మెయిన్ ఫీచర్

తొలి జాను తెనుగు కవి (ప్రపంచ తెలుగు మహిసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆరూఢ్య గద్య పద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
మానుగా సర్వ సామాన్యంబుగామి
జానుతెనుంగు విశేషము ప్రసన్నతకు’’
- అని సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో చెప్పాడు. ‘నేను రచిస్తున్నది తెలుగు పుస్తకమని తిరస్కరిస్తారో ఏమో, సాక్షాత్తు వేదోపనిషత్తుల సారమంతా తెలుగులోకి తెస్తున్నాను. ఆదరించండి’ అని ఆంధ్ర పాఠక మహాశయులను సవినయంగా ప్రార్థించాడు మహాకవి.

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవి నన్నయభట్టే అయినప్పటికీ తొలి తెలుగుకవి పాల్కురికి సోమనాధుడు. నన్నయ వాడిన ఛందస్సులు, భాషావైభవం, ఇతివృత్తం, పద్యశిల్పం అన్నీ సంస్కృతం నుండి స్వీకరించినవే! పైగా భారతం అనువాద కావ్యం. సోమనాథుడు అట్లాకాదు. తెలుగు ఇతివృత్తాలు, తెలుగు ఛందస్సు, తెలుగు నుడికారం, జాను తెనుగు స్వీకరించి కావ్య రచన చేశాడు. అందుకే సోమనాథుడు తొలి ‘తెలుగు’ కవి అని నా అభిప్రాయం.
అలా అనడం వల్ల కవిత్రయానికి ఉన్న గౌరవం రవ్వంతైనా తగ్గదు. ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకియే. తిక్కన శిల్పపు తెలుగు తోటయే. సందేహం లేదు. నిజం చెప్పాలంటే కవిత్రయాన్ని పాల్కురికితో పోల్చవలసిన అవసరం కూడా లేదు. కవిత్రయమువారూ పాల్కురికితో పోల్చవలసిన అవసరం కూడా లేదు. కవిత్రయమువారూ పాల్కురికి సోమనాథుడూ వారు జీవించిన కాలాలను అనుసరించి నాటి చారిత్రకావసరాలను గుర్తించి ఆ విధమైన ఇతివృత్తాలు, ఛందస్సులు, భాషాభావమూ స్వీకరించారు. అందువల్ల మనకు అందరూ పూజనీయులే. అయితే తెలుగు దేశంలో పాల్కురికి కవితకు రావలసినంత ప్రశస్తి రాలేదు.
అందుకు ప్రధాన కారణం మనవారు పాల్కురికి రచనలను సరిగా చదవకపోవడం. చదివినా కవిత్రయాన్ని చదివినంత ‘శ్రద్ధగా’ చదవకపోవడం. పాల్కురికి అనగానే ‘శివకవి’ అనేసి నన్నయ నుండి నేరుగా తిక్కన వద్దకు పోయే అలవాటు గత యాభై ఏండ్లుగా తెలుగు సాహిత్య విమర్శకులలో ప్రబలింది. ఆ విధమైన అలవాటూ, అలసత్వములతోబాటు అన్యవాదములయందలి అసహనం కూడా అందుకొక కారణంగా చెప్పవచ్చు. సద్విమర్శకులు వాటికి అతీతంగా చూడవలసి ఉంది. పింగలి వారి సాహిత్య చరిత్రలో తిక్కనకు ఇచ్చిన ప్రాధాన్యం సోమనకు లేదు.
అనాదిగా కర్ణాటకం శైవానికి, తమిళదేశం వైష్ణవానికీ ఆంధ్ర ప్రాంత అద్వైత దర్శనానికీ ప్రధాన కేంద్రాలు. ప్రధాన కేంద్రాలవడం వల్ల తక్కిన దర్శనాలు ఈ నేలలపై లేవని అర్థం కాదు. గౌణములని తాత్పర్యం. అందువల్ల అద్వైత ప్రధానమైన భారతమునకు వచ్చినంత ప్రశస్తి, ఇచ్చినంత ప్రాముఖ్యం తెలుగు విర్శకులు పాల్కురికి ఇవ్వలేదు. ఇలా ఇవ్వకపోవడం వల్ల పాల్కురికి కవితావైభవం తక్కువ కాదు. తక్కువదీ కాదు. ఒక్కొక్క రకమైన సాహిత్యం ఒక్కొక్క రకమైన దేశకాల పాత్రముల ననుసరించి ఆదరానికీ నిరాదరానికీ గురి అవుతూ ఉంటుంది. వానికి అతీతంగా కేవల కవితా సౌందర్యాన్ని దర్శించగల విమర్శకుడే సహృదయుడు.
పాల్కురికి జీవితం
పాల్కురికి సోమనాథుడు క్రీ.శ. 12వ శతాబ్దములకు చెందిన మహాకవి. తెలంగాణంలోని వరంగల్ జిల్లాలో వున్న పాలకుర్తి ఈయన జన్మస్థానం. క్రీ.శ. 1140లో జన్మించి 1240 వరకు జీవించి ఉంటాడని ఒక ఊహ. కాకతీయ ప్రథమ (ద్వితీయ?) ప్రతాపరుద్రుని నాటివాడని పరిశోధకుల భావన. ఆయన ఆరాధ్యగురు పరంపరకు చెందినవాడు. ఆయన తండ్రి విష్ణురామి దేవుడు. తల్లి శ్రీయాదేవి. తాను వీరమహేశ్వరాచార వ్రతుడనీ కట్టకూరి పోతిదేవరకు భక్తుడననీ, కరస్థలి సోమనాథయ్య తన కవితా గురువనీ పాల్కురికి స్వయంగా చెప్పుకున్నాడు. చెన్నరాముడు ఆయనకు ప్రాణ స్నేహితుడు. పాలకూరి సూరనామాత్యుడు అతడి ముద్దుల బావమరిది బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు తనకు గురువని కూడా (దీక్షాగురువేమో) పాల్కురికి చెప్పుకున్నాడు. ఆయన ఆరాధ్య బ్రాహ్మణుడని ఒక వాదం. వీరశైవజంగముడని మరొక వాదం. నియోగి అనే ఇంకో వాదం ఆయన సంపూర్ణ గృహస్థ జీవితాన్ని గడిపినవాడు. చతుర్ముఖ బసవేశ్వరుడనే కుమారుడు సోమనాథునికి ఉన్నట్లు కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వీరశైవం రాజమతంగా ఉన్న కాకతీయుల కాలంలో జన్మించిన పాల్కురికి సోమనాథుడు బసవని ప్రభావంతో ఉర్రూతలూగిన కన్నడ దేశంలో నేటి బెంగళూరు సమీపంలో ఉన్న నాటి ప్రముఖ శైవపీఠం కల్వ అనే చోట లింగైక్యం చెందినట్లు చరిత్రకారుల అభిప్రాయం. సోమన్న కర్ణాటక వాడనే వాదం ఒకప్పుడు ప్రచారంలో ఉండేది.
సోమనాధుని కృతులు
సోమనాధుడు దాదాపు నలభైకి పైగా కృతులను రచించినాడు. అందులో కొన్ని ప్రముఖమైనవీ, మరికొన్ని అలభ్యమైనవీ ఉన్నాయి. అతని రచనలలో- బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, అనుభవ సారము, చతుర్వేదసారము, బసవ రగడ, చెన్నమల్లు సీసములు, వృషాధిప శతకము, బసవోదాహరణము, సోమనాథ భాష్యము (బసవరాజీయం), రుద్రభాష్యము, బసవాష్టకము, బసవ పంచకము, పంచప్రకార గద్య, నమస్కారగద్య, అక్షరాంకగద్య, బసవారూఢ్యరగడ, గంగోత్పత్తి రగడ, సద్గురు రగడ, చెన్న బసవస్త్రోత్ర రగడ, సోమనాథ స్తవము, మల్లమదేవి పురాణము, మొదలైన గ్రంథములున్నట్లు పరిశోధకుల అభిప్రాయం. ఇందులో మల్లమ్మదేవీ పురాణం వంటి కృతులు అలభ్యములు కాబట్టి వాని స్వరూపం మనకు తెలియదు. కన్నడ ప్రాంతంలో హేమారెడ్డి మల్లమ్మ అనే ప్రముఖ భక్తురాలు ఒకామె ఉంది. మల్లమ్మదేవీ పురాణంలోని కథ ఆమెకు సంబంధించినది కావచ్చునని అభిప్రాయం. బ్రహ్మశ్రీ ముదిగొండ శంకరరాధ్యులవారు (వీరి మఠం హైదరాబాదులోని కవాడీగూడాలో ఉంది) ప్రచురించిన ‘మోఫోపాయము’ అనే గ్రంథంలోని
‘్భక్తస్తవము’ అనే ద్విపదకూడా పాల్కురికి సోమనాథుడు రచించిన శైలినిబట్టి బండారు తమ్మయ్యగారు
అభిప్రాయపడ్డారు. సంస్కృత పండితారోధ్యోదాహరణం కూడా ఇటీవల దొరికింది. పాల్కురికి సంస్కృత సోమనాథ భాష్యముపై డాక్టర్ యం.ఉమాదేవి ఆంగ్లంలో పరిశోధనా గ్రంథం వ్రాశారు.
పాల్కురికి కవితా లక్షణాలు:
సోమనాథుడు సంస్కృతాంధ్ర భాషా విశారదుడే కాక ప్రాకృత తమిళ కన్నడ మహారాష్ట్రాది బహుభాషా కోవిదుడు. ద్వైతాద్వైత విశిష్టాద్వైత బౌద్ధజైనాది సమస్త దర్శనముల సారమును గ్రహించినవాడు. ఇంతటి పండితకవి మొత్తము తెలుగు భాషలోనే మరొకడు లేడంటే అందులో ఆశ్చర్యం లేదు. అంతేకాక ఇతడు సమస్త కవితా సంప్రదాయములూ తెలిసినవాడు. దేశకాల పాత్రములను గుర్తెరిగినవాడు. ప్రజల భాషలో ప్రజల కొరకు ప్రజల ఇతివృత్తాన్ని ప్రచారం చేయవలసిన అవసరం గ్రహించినవాడు. అందుకే నన్నయ్య మనకు అక్షరభిక్షను పెట్టిన ఆదికవి. అయితే పాల్కురికి తొలి తెలుగు కవి. ఐహికాధ్యాత్మికానుసంధానం గావించిన మొట్టమొదటి ప్రజాకవి.
‘‘ఉరుతర గద్య పద్యోక్తులకంటె
సరసమై పరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వసామాన్యమగుట
గూర్చెద ద్విపదలు కోర్కి దైవార’’
- అని బసవ పురాణ అవతారికలో సోమనాథుడు చెప్పుకున్నాడు. ‘జాను తెలుగు’ అనే భాషను తెలుగులో ప్రవేశపెట్టినవాడు పాల్కురికి. ఈ విషయంలో తిక్కనకు పాల్కురికియే గురువు.
నన్నయ పంచమ వేదాన్ని తెలుగులోకి తెచ్చి మహోపకారం చేశాడు. అయితే నన్నయది మార్గ కవిత. నాటి బౌద్ధ జైనములు దేశి కవితను ఆశ్రయించాయి. ప్రజల భాషను స్వీకరించాయి. అందువల పాల్కురికి ద్విపదను, జాను తెనుగును స్వీకరించవలసి వచ్చింది. అంటే నన్నయ్య నాటికి సంస్కృత కవిత మార్గ కవిత. భారతం దేశికవిత-పాల్కురికి నాటికి నన్నయ్య భారతం మార్గ కవిత బసవపురాణం దేశికవిత అయింది. ఇలా రెండువందల సంవత్సరాలలోనే కవితా నిర్వచనాలు మారాయి.
నేడు ఇంగ్లీషుకు ఉన్నట్లే నాడు సంస్కృతానికి మాత్రం సభాగౌరవం, రాజపోషణ ఉండేది. ధర్మశాస్త్రాదులు మంత్ర తంత్రాదులు కేవలం సంస్కృతంలోనే ఉండేవి. తెలుగును ఆ స్థాయికి తీసుకురావడం కోసం చాళుక్యులు కాకతీయులు కూడా అవిరళ ప్రయత్నం చేశారు. తత్ఫలితమే అటు భారతావతరణమూ, ఇటు బసవపురాణ పండితారాధ్య చరిత్రల రచనమూ జరిగింది.
‘‘తెలుగు మాటల సంగవలదు వేదముల
కొలదియు కాసూడు డిలనెట్టులనిన
బాటి తూమునకును బాటి నేని
బాటింప సోలయ బాటియకాదె’’
- అన్నాడు బసవపురాణంలో. ఇందులో ఇచ్చిన కొలమానపు ఉదాహరణ నూటికి నూరు పాళ్లు తెలుగుదనంతో కూడివుంది. అదే పాల్కురికి విశేషం. అలంకారాలలోనూ పదబంధంతో చమత్కారాలలోనూ పలుకుబళ్లలోనూ పూర్తిగా తెలుగును ఆశ్రయించాడు పాల్కురికి. ఇలా అనేకంటే తెలుగును బ్రతికించాడు పాల్కురికి అనడం ఇంకా బాగుంటుంది. నేటికీ నిఘంటువుల కెక్కని పదాలు వ్యావహారికమైన నుడికారాలు బసవపురాణంలో పండితారాధ్య చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. పాల్కురికి కవిత్రయంలో స్థానమివ్వక భీష్మించి తిరస్కరించిన బహుజనపల్లివంటి పెద్దలు, తిరస్కారంలో శీలాన్ని వ్యర్థం చేయక పాల్కురికి పదాలను నుడికారాలను ప్రజలకు వివరించి ఆయన రచనలు సేకరించి పూర్తిగా చదివి, రసజ్ఞులకు వివరిస్తే భాషకు చాలా ఉపకారం జరిగి వుండేది. ఒక్కమాటలో చెప్పాలంటే పాల్కురికి అన్నమయ్యకు భాషాగురువు. పదరచనకు ప్రోత్సాహకుడు.
‘‘అల్పాక్షరముల ననల్పార్థ రచన
కల్పించుటయు కాదె కవి వివేకంబు’’
- ఈ వాక్యాలు తిక్కన సోమయాజివి అనుకొంటున్నారేమో, పాల్కురికి సోమనాథునివి. బసవపురాణంలోనివి. అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేయడమనే కవితా సిద్ధాంతమును పాల్కురికి ప్రతిపాదించాడు. తిక్కనగారు దానిని విరాటపర్వ అవతారికలో ఆమోదించారు.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్