మంచి మాట

ఉగాది శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నులివెచ్చని, తొలి కిరణాల మాటున సిగ్గులొలుకు నవ వధువు చందాన, వసుంధర వయ్యారపు నడకలతో, ప్రకృతిని పరవశింపచేస్తూ విజయోత్సవంతో మన్మధలీలలు తల్చుకుంటూ, మన్మథుడ్ని సాగనంపి, దుర్ముఖను స్వాగతిస్తూ అడుగిడుతోంది నవ్య ఉగాది.
రెమ్మ రెమ్మకు తేటి విపంచులతో, కొమ్మ కొమ్మకు సుమధుర పరిమళాల సువాసనల గుబాళింపుతో, గుబురుమామిడి కొమ్మల్లో వినిపించింది గండు కోకిల ఉగాది పలకరింపు. మధురానంద నిలయమైన మాధవ ఋతువు. అదే.. వసంత ఋతువు- ఉగాది పర్వదినం. ఉగాది షడ్రుచుల సమ్మేళనం. అవే తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు, జీవితం వీటి సమ్మేళనమే కదా?2
భగవంతుని స్వరూపమైన కాలాన్ని మన దైనందిన జీవన వ్యవహారాలకు అనుగుణంగా మలచుకుని, జరుపుకుంటూ ఆనందిస్తున్నాం. అలా విభాగించుకుని ఆచరించి ఆనందించేవే పండుగలు. తెలుగువారు చంద్రుని సంబరాన్ని బట్టి ‘చాంద్రమానం’ అనే పేరుతో కాల విభాగం చేసుకున్నారు. ఈ విధానంలో సంవత్సరం ప్రారంభమైన (తెలుగు నెలల ప్రకారం) చైత్రశుద్ధ పాడ్యమి విశిష్టమైన పర్వదినం. దీనే్న ‘ఉగాది’ అంటారు. ఉగాది- అదే ‘యుగాది’- అంటే సంవత్సర ఆరంభం అని అర్థం.
ఉగాది ప్రత్యేకత ఏమంటే, ఈ పండగ ఒక దేవతనికాని, దేముడ్ని కాని ఉద్దేశించి చేసే పండుగ కాదు. అనంతమైన కాలాన్ని- మన సౌలభ్యం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి, సంవత్సరాదినాడు కాలాన్ని మన ఇష్టదేవతా స్వరూపంగాను, సకల దేవతా స్వరూపంగాను భావించి ‘సంవత్సర కాల భవిష్యత్తును ముందుగా తెలుసుకుని ఆయా సమయాల్లో దైవానుగ్రహాన్ని పొందడానికై, చెయ్యవలసిన సాధనాలను సిద్ధపరచుకునే ఒక చక్కని శాస్ర్తియ ప్రణాళికకు ముందుగా రంగం ఏర్పరచుకోవడమే ఉగాది విశిష్టత.
చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేముడు ఈ సృష్టిని ప్రారంభించాడని, శాస్త్ర వాక్కును ప్రమాణంగా చేసుకుని, ఆ రోజునే యుగాదిగా గణించి ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. చైత్రమాసమే సంవత్సర ప్రారంభం.
జ్యోతిశ్శాస్త్రం రీత్యా వసంత, శరదృతువులకు యమదంష్ట్ర- అంటే మృత్యువు తాండవించే రోజులు అంటారు. కనుక అపమృత్యువాత పడకుండా ఆయురారోగ్యాలతో హాయిగా వుండాలని, వసంత ఋతువు ఆరంభంలోనే శ్రీరాముడ్ని, శరదృతువు ఆరంభంలో దుర్గాదేవినీ పూజించాలి.
ఉగాది నాడు వేప పూత పచ్చడి తప్పక స్వీకరించాలి. దీన్ని నింబకుసుమ భక్షణం అంటారు. ఇది ఒక మంచి ఔషధం. చేదు, తీపి, పులుపు త్రిగుణాల సంకేతం. ఇది విధిగా తినాలి. ఉగాది నాటి ముఖ్యమైన విధుల్లో పంచాంగ శ్రవణం విశిష్టమైంది. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం- అయిదు అంగాలు కలది పంచాంగం- సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణు స్వరూపంగా భావించి, పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చెయ్యాలి. పంచాంగంలో అయిదింటికి ప్రయోజనాలు వున్నాయి.1.సంపదకోరేవారు తిథి విషయమై జాగ్రత్త వహించాలి. 2.దీర్ఘాయువు కోరేవారు వారం విషయంలో జాగ్రత్త వహించాలి. 3.పాపాలనుండి విముక్తి కోరేవారు నక్షత్ర విషయంలో జాగ్రత్త వహించాలి. 4.రోగాలనుండి విముక్తి కోరేవారు యోగ విషయంలో జాగ్రత్త వహించాలి. 5.కార్యసిద్ధి కోరేవారు కరణం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ అయిదూ తమ పేరుకు, నక్షత్రానికి అనుకూలంగా వున్నాయో లేదో చూసుకోవాలి. జీవన ప్రమాణంలో ఒక్క సంవత్సరకాలంలో ముందుగా వచ్చే ప్రకృతిలోని మార్పు, ఖగోళంలో మార్పు గ్రహించి అందుకు తగ్గట్టు, శాస్త్రం చెప్పిన విధి, విధానాలను అనుసరించి ఆచరించి, జీవన మార్గాన్ని సుఖతరం, సులభతరం చేసుకుని జీవించడానికి పంచాంగ శ్రవణం ఒక ప్రధాన కర్తవ్యంగా భావించాలి.
ఇలా శాస్త్రాలు చెప్పిన విధంగా పండగలు ఆచరిస్తే ఆనందం, ఆరోగ్యం కలుగుతాయి. ధర్మాన్ని మనం రక్షిస్తే- ధర్మం మనల్ని రక్షిస్తుంది.

-శివాని