మెయిన్ ఫీచర్

అమ్మ ప్రేమ అనంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ లేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం ఎంతటి దౌర్భాగ్యం.. అమ్మలేని కొందరి జీవితాలను పరిశీలిస్తే కళ్లలో నీళ్లు ఘనీభవించి కళ్లు మసకబారిపోతాయి. అమ్మ వున్న కొందరి ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలిపోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది.

రెండేళ్ల క్రితం అమెరికాలో అమ్మ సేవలకు గంటల ప్రకారం లెక్కలు కట్టారు. ఆమె సేవలకు కట్టిన విలువ ఎంతో తెలుసా? సంవత్సరానికి అక్షరాలా 70 లక్షల రూపాయలు అని తేల్చారు. అంటే నెలకు ఐదు లక్షలన్నమాట. కాని బిడ్డకు పెన్నిధి లాంటి అమ్మ ప్రేమకు వెలకట్టడం హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు.
అమ్మతో మంచి అనుబంధం ఉన్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. మెదడులో వుండే హిప్నోకాంపస్ అనే భాగం మన జ్ఞాపకశక్తికీ, తెలివితేటలకూ, ఒత్తిడిని తట్టుకునే శక్తికీ ఆధారభూతమైంది. అమ్మ ప్రేమ లభించేవారిలో అది దాదాపు పదిశాతం
పెద్దదిగా ఉన్నట్లు తేలింది.

అక్కున చేర్చుకొని తల నిమురుతూ నుదుట ముద్దు పెట్టుకునే అమ్మ అద్భుతమైన స్పర్శ ఎంత గొప్పది. అంతటి అనుభూతిని భావవ్యక్తీకరణ చేయడానికి పదాలు దొరుకునా, అమ్మ గురించి రాయడానికి కలం కదులునా, అమ్మ యావత్ విశ్వమండలమంతా వెలిగే అఖండ ప్రేమ జ్యోతి అని తెలుపుటకు స్థాయి సరిపోవునా, వీచే చల్లని గాలిలో అమ్మ పలకరింపులు పున్నమినాటి చంద్రుని కాంతిలో అమ్మ దీవెనల వెలుగులు ఇలా అమ్మను వర్ణించుటకు భాష సరిపోవునా...!!

అమ్మ ఉన్నంత కాలం తన విలువ తెలియదు, తను శాశ్వతంగా దూరమైతే తెలుస్తుంది నిజమైన ఒంటరితనం యొక్క ప్రభావం మనిషిని మనసుని ఏవిధంగా ఎంతలా దుఃఖించేలా చేస్తుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. నలుగురిలో ఎలా బ్రతకాలో నేర్పిన అమ్మ పాఠాల మాటలు పిలుపే అందని దూరాలలో, వెతికినా దొరకక చూసిన కనపడక, తిరిగిరాని లోకాలకు అమ్మ ప్రయాణమైతే ఆ ఇల్లు దీపం వెలుగుతూ కనపడినా జీవ కళ లేని అంధ గృహమే కదా, భగవంతుడు లేని చీకటి దేవాలయమే కదా ఎంత బలం బలగం వున్నా ఏమి? అమ్మలేని జీవితం శూన్యమే కదా.
దేవత లాంటి అమ్మను అందరికీ ఇచ్చిన భగవంతుడు కొందరు పిల్లలు ఎదిగి ప్రయోజకులయ్యే వయసులో అకారణంగా అమ్మను తన వద్దకు తీసుకొని వెళ్లిపోతుంటాడు, గతి తప్పిన గమ్యాలై గూడు చెదిరిన పక్షులవలె అందరు వున్నా అనాధలుగా మిగిలిపోతుంటారు. అమ్మను దూరం చేసి గమ్యమెరుగని ప్రయాణం చేయమంటే చిన్ని గుండెలు ఎలా తట్టుకొనగలవు. ఇది వారి నుదుట రాసిన కర్మ ఫలమా లేక విధి ఆడే వింత వినోద నాటకంలో పాత్రలమా, ఇలా ఎందరో మరెందరో అభాగ్యుల జీవితాలు అమ్మ ప్రేమ మరియు అమ్మ తోడు లేక దారం తెగిన పతంగివలె చెట్టుకో పుట్టకో చిక్కి చెదిరిపోవాల్సిందేనా! అమ్మకు సరిసాటి రాగల వారెవరు. అమ్మ చూపే కల్మషమెరుగని ప్రేమను ఈ లోకంలో ఎవరు చూపగలరు.. అమ్మలేని ప్రతి ఒక్కరి హృదయంలో కలిగే ఆవేదనను ఎవరు ఓదార్చగలరు.. అమ్మ వదనం ప్రశాంత నందనవనం, అమ్మ హృదయం సూర్యచంద్రులు దాగిన నీలాకాశం, అమ్మ చిరుకోపం మెరిసే మేఘం, కురిసే వర్షం, అమ్మ లేని జీవితం నిశిరాత్రి చీకటి శ్మశానం అని నా భావన. ఇంకా వివరించటానికి మాటలు లేవు రాయడానికి అక్షరాలు చాలవు..!!
ఇకపోతే అమ్మ కొందరి మనుషుల వ్యధ, కొడుకులు తల్లిని ప్రేమించడం గౌరవించడం పూజించడం సేవలు చేయడం అనేది తరువాత విషయం అనుకుందాం కాని ఎందుకు అంత హీనంగా చూస్తున్నారు. దగ్గినా తుమ్మినా నీరసంగా వున్నా ఎందుకు అంత వింతగా చూస్తున్నారు? వేళకు పట్టెడు అన్నం పెడుతున్నారా? నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని నీచమైన పదాలతో దుర్భాషలాడుతున్నారు, మానసికంగా హింసలు పెడుతూ వెట్టిచాకిరీ చేయిస్తూ ఆవేశంతో చేయి చేసుకుంటున్నారు. చివరికి తల్లిని మెడపట్టి గడప బయటకు తోసేస్తున్నారు? సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలా దిగజారిపోతున్నారు ఏమి ఈ దౌర్భాగ్యం.వృద్ధులైన తల్లులకు సేవ చేయలేని దుర్మార్గులు అడవులలో వదలడం, అంతస్తుల మీద నుంచి తోసేయడం ఇలా కనపడకుండా హత్యలు చేస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమంలో వదిలి దిక్కులేనివారిగా చేస్తున్నారు.
అయినప్పటికీ సహన ధారిణి బహుపాత్ర రూపిణి అయిన అమ్మ ఎన్ని బాధలు, అవమానాలు పడినా తన చివరి శ్వాస వరకు కన్న బిడ్డలపై ఎనలేని మమకారం చూపుతూనే వుంటుందనేది పరమ సత్యం. అమ్మ ఒక గంభీరమైన నిరంతర ప్రవాహం. కొలవలేని లోతైన మహా సముద్రం. అమ్మ తన బిడ్డలపై స్వచ్ఛమైన చల్లనైన ప్రేమామృత వర్షం కురిపిస్తూనే వుంటుంది.. ఎందరో మాతృమూర్తుల పాదాలకు వందనాలు.

-డా. శారదారెడ్డి వకుల