మెయిన్ ఫీచర్

ప్రజల మనిషి కాళోజీ(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచీకరణలో భాగంగా వచ్చిన మార్కెట్ సంస్కృతి ప్రభావం వల్లనో, మరే కారణాల వల్లనో మనిషి రానురాను సమష్టి జీవితం నుంచి దూరమవుతున్నాడు. సంఘంలో ఉంటూనే అతి జాగ్రత్తగా ఒంటరి జీవిగా బతకటానికి ఇష్టపడుతున్నాడు. అస్తిత్వోద్యమాల్లాంటివి సామూహిక చైతన్యాన్ని కలిగించినా - వాటికి గల ఉద్యమావసరాల దృష్ట్యా అవి మొత్తంగా మనిషిని సామాజికీకరణం చేయలేకపోయాయి. వివిధ అస్తిత్వోద్యమాల ప్రభావం వల్ల సమాజం నేడు అనేక సమూహాలుగా పరిణామం చెంది ఉండటాన్ని మనం గమనించవచ్చు. అయితే ఒక సమూహానికో లేదా ఏదో ఒక సమూహానికి చెందిన మనిషికో అన్యాయం జరిగితే - ఆ సమూహం మాత్రమే స్పందించటం, మిగతా సమూహాలు ప్రేక్షకపాత్ర వహించటం లాంటివి ఈ పరిణామక్రమం వల్ల కలిగే, కలుగుతున్న దుష్పరిణామాలు. సరిగ్గా ఇక్కడే కాళోజీ లాంటి మనిషి అవసరం ఏర్పడుతుంది. ఆయనలాంటి కవి అవసరం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఇప్పటికీ వుండివుంటే - ఈనాటి పరిస్థితుల మీద ఆయన ప్రభావం పడితే కలిగే మార్పులను ఊహించుకుంటే - శరీరం పులకరిస్తుంది.
కాళోజీ గుండెలనిండా మనిషిని ప్రేమించినవాడు. ఆ మనుషులు ఎవ్వరని అడిగితే శ్రీశ్రీ భాషలో దీనులు, హీనులు, బాధాసర్పద్రష్టులు.
మనిషిని ప్రేమించటం మొదలుపెట్టిన తరువాతనే కవిత్వాన్ని ప్రేమించాడు కాళోజీ. మనిషిని ప్రేమించడంలో భాగంగా అనివార్యంగా కవిత్వాన్ని ప్రేమించాడని అర్థం చేసుకుంటే కాళోజీ మనిషికిచ్చే విలువ ఏమిటో అర్థం అవుతుంది. తెలుగు సాహిత్య చరిత్రలో ఇంత నిజాయితీగా మనిషిని ప్రేమించినవాడు లేడు. వ్యక్తిగత జీవితాన్ని - సాహిత్య జీవితాన్ని ఒకే లక్ష్యం కోసం అంటే - మనుషులుగా వాళ్లు కోల్పోతున్న వాటి కోసం పోరాడేలా మలుచుకోవడం - ఆనాటికి కాళోజీకి తప్ప ఇతరులెవ్వరికీ సాధ్యం కాని విషయం. కాళోజీకి కుటుంబమున్నా వ్యక్తిగత జీవితం లేదు. ఉన్నదంతా సామాజిక జీవితమే. స్వంత ఆస్తి లేదు. కుటుంబ భారమంతా ఆయన అన్న రామేశ్వరరావుగారు తీసుకోవడం వల్లనే కాళోజీకి అంత స్వేచ్ఛ లభించింది అనే వాదనలో నిజం ఉన్నప్పటికీ అది మాత్రం పూర్తి నిజం కాదు. ఒకదానికి లొంగి వుండకపోవటమనే కారణం వల్ల - ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకమైనదేదో దినుసు వల్లా - ఆయనంత స్వేచ్ఛా పిపాసిగా మారాడు. అలా దొరికిన స్వేచ్ఛను సంపూర్ణంగా ప్రజలకు కేటాయించడం వల్ల కాళోజీ మహాకవి అయ్యాడు. ప్రజాకవి అయ్యాడు. అందుకే దాశరథి ‘నా గొడవ’ మొదటి ముద్రణకు పీఠిక రాస్తూ - ‘కాళోజీ 20వ శతాబ్దంలో తెలంగాణ ప్రప్రథమ ప్రజాకవి’ అయ్యాడంటారు.
స్వయంగా కాళోజీనే అనేక సందర్భాల్లో చెప్పినట్లు ఆయనది కమ్యూనికేషన్ కవిత్వం. తాను కవిగా ఒక సమస్య పట్ల ఎట్లా స్పందించాడో ఆ స్పందన నుంచి పుట్టిన కవిత్వాన్ని చదివిన వాళ్లూ అట్లాగే స్పందించాలని కోరుకున్నవాడు కాళోజీ. అంటే కవిత్వానికి అదనపు బరువులు తగిలించడం ఆయనకు ఇష్టముండదు. కాళోజీ కవిత్వం మంచినీళ్లంత శుభ్రంగా, స్పష్టంగా ఉంటుంది. ఏ ఇబ్బందీ లేకుండా మంచినీళ్లు అరిగిన విధంగానే ఎవరి (అంటే విమర్శకుని) సహకారం లేకుండానే ఆయన వ్యక్తిత్వం మనకు జీర్ణమవుతుంది. అట్లా అది కలిగించగల చైతన్యాన్ని అది కలిగిస్తుంది. కాళోజీ ఆత్మకథ ‘ఇదీ నా గొడవ’ ముందుమాటలో వరవరరావు గారన్నట్లు - ‘కాళోజీకి కవిత్వం పరమావధి కాదు. మానవత్వం పరమావధి’.
మొదట్లో విశాలాంధ్రను సమర్థించినా - తనకు గల భ్రమలు తొందర్లోనే పటాపంచలైన తరువాత తెలంగాణ కోసం బలమైన గొంతుకగా అవతరించాడు కాళోజీ. తెలంగాణ ప్రాంతీయ చైతన్యాన్ని వ్యక్తం చేయడానికి బలమైన సాధనంగా - ఏ మొహమాటం లేకుండా తెలంగాణ భాషనే స్వీకరించాడాయన. భాష విషయంలో కాళోజీ చూపించిన ఈ ముందుచూపును ఇప్పటికీ చాలామంది తెలంగాణ కవులు అలవర్చుకోవలసే ఉన్నది. రెండున్నర జిల్లాలది / దండి భాష అయినప్పుడు / తక్కినోళ్ల నోళ్లయాస / నొక్కిబడ్డప్పుడు - చాలా సాహసంగా తెలంగాణ భాషలోనే మాట్లాడిండు. అండ్లనే రాసిండు. కాళోజీ కవిత్వం దగ్గరికి వచ్చేసరికి అందులోని శిల్పం గురించో, కవిత్వ దినుసుల గురించో ఎవ్వరూ పరిశోధించరు. వాటికన్నా ఎక్కువ ఆయన కవిత్వంలో జీవితముంటుంది. జీవ భాష ఉంటది. ఈ రెండి మేలు కలయిక వల్ల మాత్రమే ఆయన కవిత్వం రాసిన మొట్టమొదటి కవి కాళోజీనే కావొచ్చు. ఆనాటికే కాళోజీకి - ఇప్పటికీ చాలామంది విద్యావేత్తలకు లేని భాషా పరిజ్ఞానం వుంది. ఆయన బడి పలుకుల భాష కాదని పలుకుబడుల భాష కావాలన్నాడు. ఇప్పటికీ అది సాధించుకోవలసిన ఆశయంగానే మిగిలిపోవడం విషాదం.
‘నిజానే్న - సత్యానే్న అన్ని సమయాల్లోనూ చెప్పాలి. అయితే ముఖ్యంగా నిజం పలకటమే ప్రమాదకరమైన సందర్భాల్లో ఆ నిజాన్ని మరీ చెప్పి తీరాలి’ - అంటాడు ఆంగ్ల కవి కోల్రిడ్జ్. దీన్ని అక్షరాలా పాటించినవాడు కాళోజీ. సాహిత్య రంగంలోనూ - దాని బయటా తాను నిజమని నమ్మిన ఏ విషయాన్నైనా చెప్పడానికి వెనుకాడలేదు. అధికారంలో వున్నవాళ్లు తన మిత్రులైనా సరే ఆయన ప్రజల పక్షమే వహించాడు. ప్రభుత్వాల చేత సన్మనాలు - పురస్కారాలు పొందినా, భూస్వాముల ఇళ్లలోకి ఆహ్వానించినప్పుడు వెళ్లి భోజనం చేసినా - వీళ్లవల్ల ప్రజలకేదైనా అన్యాయం జరిగితే మాత్రం నిస్సంకోచంగా ప్రజలవైపు నిలబడి పోరాడటం కాళోజీ నిబద్ధతకు నిదర్శనం. ఆయన కాలంలో తెలుగు నేలలో ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజల హక్కులకు విఘాతం కలిగినా కాళోజీ అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. అన్యాయం మీద కవిత్వమై పేలేవాడు. కవిగా కాళోజీ స్థానాన్ని భర్తీ చేయగలవారెవరైనా ఉన్నారేమో తెలియదుగానీ ఒక వ్యక్తిగా, ప్రజాపక్షపాతిగా, వ్యక్తిగత జీవితాన్ని, సౌఖ్యాలను త్యాగం చేసిన వ్యక్తిగా, సమాజం కోసం కన్నీరుపెట్టే మెత్తని గుండె గలవాడుగా - కాళోజీ స్థానాన్ని పూరింపగలవారున్నారనడానికి ఈ మధ్యకాలంలో సాక్ష్యాలు లేవు. సాహిత్యకారులలో నిజంగా కాళోజీ ఏనాటికైనా ప్రజల మనిషే.

- తోకల రాజేశం, 9876761415