మంచి మాట

భరతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదర్శ జీవనానికి సంపూర్ణ మార్గదర్శి వాల్మీకి రామాయణం. ఈ భువిపై తరులు, గిరులు, సంద్రములు నిలిచి ఉన్నంతకాలం రామాయణం నిత్యనూతనమై వెలుగొందుతూ మానవాళికి దారిచూపుతుంది. జన్మలలో నరజన్మ దుర్లభమని ఆదిశంకరులు వక్కాణించారు. అలాగే జన్మలను చరితార్థము గావించుకొనుటకు రామాయణ అనుసరణము తప్ప మరేదియు లేదు అనుట పరమ సత్యము.
అటువంటి ఆదికావ్యములో ప్రతి ఒక్కరూ ఆదర్శనీయులే అనుటలో సందేహము లేదు. వారిలో భరతుని వ్యక్తిత్వము ఆద్యంతము అద్భుతము. శ్రీమహావిష్ణువు రామునిగా అవతరించినపుడే అంశలన్నియు అవతరించినవి. భరతుడు విష్ణువు యొక్క అంశయేనని గ్రహించాలి. మందర దుష్టబోధన అయితేనేమి, దశరథుని వరములవల్లనైతేనేమి రామాయణము ఒక గొప్ప మలుపు తిరుగుట సంభవించినది. కాని కైకేయి తాననుకున్నట్లు భరతుని చక్రవర్తిగా చూడలేకపోయింది. పైగా చరిత్రలో తనయునిచే నిందించబడిన తల్లిగా నిలిచిపోయింది. తల్లి కోరిక ముందు భాతృప్రేమయే గెలిచినది.
మేనమామ యధాజిత్తు గృహములోనున్న భరతునకు ఒక పీడకల రాగా వెంటనే బయలుదేరి అయోధ్య చేరుకున్నాడు. తల్లుల ద్వారా తండ్రి స్వర్గస్థుడైన విషయమును తెలుసుకొని బాధతో విలవిలలాడడంలో అతని సరళస్వభావం, పితృప్రేమ కనబడుతుంది. తల్లి కైకేయి ద్వారా శ్రీరామలక్ష్మణులు, సీతాదేవి అరణ్యవాసమునుకు వెళ్ళుట, తనకు పట్ట్భాషేకం చేయుటకు నిర్ణయించుట మొదలగు విపరీత పరిణామములు తెలుసుకొని కంపించిపోయినాడు.
శ్రీరాముని యెడల తన భావనను తెలుసుకోకుండా ప్రవర్తించిన తల్లి తీరును చాలా కఠినంగా నిందించుట పరిశీలిస్తే శ్రీరాముని పట్ల భరతుని సౌహార్దము ఎంతటిదో చూడవచ్చు. కౌసల్యామాతకు తన నిర్దోషిత్వమును విశదపరచుటకు పడిన తపన చూస్తే అతని సత్యసంధత ద్యోతకమవుతుంది.
దశరథుని అంత్యక్రియలు పూర్తిచేసిన భరతుడు పరిపరివిధాల చింతాక్రాంతుడై కుమిలిపోయెను. వశిష్ఠ మహర్షి మరియు రాజ్యోన్నతులు రాజ్యమును చేపట్టుట న్యాయ సమ్మతమేనని భరతునికి బోధించిరి. ‘నేను ఈ రాజ్యము శ్రీరామునిలో ఒక భాగమని, జ్యేష్ఠుడైన శ్రీరాముడు నాకు పితృ సమానుడని, పూజ్యుడైన శ్రీరాముని వనమునుండి తీసుకువస్తానని’ ప్రతిజ్ఞ చేస్తాడు. ‘ఉదాత్తుడు, ధర్మస్వరూపుడైన శ్రీరాముడు అందుకు వ్యతిరేకిస్తే లక్ష్మణునితో చేరి సీతారాములను సేవిస్తాను తప్ప తిరిగిరానని నిష్కర్షగా చెప్పడం వెనుక భరతుని నిస్వార్థత, కర్మయోగత్వము మనకు ప్రత్యక్షమవుతాయి.
అన్న శ్రీరాముని తీసుకువచ్చుటకు సమస్త పరివారముతో బయలుదేరిన భరతుడు మార్గమధ్యములో నిషాదరాజు గుహుని వద్ద అన్నగారి ఎడబాటును సహించలేక స్పృహ కోల్పోడంవల్ల అతని గాడమైన సోదరప్రేమ అల్పులైన వారికి అర్థం కాదు. చిత్ర కూట సమీపములోని పర్ణశాలలో సీతారామ లక్ష్మణులను చూసిన భరత, శత్రుఘు్నలు ‘రామా’ అంటూ నేలపై పడిన తీరు వారి ప్రేమానురాగాలు, దీక్ష, నిరాడంబరతను వ్యక్తం చేస్తున్నాయి. పరిపరివిధాల బ్రతిమిలాడినా శ్రీరాముడు వనవాసమునుండి తిరిగిరానని తెలుపగా, నా ప్రభువు రాజ్యము చేపట్టువరకూ అన్నపానీయములు ముట్టనని దర్భలు పరచుకొని కూర్చుని నిరాహారదీక్షను మనకు పరిచయం చేస్తాడు.
భరతుని బుద్ధిని, వినయశీలతను గుర్తించిన శ్రీరామచంద్రుడు కోసల రాజ్యమునే కాదు సమస్త భూమండలమును పరిపాలించగల సమర్థుడని కొనియాడాడు. తుదకు సద్గుణ సంపన్నుడైన భరతుడు అన్నగారి ఆదేశముతో శ్రీరాముని స్వర్ణపాదుకలు గైకొని తన శిరముపై నుంచుకొని పయనమయ్యాడు.
శ్రీరాముడు లేని అయోధ్యలో తానుండజాలని, శత్రుఘు్ననితోబాటు నంది గ్రామం చేరుకొని అచ్చట శ్రీరామ పాదుకా పట్ట్భాషేకము గావించి శ్రీరామచంద్రుని నామముతో పరిపాలన చేసిన భరతుని ఔన్నత్యము, భాతృభక్తి, ధర్మనిరతి సమస్త మానవాళికి అనుసరణీయము. రామాయణమును ఆదర్శంగా చేసుకొన్న ప్రదేశము సకల సౌభాగ్యములతో తులతూగుట తథ్యము.

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు