మంచి మాట

మానవతా విలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సంస్కృతి విశ్వంలోనే ఘనతగాంచింది. మన భారతీయ సంస్కృతి భవ్యమైంది, దివ్యమైంది. ఇందులో నైతిక విలువలు, నాగరికత విశిష్టతని ఎత్తిచూపిస్తాయి. మన సంస్కృతి సాహిత్య సంప్రదాయలలో మానవతా విలువలు వెల్లివిరిసి ప్రతిబింబిస్తాయి. అవి జాతి ఔన్నత్యానికి ఆసరాయై అద్దంపడతాయి. మన సంస్కృతి ఆదినుండీ మానవతా పరిమళాలను వెదజల్లుతూ మానవునిలో మార్పును తీసుకొచ్చే మంచిని పెంచుతూ పంచుతూ ఆదర్శంగా ఆవిష్కృతమై అగ్రపూజనందుకుంటుంది. కావుననే ప్రపంచంలో అసలైన మానవత్వం ఎక్కడుందని ఎవరైనా ప్రశ్నిస్తే అది ఒక్క భారతదేశంలోనే మిగిలి ఉందని, చెప్పడంలో అతిశయోక్తి లేదు.
‘అహింసా పరమో ధర్మః’ అన్నది మన వేదం. అదే మన వాదం, నాదంగా నిల్చింది. ‘ఆత్మవత్ సర్వ భూతాని, .......’ అని నినదిస్తాయి మన గీతాది గ్రంథాలు. పరోపకారమే పుణ్యమని, పరులను పీడించడమే పాపమని అష్టాదశ పురాణాల సారాంశమిదేయని వ్యాస మహర్షి ఇలా ప్రకటించారు.
నిరుపేదలకు, నిర్బలులకు, రోగులకు, అనాథలకు ఊతనాశించేవారికి, ధైర్యం కోల్పోయిన భయనీతిపరులకు, ఆపదల్లో కొట్టుమిట్టాడేవారికి కాస్తంత ఊతను, ధైర్యాన్ని ఆశను, ఆత్మవిశ్వాన్ని, వ్యక్తిత్వ పరిమళాలనందించేదే మానవత్వం అంటారు పెద్దలు.
మానవుడిలో మానసిక మార్పు తేవడం చాలా ముఖ్యమైందని వేమన వాణి ఇలా చెబుతోంది. మనుషులు సూదిలా ఉండకూడదని, దారంలా ఉండాలని, సూది పని రంధ్రాలు చేయడమే. కాని దారం ఆ రంధ్రాలన్నింటినీ కప్పుకొని వెళ్తుందని తెలుగు లెంక కీ.శే.తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి ప్రబోధం.
‘తల్లిదండ్రి లేని బిడ్డల జూచి / కన్నీరు, దానంబు చేయు నేత్రములు నావి / కఠిన చిత్తుల దురాగతముల ఖండించి / కనికరమొలికించు కలము నాది’ అంటూ మహాకవి జాషువా తన సానుభూతిని తెలియజేశారు.
నా దేశంలో ఆకలి దప్పికలతో జంతువులు కూడా బాధపడకూడదని, నిష్కామ బుద్ధితో బాధితులకు సేవ చేయడమే ఉత్కృష్ట మానవ ధర్మమని స్వామి వివేకానంద తెలిపారు. ఎవడు జీవనారాధకుడో, అతడే దైవారాధకుడన్నది అతని ప్రబోధం.
‘ప్రార్థించే పెదవులుకన్నా, సహాయం చేసే చేతులు మిన్న’- చేతులకెంత మురికి అంటితే, అంత గౌరవంగా నే భావిస్తానని మదర్ థెరిస్సా ఆచరించి లోకానికి ఆదర్శంగా నిల్చారు. మహామహిమాన్వితురాలయారు.
‘సొంత లాభం కొంతమానుకో, పొరుగువారికి తోడుపడవోయ్’ అంటూ గురజాడ అప్పారావు లోకానికి హితవు పలికారు. ఈ లోకంలో మానవుడు ఇతరులకు చేసిన మేలే, అతనికి నిజమైన సంపదయని మహమ్మద్ ప్రవక్తప్రబోధం. ‘సేవించు ప్రేమించు తరించు’ అని స్వామి శివానందులవారి సందేశం. ‘ప్రేయసి ప్రేమలోన కనిపించిన తీయని, స్వర్గమొక్కటే ధ్యేయము కాదు, హీనులు అతిదీనులు, మ్లానతనుల్, దరిద్ర నారాయణులు ఏడ్చుచుండిరి, వారి అశ్రువులను నీవు ఆమెతో సహా వెళ్లి తుడిచి సహాయమొనరించినచో నీకు కోట్లాది స్వర్గములు లభిస్తాయన్నది కరుణశ్రీ కవిగారి వాణి.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దధీచి, శిబి, బలి వంటి మహాపురుషులెందరో నాడు మానవతావాది విలువలకు పట్టంగట్టారు. ప్రాణం పోశారు. మహనీయులెందరో మానవతా విలువలకు వలువలు చేకూర్చారు, ఊపిరిలూదారు. నేడు అంతరిస్తున్న మానవతా విలువలను చిగురింపజేస్తూ ప్రతి యువతీ యువకుడు గుండె బలంతో, నిండు మనసుతో ముందుకొచ్చి మంచి మనీషిగా ఎదగాలని కోరుకుందాం.
దానికి చిన్నప్పుడే పూవు పుట్టగనే పరిమళించినట్టుగా బాల్యదశలోనే నీతికథలను బోధించాలి. మహనీయుల జీవిత చరిత్రను తెలపాలి. భగవద్గీతను పఠింపచేయాలి. భగవంతుని కథలను వినేట్ట్టు చేస్తే భగవంతునిపైన నమ్మకాన్ని కలిగిస్తే అందరిలోను ఉన్న పరమాత్మ అంశను చూచే నేర్పుఅలవడితే ఎవరికి వారు పరుల ప్రయత్నాలకు తమ చేయ నందిస్తారు. ఉన్నంతలో కలసిఉండాలన్న తపన వారిలో మొదలవుతుంది. దానివల్లనే మనదేశ ఔన్నత్యం కాపాడే వీరులుగా పిల్లలు ఎదుగుతారు. వారే వసుదైక కుటుంబవాంఛను ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా భారతదేశాన్ని నిర్మించడంలో పాలుపంచుకుంటారు.

-చెళ్ళపిళ్ళ సన్యాసిరావు