మెయిన్ ఫీచర్

మేల్కొందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలంతో వచ్చిన మార్పులు మనిషి జీవితంమీదా ప్రభావం చూపించడం అనేది వర్తమానం! ఒకప్పటిది మనిషి యుగమైతే... ఇప్పటిది మరమనుషుల యుగం. అప్పటిది మనసు యుగమైతే... ఇప్పటిది మేధో యుగం. ఎప్పుడైతే మేధస్సుకు ప్రాధాన్యత పెరిగి మమతకు ప్రాధాన్యత తగ్గిపోయిందో అప్పుడే పుట్టింది మానవ సంబంధాల మధ్య ముసలం! డబ్బు యావ, ‘నేను, నాది’ అన్న స్వార్థం మనిషి మనసులో వైరస్‌లా ఎప్పుడైతే వచ్చి చేరాయో అప్పుడే వాటికి ప్రేమ, ఆప్యాయతల డెఫీషియన్సీ కూడా తోడై మనసు వ్యాధిగ్రస్తమైంది.
పండుగకు పుట్టింటికి వచ్చిన నడివయసు ఆడపడుచు పుట్టింట్లో తను గడిపిన ఆనాటి తన బాల్యాన్ని చిన్నారి మేనకోడళ్లలో చూసుకుంటూ తీయటి జ్ఞాపకాల ముడి విప్పుతూ వుండేది. చిన్నతనంలో అప్పుడు తను ఆడుకున్న లక్కపిడతలు, గచ్చకాయలతో ఇప్పుడు మేనకోడలు ఆడుకుంటుంటే చూసి మురిసిపోయేది. తనకు తల దువ్వి జడవేసి.. తనకు ఓణీలు వేసుకోవడం నేర్పిస్తూ గతంలోకి జారుకుంటుండేది. అలాగే మంచంలోని వయోవృద్ధురాలైన ఓ తాతమ్మ ‘ఇలా రావే అమ్మడూ’ అంటూ ఐదోతరం మునిమనవరాలిని దగ్గరకు పిలిచి- తన మెళ్లోని ‘జిగినీ గొలుసు’ను ఆ పసిదాని మెళ్లో వేసి.. ఆ పిల్ల తల్లి వంక చూస్తూ ఇది మా అత్తగారు నాకిచ్చిన అచ్చొచ్చిన తరతరాల నగ- భద్రంగా దాచి మళ్లీ నీ మనవరాలికివ్వు- అని చెప్పటం ఆ తరంలో ఆరోజులను చూసినవాళ్లకు చిరపరిచితమైన దృశ్యమే. మనవరాలి పెళ్లి చూడందే చావనని మొండికేసుకుని కూర్చునే మొండి ముసలి ఘటాలు.. ‘నేనుండగానే నా మనవడి భుజాన ఓ జంధ్యం పోగు వేయండర్రా-చూసి పోతాను’ అని కొడుకును బ్రతిమిలాడే ముసలి తండ్రులు ఆరోజుల్లో వుండేవాళ్లని ఆ తరువాతి వాళ్లు చెబితే ‘వీళ్ల ప్రేమలు విచిత్రం సుమా... చచ్చే సమయంలోనూ వీళ్లను ఈ భవబంధాలు వీడవా?’ అని ఆశ్చర్యపోయేవాళ్లు! ఆనాటి ప్రేమల, అనుబంధాల గట్టితనం అది!
ఇప్పటిలా ‘ఉఫ్’ అంటే ఊడిపోయేలాంటి పైపై ప్రేమలు కావవి..! మనసు లోతుల్లో నుంచి వచ్చినవి. ఇప్పుడు ‘నేను.. నాకో భార్య (్భర్త).. ఒక సంతానం!’ ఈ ముగ్గురు తప్ప నాలుగో మనిషితో బంధం, సంబంధం ఉండటంలేదు. ఆ ముగ్గురైనా ముచ్చటగా ఉంటారా అంటే అదీ లేదు. విడాకులు, చైల్డ్‌కేర్ సెంటర్సు, హాస్టల్ చదువులు, భార్యాభర్తల బహుదూరపు పోస్టింగ్‌లు ఇలా ఏవో ఒకటి ఆముగ్గురి ‘తలొకదారికి’ కారణం అవుతున్నాయి. ఈ ముగ్గురూ కాక ఒకవేళ ముసలి తల్లో, తండ్రో బతికివుంటే వాళ్ల కోసం వృద్ధాశ్రమాలు గేట్లు బార్లా తెరుచుకుని ఉండనే వుంటున్నాయి. వ్యాపారం చేసుకోవాలనుకునేవాడికి ఇంతకుముందు కొన్నంటే కొనే్న మార్గాలు వుండేవేమోగాని ఇప్పుడు అపతి ఇల్లూ వాళ్లకు ఒక ఉపాధి మార్గమే.. ప్రతి మనిషీ వ్యాపార వస్తువే. కుటుంబల పరిస్థితి, పరిధే ఇలావుంటే ఇక అలాంటి ఇళ్లకు అతిథి అనేవాడు అడుగుపెట్టడానికైనా సాహసిస్తాడా? చుట్టమై వచ్చి దయ్యంలా పట్టుకున్నాడని అనుకుంటారని, భయపడడూ! అయినా ఇప్పుడు అలా అనుకోవడం, గినుకోవడం కూడా ఏమీ లేదూ... అనదలుచుకున్నది ముఖాన అనెయ్యడమే! అంతా ఓపెనే.. నో సీక్రెట్స్! ఫ్రాంక్‌గా వుండటం, అలాగే మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్! అయినా సిగ్గు లేకుండా ఎవడైనా ఎవడింటికయినా చుట్టమై వెళితే.. వాడికి కుక్కపాట్లే (కుక ఇంకా బెటర్). ‘మమీ హూ ఈజ్ దిస్ గై?’ అని అతడి ముఖం ముందే తల్లిని అడుగుతుంది ఐదేళ్ల కూతురు. ఆమె చక్కగా ఆ వచ్చిన వ్యక్తి ఆ పాపకు ఏమవుతాడో వివరించి చెప్పకుండా... వరస కలుపకుండా ‘అంకుల్’, ఆడ అయితే ఆంటీ అని చెబుతుంది సింపుల్‌గా. తల్లికీ, బిడ్డకూ కూడా ఆ వచ్చినవాళ్లు టోటల్‌గా అంకుల్, ఆంటీలే! ‘్ఫన్నీ’ కదా! రాత్రి ఏ ఏడుగంటలకో వర్క్ ప్లేస్ నుంచి ఇంటికొచ్చిన ఆ ఇంటి యజమాని వచ్చిన గెస్టులు తనవైపు వాళ్లయితే ఒక చిరునవ్వు నవ్వితే నవ్వుతాడేమోగానీ వైఫ్ తరఫు వాళ్లయితే మాత్రం నైఫ్‌లా చూస్తాడు వాళ్ల వంక (వైఫూ డిటోనే). ఇక ఇద్దరూ జాబ్ చేసేవాళ్లయితే వచ్చినవాళ్ల గతి అధోగతే! ‘మేమిద్దరం వర్కింగ్.. మాకు ఫార్మాలిటీస్ కుదరవు. పైగా మా ఇల్లు చిన్న ఫ్లాట్.. మాకే సరిపోదు.. అందులో గెస్ట్ రూమ్ లేదు.. అని డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో చెబుతున్నారు.
ఈ అల్ట్రామోడ్రన్ యుగంలో యంత్రాల మధ్య నిరంతరం పనిచేస్తూ తానూ రోబోలా మారిన మనిషి గుండె కూడా ఇనుములా కఠినంగా మారిపోయింది. అందులో ఆర్ద్రత, ఆప్యాయతలకు తావు లేకుండా పోతోంది. మానవ సంబంధాలకు అనుకూలత లేకుండా పోవడంతో మనిషి ఒంటరితనం, ఒత్తిడితో, ప్రేమ రాహిత్యంతో, నిరంతర వేదనతో, అభద్రతా భావంతో బాధపడుతున్నాడు. ఇది ముందుముందు కూడా ఇంకా ఇలాగే గొనసాగితే.. మనిషిలో నుంచి మానవత్వం తొలగిపోతే దానివల్ల రాబోయే తరాలలో ఒక్కొక్కరు ఒక్కో మానసిక రోగిగా మారిపోతారు. ఆ పరిస్థితి రాకముందే మేల్కొందాం. మాయమైపోయిన మనిషిని పట్టి తిరిగి తీసుకొద్దాం.

-డా. శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు