మెయిన్ ఫీచర్

విలాసం.. విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోము మెరిసిపోయేందుకు వాడే పౌడర్..
లేత పెదవులకు శోభనిచ్చే లిప్‌స్టిక్ మెరుపు.. సువాసనలు వెదజల్లే తైలాలు.. ఖరీదైన షాంపూ... నిగనిగ మెరిసే హ్యాండ్‌బ్యాగ్, లేదా పాదరక్షలు.. ఏదైనా మన అందానికి శోభనిచ్చేవే.. మన హోదాను చాటిచెప్పేవే. కానీ ఆ అందంపై అభిలాష.. అభిరుచి నోరులేని మూగజీవుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. చాలామందికి తెలీక, తెలిసినా దాని తీవ్రతను పట్టించుకోక అందాల లోకంలో విహరిస్తున్నవారు కోట్లలో ఉన్నారు. మనం వాడే కాస్మొటిక్స్, ఫ్యాషన్ వస్తువులు, చివరకు దుస్తులు, షాంపూలు ఎన్ని ప్రాణుల బలిదానమో తెలుసుకుంటే కళ్లుబైర్లు కమ్ముతాయి. విలాసం కోసం మనం చేసే పనుల వెనుక ఎంతటి విషాదం దాగి ఉందో తెలుసుకుంటే మనం ఏం చేస్తే మంచిదో తెలుస్తుంది.
*
మనవాళ్లు వాడే పగడాలు ఓ సముద్రజీవి రక్షణ కవచమని ఎందరికి తెలుసు. ముత్యాల కోసం ఎన్ని ఆల్చిప్పలు బలవుతాయో తెలుసా? అందమైన పాదరక్షలు, హ్యాండ్‌బాగులకోసం అరుదైన పాములు, జంతువుల చర్మాలు వలిచేస్తారని తెలిసినవారెందరు? చివరకు బల్లులు, ఊసరవెల్లులు, ఉడుములు, మొసళ్ల చర్మాలూ వినియోగించి తయారు చేసే వాద్య పరికరాలూ ఉన్నాయని తెలుసా? సుగంధ ద్రవ్యాల కోసం కొన్ని జీవులను హింసిస్తారని, కొన్ని రకాల షాంపూల కోసం కుందేళ్ల కళల్లో రసాయనాలు పోసి పరిశీలిస్తారని చాలామందికి తెలియదు. మూగజీవాల సామూహిక హత్యలు మనకు ఆనందాన్ని అందాన్నిస్తున్నాయని తెలియనివారే ఎక్కువ. పర్యావరణ సమతుల్యతను, జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న మన ఆడంబరాలు తక్కువేం కాదు. మనం వాడే టాల్కమ్‌పౌడర్ లేదా షాంపూ, లిప్‌స్టిక్, హెయిర్‌డై మార్కెట్‌లోకి వచ్చేముందు కొన్ని మూగజీవాలపై ప్రయోగిస్తారని తెలుసా? ‘స్వ్కిరల్ మంకీ’లకు ఇనుప పంజరాల్లో బంధించి పరీక్షలు జరుపుతారు. వాటి గొంతుల్లోకి బలవంతంగా గుమ్మరిస్తారు. ఎంత పరిమాణంలో వాడితే వాటికి ముప్పు ఏర్పడిందో గమనిస్తారు. రోజూ వేలాది ఈ ఉడతలాంటి కోతులకు నరకయాతనే.
* పరిమళాన్ని వెదజల్లే తైలం కోసం పునుగుపిల్లిని 25-30 సెంటీమీటర్ల పంజరంలో బంధిస్తారు. ప్రతి పదిరోజులకు ఓసారి దానిని చావగొడతారు. ఆ బాధలో అది తన పృష్ఠ్భాగంలో ఉండే ఓ సంచీలాంటి భాగంలో ప్రత్యేక తైలాన్ని విసర్జిస్తుంది. అది సుగంధభరితంగా ఉంటుంది. దానిని సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్ తయారీలో వినియోగిస్తారు. అందుకోసం బలవంతంగా ఆ పునుగుపిల్లుల పృష్ఠ్భాగంలోని సంచీలని ప్రతి పదిరోజులకు ఓసారి బలవంతంగా కొట్టి తెరుస్తారు. అవి బతికున్నంతవరకు ఆ బాధ తప్పదు. చివరకు అవి మరణిస్తాయి. నిజానికి అడవుల్లో వాటి జీవన ప్రమాణం కన్నా చాలాముందుగానే అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. కుందేళ్ల తలను వేళ్లాడదీసి వాటి కళ్లను ఇనుప క్లిప్పులతో వెడల్పుగా విస్తరింపచేసి సాంద్రమైన షాంపూ ద్రావకాన్ని పోస్తారు. కళ్లకు ఆ రసాయనం ఎంతమేరకు హాని చేస్తుందో పరిశీలిస్తారు. కంటిలోపలి పొరలపై దద్దుర్లు ఏర్పడ్డాయా, రంగుమారిందా, చూపు మందగించిందా, లేదా పూర్తిగా చూపు పోయిందా అన్నది పరిశీలించేందుకు ఇలా చేస్తారు. అవి బాధతో విలవిలలాడతాయి. చాలా సందర్భాలలో ప్రాణా లు వదులుతాయి. కేవలం షాంపూ పరిశ్రమ కోసం ఏటా కనీసం లక్ష కుందేళ్లను ఇలా హింసించి చంపుతారంటే నమ్మాల్సిందే.
కస్తూరి జింకకు ఉండే ప్రత్యేక గ్రంధి సువాసన వెదజల్లే ద్రవాన్ని విడుదల
చేస్తుంది. కేవలం దానికోసం వాటిని వేటాడతారు. ఆ గ్రంధిని కోసేసిన తరువాత దాని కళేబరాన్ని వదిలేస్తారు. హిమాలయాల్లో అరుదైన జాతిగా చెప్పే మస్క్‌డీర్ పరిస్థితి ఇది.
బతికున్న మొసలి మెడ దిగువ నుంచి (ఉదరభాగం) తోక కొసవరకు పై చర్మం కోసేస్తారు. వీటితో బ్యాగ్‌లు, పర్సులు, టోపీలు తయారు చేస్తారు. చర్మాన్ని ఒలిచిన తరువాత ఇంకా బతికున్న మొసలిని మళ్లీ నీళ్లలోకి వదిలేస్తారు. అలాగే బతికున్న పాముల చర్మాన్ని ఒలిస్తే అవి బాగాసాగే గుణంతో ఉంటాయి. అందుకే చెట్టుకు పాము తలను ఆన్చి పిన్ను గుచ్చుతారు. తోక చివరా అలానే చేస్తారు. అది బతికుండగానే చర్మాన్ని నిలువునా చీల్చి ఒలుస్తారు. కొన్ని రగాల బల్లులు, ఉడుముల పరిస్థితీ అంతే.
గర్భందాల్చిన ఆడగుర్రాలలో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వాటి మూత్రంలో ఆ హార్మోన్ లభిస్తుంది. కాస్మొటిక్ పదార్థాల తయారీకి అది ఎక్కువ అవసరం. అందుకోసం కొన్ని ఆడగుర్రాలను నిరంతరం గర్భం దాల్చేలా చర్యలు తీసుకుంటారు. వాటిని ఎప్పుడూ నిర్బంధంలోనే ఉంచుతారు. వైద్యం, కాస్మొటిక్ రంగాల్లో పరిశోధనలకోసం వాటిని అలా అసహజరీతిలో బాధిస్తూనే ఉంటారు.
మగవారు గెడ్డం గీసుకున్నతరువాత చర్మ రక్షణ కోసం వాడే ఆఫ్టర్ షేవ్‌లోషన్ చురుక్కుమన్నా ఆ తరువాత చల్లగా, హాయిగా ఉంటుంది. కానీ ఎన్నో మూగజీవాలపై కర్కశంగా జరిగిన పరీక్షల ఫలితం అది. గినియా పందుల చర్మంపై పదేపదే టేప్ అంటించి బొచ్చు పీకి ఆ చర్మంపై ఆ లోషన్‌ను చల్లి పరిశీలిస్తారు. చర్మం కాలిందా, బొబ్బలెక్కిందా అన్నది చూస్తారు. ఇదంతా ఆ జీవికి ప్రాణసంకటమే.
ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ‘కరాకుల్’ టోపీ వెనుక కూడా కొన్ని జీవుల ఆర్తనాదాలు దాగి ఉంటాయి. తెల్లటిబొచ్చుతో గర్భందాల్చిన గొర్రెలను నెలలు నిండకుండానే కాన్పు జరిగేలా ఇనుపచువ్వలతో చావబాదుతారు. ఆ బాధ భరించలేక అవి పిల్లను ఈనతాయి. ఒతె్తైన, ఉంగరాల బొచ్చుతో ముచ్చటగా ఉండే పసిగొర్రె బతికుండగానే చర్మం ఒలిచేస్తారు. ఆ బొచ్చుతోకూడిన చర్మం చాలా మృదువుగా ఉండటమే వాటి ప్రాణాలమీదకు తెస్తోంది. వాటితోనే ఈ ‘కరాకుల్’ టోపీలు తయారు చేస్తారు. ప్రసవించిన కొద్దిసేపటికే, తల్లికళ్లముందే ఇదంతా జరిగిపోతుంది.
ఇక హెయిర్ షేవింగ్ బ్రష్‌లు, బూట్ పాలిష్ బ్రష్‌లు, ఐ లైనర్‌లు, రఫ్ బ్రష్‌ల తయారీకి ఎన్నో రకాల ఉడతలు, పందుల ప్రాణాలు తీస్తారు. మందులకోసం, పరిశోధనల కోసం ఎలుకలు, కుందేళ్లపై పరిశోధనల మాట పక్కనబెడితే... విలాసవంతమైన వస్తువులు, సౌందర్య సాధనాల కోసం తయారయ్యే వస్తువులు అత్యవసరాలు కావు. వాటికోసం మూగజీవాల ప్రాణాలు తీయడం సరికాదు. కానీ దీనిని అర్థం చేసుకునేవారు ఎందరు?

చిత్రాలు..అప్పుడే పుట్టిన గొర్రెపిల్లల బొచ్చుతో చేసిన టోపీ
* మొసలి చర్మంతో చేసిన బ్యాగ్, పాము చర్మంతో చేసిన పాదరక్షలు

- రవళి