మంచి మాట

మాహాత్మ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్ని, సూర్య, చంద్ర సంయుక్త బీజాక్షరి మంత్ర రాజము ‘రామ’ అనే రెండక్షరాలు. రామ అని పలికినంతనే సమస్త దురితములు హరించిపోవును. ఇక రామాయణ పఠనం, శ్రవణముల వలన కలుగు ఫలితములు అమోఘము. శ్రీమద్రామాయణము ఒక దివ్య మహామాల. ఈకావ్యము గురించి తెలియని భారతీయుడు ఉండడు. అటువంటి మహిమాన్విత కావ్యము యొక్క మహత్మ్యమును స్కంద పురాణంలో మనసున హత్తుకొను రీతిన ఆవిష్కరించబడింది.
రామాయణ కథాశ్రవణ మాత్రముచే తమ దుర్భర, దుర్మార్గ జీవితములనుండి విముక్తులైన మాలిని, కాళి అను వారల గాథ రామాయణ మహిమను విశదపరచినది. మాలిని అను సామాన్యుడు సమస్త ప్రాణులను సంహరించి మాంస భక్షకుడై జీవించుచుండెను. మాంసభక్షణ వలన సత్వగుణముకు దూరమై నిత్యము చెడు మార్గమున సంచరించుచుండెను. దేవాలయాములలో దొంగతనము, గోహత్య, బ్రహ్మ హత్యలు చేయుచూ పరమ దుర్మార్గుడై చరించుచుండెను. ఇతని దుష్కార్యములను భీతిల్లిన అతని బంధుగణము వెలివేసినది. అరణ్యములో బాటసారులను దోచుకొనుచూ ఒంటరిగా జీవించుచుండెను. ఒకరోజు ఏ విధమైన ఆహారము లభింపక గ్రీష్మ తాపము భరించలేక అరణ్యములో దారి తప్పి వశిష్ఠుని ఆశ్రమమునకు చేరెను. అచ్చట వశిష్ఠుని ఆధీనములోనున్న ఒక సుందర సరస్సులోని జలమును త్రాగి, అచటనున్న ఆకులు, అలములు భుజించి సేద తీర్చుకొనెను. దైవానుకూలమువలన అచటనే కొన్ని శిలలతో చిన్న ఆశ్రయము ఏర్పరచుకొని జీవనము సాగించుచుండెను. మాంస భక్షణ మాత్రము త్యజించలేదు.
ఒక సంవత్సర కాలము గడిచిన పిదప గ్రీష్మఋతువు ప్రవేశించినది. పశుపక్ష్యాదులు తాపము భరించలేకపోవుచున్నవి. అటువంటి విపత్కర పరిస్థితులలో కాళి అను నిషాద స్ర్తి, ఆకలి దప్పికతో మాలిని నివసించు ప్రాంతమునకు వచ్చి స్పృహ కోల్పోయినది. ఆమెకు జలమునిచ్చి సేద తీర్చిన తరువాత ఆహారముగా మాంసమును పెట్టి ప్రాణములను కాపాడినాడు. అప్పటినుండి ఆమె కూడా మాలినితో నివసించుట ప్రారంభించెను. వారిరువురి మార్గములు దుర్మార్గములే! ఆమె తన పతిని హత్యగావించిన కారణమున బంధుగణము తరిమివేసినది. పాపులిరువురు ఒక చోట చేరుట విధి విలాసము. కాని వారి పాప జీవితములు కడతేరు సమయము ఆసన్నమయినది. ఋషులు తినగా మిగిలిన ఆహారమునకై ప్రతిదినము వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళుచుండెడివారు. మాఘమాసము ప్రవేశించినది. అలవాటుగా ప్రాతఃకాలముననే ఇరువురు ఆశ్రమమునకు చేరిరి. అచట ఋషులు, విప్రులు కలసి రామాయణమును తొమ్మిది దినములు పారాయణ చేయుట మొదలిడిరి. మొదటిరోజు వారిరువురు అప్రయత్నముగానే శ్రవణము చేసినారు. మిగిలిన రోజులన్నియు రామాయణమును వినుచూ తన్మయులై ఆహార పానీయాలు మరచి అహోరాత్రులు రామనామము జపించుట మొదలిడిరి. నవరాత్రులు ముగిసినవి. పదవ రోజున వారిరువురూ ప్రాణములు విడిచిరి. రామాయణ శ్రవణ ఫలితము మరియు రామనామ జప మహత్యము వలన శ్రీమహావిష్ణువు తన దూతలను పంపి వారిని వైకుంఠమనకు రప్పించుకొనెను. అనేక సంవత్సరములు వైకుంఠమున, సత్యలోకమున, బ్రహ్మలోకమున, ఇంద్ర లోకమున సమస్త భోగములు అనుభవించి తుదకు సుమతి, సత్యవతిగా గొప్ప రాజకుటుంబములలో జన్మించినారు. కాలాంతరమున భార్యాభర్తలై సప్తద్వీప వసుంధరకు చక్రవర్తియై పరిపాలన చేసినారు.
వారి రాజ్యములో రామనామ జపము నిరంతరము ప్రజల శిరోధార్యమై వెలుగొందెడిది. రామాయణ శ్రవణ, పఠనములు చేయు ప్రజలను చక్రవర్తి స్వయముగా సేవించెడివాడు. ప్రజలకు మరణభయము లేదు. అందరూ పరమ కళ్యాణ వైరాగ్యమూర్తులై ప్రకాశించెడివారు. వార్థక్యము లేక నిత్య యవ్వనులై ఉండెడివారు. ఆ విధంగా కేవలం రామాయణ శ్రవణము మాత్రముననే పాపజీవులైన మాలిని, కాళిలకు సర్వ సంపదలు లభించుటయేకాక చక్రవర్తిగా వెలుగొందెను. ఇక ప్రయత్న పూర్వకంగా ఈ కలియుగంలో రామాయణమును పఠించినా, శ్రవణము చేసినా సకల సంపదలు లభించును. అపూర్వమైన ఆత్మానందము తప్పక కలుగును.
యుగయుగాన ఈ రామాయణం శ్రవణ పఠనములు ముక్తిని, మోక్షమును వసంగునని నారద మహర్షి స్కంద పురాణంలో కావ్య మహాత్మ్యమును తెలిపారు.

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు