆలోచనాస్రవంతిలోకి భావాలు ప్రవేశపెట్టేటప్పుడే జాగ్రత్త వహించాలి. అపసవ్య ఆలోచనాలనే వైరస్‌లను బ్రెయిన్ అనే కంప్యూటర్‌లోకి చొప్పిస్తే మొత్తం ప్రోగ్రామ్ అంతా చెడిపోతుంది.
కడివెడు పాలను

విరచడానికి ఒకే ఒక్క విషబిందువు చాలు! ఏదైనా ఒక లక్ష్యం కోసం కృషిని ప్రారంభించే ముందు నాణేనికి రెండువైపులా చూడాలి. కానీ తమపై తమకు నమ్మకంలేనివారు కేవలం ఒకవైపు మాత్రమే చూస్తూ అపసవ్య ఆలోచనలు పెంపొందించుకొంటుంటారు. విజయాన్ని వాయిదా వేసే అపసవ్య ఆలోచనలను వదిలించుకోవడం కాస్త కష్టసాధ్యమే!
ఎనభైశాతం విజయం సాధించి ఇరవై శాతం అపజయం ఎదుర్కొన్నా ఆ అపజయమే మన వైఫల్యాన్ని ఎత్తిచూపి విజయాన్ని అపహాస్యం చేస్తుంది. విజయానికి చేరువలో ఉన్నామనే విషయాన్ని విస్మరించి అవాంతరానే్న తలచుకొని మదనపడతాం!
నిజమే! అపసవ్య ఆలోచనలకున్న బలం అలాంటిది. ఇవి హద్దులు మీరితే ఏ విషయాన్ని సహేతుకంగా చూడనీయవు. తలపై అనవసర భారాన్ని మోపి అంతర్గత శక్తిని వృధా చేస్తాయి. సాధారణంగా అపసవ్య ఆలోచనలన్నీ గతానికో, భవిష్యత్తుకో సంబంధించినవై ఉంటాయి. కాబట్టి వీటివల్ల వర్తమానం వృధా అవుతుంది.
అయితే, ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు మన ఆలోచనలను కేవలం వర్తమానంలో ఏం చేయాలి? అనే విషయానికి పరిమితం చేయడం ద్వారా అపసవ్య ఆలోచనలనుండి మనం ఖచ్చితంగా బయటపడతాం. గతించిన విషయాల గురించి ఆలోచించడం పూర్తిగా మానేయాలి. తప్పో ఒప్పో జరిగిపోయింది. గతం గతః
గతాన్ని మనం మార్చలేం. అలాగే భవిష్యత్తు కూడా పూర్తిగా మన చేతిలో ఉండదు. మనం నియంత్రించగలిగేది కేవలం వర్తమానానే్న! అలాగని పూర్తిగా భవిష్యత్తు గురించి ఆలోచించవద్దని కాదు. అతిగా ఆలోచించక, దానిలో తలదూర్చకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే రేఖామాత్రంగా నిర్థారించుకొని దృష్టిని మాత్రం వర్తమానంపైకి కేంద్రీకరించాలి. అదేవిధంగా రాబోయే ఫలితంపట్ల కూడా అనవసర ఉత్సుకత చూపకూడదు. ఫలితాల గురించి నెగెటివ్‌గానైనా అతిగా ఆలోచించకూడదు. ఫలితాల గురించిన నెగెటివ్ ఆలోచన స్వీయ సామర్థ్యాన్ని అణచివేస్తే అతి పాజిటివ్ ఆలోచన భ్రమల్లో ముంచెత్తుతుంది. క్రమంగా సవ్యమైన, ఉపయుక్తమైన ఆలోచనలవైపునకు దృష్టిని మళ్లించాలి. ఇవన్నీ మనకు సాధ్యమే! ఫలితం అనుకూలంగానే వస్తుంది. కష్టపడితే విజయం నాదే. ప్రయత్నిస్తే ప్రతికూలతను సైతం అనుకూలంగా మార్చుకోవచ్చు. ప్రతికూల ఆలోచనలను ఎంతగా నివారిస్తే మైండ్ పవర్ అంతగా బలపడుతుంది. తద్వారా ఆలోచనలకు, చేస్తున్న కృషికి మధ్య చక్కని పొత్తు కుదురుతుంది. అంతటా సర్వశక్తులన్నీ లక్ష్యంపైకి అడుగులు పడి విజయంవైపు దారితీస్తుంది.

- కంచర్ల సుబ్బానాయుడు