మంచి మాట

సర్వసాక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక మనిషి ఒక పనిని మంచిదో చెడ్డదో రహస్యంగా చేసి ఆహా ఎవరూ చూళ్ళేదు గదా అనుకుంటాడు. కానీ ఎవరూ చూడడం లేదు అనేది నిజం కాదు. సృష్టిలోని కొన్ని మహనీయ శక్తులు మనం చేసే ప్రతి పనినీ ప్రతి నిముషం చూస్తూనే ఉంటాయి అంటుంది భారతం.
రహస్యంగా చేసే పని అంటే బహిరంగంగా చేయదలచనిది అనేగదా అర్థం. బహిరంగంగా చేస్తే నలుగురూ ఆక్షేపిస్తారనో, అభ్యంతర పరుస్తారనో అనుకొని రహస్యంగా చేస్తుంటారు. అంతేకాక అసలు చేయనేకూడని పనులు కూడా కొందరు రహస్యంగా చేస్తారు. దేశ రక్షణ కోసమో మరేదైనా మంచి ప్రయోజనం కోసమో, ఏదైనా గూఢచర్య సందర్భం కోసమో గుట్టుగా నిర్వహించాల్సిన కార్యాలు తప్ప పదిమందీ మెచ్చుకునే మంచి పనులను వేటినీ రహస్యంగా చెయ్యాల్సిన అవసరం ఉండదు. అలాంటి పనులు కూడా ఎవరైనా రహస్యంగా చేస్తున్నాడంటే అతడు చేయకూడని పని చేస్తన్నాడనే అనుకోవలసి వస్తుంది. అనుకోకుండా ఒక పని ఇతరులకు తెలియకుండా జరిగిపోయినట్లయితే తరువాతైనా దానిని బహిరంగపరచాలా వద్దా అనేది వ్యక్తి నిర్ణయించుకొని బహిరంగపరచవలసి వస్తుంది. ముఖ్యంగా ప్రజా జీవితంలో వుండేవారు చేసే పనులు ప్రజలకు సంబంధించిన వాటిని రహస్యంగా ఉంచకూడదు. ఉంచాడు అంటే ఆ పని నలుగురికీ అంగీకారం కానటువంటిదీ ఆక్షేపించబడేదీ అయి వుంటుందనే అర్థం. అనుకోకుండా అది బహిరంగమైతే మరికొన్ని తప్పులు అంటే దాన్ని సమర్థించుకోవడానికి అబద్ధాలాడ్డం లాంటివి జరుగుతాయి. ఈ సంగతిని మహాభారతంలో శకుంతల చాలా స్పష్టంగా వివరిచింది.
వేటకై అరణ్యానికి వెళ్లిన దుష్యంతుడనే రాజు- కణ్వాశ్రమంలో శకుంతలను చూసి మోహిస్తాడు. ఆమె కూడా రాజపుత్రికే అని తెలుసుకొని తాను రాజైనందున ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవాలనుకుంటాడు. తమకు పుట్టే కొడుకును రాజ్యానికి అధిపతిని చేస్తే అంగీకరిస్తాననే షరతుతో ఆమె రాజును పెళ్లాడింది. శకుంతల ఋజువర్తనా, సాధుశీలమూ గల మనిషి కాబట్టి రాజ్యమేలే ప్రభువు మాటలు నమ్మింది. రాజు తన కోరిక తీర్చుకుని వెళ్లిపోతాడు. రాజు ఈ పనిని రహస్యంగానే ఉంచాడు గాని శకుంతల రహస్యంగా ఉంచలేదు. ఆమె చెలికత్తెలకు తెలుసు. కణ్వుడూ తెలుసుకుంటాడు. రాజు రాజధానికి పోగానే తన చర్యను బహిరంగపరచి, శకుంతలను పిలిపించుకొని రాణిగా స్వీకరించాలి కాని అతనలా చేయలేదు. అంతేకాదు రాజసభలో నిర్భయంగా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు శకుంతలతో. తాను రాజు కాబట్టి ఎవ్వరూ నోరెత్తరు. ఈ దిక్కూ దివాణం లేని మనిషిని ఎవరు నమ్ముతారులే, అసలు తను చేసిన పనికి సాక్షులెవరున్నారు అనుకుంటాడు. అప్పుడు శకుంతల రాజా నువ్వు రాజువై వుండీ అసత్యమాడుతున్నావు. సత్యం యొక్క మహాత్మ్యమేందో నీకు తెలిసినట్లు లేదు. అదలా వుంచు. నువ్వు చేసిన పని ఎవరూ చూడలేదనుకుంటున్నావేమో. ప్రతి మనిషి నడవడినీ వేదాలు చూస్తూంటాయి. పంచభూతాలు చూస్తుంటాయి. ధర్మదేవత చూస్తూంటుంది. సంధ్యలు గమనిస్తుంటాయి. మరీ ముఖ్యంగా అతని అంతరాత్మకు అంతా తెలుస్తూనే వుంటుంది. యముడూ, సూర్యచంద్రులూ, రాత్రింబవళ్ళు- ఇవన్నీ మానవుడి సర్వ ప్రవర్తనలనూ గమనిస్తూనే వుంటాయి. నేను చేసేది ఎవరూ చూడడం లేదులే అనుకోవడం ఆత్మవంచనే. తనను తానే దొంగిలించుకోవడం లాంటిది అని ఒక సత్యాన్ని అద్భుతంగా వివరిస్తుంది కణ్వ కన్య.
వేదాలు భారతీయ ఆత్మకు ప్రతిరూపాలు. హైందవ ధార్మిక జీవనానికి పవిత్ర నిర్దేశకాలు. అలాగే పంచభూతాలూ, మనిషి నిలుచున్న భూమీ, ఆవరించుకుని వున్న ఆకాశమూ, ప్రాణదాతలైన వాయవాగ్నిజలాలూ, సంధ్యలతో సంధింపబడి ఉన్న రేపవళ్ళ రూపమైన నిరవధి ఐన కాలమూ, సూర్యచంద్రులూ, సమవర్తి అయిన యముడూ వీటిలో మనిషి దేని చూపును తప్పించుకోగలడు. వీటి దృష్టినుంచి తననుతాను ఎక్కడ దాచుకోగలడు. ఋజువర్తన కలిగిన మనిషెవడూ నీతి బాహ్యమైన పనులు చేయడు. ఎవరైనా రహస్యంగా చేసినా అది రహస్యం కాదు. పైన తెల్పినవన్నీ దాన్ని గమనిస్తుంటాయి. ఈ మహనీయ శక్తులనుంచి ఎవరూ తప్పించుకోలేరని తెలిస్తేనైనా మనిషి దుష్కార్యాలను చేయడం మానుకుంటే ఈ ప్రపంచం స్వర్గతుల్యవౌతుంది గదా!

- సిహెచ్.వి.బృందావనరావు