మెయిన్ ఫీచర్

క్రికెటర్ నుండి యాక్టర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు సరదాగా స్కూల్లో వేస్తున్న నాటకంలో చిన్న పాత్ర వేస్తే అందరూ మెచ్చుకున్నారు. అలా నాటకాల పట్ల ఏర్పడిన మక్కువ డా కోట్ల హనుమంతరావుని కళాకారుడిగా తీర్చిదిద్దింది. నేడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాటక రంగంలో శాఖాధిపతి. ఎక్కడ విద్యార్థిగా మొదలుపెట్టారో, అదే విశ్వవిద్యాలయ శాఖాధిపతిగా ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు.

క్రికెటర్ కావాలనుకున్నారనుకుంటా. కళాకారుడుగా ఎలా అయ్యారు?
నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కాలేజీ కెప్టెన్‌గా ఉన్నాను. క్రికెటర్ అవ్వాలని కలలు కనేవాడిని. మా అన్న కోరిక నేను డాక్టర్ అవ్వాలని. కాని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో యాక్టింగ్ కోర్సు గురించి ప్రకటన చూసి అప్పుడు అక్కడ విద్యార్థిగా నా పయనం మొదలైంది.
బాల్యం గురించి చెప్పండి?
చిన్నప్పుడు నాన్నగారు నన్ను సైకిల్‌మీద తిప్పేవారు. అలా వెళుతున్నపుడు, సినిమా కథలు, రామాయణం, మహాభారతం, నాటకాలు, ఏకపాత్రాభినయం గురించి చెప్పేవారు. నేను 7వ తరగతి చదువుతున్నపుడు మా ఊళ్ళో ‘వీరబ్రహ్మేంద్రస్వామి’ నాటకం వేశారు. అందులో నేను చిన్న సిద్ధయ్య పాత్ర వేశాను. అలా నా నటనా జీవితం మొదలైంది. నాన్నగారే నాకు స్ఫూర్తి.
విద్యార్థిగా ఉన్నప్పుడు అనుభవాలేంటి?
తెలుగు విశ్వవిద్యాలయంలో నేను 1993లో బిఏ చేరాను. కొత్తలో అంతా కన్‌ఫ్యూజన్ ఉండేది. నటుడిగా నిలదొక్కుకోవడం కష్టం అనిపించేది. ఒక దశలో కోర్సు మధ్యలో మానేద్దాం అనిపించింది. కాని గుంటూరు యూత్ ఫెస్టివల్‌లో ఒక నాటకంలో చిన్న పాత్ర వేశాను. అప్పుడు నమ్మకం పెరిగి ధైర్యం వచ్చింది. అలా క్రమంగా నా ప్రదర్శనలకు మంచి స్పందన రాగా, కాన్ఫిడెన్స్ పెరిగింది. తరువాత అదే యూనివర్సిటీలో ఎంఏ, పిహెచ్‌డి చేసి అధ్యాపకుడిగా చేరటం ఒక అనుభవం.
నటనలో మీపై ఎవరి ప్రభావం ఉంది?
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో అప్పుడు రంగస్థల కళల శాఖాధిపతి సోమయాజులు. అప్పుడు టీచర్లుగా దర్శి రాములు, వినోదబాల ఉండేవారు. ఇద్దరిదీ వేరే స్టైల్! దర్శి రాములు బాగా ప్రాక్టీసు చేయించేవారు. వినోద్‌బాల నటుడినుండి నటన రావాలి అని, స్పాంటేనిటీ వుండే పద్ధతి వారిది. వీరిద్దరి శిక్షణలో చాలా ఎదిగాను.
టీచింగ్ ప్రొఫెషన్‌లో ఎలా వెళ్లారు?
చాలామంది సినిమా నటులు అవ్వాలనే కోరికతో రంగస్థల కళల కోర్సులో చేరుతూంటారు. నేను ఎం.ఏ చదివిన వెంటనే యుజిసి నెట్ పాస్ అయ్యాను. వెంటనే తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థి నుండి టీచరుగా ఎదిగే అవకాశం వచ్చింది. అలా మొదలై నేడు అసిస్టెంట్ ప్రొఫెసరు, శాఖాధిపతిగా ఎదిగాను.
టీవీ, రేడియో సినిమాలో పొందిన అనుభవాలు ఎలాంటివి?
ఊహలపల్లకీ, ఉషోదయం, సంగ్రామం లాంటి ఆరు టీవీ సీరియల్స్‌లో నటించాను. మాయాబజార్ సీరియల్‌కి దర్శకుడిగా మూడు సంవత్సరాలు చేశాను. ఇవి నటుడిగా, దర్శకుడిగా బాగా పేరు తెచ్చాయి. ఆల్ ఇండియా రేడియో యువవాణి ప్రోగ్రామ్స్‌కి అనౌన్సరుగా ఉండేవాడిని. నా ప్రోగ్రామ్స్‌కి నేనే స్క్రిప్టు రాసుకునేవాడిని. వాటికి డబ్బు ఇచ్చేవారు. విద్యార్థి దశలో ఆర్థికపరంగా ఇవి సహాయంగా ఉండేవి. ఇలా నాలోని రచయితకు బీజం పడింది. ప్రైవేటు రేడియో ఎఫ్‌ఎం చానెల్ ‘జాఫా ఫోర్’కు ప్రొడ్యూసర్, రేడియో జాకీగా పనిచేశాను.
ఎల్లమ్మ, చిన్నారి పంతులమ్మ, ఈశ్వర్, యువర్స్ అభి వంటి సినిమాల్లో నటించాను. కాని స్నేహితుడి పాత్రల అవకాశాలు వచ్చేవి. ఇలా చిన్న పాత్రలకే పరిమితం అవడం ఇష్టం లేక పెద్ద, మంచి పాత్ర వస్తే చూద్దాం అనిపించింది. అప్పటినుండి నాటకాలకు, టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వైపే ఉన్నాను.
మీకు వచ్చిన కొన్ని ముఖ్యమైన అవార్డులు ఏంటి?
చాలా సత్కారాలు, పురస్కారాలు వచ్చాయి. కాని కొన్ని ముఖ్యమైనవి- 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు. మూడు ఇంటర్నేషనల్ అవార్డులు- మైమ్, మోనోయాక్షన్, వన్ ఏక్ట్ ఇన్ సమర్ ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్, జైపూర్, రాజస్థాన్‌లో. ఫిలిం కౌన్సిల్ నుండి బెస్ట్ మోనోయాక్టర్ అవార్డు- ఇలా చాలా వచ్చాయి.
దర్శకుడిగా మీరు పొందిన అనుభవాలు ఎలాంటివి?
విద్యార్థి దశ నుండి ప్రయోగాత్మక నాటకాలు చేయాలి అనే భావం ఉండేది నాకు. జయ జయహే తెలంగాణ, నాయకురాలు నాగమ్మ, గంగిరెద్దు, బతుకమ్మ, రామప్ప.. ఇలా అన్నీ విభిన్న కథాంశాలతో రచించినవే. జయ జయహే తెలంగాణ 60 సంవత్సరాలుగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటం గురించి. సూత్రధార పద్ధతిలో, కూచిపూడి నర్తకీమణులతో రజాకార్ల దాష్టీకం చూపించినా అన్ని నాటకాలకు మంచి స్పందన వచ్చింది. నాయకురాలు నాగమ్మలో ప్రధాన సూత్రధారుడితో పాటు ఆరుగురు సహాయకులు మాస్కులు ధరించి ఉంటారు. రామప్ప, గంగిరెద్దు, బతుకమ్మ, స్వక్షేత్రం అన్నీ కూడా విభిన్న, వినూత్న పద్ధతిలో చేశాం.

నాటకరంగంలో యువతకు ప్రోత్సాహం ఎలా ఉంది? పోటీల నిర్వహణ, పరిషత్తులో మార్పులు ఏవైనా రావాలా?
తెలుగు నాటక రంగం అంటే పరిషత్తు నాటకం అనే ధోరణిలో వుంది. అది మారాలి. ఎంతోమంది దర్శకులున్నారు. వారికి సరైన గుర్తింపు, వేదికలు లేవు. పైగా ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంవల్ల వీరు సినిమా, టీవీ వైపు వెళ్తున్నారు. ప్రేక్షకులు కూడా బాధ్యత తీసుకుని నాటకాలను ప్రోత్సహించాలి. పరిషత్తు పోటీలు నిర్వహించేవారు, జర్నలిస్టులు కూడా కొత్త నాటకాలను ప్రోత్సహించాలి.
ఎలాంటి బాధ్యతలున్నాయి?
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఉపయోగపడే సౌకర్యాలు కల్పించే అనేక బాధ్యతలు నిర్వహించడమైనది. ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీల్లో బిఒఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) మెంబరుగా ఉన్నాను. పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో డాక్టోరల్ మెంబర్‌గా ఉన్నాను. ఎన్నో విశ్వవిద్యాలయాల్లో బోధనాపరంగా అనేక బాధ్యతలు నిర్వహించాను. ఉస్మానియా విశ్వవిద్యాలయాల రంగస్థల కళల శాఖలో, ఆంధ్ర మహిళా సభలో బోధన బాధ్యతలు కూడా! ప్రభుత్వ పరంగా ఉన్న కమిటీల్లో మెంబరుగా ఉన్నాను. ఎఫ్‌డిసి సెలక్షన్ కమిటీ మెంబరుగా, తెలంగాణ నాటక పోటీలను ‘సింహ’ అవార్డులకు నిర్వహించే కమిటీ మెబరుగా ఉన్నాను.

నాటకరంగం- టీవీ- సినిమాల్లోకి వచ్చేవారికి మీ సూచనలు ఏమిటి?
ఈ మూడు మాధ్యమాలు వేరుగా చూడకూడదు. నటుడు ఒకటే, శిక్షణ ఒకటే! ఆయా మాధ్యమాలకు (మీడియా) అనుగుణంగా నటుడు నటించాలి. పుట్టగొడుగుల్లా నటుడిని తయారుచేసే శిక్షణాలయాలు పుట్టుకొస్తున్నాయి. సరైన ట్రైనింగ్ తీసుకొని బాగా నటించడం నేర్చుకోవాలి. కృషి, పట్టుదల, అంకితభావంతో ఏ రంగంలోనైనా రాణించగలరు.
రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా?
కళాబంధువు - తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ముఖ్య సలహాదారులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు ఐఎఎస్ (రిటైర్డ్) డా కె.వి.రమణయ్య అంటే విద్యార్థి దశ నుండి ఎంతో అభిమానం. కళాకారులకు, కళలకు ఆయన ఎంతో సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ఆయన చేసే కృషి, పట్టుదల, కళలపట్ల అభిమానం ఎంతో గొప్పది. ఆయనలాగే ఒక ప్రత్యేకమైన మార్క్ ఉండాలని నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఆయనే నాకు రోల్ మోడల్.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి