మెయిన్ ఫీచర్

అందాల అతిథి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఒకప్పుడు అందమైన మోడల్.. పదహారేళ్లకే సెవంటీస్ మ్యాగజైన్ కవర్‌పేజీపై తళుక్కున మెరిసిన మెరుపు.. అర్థశాస్త్రంలో పట్ట్భద్రురాలు.. వ్యాపార సామ్రాజ్ఞి.. ఆమె కనుసన్నల్లోనే అగ్రరాజ్యంలోని కీలక విభాగాలు.. అడుగడుగున నీరాజనాలు.. అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవ మర్యాదలు.. స్వాగత సత్కారాలు ఇవన్నీ అమెరికా ప్రధమ పుత్రిక ఇవాంకా ట్రంప్ ప్రత్యేకతలు. డోనాల్డ్ ట్రంప్‌కు నీడలా వెన్నంటే ఉంటూ తండ్రి విశ్వాసాన్ని అపారంగా చూరగొనటం వల్లే దక్కాయనటంలో ఎలాంటి సందేహం లేదు. పదేళ్లకే తల్లి తన నుంచి దూరంగా వెళ్లిపోయినా.. తండ్రి నీడలో పెరిగి నేడు ఆయనకే నీడలా వెన్నంటే ఉండే స్థాయికి ఎదిగింది. అందుకే అమెరికాలోనే కాదు ప్రపంచమంతా అన్నింటా తన ప్రాధాన్యతను అతికొద్దికాలంలోనే పెంచుకోగలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈనెల 28న భాగ్యనగరానికి వస్తున్న సందర్భంగా ఈ అరుదైన అందాల అతిథి గురించి కొన్ని విశేషాలు..

జీవిత విశేషాలు..

ఇవాంకా ట్రంప్ న్యూయార్క్ నగరంలో అక్టోబరు 30,1981లో జన్మించింది. డోనాల్డ్ ట్రంప్ ఆమె పుట్టేనాటికే గొప్ప వ్యాపారవేత్త. పదేళ్ల వయసు వచ్చేనాటికి తల్లి తండ్రి నుంచి విడాకులు తీసుకుంది. ఆమె తండ్రి సంరక్షణలోనే పెరిగింది. చాపిన్‌లోని బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. చదువుకుంటూనే 14 ఏళ్లకు మోడల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ వయసులోనే ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్‌కు సంతకం చేసింది. అమెరికాలోని ‘సెవెంటీన్’ మేగజైన్ కవర్‌పేజీ ఫొటో స్థానం పదహారేళ్లకే దక్కించుకుంది. మిస్ టీన్‌గానూ గెలిచింది. వయసు పెరిగేకొద్దే ఫ్యాషన్ ప్రపంచం నుంచి తప్పుకుంది. వ్యాపారం వైపు మొగ్గు చూపింది. వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో పట్టా తీసుకుంది. ఆ తరువాత తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రెండేళ్లు పనిచేసిన తరువాత వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ట్రంప్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ స్థాయికి వెళ్లింది. ఆ తరువాత తన సోదరులతో కలిసి హోటళ్ల బిజినెస్‌లోకి అడుగపెట్టింది. ట్రంప్ హోటల్స్‌ను స్థాపించింది. మియామీలోని డొరల్ గోల్ఫ్ రిసార్ట్‌ను ఏర్పాటు చేసింది. తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని అనేక దేశాల్లో విస్తరించటంలో ఇవాంకా ముఖ్య భూమిక పోషించటం వల్లనే ఆమె తండ్రికి అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఒకరిగా నిలిచి అమెరికా అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టి ఆయన సలహాదారునిగా మారింది. ఇటీవల ఈమెయిళ్ల వ్యవహారంలో వచ్చిన విమర్శలను ఎదుర్కొని తిప్పికొట్టగలిగింది.
సాంకేతిక రంగానికి పెద్దపీట..
ఇవాంకా ట్రంప్ నాలుగేళ్లకే టచ్ స్క్రీన్ ఫోన్ పట్టుకుందని, విండోస్ ఓపెన్ చేసేదని ఆమె నానమ్మ మురిపెంగా చెప్పుకునేది. పెద్దయిన తరువాత కూడా ఇవాంకా ట్రంప్ సాంకేతిక రంగానికి పెద్దపీట వేయటానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పిల్లలు కిండర్‌గార్డెన్ స్థాయిలోనే కంప్యూటర్ వౌన్ తిప్పాలని అంటారు. తండ్రిని ఒప్పించి పాఠశాలల్లో కిండర్ గార్డెన్ నుంచే కంప్యూటర్ విద్య నేర్పేందుకు నిధులను సైతం విడుదల చేయించింది.
ఇవాంకా బ్రాండ్‌కు ఎంతో ఇమేజ్..
ఇవాంకా అందివచ్చిన అవకాశాలను ఏనాడు జారవిడుచుకోలేదు. తనకు దక్కిన సెలబ్రిటీ హోదాను సైతం వ్యాపార విస్తరణకు సద్వినియోగం చేసుకోవటంలో దిట్ట. ముఖ్యంగా అమెరికా మధ్య తరగతి మహిళలు ఏయే వస్తువులను ఇష్టపడతారో తెలుసుకుని వాటిని ఇవాంకా ట్రంప్ అనే ట్యాగ్ తగిలించి అమ్మే తెలివితేటలున్నాయి. దుస్తులు, అలంకరణ సామాగ్రి, ఫెర్‌ఫ్యూమ్‌లు. హ్యాండ్ బ్యాగులు, బూట్లు, ఫ్యాషన్ జ్యూయలరీ వస్తువులు ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులు ఆమె బ్రాండ్ పేరుతో నేడు దేశ విదేశాల్లో అమ్ముడుపోతున్నాయి. అంతేకాదు పలు దేశాల్లో తన పేరుతో జ్యూయలరీ షాపులను ఏర్పాటు చేసి దిగ్విజయంగా నడుపుతోంది. ఆమెలోని వ్యాపారదక్షతను గమనించే మోదీ హైదరాబాద్‌లో నిర్వహించే వాణిజ్య సదస్సుకు తండ్రిని కుమార్తెను ఆహ్వానించారనుకుంటా. ఏదిఏమైనా అమెరికా నుంచే 300 మంది వాణిజ్య వ్యాపారుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తోంది.
ప్రియుడి కోసం మతం మారి..
రియల్ ఎస్టేట్ డెవలపర్ జేర్డ్ కుష్నర్‌ను 2005లో తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్ల డేటింగ్ తరువాత వివాహమాడింది. ఇందుకోసం ఆమె యూదు మతాన్ని స్వీకరించింది. వీరికి ముగ్గురు మనోహరమైన పిల్లలు. ఇపుడు భార్యభర్తలు అమెరికా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి ట్రంప్ కుడిభుజంగా మారారు. నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు.

దాగివున్న దాతృత్వం..
ఇవాంకాలో దాతృత్వం కూడా దాగివుంది. చైల్డ్ లైఫ్‌లైన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి క్యాన్సర్ పిల్లలకు సహాయపడుతోంది. ఇకా అనేక ధార్మిక సంస్థలకు విరాళాలు సైతం ఇస్తోంది.

మహిళా సాధికారితపై గళం

‘‘మహిళలు తమపై జరిగే ఎటువంటి హింస, వేధింపులనైనా ఎన్నటికీ సహించవద్దు’’
‘‘కార్యాలయాల్లో మహిళలను గౌరవించే సంస్కృతి రావాలి’’
‘‘నేడు మహిళాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సమాజం, ఆర్థిక వ్యవస్థ మీద మహిళలు ఐక్యతతో పట్టు సాధించాలి. అపుడే శక్తివంతమైన ముద్ర వేసుకుంటారు‘‘.

ఈ మాటలు మహిళా ఉద్యమాల్లో పాల్గొనే గొప్ప స్ర్తివాది అన్న మాటలు అనుకుంటాం. కాని 36 ఏళ్ల ఇవాంకా ట్రంప్ నోటి నుంచి వచ్చాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. తండ్రి నోటి దురుసుతనం ఆమెలో దాగివున్న స్ర్తివాద కోణాన్ని అణిచివేయటం సహజం. మహిళా సాధికారితను బలంగా కోరుకునే ఇవాంక ‘విమెన్ ఇన్ వర్క్’పేరుతో పుస్తకాన్ని రాసి సాటి స్ర్తి హక్కుల కోసం ఆ పుస్తకంలో గళం విప్పిన వనిత. ఇవాంకా ట్రంప్ రాసిన పుస్తకం అమెరికాలో మహిళల ప్రశంసలను సైతం అందుకుంది. మహిళలు ఆత్మగౌరవంతో ఎలా తలెత్తుకు బతకాలి. సమాజంలో ఆమెకు ఎదురయ్యే సమస్యలను సమర్థవంతగా ఎదుర్కొనే అంశాలెన్నింటినో ఇవాంక తన పుస్తకంలో పొందుపరిచారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో మహిళల పట్ల ట్రంప్ నోటి దురుసుతనాన్ని హిల్లరీ, మీడియా పెద్దఎత్తున ప్రచారం చేస్తే అలాంటి విమర్శకుల నోటికి తాళం వేసింది భార్య మెలీనియాకంటే ఇవాంకానే అని చెప్పవచ్చు. ఇటీవల జపాన్‌లో జరిగిన ఓ మహిళా సదస్సులో ఇవాంకా చేసిన ప్రసంగం అక్కడి మహిళల మనసు దోచుకుంది. ఇప్పటికీ ఆమె సోషల్ మీడియాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనపై, ఆడపిల్లల చదువుపై ఆమె తన మనోభావాలను ఇప్పటికీ పోస్ట్ చేస్తోంది. మహిళా సదస్సుల్లో ప్రధమ పౌరురాలి కంటే ప్రధమ పుత్రికే పాల్గొని తన గళాన్ని వినిపిస్తోంది.