మంచి మాట

బంధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులు నిరంతరం ఆశా పాశాలతో కాలచక్రంలో ఈదులాడుతుంటారు. నేడు ఆధునిక యుగంలో ప్రతీ ఒక్కరు వారి వారి జీవన క్రమంలో పూర్తిగా నిమగ్నం అవుతారు మరే ఇతరములతో అవసరం లేదన్నట్టుగా! ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి వరకు నిరంతర వ్యాపకాలే అందరికీ. చిన్నపిల్లలనుండి పెద్దవారి వరకు అలానే నిరుపేదనుండి ధనికుల వరకు అందరికీ అంతుపట్టని కార్యక్రమాలలో సతమతమవ్వడమే!
ఇటువంటి పరిస్థితుల్లో జీవన కార్యక్రమాల్లో మనిషిగా జన్మించుట లక్ష్యం, కాని దొరికిన బంగారు వరం లాంటి మానవ జన్మ సార్ధకత గురించి అందరూ ఆలోచించడం లేదని అనిపిస్తుంది. జన్మ లభించినందుకు పరమాత్మకు కృతజ్ఞత, పరమాత్మను చేరుకునే దారిలో ప్రయాణం అనేదే తోచడంలేదు అన్నట్టుగా చాలామంది ధోరణి వుంటోంది.
ప్రతి ఒక్కరికి భవిష్యత్తుపై ఆశ, కోరిక వుంటాయి. అవి తీరనివి, అంతులేనివి అయితేనే ఆ మనిషికే ఇబ్బంది. తరవాత ఎంతసేపూ తమ గతం తమకు అన్యాయంగా ఇబ్బందిగా గడిచిందని, వర్తమానం బాగున్నప్పుడు కూడా అనుకుంటూ బాధపడడం ఎందుకో అర్ధం కాదు. చరిత్ర చూసుకున్నా పురాణాలు గుర్తు తెచ్చుకున్నా ఒక్కటే సత్యం కనపడుతుంది. దురాశ దుఃఖానికి దారి అనేది. మహాభారత యుద్ధానికి దారి తీసిన సంఘటనలే నేడు కూడా మనకు కనబడుతుంటాయి. దుర్యోధనుని లోభం కారణంగా అంతా తనకే రాజ్యం కావాలనే తాపత్రయపడి తను నశించి అందరి నాశనానికి కారణమయ్యాడు. నేడు తల్లిదండ్రులైనా, ఇతర బంధువులైనా పుత్ర వాత్సల్యం, బంధు ప్రేమతో అధర్మమార్గంలో పయనిస్తున్న వారిని మందలించి మంచి త్రోవలో పెట్టడం చేయక వత్తాసు పలుకుతుండడం, ఎవరన్నా దండించినా, మందలించినా వానిని కాపాడుకునేందుకు ప్రయత్నించడం జరుగుతోంది. మనుషులు ఉన్నవారైనా లేనివారైనా వేదనతో సతమతమవుతున్నారు. కలిమి లేమి అనేవి మనిషి గత జన్మల కర్మ ఫలాలే కదా! ఎంత ధార్మిక ప్రవర్తన, సత్య, సాత్విక జీవనం చేయగలిగితే అంత వెసులుబాటు త్రిలోకాల్లోనైనా ఏ జన్మలోనైనా మంచిగానే జరుగుతాయి. మనిషి ఒక విషయంగా కావచ్చు, ఒక వస్తువుపై కావచ్చు, ఏదైనా ప్రయాణమైనా మొత్తానికి హేతువుగా ఆశపడడం జరుగుతుంది. అదే కోరిక. ఆ కోరిక నెరవేరితే అంతులేని ఆనందం. ఏ కారణంగానైనా నెరవేరకపోతే మనిషికి వెంటనే కోపం వస్తుంది. ఆ క్షణానికి కోపం కలగడం సహజమే! కాస్త తమాయించుకుని ఆ పని జరగనందుకు గల కారణాలను చూసుకోవాలి. అవి సరైనవా కావా అని కూడా ఆలోచించాలి. మనిషి ఆశపడడం అనేది ఒక బంధనం లాంటిది. ఆశే అన్నిటికీ మూలం. ఆనందం కలిగినా దుఃఖం కలిగినా ఎక్కువగా కారణం ఆశే!
పరిస్థితులన్నీ అనుకూలం, ప్రతికూలం అనేవి పరమాత్మచే కల్పించబడినవే. అది కూడా మన కర్మల ప్రతిబింబాలే. గత జన్మలో ఏవి చేస్తే అవి దాచుకున్నవిగా ఈ జన్మలో ఎదురయ్యే కష్ట సుఖాలు. ఎవరైనా ఇతరులతో కలిసి పోయి స్నేహంగా తిరిగితే ఆ ఇతరులు వీరితో స్నేహంగా వుంటారు. వీరు రాకాపోకా చేస్తే వారు కూడా ఆ విధంగా వస్తూ పోతుంటారు. ఎవరైనా నన్ను ముట్టుకోకు నామాల కాకన్నట్టు బిగదీసుకు కూర్చుంటే తన వద్దకు ఎవ్వరూ రారు కదా! మరి ఎవరూ రాలేదనో తనతో ఎవరూ కలుపుగోలుగా లేరనో అనుకోవడం వ్యర్ధం. మనిషి ఎప్పుడూ ఆశ, దానివలన కలిగే ఆశపాశ బంధనాల్లో చిక్కుకోకుండా చూసుకోవాలి. జీవన విధానంలో ఏ పని చేస్తున్నా తప్పనిసరిగా భగవంతుని ధ్యాసతో చేస్తూ పోవడమే కోరికలకు కట్టడి చేసిన వారవుతారు. మనిషి ఎంతసేపూ తను అనుకున్నట్టు ప్రతీదీ జరగాలని తన మాటే నెగ్గాలని తపించడం కనబడుతుంది. నేను, నా మాటలకై తపన భగవంతునిపై మళ్లించగలిగితే ధన్యులవుతారు. ఏమీ లేనినాడు కష్టంతో భగవంతుని కృపచే అన్నీ అమరినా మనుషులు అశాంతితో అసంతృప్తితో వుంటున్నారంటే కారణం ప్రతిదాన్నీ కేవలం తన స్వశక్తిచే సంపాదించుకున్నాను ఇంకా సంపాదించాలనే నిరంతర తాపత్రయమే! మనిషి ముసలి వయసు వచ్చినా వైద్యానికి అందని అంతుచిక్కని దీర్ఘ వ్యాధి బారిన పడినా కూడా పరమాత్మ తపన కలగడంలేదు సరికదా బతుకు సుఖాలమీద వ్యామోహం ఏమాత్రం తగ్గడంలేదు అని చాలామందిని చూసినపుడు అనిపిస్తుంది. మనిషి ఆశ-పాశ కోరికలను, బంధనాలను విడిచిపెట్టకపోతే భగవంతుని చేరడం సుగమం కాదు. ఇది మాత్రం అందరూ గుర్తించితీరవలసిన విషయమే.

- శ్రీమతి గంటి కృష్ణకుమారి