మెయిన్ ఫీచర్

ఆన్‌లైన్ సంత సందడే అంతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంటలతరబడి ఏరికోరి నచ్చిన వాటిని కొనుక్కునే ఓపికలేని వారంతా కూడా ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్‌పై ఆధారపడుతున్నారు. ప్రతి ఐదుగురు నెటిజన్లలో ముగ్గురు ఇంట్లోనే ఎంచక్కా ఇ-కామర్స్ సంస్థల ద్వారా కావలసినవి కొనేస్తున్నారు. చాలా మందికి షాపింగ్ చేయాలంటే చాలా సరదాగా ఉంటుంది. ఒకప్పుడు షాపింగ్ వెళ్లి హ్యాపీగా వచ్చేవాళ్లు. కానీ రానురానూ షాపింగ్ అంటే చాలా మంది ఇష్టపడటం లేదు. అలాగని కొనుగోలు చేయడానికి మాత్రం ముందు వరసలోనే ఉంటారు. నగరాలలో షాపింగ్ చేయడమంటే పెద్ద ప్రహసనంగా మారింది. పెరిగిన రద్దీతో ఐదు లేక పది కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలకు వెళ్లడానికి సైతం గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఈ అవస్థలు కనిపెట్టి వినియోగదారులకు మరింత సులభయోగ్యంగా సరుకులను కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్ షాపింగ్ సుగమమైన మార్గం. ఆన్‌లైన్‌లో అయితే వేలకొద్దీ... ఉత్పత్తులు మన కళ్లముందు సాక్షాత్కారమవుతున్నాయి.

కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మాల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్ కామన్ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్ పెరుగుతోందనే భావన నిర్వాహకుల నుంచి సైతం వినిపిస్తోంది.
ఆన్‌లైన్ మార్కెట్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చని, బయటకి వెళ్లాలంటే ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుందని, అలాకాకుండా ఇంట్లోనే ఎంచక్కా కంప్యూటర్, మొబైల్, టాబ్లెట్ ఇంటర్నెట్ ద్వారా షాపింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యం 24 గంటలూ ఉండటం కూడా అధికులు ఈ వెబ్ కొనుగోళ్లకు అలవాటుపడటానికి ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. పైగా ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులు, ఆయా ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులే ఇంటికి తీసుకొచ్చి ఇస్తుండటం కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కు నానాటికి ఆదరణను తెచ్చిపెడుతోంది. నచ్చకపోతే వస్తువులను వెనక్కి పంపించేయడం, మరొకదాన్ని మార్చుకునే సౌలభ్యం కూడా ఆన్‌లైన్ మార్కెట్‌లో ఉంది. అంతేగాక బ్యాంకులు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే షాపింగ్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం కూడా ఆన్‌లైన్ వ్యాపారం దూకుడును పెంచుతోంది.
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, డిజైనర్ ఫర్నీచర్, గృహలంకరణ వస్తువులు, దుస్తులు, ఆభరణాలు, యాక్ససెరీస్, పాదరక్షల అమ్మకాలు ఆన్‌లైన్ మార్కెట్‌లోనే అధికంగా జరుగుతున్నాయి. డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, హోంనీడ్స్, హౌస్‌కీపింగ్ చివరికి సబ్బులు, పప్పులు, ఉప్పు కూడా ఆన్‌లైన్ మార్కెట్లలో అమ్మేస్తున్నారు. ముందు కొనాల్సినవి ఏంటనేవి అనుకున్న తర్వాత ప్రైస్ కంపారిజన్ సైట్లు, మొబైల్ రీచార్జ్ సైట్లు పరిశీలించాలి. వెబ్‌సైట్‌లో కంటే యాప్‌లో కొంటే కొన్ని మరింత తగ్గింపు ధరలకే అందిస్తుంటాయి. అలాంటి ఆఫర్లు ఉన్నాయేమో సదరు ఈ కామర్స్ సైట్లలో ఆఫర్ల కోసం సెర్చ్ చేయాలి. ఉంటే సంబంధిత ప్రొమోకోడ్‌ను వస్తువుకు ధర చెల్లించే ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. అది మరిచిపోతే డిస్కౌంట్ వర్తించదు. ఫలానా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ అంటూ తరచుగా ఆఫర్ చేస్తుంటాయి. ఆయా కార్డుల ద్వారా కొనుగోలు చేయడంవల్ల మరింత ఆదా చేసుకోవచ్చు. నిజానికి ఆర్థిక మందగమనంలోనూ ఆన్‌లైన్ షాపింగ్ వృద్ధిపథంలో నడుస్తుండగా, దీనికి కారణం ఆయా ఈ-కామర్స్ సంస్థలు ప్రకటిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లే. బహిరంగ మార్కెట్‌లోకి ఇంకా రాని వస్తువులు కూడా ముందే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటం, ప్రత్యేక సేల్స్ పేరిట రోజులు, వారాలదాకా అన్నిరకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించడం చేస్తున్నాయి ఈ-సంస్థలు. ముఖ్యంగా పండగ సీజన్లలో ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అందరి చేతుల్లోనే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న మొబైల్స్ ఉండటంతో అంతా ఆన్‌లైన్ షాపింగ్ మయమే.
పుస్తకాలు, వారపత్రికలు, మొబైళ్లు, ఎలక్ట్రానిక్స్ ఇలా ఒకే అడ్డాలో అన్నీ కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు మీరేదైనా పుస్తకాన్ని కొనాలనుకుంటే సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ చూడొచ్చు. ఫోన్‌కాల్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. నెజటిన్ల ఆదరణ పొందిన ఆన్‌లైన్ షాపింగ్ సైట్, డీల్స్, డిస్కౌంట్‌లతో మొబైల్స్, ట్యాబ్లెట్స్, కెమెరాలు, లైఫ్‌స్టయిల్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయవచ్చు. మీరుంటున్న సిటీలోని స్పెషల్ డిస్కౌంట్‌లతో ఉత్పత్తుల్ని సొంతం చేసుకోవచ్చు.
రెస్టారెంట్‌ల్లో నోరూరించే వంటల దగ్గర్నుంచి బ్యూటీ క్లినిక్‌లలో ఫేస్‌ప్యాక్‌ల వరకూ అన్నీ చూడొచ్చు. ఫేస్‌బుక్ ఐడీలో లాగిన్ అవ్వొచ్చు. డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండ్‌కు అనుగుణంగా యూత్ మెచ్చే... వారు కోరుకునే వస్తువులను ఈజీగా కొనుగోలు చేయవచ్చు. వీటిల్లో లేటెస్ట్ మోడల్ షూస్... యాక్సెసరీస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. పాల డబ్బాతో మొదలు పిల్లలకు కావాల్సిన అన్నీ అందుబాటులో ఉన్నాయి. కుర్రకారు అభిరుచులతో గ్యాలరీలు కనిపిస్తాయి. బంగారం, వజ్రాల్ని కూడా సరికొత్త డిజైన్లను ఎక్స్‌ప్లోర్ చేసి వెతకొచ్చు. మీ ముఖకవళికలు సరిపడే సన్‌గ్లాసెడ్‌డిజైన్ సెలెక్ట్ చేసుకుని సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్‌లతో మొబైల్స్, ట్యాబ్లెట్స్, కెమెరాలు, లైఫ్‌స్టయిల్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయవచ్చు. కావలసిన మేగజైన్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ వంటివన్నీ ఒకేచోట కొనుగోలు చేయవచ్చు. రోజూ బయటికెళ్లి మెస్‌లోనో, హోటల్‌లోనో తినాలంటే బోర్. వేడివేడి టీ నుంచి పరోటాలు, కూరలు, బిర్యానీ దాకా ఒకటేమిటి... అన్నిటినీ ఒక్క క్లిక్‌తో మీరున్న చోటికే తెస్తామంటున్నాయి ఈ కంపెనీలు. కొన్నాళ్ల కిందటి వరకూ ఆన్‌లైన్‌ను ఆశ్రయించేవారంతా షాపింగ్, ట్రావెల్‌తో పాటు సినిమా టిక్కెట్లకే ప్రాధాన్యతమిచ్చేవారు. ఈ-వ్యాపారంలో విలువ ఎక్కువ ఉండే ట్రావెల్‌ది మొదటిస్థానం కాగా... ఫుడ్‌ది 3వ స్థానం. అందుకే గుర్తు పెట్టుకోలేనన్ని స్టార్టప్‌లు ఈ రంగంలోకి దిగుతున్నాయి.

80 శాతం పైగా వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగే..

నిన్నమొన్నటి వరకూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరంటే బిర్యానీ, పిజ్జా మాత్రమే. కానీ రకరకాల స్టార్టప్స్ ప్రవేశించాక... టీ, టిఫిన్లు, సమోదసా, సూప్స్, సలాడ్స్, పరాటా, జొన్న రొట్టెలు వంటివన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. అమెజాన్ పోర్టల్ ఇప్పటికే కొన్ని రకాల ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, డ్రింకులను సైట్లో అమ్మకానికి పెట్టింది. ఆన్‌లైన్ మార్కెట్లో నిత్యావసర సరుకుల మార్కెట్ చాలా భారీగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పండుగలు పెళ్లిళ్ల సీజన్‌లలో సాధారణంగా షాపుల్లో కొనుగోళ్లు విపరీతంగా జరుగుతాయి. నగరాలలో జరిపిన సర్వేలో 80 శాతం పైగా వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికే ఇష్టపడుతున్నారు. జబాంగ్, ప్లిప్‌కార్డ్, జోవీ, స్పాప్‌డీల్ వంటి ప్రఖ్యాత షాపింగ్ వెబ్‌సైట్లు కొన్ని ఆఫర్లు కూడా ప్రత్యేక సీజన్లలో వినియోగదారులకు ఇస్తుంటాయి.
క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ కూపన్ల వల్ల ఆన్‌లైన్‌లో షాపింగ్ మరింత చౌకగా మారుతోంది. పైగా మెట్రో, క్రాస్మో పొలిటిస్ నగరాల్లో అందుబాటులో ఉండే వెరైటీ, బ్రాండ్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉండవు. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కావాల్సిన బ్రాండ్‌లో నచ్చిన వెరైటీని ఆర్డర్ చేసుకుంటున్నారు.

నాణానికి మరోవైపు

చాలామంది ఆన్‌లైన్ షాపింగ్ అనేది సౌలభ్యంగా ఉండుటవలన కొద్దిగా షాపింగ్ చేయటానికి ఇష్టపడుతున్నారు. కొన్ని సార్లు వారు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయటం వలన వారి సమయం, డబ్బు చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందనే వాస్తవాన్ని గుర్తించలేరు.
కావలసిన వస్తువులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయటం, వాటి పేమెంట్ విషయంలో మాత్రం ఎక్కువగా మోసపోతున్నారు. వారిలో ఎక్కువగా ఇంటిలో నుంచి ఆర్డర్లు ఇచ్చే మహిళలే ఎక్కువగా ఉన్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి బ్యాంకుకు చెందిన ఇంటర్నెట్ వెబ్‌సైట్ నిజమైనదా - కాదా అనే విషయం ప్రధానంగా గుర్తించాలి.
బ్యాంకుకు సంబంధించి లావాదేవీలు బయటనుంచి అంటే ఇంటర్నెట్ సెంటర్ల నుండి కాకుండా, స్వంత కంప్యూటర్ ద్వారా లావాదేవీలు పూర్తి చేయడం ఉత్తమం. షాపింగ్ కార్యకలాపాలకు సంబంధించి సంబంధిత వెబ్‌సైట్‌లో ఉన్న వర్చువల్ కీబోర్డును ఎంపిక చేసుకోవడం మంచిది. కానీ చాలా మంది కంప్యూటర్ వద్ద ఉన్న కీబోర్డు ఉపయోగించడంవల్ల హ్యాకర్లు వాటి సమాచారాన్ని తస్కరించి, వాటి ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి ‘పిన్’ నెంబర్‌ను బహిర్గతం చేయడం మంచిది కాదంటున్నారు.
ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్లో పేరెన్నికగన్న సంస్థలు కూడా వినియోగదారులను అడ్డగోలుగా మోసం చేసే పరిస్థితులు నిత్యకృత్యం కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వినియోగదారులు చేరుతున్నారు. ఆన్‌లైన్లో ఏదైనా కొనాలనుకునే వారు అన్ని జాగ్రత్తల తప్పనిసరి తీసుకోవాలి.

-తరిగొప్పుల విఎల్లెస్ మూర్తి