మంచి మాట

పుణ్యఫలాలు

  • -శ్రీష్టి శేషగిరి
  • 06/05/2013

కలియుగమంటేనే కష్టాలూ కన్నీళ్లగుర్తుకు వస్తాయ. త్రేత ద్వాపర యుగాలలో ప్రజలు నిత్యం సుఖ సంతోషాలతో, ఆనందసాగరంలో మునిగితేలారు. కానీ ఈ కలియుగంలో మాత్రం ఎప్పుడూ దుఃఖపూరితంగానే ఎక్కువగా కనిపిస్తారు. కారణం ఆయా యుగాలో ప్రజల్లో, సమాజంలో ధర్మం, న్యాయం నిండుగా వుండేది. ప్రజలలో పాపభీతి ఉండేది. నరనరాన దైవభక్తితో ప్రజలు పరవశించేవారు. ఎప్పుడైతే అధర్మం, అవినీతి, అక్రమం, అన్యాయం అనేవి వుండవో అప్పుడిక దుఃఖం కష్టం అనేవి కూడా వుండవు. అందుకు అలనాడు రామరాజ్యాన్ని ఇప్పటికీ గుర్తుచేస్తుంటారు. ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలతో నడిచేది. రాముడంటేనే ధర్మానికి నిలయం. అటువంటి మహనీయుడి పాలనలో ప్రజలంతా ఎంతోసుఖ సంతోషాలతో ఉండారు. కానీ ఈ కలియుగాన ఎక్కడ చూసినా అవినీతి, అధర్మం, అన్యాయం, అక్రమం తాండవిస్తున్నాయి.
అందువల్లే ప్రజల్లో తీవ్ర దుఃఖం అశాంతి నెలకొంటున్నాయి. అదీకాక ఈ కలిప్రభావంవల్ల ఈ యుగంలోని మానవులో స్వార్థం, కామం, మోహం, లోభాపేక్షలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తత్ఫలితంగా దైవభక్తి సన్నగిల్లిపోతుంది. అందువల్లనే మానవుడిలో పుణ్యఫలం తగ్గి పాపఫలం పెరిగిపోతుంది. దీని ప్రభావం కేవలం మానవ జాతిమీదనే కాక ప్రకృతిపై కూడా పడుతుంది. త్రేతా ద్వాపరయుగాల్లో మాదిరిగా మానవుడు నిస్వార్థంగా యజ్ఞయాగాదులు చేయకపోవడం, సమాజ శ్రేయస్సు కోసం కనీసం తన శ్రేయస్సు కోసం కూడా జపతపాలు కావించకపోవడంవల్ల ప్రకృతి వికృతిగా మారుతుంది. తత్ఫలితమే క్షామం. అతివృష్టి అనావృష్టి గతి తప్పిన రుతువులు మొదలైన వికృతాలన్నీ సంభవిస్తున్నాయి.
ఈ యుగంలో ఎవరిని కదిలించినా కష్టాలు. ఎక్కడ చూసినా కన్నీళ్లు. అనంత దుఃఖం. ఎందుకు ఈ దుస్థితి అనగా వ్యక్తిగా మొదలైన పాప ఫలాలు సమాజానికి చేరుతాయి. తద్వారా దేశానికి పాకుతాయి. తాను ఆచరించవల్సిన కనీసధర్మలను కూడా ఆచరించకపోవడంవల్లే వ్యక్తి పతనవౌతున్నాడు. వ్యక్తిగా అతను ఎదగవచ్చు. కానీ లోన ఆధ్యాత్మిక విలువలు, వాసనలు లేకుండా ఎంత పైకెదిగినా వానికి విలువుండదు. పునాది బలంగా లేని ఎడల ఎంత ఎత్తు మేడ కట్టినా ఏం ప్రయోజనం? అది ఏదో రోజు నిట్టనిలువునా కూలక మానదు. అలాగే మానవుడిలో రోజురోజుకీ స్వార్థం పెరిగిపోవడవంవల్ల మానవత్వం నశిస్తుంది. తద్వారా అతడు అనేక పాపకార్యాలు చేస్తూ తనయొక్క ఖాతాలో పాప కర్మను జమ వేసుకుంటున్నాడు. కష్టాలు, దుఃఖం దరిద్రం అంటే ఏంటో కాదు మానవుడు తాను చేసుకున్న లేదా సంపాదించిన పాపకర్మ ఫలమే ఆ కష్టనష్టాలు. ఎంత పూర్వ పుణ్యం వుంటే ఈ జన్మలో జీవి అంతగా సుఖపడును. అట్లే ఎంత పూర్వ పాపంవుంటే జీవి అంత కష్టం అనుభవించును.
అయితే ఆ యుగాలోలాగా మానవుడు ఈ యుగంలో పుణ్యం సంపదించడానికి యజ్ఞయాగాదులు చేయకపోయినా పర్వాలేదు. ఈ కలియుగంలో కేవలం భగవత్ నామం, భగవత్ ధ్యానంతో సులభంగా సంసార సాగరాన్ని దాటి సులువుగా మోక్షాన్ని చేరగలం. గోవింద నామస్మరణం, గీతాధ్యాయం, గంగాస్నానం, గోసేవ, మాతా పితరుల సేవ ఇవి చాలు వ్యక్తిలోని అనేక జన్మల యొక్క పాపకర్మలని భస్మీపటలం చేయడానికి. ఈ కలి ఎటువంటివాడంటే తన మాయతో మానవుడిని లోబర్చుకుంటాడు. దానివల్ల ఆ భగవంతుని ధ్యాసని మరిచి భోగలాలసలే జీవితం అని భ్రమిస్తాడు. తత్ఫలితంగా ఈ కలియుగంలో జీవి పాప కర్మలలోనే పుట్టి పాప కర్మలలోనే మరణిస్తున్నాడు. కావున దైవారాధన నిత్యం గావించి పుణ్యబలాన్ని పెంచుకోవాలి. ఈ పుణ్యఫలాన్ని కేవలం తన స్వార్థానికేకాక సమాజానికి కూడా ధారపోయాలి. అలా చేసినచో ఈ కలియుగంలో చింతలుండవు.

=================
రచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading