మంచి మాట

యువతరం - లక్ష్యం

  • -మారోతు రామారావు
  • 08/05/2013
యువతరం దేశానికి ఎంతో అవసరం. అటువంటి యువత దేశాన్ని తీర్చిదిద్దుటలో ప్రముఖ పాత్ర పోషించాలి. అట్లే తమ తమ భవిష్యత్‌ని కూడా- శోభాయమానంగా మలచుకోవాల్సిన బాధ్యతనుంచి తప్పుకోకూడదు. మనలను ఈ కలియుగంలోకి మానవులుగా జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు సంతోషించేటట్టుగా మన నడవడి ఉండితీరాలి. అయితే నేడు ఆధునికత పెరిగి దానికి ఆకర్షితులై, జీవితాన్ని మరింత బాగా అనుభవించాలని అత్యాశకు పోయి, తమకు వున్నవాటిని పోగొట్టుకుని యువత చతికిలపడిపోతున్నారు. నీ దారి నీవే వెతుక్కో, నీ గమ్యం నీవే నిర్దేశించుకో, దానిని చేరడానికి అసలు సిసలైన నిజాయితీ, నీతి, ఓర్పు, సహనం వంటి ఆయుధాలు పెంచుకోవాలి. అందరితో జ్ఞానాన్ని పంచుకోవాలి. ఇవన్నీ చేయటానికి సమయపాలన, నిబద్ధత, నిరంతర అభ్యాసన కావాలి. ఈ అందమైన జీవితం అద్భుతమైన, ఆదర్శవంతమైన ఒక వంతెనగా నిలవాలి. మహర్షిగా మారకపోయినా ఫర్వాలేదు. మహనీయునిగా అందరిచేత కీర్తింపబడకపోయినా ఫర్వాలేదు. ఈ లోకానికి మహారాజువి కాకపోయినా ఫర్వాలేదు. కానీ నీ మనఃసాక్షికి జవాబుదారిగా వుండు, నీ ప్రతి పనినీ చర్యను, చర్చను, నీ మనస్సుతో పంచుకో, తప్పొప్పులు నీవే నిర్దేశించుకో. మనపట్ల ఇతరులు నడుచుకుంటో బాధకలుగుతుందో ఆవిధంగా ఇతరుల పట్ల మన నడవడి ఉండకూడదు. మంచి చేయకపోయనా ఫర్వాలేదుకాని చెడు చేయకుండా ఉండడమే కాదు చెడు ఏవిధంగాను ఆసరా కాకూడదు. నీకు నీవే సాక్షిగా నిలవాలి. అంతేగాక చుట్టూ అన్నిటినీ పరికించాలి. మంచి తోటవంటి ఈ సమాజంలో ఏ మొక్కకి తెగులు సోకినా మొత్తం తోట నాశనం అవుతుంది. కావున ఆ తెగులు తీసిపారేసే ‘చేయ’వి నీవే కావాలి. తప్పు అని నీకు అనిపిస్తే తప్పనిసరిగా దానిని గూర్చి చెప్పాలి. విశదీకరించాలి. జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోవాలి. ‘‘తప్పుని తప్పు అని చెప్పటం తప్పుకాదు- తప్పుని తప్పు అని చెప్పకుండా తప్పించుకోవడమే తప్పు...’’- నిర్లిప్తత, నిస్తేజం, బద్ధకం అన్నిటినీ తరిమి తరిమికొట్టాలి, పొలిమేర దాటే దాకా తరిమేయ్. చీకటిలో సైతం అడవిని దాటేయగలను, కడలిపై కాళ్ళతో నడిచేయగలను అన్నంత ఆత్మవిశ్వాసం పెంచుకో.. అయితే అది ఇతరుల మనోభావాలను దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటే సరిపోదు. ఆ ‘ఏదో ఒకటి’ అనేదాన్ని నిర్దేశించుకుని, నిబద్ధతగా దానికై రాత్రింబవళ్లు కృషి చేయాలి. వివేకానందుడు చెప్పినట్లుగా ‘‘నీవు నీ జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటున్నావా? అది ప్రేమ, డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఏదైనా కావొచ్చు. కానీ దానికై పోరాడు, నిరంతరం కష్టపడు, కన్నీళ్ళు, కష్టాలకు కృంగిపోకు. నిరంతరం నీ విజయం కోసం పరితపించు. తప్పనిసరిగా నీకు అది దక్కి తీరుతుంది. మరి ఆ మహాత్ముని మాటలు మనమూ పాటిద్దాం.. మన భవిష్యత్ తరానికి మంచి బాట ఇద్దాం... ==================== మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading